AADIVAVRAM - Others

అవన్నీ స్వప్నలోకపు దృశ్యాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఆ పండుగ సందర్భంగా అలంకరించిన గంగిరెద్దులు ఇళ్ల ముందుకు రావడం శోభాయమానంగా ఉంటుంది. చిత్రకారుడు రేవులపల్లి బాలాచారి ఆ గంగిరెద్దుపై మొత్తం సంక్రాంతి పండుగ విశేషాలను పొందుపరచి తన సృజనను చాటుకున్నారు. తెల్లని ఎద్దును కాన్వాసుగా భావించి పండుగ వాతావరణమంతా అందంగా చిత్రీకరించి ఆకట్టుకున్నారు. చివరికి గంగిరెద్దును ఆడించే వ్యక్తి సైతం ఆ ఫ్రేములో ఇమిడిపోయేలా రూపకల్పన చేసి రసరమ్యంగా రూపొందించారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ఎద్దు (కాన్వాసుపై) పై హరిదాసు, అతని ఆకర్షణీయ ఆహార్యం... చెరకు గడలు, పొంగలి వండటం, పిల్లలు గాలిపటాలు ఎగరేయడం, పిండి వంటలు, కోడిపుంజు, ఎద్దు తోక చెరకు గడ రూపంలో అగుపించి అబ్బురపరుస్తుంది.
నేపథ్యంలో పూరిళ్లు, భోగిమంటలు, గొబ్బెమ్మలు పెట్టే ఆడపిల్లలు, కోడి పిల్లలు, ముగ్గులు ఇట్లా పండుగ వాతావరణం సృష్టించి తనదైన పద్ధతిలో సృజనాత్మకతను చిత్రకారుడు చాటుకున్నారు. అయితే అంతగా పరిణత చెందిన రేఖలు గాక ‘ప్రామిసింగ్’ చిత్రకారుడి రంగులు, రేఖలు అందులో కనిపిస్తాయి. పరిపక్వత చెందుతున్న తీరు అందులో దర్శనమవుతున్నది.
బాలాచారి ఇతర బొమ్మలు తనదైన ప్రత్యేక శైలిలో కనిపిస్తాయి. కొంత క్యూబిజం, కొంత నైరూప్యత, కొంత వాస్తవికత, కొంత సృజనాత్మకతను జోడించి ఆయన పల్లెటూరి జంటలను కాన్వాస్‌పై చిత్రించి మంత్రముగ్దుల్ని చేశారు. ఈ విభిన్న శైలిలో గ్రామీణ మహిళ అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఆమెలోని లావణ్యం, సౌకుమార్యం, సహజత్వం, స్వాభిమానం, ప్రేమ వ్యక్తీకరణ ఓ ప్రబంధ వాతావరణంలోకి తీసుకెళతాయి.
ఓ మహిళ తన మనసు విప్పి నెమలితో మాట్లాడటం ఆ సంభాషణ తీవ్రత నెమలి చూపుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె అలంకరణ కొంత విరహపు చూపు.. నెమలి సైతం ఆమె మాటలను శ్రద్ధగా వింటూ ఆ ప్రేమ పదాలకు విరహ వాక్యాలకు విస్మయంతో చూస్తున్నట్టుగా చిత్రకారుడు చిత్రించారు. చిత్రకారుడు ఈ శైలిని తన సిగ్నేచర్ శైలిగా చెప్పుకుంటున్నారు.
మరో బొమ్మలో గ్రామీణ యువజంట కనిపిస్తుంది. ఇందులో స్ర్తి, పురుష ముఖాలు సహజంగా కాక కొంత క్యూబిజం, మరికొంత నైరూప్యం రంగరించి వెలుగు నీడల్లో పొందుపరిచాడు. ఎంకీ నాయుడుబావ లాంటి ఓ గ్రామీణ వ్యూహాత్మక జంటకు రంగు, రూపం ఇచ్చాడు. దగ్గరలో ఓ పక్షి వారి గుసగుసలు వింటూ కనిపిస్తుంది. దాని ఉనికిని గమనించకుండా ఆ జంట ‘గువ్వల్లా’ తమ భావాల్ని వౌనంగానే వెళ్లబోసుకుంటున్నారు. ఆమె కొప్పులో ఎర్రటి పుష్పం, ఆమె నల్లటి పొడవైన జడ, చెవులకు లోలకులు ఇదో స్వప్నలోకపు ‘దృశ్యం’గా కూడా అనిపిస్తుంది. తనదైన రీతిలో వెలుగు నీడల్లో ఆ జంటను చిత్రించి మంచి మార్కులు కొట్టేశాడు చిత్రకారుడు.
మరో బొమ్మలో ఆ జంట మరింత సాన్నిహిత్యంగా కనిపిస్తుంది. ఈసారి వెనె్నల వెలుగు దర్శనమవుతుంది. ఆ వెనె్నలలో తమకంతో ఆ జంట దగ్గరగా, ఒకరి శరీరాన్ని ఒకరు తాకుతూ సాంత్వన పొందుతూ కనిపిస్తారు. ఆమె చేతిలో తెల్లటి పుష్పం, సిగలో ఎర్రటి పువ్వు, నల్లటి పొడవాటి జడ... ఆ సాన్నిహిత్యానికి, బంధానికి వనె్న తెచ్చేలా వెనె్నలధార కురిపిస్తూ గీసిన చిత్రం సైతం ఆయన సృజనకో మచ్చుతునక. ఈ జంట ప్రేమకు సాక్షిగా ఓ పక్షి పక్కన కనిపిస్తోంది.
మరో బొమ్మలో ఆ మహిళ తన ప్రియుడి కళ్లలో తన రూపం చూసుకుంటూ ‘బొంబాయి బొట్టు’ పెట్టుకోవడం పూర్తిగా కొంటెతనంతో కూడుకుంది. ఆ చేష్టకు అతను కొంత అసహనంగా కనిపించినా ఇదేదో బాగానే ఉందన్న భావన సైతం కనిపిస్తోంది. ఆ అమాయకత్వం, బోళాతనం, పల్లెటూరి ప్రేమకు చిహ్నంగా ఫ్రేమ్‌లో మేకపిల్లను చిత్రకారుడు చూపారు. షరా మామూలుగా ఓ పిట్ట మాత్రం ఈ ప్రేమ జంట చిలిపి చేష్టలను పరిశీలిస్తూ కనిపిస్తుంది. ఇందులో సైతం వెలుగునీడల సయ్యాట ద్యోతకమవుతుంది.
తమ మధ్య గల సాన్నిహిత్యాన్ని పదిమందికి చెబుతన్నావా? అంటూ ఆ మహిళ పిట్టను గుడ్లురిమి ప్రశ్నిస్తున్న వైనం మరో కాన్వాసులో కనిపిస్తుంది. ఈ ఫ్రేములో రంగుల పొందిక పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆమె ముఖకవళికల్లో ఆగ్రహం స్పష్టంగా చూడొచ్చు. పిట్ట మాత్రం తనకేమీ తెలియదన్నట్టు అమాయకంగా చూడ్డం... ఓ మధుర కలహాన్ని తలపిస్తుంది. ఇలా ఒకటా రెండా అనేక భావాలను ఒలికిస్తూ బాలాచారి అనేక బొమ్మలను తనదైన సిగ్నేచర్ శైలిలో కాన్వాసుపై, కాగితంపై పొందుపరిచారు. అవన్నీ ఆయన సృజనను, రంగులపై పట్టును, కాంపోజిషన్‌ను తెలియజేస్తాయి.
ఆయన గీసిన ‘బతుకమ్మతో సెల్ఫీ’ అన్న బొమ్మ తెలంగాణ సంస్కృతికి అద్దంపడుతోంది. మూడు తరాలను ఒకే ఫ్రేమ్‌లోకి తెచ్చి అటు బతుకమ్మను, చెరువును, చెరువులో తేలుతున్న బతుకమ్మలను, దూరంగా బతుకమ్మ ఆడుతున్న ఆడవారి బృందాన్ని చిత్రించి ఆ పండుగపై తనకున్న ఆరాధనా భావాన్ని, రంగు రంగుల పూల వసంతాన్ని, వనె్న తరగని అందాన్ని అద్భుతంగా చిత్రకారుడు చూపాడు.
ఇలా తెలంగాణ జనజీవితాన్ని, సంస్కృతిని, పండుగలను, పబ్బాలను తన కుంచెతో కాన్వాసుపై ఎక్కిస్తున్న రేవులపల్లి బాలాచారి యావత్తు భువనగిరి జిల్లా చీమలకొండూరు గ్రామంలో 1988 సంవత్సరంలో జన్మించారు. చేతివృత్తుల సామాజిక వర్గంలో పుట్టిన ఆయనకు తొలి గురువు తన తండ్రి రేవులపల్లి నరహరి అని ఆయన అంటున్నారు. నాన్న చేసే కార్వింగ్ పని, నగిషీ పని తననెంతో ఆకర్షించాయని, దేవుళ్ల పటాలకు, గర్భగుళ్లకు రూపొందించే ఆర్చ్‌లు.. ఫ్రేమ్‌ల పనితనం ఎంతో భక్తి భావంతో గాక, సుందరంగా ఉండేవని ఆయన చెబుతున్నారు. అవి తననెంతో ఉత్తేజపరిచాయని, తానూ చిత్రకళ పట్ల, కళల పట్ల ఆసక్తి పెంచుకోవడానికి ఆ వాతావరణం ఎంతో దోహదం చేసిందంటున్నారాయన.
1996లో ఎస్.ఎస్.సి. పూర్తయ్యాక తమ ప్రాంతానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఏలే వేసిన లక్ష్మణ్‌తో పరిచయమయ్యాక అతని చిత్రకళను చూస్తూ స్ఫూర్తి పొంది ముందుకు కదిలానని బాలాచారి అంటున్నారు. పల్లె జీవనంపై ఏలే వేసిన బొమ్మలు తననెంతో కదిలించాయంటున్నారు. అలా చిత్రకళను ప్రేమిస్తూ తొలుత ‘టి.టి.సి.’ చేశానని అనంతరం 2006 సంవత్సరంలో బి.ఎఫ్.ఏ.లో చేరి స్వల్పకాలిక సర్ట్ఫికెట్ అందుకున్నానని, కొంతకాలం యానిమేటర్‌గా పనిచేశానని, ఆ రకంగా కంప్యూటర్‌పై కొంత పట్టు లభించిందని, సంప్రదాయ కాన్వాసుపై అంత పట్టు లభించాక హైదరాబాద్ శివారు ప్రాంతంలో తాను నివశిస్తున్న చోట పెయింటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసి పిల్లలకు, పెద్దలకు రంగుల రహస్యాలను రేఖా విన్యాసాన్ని వివరిస్తున్నానని బాలాచారి చెప్పారు. ఇప్పటివరకు అనేక గ్రూపు షోలలో పాల్గొన్నానని, కొన్ని పురస్కారాలు లభించాయని, ఈ కృషిని ఇలాగే కొనసాగిస్తానని తాను గీసిన ‘రంగుల జంట’ సాక్షిగా ఆయన పేర్కొన్నారు.

**చిత్రాలు..
-రేవులపల్లి బాలాచారి 9989699137

- వుప్పల నరసింహం 9985781799