AADIVAVRAM - Others

చేనేత కళామ తల్లులకు నీరాజనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో వినూత్న వ్యక్తీకరణ. రకరకాల ప్యాట్రన్స్‌తో, ప్రహేళికల్లాంటి ఆకృతులతో, చదరంగం గళ్లతో, త్రికోణాలతో, దీర్ఘచతురస్రాలతో ఓ సరికొత్త సంయోజనం. రకరకాల రంగుల రసజ్ఞతతో, సంయోజనంతో చిత్ర కళాఖండాలు సృష్టించడంలో చిత్రకారుడు పెద్ది లక్ష్మీకాంత్ ఆరితేరారు.
అవి నైరూప్యంలా కనిపించినా వెతికితే రూపం కనిపిస్తుంది. జామెట్రికల్ ‘జాదూ’ కనిపిస్తుంది. నాజూకైన పనితనం దర్శనమిస్తుంది. అద్భుతమైన పొందిక అగుపిస్తుంది. కొత్త ప్యాట్రన్స్‌తో, రేఖల... గీతల గాఢతతో గంభీరమైన ఆకృతికి ప్రాణం పోయవచ్చని ఫిగరేటివ్ చిత్రాలు గీయవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. సరికొత్త ప్రయోగానికి తెర లేపారు.
వాటిల్లో నిజాయితీ ఉంది... నిండుదనం ఉంది. వినూత్నత ఉంది. జీవనసారముంది. కళాత్మకత ఉంది. సమకాలీన చిత్రకళ శైలి ఉంది. ప్రయోగశీలత ఉంది... పరిపక్వతా ఉంది... అరుదైన ప్రతిభ... సృజనాత్మకత... కొత్తదనం ఉంది.
ఆయన గీసిన మహిళల పోట్రేట్స్ చేనేతకళ, ప్యాట్రెన్స్, అలంకరణతో పొందికగా, వినూత్నంగా ఆకర్షిస్తాయి. ఆ పోట్రేట్స్ చీర అంచులతో గమ్మత్తుగా, గంభీరంగా సరికొత్తగా విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇదంతా పోచంపల్లి చేనేత కార్మికుల ‘ఇక్కత్’కు మరో పార్శ్వం అని చిత్రకారుడంటారు.
చేనేత కుటుంబం నుంచి వచ్చిన ఈ చిత్రకారుడు తన చిత్రాల నిండా చేనేత డిజైన్లు, టెక్చర్, సరకు - సరంజామా రంగుల వాసన దర్శనమవుతుంది.
చేనేత కుటుంబాల్లో మహిళలు నిరంతరం శ్రమిస్తారని, విరామం, విశ్రాంతి లేకుండా పనిచేస్తారని, వారు చేనేత కళామతల్లులని అందుకే వారిని పవిత్రంగా భావిస్తానని, ఆ చైతన్యంతో, ఆ భావనతో, ఆలోచనతో అనేక బొమ్మలు గీశానని చిత్రకారుడు లక్ష్మీకాంత్ చెప్పారు.
పోచంపల్లి చీరల్లోని అందం, ఆకర్షణ, డిజైన్లు, త్రికోణాలు, కోట కొమ్మలు, జరీ... అంతటా వారే కనిపిస్తారని... తెలంగాణకు ప్రతిరూపంగా నిలుస్తారని, ఆ వ్యక్తా అవ్యక్తాల ఆకృతులే తన బొమ్మలని ఆయన అంటున్నారు. చాలా వాటిల్లో తన అమ్మ పెద్ది లక్ష్మమ్మను చూసుకుంటానని నిజాయితీతో చెబుతారు. ఆమెకు గుడి కట్టినట్టు వేసిన చిత్రం ఎంతో వైవిధ్యంగా కనిపిస్తుంది. ఆ కాన్వాసు నిండా ప్యాట్రెన్స్... ఇక్కత్ శైలి మధ్యలో ఒక వృత్తం.. వృత్తంలో త్రికోణాలు, నాజూకు పనితనానికి పరాకాష్టగా డిజైన్లు మధ్యలో మాతృమూర్తి... చేనేత కళామతల్లి... ఇది వర్తమాన (మోడ్రన్) చిత్రకళకు అద్దం పడుతుంది. రంగుల పొందిక... గీతల అల్లిక అద్భుతంగా కుదిరింది. చిత్రకారుడి ‘సత్తా’, సృజన, కళాత్మక వైభవం, నాజూకు పనితనం, శిఖరాగ్రానికి చేరిన తీరును పట్టి చూపుతుంది. తన సిగ్నేచర్ శైలిని ప్రతిబింబిస్తుంది.
ఇక్కత్ కళామతల్లులను ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా ఆయన చిత్రిక పట్టారు. ఆ మోములో పవిత్రత, దైవత్వం తొణికిసలాడేలా శ్రద్ధ తీసుకున్నారు. ఆయా కళామతల్లులు పోట్రేట్స్ నిండా ఇక్కత్ డిజైన్లు చిత్రించి నీరాజనం పలికారు. సాధారణ పోట్రేట్స్‌కి దీనికి ఊహకందనంత తేడా కనిపిస్తోంది. నేపథ్యంలో (బ్యాక్‌గ్రౌండ్) నేత పూర్తయిన వస్త్రం... గళ్లగళ్ల లుంగీనో, టైల్స్ డిజైన్‌లో చిత్రిక పట్టి సహజత్వాన్ని తీసుకొచ్చారు. వారి ముక్కుకు ముక్కెర, దానికి ముత్యం... పగడం చేర్చడంతో ఆ దివ్యత్వం మరింత ఇనుమడించేలా చేశారు. నేపథ్యం మాత్రం మారుతుంది... వస్త్రాలు మారుతాయి. కొన్నిటి నేపథ్యంలో దారం కండెలు, దారాలు కనిపిస్తాయి. అంతిమంగా చిత్రకారుడి సృజన శీలత సబ్జెక్ట్‌లో తాదాత్మ్యం చెందటం దండిగా కనిపిస్తుంది.
లక్ష్మీకాంత్ చిత్రించిన అద్భుత రంగుల చిత్రాలకు సరితూగే రీతిలో ఆయన డ్రాయింగ్స్ కనిపిస్తాయి. అవి పిసరంత ఎక్కువ శక్తిమంతంగా, విషయాన్ని గుండెల్లోకి తీసుకెళ్లేలా నలుపు, తెలుపులో దర్శనమిస్తాయి. ఇవన్నీ తిరిగి తన బాల్యం నుంచి చూసిన చేనేత దృశ్యాలే... కళామతల్లుల కష్టమే... నిరంతరం శ్రమ చేసే వారే కనిపిస్తారు. ఆ బొమ్మల్లో చేనేత పరికరాలు, కండెలు, షటిల్స్, మగ్గం, సాంచెలు, నూలు, ఆసుపోయడం ఒకటా రెండా మొత్తం నేత ప్రక్రియకు ప్రాణం పోసి ఔరా! అనిపించుకున్నారు. ఇందులో మగవారు సైతం కనిపిస్తారు. వారి నైపుణ్యం, శ్రమ కనిపిస్తుంది.
వీటిని చూస్తే చిత్రకారుడు నిశీత దృష్టి, సబ్జెక్ట్ పట్ల అంకిత, ఆరాధనాభావం, కాగితంపై ఆ దృశ్యాన్ని తీసుకొచ్చేందుకు పడిన తపన, ఆర్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఓ ‘‘సాలెపురుగు’’ అల్లిన చందంగా ఎక్కడా తెగిపోకుండా అల్లాడు. రంగులకే కాదు రేఖలకు సైతం అనిర్వచనీయమైన ‘‘శక్తి’’ తనకు ఉందని ఆయన రుజువు చేశారు.
చేనేత కళాకారుల జీవితం నాణేనికి మరో వైపు కూడా ఉంది. అదే దారిద్య్రం... ఆఖలిచావులు... అప్పుల బాధలు. ఒకప్పుడు ఎక్కువగా వినిపించే ఈ వార్తలు, వాస్తవాల నేపథ్యంలో తాను దగ్గరుండి చూసి, అనుభవించి ఆవేదనకు గురై చిత్రకారుడు ఆ జీవితంపై కూడా బొమ్మలు గీశారు. అందులో సృజన, దైన్య జీవితం కనిపిస్తుంది. వికృతంగా కనిపించే పుర్రెపై రేఖల్లో చేనేత కళాకారుల కార్యక్రమాలను రోజువారీ పనులను చిత్రించి వారి బతుకు ఛిద్రమైన వైనాన్ని సింబాలిక్‌గా తెలియజేశారు. మరో బొమ్మలో ఓ రాబందు నూలు... కండెలు తన రెక్కల కిందకు లాగేసుకున్నట్లు చూపి చేనేత కళాకారుల కళ వారి జీవన స్థితి ఏ విధంగా మారిందో కళాత్మకంగా, సింబాలిక్‌గా చిత్రించారు. ఇట్లా వారి జీవితాలను. పడుగుపేకలను, వెలుగు నీడలను, వెనె్నల చీకటిని చిత్రకళలో బలంగా పొందుపరిచి ప్రజల ముందుకు తీసుకొచ్చారు.
చిత్రకారుడు ఆ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఆ సాధక బాధకాలు, చేదు అనుభవాలు, చేనేత వెతలు క్షుణ్నంగా కాన్వాసుపైకి తీసుకురాగలిగాడు.
ఇంతటి వైవిధ్యం, జీవన పోరాటం, ఇక్కత్ రంగుల సోయగం, గుండెలకు హత్తుకునే డిజైన్లు, వృత్తాలు, త్రికోణాలు, బిందువులు, దారాలు, గీతలు, కోటగుమ్మాలతో, జాగ్రత్తగా అల్లిన జరీ పోగుల మెరుపుదనంతో చిత్రకళ పవిత్రత కోసం పరిశ్రమిస్తున్న పెద్దిలక్ష్మీకాంత్ భువనగిరి యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం వెలివర్తి గ్రామంలో 1981 సంవత్సరంలో జన్మించారు. అందరి పిల్లల మాదిరి అతని బాల్యం గడిచింది. ప్రాథమిక విద్య తన గ్రామంలో చదివినా తొమ్మిది, పదవ తరగతి వలిగొండలో చదివారు. బాల్యంలోనే తండ్రి పెద్ది నరసింహ పంచాంగం పుస్తకాలు తెప్పించి అందులోని విషయాలను, గ్రహగతులను గ్రామస్తులకు చెప్పేవాడు. అందులో గ్రహరాశులను సూచించే తేలు, ఎద్దు... తదితర డ్రాయింగ్స్ తనను విపరీతంగా ఆకర్షించాయని. వాటిని చూడగానే తనకు కావల్సిన ‘నిధి’ లభించిందన్న భావన బాల్యంలోనే కలిగిందని, ఆ విధంగా చిత్రాలపై, బొమ్మలపై ప్రేమ... పిచ్చి తనకు తెలియకుండానే ఏర్పడిందని అది లగాయతు తన మానసిక లోకం మారిపోయిందని, బొమ్మలు ఎక్కడ కనిపిస్తే అక్కడికెళ్లి తదేకంగా చూడటం, గోడలపై కనిపించే బొమ్మలు, పత్రికల్లో కనిపించే చిత్రాలు చూసి వాటిని నకలు చేసి నోట్ పుస్తకాలను నింపేసే వాడినని అలా చిత్రకళ తనలో అంతర్భాగమైందని లక్ష్మీకాంత్ చెప్పారు.
హైదరాబాద్‌లోని సిటీ కళశాలలో డిగ్రీ చదివేందుకు వచ్చాక చిన్నా చితక పనులు చేస్తూనే తన చిత్రకళను కాపాడుకున్నానని, అందులో భాగంగా ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ దగ్గర కొంత కాలం, ఆర్ట్ గ్యాలరీ హనుమంతరావు దగ్గర కొంతకాలం పని చేశాక 2006లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరానని, పెయింటింగ్ సబ్జెక్ట్ తీసుకుని సాధన చేశానని అనంతరం బరోడాకెళ్లి ఎం.ఎస్.యూనివర్సిటీలో ప్రింట్ మేకింగ్‌లో ఎం.ఎఫ్.ఏ చేశానని, దాంతో తన నైపుణ్యం, దృక్పథం పెరిగిందని ఆయన చెప్పారు. ఈ ప్రతిభ... నైపుణ్యం, నాణ్యత, అంకితభావం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం తనకు 2013 సంవత్సరంలో జూనియర్ ఫెలోషిప్‌ను మంజూరు చేసిందని, ఇది అరుదైన విషయమని, ఆ గౌరవం తనకు దక్కిందని లక్ష్మీకాంత్ తెలిపారు. గతంలో తనకు తొమ్మిది అవార్డులు వచ్చాయని వెల్లడించారు.
కొంతకాలం అమీర్‌పేటలో పిల్లలకు, పెద్దలకు చిత్రకళ నేర్పించే సంస్థను నడిపానని, ఆ రకంగా తన కళను పదిమందికి పరిచయం చేశానని పేర్కొన్నారు.
ప్రస్తుతం పూర్తి సమయం చిత్రకళకే కేటాయిస్తూ బొమ్మలు గీస్తున్నానని అలా గీసిన చేనేత కళామతల్లుల చిత్రాలను మార్చి మొదటి వారంలో ఢిల్లీలో జరిగిన జాతీయ చిత్రకళ మేళా-2020 (ఆర్ట్ ఫెయిర్)లో ప్రదర్శనకు పెట్టానని, ఆర్ట్ లవర్స్ నుంచి మంచి స్పందన లభించిందని, ఈ స్ఫూర్తితో మరిన్ని బొమ్మలు గీస్తానని తెలంగాణ చిత్రకళకు ‘వనె్న’ తీసుకొస్తానని ఆయన ఆత్మ విశ్వాసంతో చెప్పారు.
*చిత్రాలు.. పెద్ది లక్ష్మీకాంత్

-వుప్పల నరసింహం 9985781799