AADIVAVRAM - Others

థ్రిల్ హిల్స్.. హార్స్‌లీ హిల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఉత్కంఠభరితమైన ప్రయాణం చేయాలనుకునేవారికి, ప్రకృతి ఒడిలో తలపెట్టుకుని సేద తీరాలనుకునేవారికి ఎంతో అనువైన ప్రదేశం తిరుపతికి సమీపంలో మనల్ని ఆహ్వానిస్తోంది. అక్కడికి వెళితే మేఘాలు చేతికందుతాయి.. మంచుముత్యాలు ఒళ్లంతా గిలిగింతలు పెడుతుంటాయి.. సంపెంగల సువాసనతో కూడిన చల్లటి కొండగాలి గుండెకెన్నో ఊసులు చెబుతుంది. ముఖ్యంగా ఆ ప్రదేశాన్ని దూరం నుండి చూస్తుంటే మంచుదుప్పటి కప్పుకున్న పడుచుపిల్లలా.. దగ్గరకు వెళితే ఔరా అనిపించే పర్వత ప్రాంతాలు చిన్నవిగా కనిపిస్తూ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేయకమానదు. మండు వేసవిలో సైతం చల్లదనాన్ని పంచే అద్భుతమైన పర్వత ప్రాంతం ‘హార్స్‌లీ హిల్స్’.
పొద్దుపొద్దున దట్టంగా కప్పుకున్న పొగమంచు.. మేనును తాకే చల్లటి గాలులతో హృదయం ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది.
పూర్‌మెన్ (పేదవాడి) ఊటీ, ఆంధ్రా ఊటీగా పిలవబడే ఈవిహార స్థలం ఎక్కడో లేదు. మన రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మదనపల్లికి 29 కిలోమీటర్ల దూరంలో బీ.కొత్తకోట మండలంలో ఉంది. తూర్పు కనుమల్లోని దక్షిణ భాగపు కొండల వరసే ఈ హార్స్‌లీ హిల్స్. సముద్ర మట్టానికి సుమారు 4,312 అడుగుల అతి ఎతె్తైన ప్రాంతంలో ప్రదేశం ఉంది. కర్నాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న హార్స్‌లీ హిల్స్ తిరుపతి నుంచి 140 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. చలికాలంలో 3డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో వేసవి ఉపశమనం కోసం ఇక్కడికి వచ్చే పర్యాటకులతో ఈ ప్రాంతం ఎంతో సందడిగా మారిపోతుంది. దట్టమైన అడవిలో రెండువైపులా నీలగిరి జాతి చెట్ల మధ్య ఒంపులు తిరిగే ఘాట్ రోడ్ ప్రయాణం ఎంతో ఉత్కంఠను కలిగిస్తుంది. సాహస యాత్రికులకు, ట్రెక్కింగ్ ప్రియులకు ఇది స్వర్గ్ధామం. ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌదర్యం ఇక్కడి ప్రత్యేకతలు. కొండపైకి చేరుకున్న ప్రకృతి ప్రేమికులకు మబ్బులమాటున సూర్యుడి నుండి అస్పష్టంగా వచ్చే కిరణాలు వెచ్చటి స్పర్శను అందిస్తాయి. పక్కనే ఉన్న గాలికొండ వ్యూపాయింట్ నుంటి లోయలోకి చూస్తే గుండె గుభేల్ అనక మానదు. ఐనా అక్కడ కనిపించే సుందర మనోహర దృశ్యాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. నైట్ క్యాంపులో చలిమంటలు వేసుకుని ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు పర్యాటక ప్రేమికులు. రాత్రిళ్లు నిర్మలమైన ఆకాశంలో మిణుకు మిణుకుమనిపించే తెల్లటి నక్షత్రాలను లెక్కిస్తూ కాలాన్ని సైతం మైమరచిపోతారు.
హార్స్‌లీ హిల్స్ పూర్వనామం - ఏనుగు మల్లమ్మ కొండ. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసేదట. అక్కడ అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించేదట. అలా ఈ ప్రాంతానికి ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరొచ్చింది. అదే పేరున ఇక్కడ ఓ ఆలయం కూడా ఉంది. స్వాతంత్య్రానికి ముందు 1863-67 మధ్యకాలంలో కడప జిల్లా పాలనాధికారిగా డబ్ల్యు డీ హార్స్‌లీ అనే బ్రిటీష్ అధికారి ఇక్కడ కొండపైకి విహారానికి వచ్చారు. ఇక్కడి పచ్చదనం, చల్లదనం ఆయనను ఆకర్షించింది. దీంతో ఆయన ఈప్రాంతంలో ఓ బంగ్లాను నిర్మించి తన వేసవి విడిదిగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ బంగ్లానే ఫారెస్ట్ బంగ్లాగా పిలవబడుతోంది. ఈ బంగ్లా నేటికీ నివాస యోగ్యంగానే ఉంది. నాటి నుండి ఏనుగు మల్లమ్మ కొండ ప్రాంతం హార్సిలీ హిల్స్‌గా ప్రాచుర్యం పొందింది.
ఇక్కడి అటవీ ప్రాంతంలో జంతు ప్రదర్శనశాల, గవర్నర్ బంగ్లా, మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల, మ్యూజియం, గాలికొండ వ్యూపాయింట్ వంటివి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడే ప్రముఖ రచయిత, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషీవ్యాలీ విద్యాలయం ఉంది. అలాగే కల్యాణి పేరుతో ఘనతకెక్కిన 150 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ ట్రీ (నీలగిరి చెట్టు) ప్రధాన ఆకర్షణ. చందనం చెట్లు, శీకాయ వృక్షాలు, నీలగిరి చెట్లు, కాఫీ ప్లాంటేషన్ పర్యాటకుల మనసులను రంజింపజేస్తాయి. జింకలు, చిరుతపులులు వంటి వన్య, మృగప్రాణులు ఇక్కడ సంచరిస్తుంటాయి. ఈప్రాంతంలో చెంచుజాతి ప్రజలు జీవనం సాగిస్తుంటారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల నుండి రోడ్డుమార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మదనపల్లి నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొండపై అతిథి గృహాలను ఏర్పాటు చేసింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్రదేశానికి ఒక్కసారైనా వెళ్లిరావాల్సిందే. ఐతే చందమామలో మచ్చలా ఇక్కడ కూడా కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి. నీటి సౌకర్యం తక్కువ. పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా ఎప్పుడూ తాళాలు వేసి ఉండటంతో నిరుపయోగంగా మారుతున్నాయి. సీజన్‌లో తప్ప మిగతా సమయాల్లో వెళ్తే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు వాళ్లు నిర్వహించే హోటళ్లలో దొరికే ఆహారం తప్ప మిగతా ఎక్కడా ఆహారం దొరకదు. ఇంకెందుకాలస్యం ఈ సమ్మర్‌లో హార్స్‌లీ హిల్ ఓసారి చుట్టొద్దామా!

- అనిల్ కుమార్ తాళ్లూరి