Others

ఏవీ.. అంత గొప్ప సినిమాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ హిట్ మూవీ అంటూ బుల్లితెర ఛానళ్లలో నిరంతరం తెలుగు చిత్రాలు ప్రదర్శిస్తున్నారు, సంతోషం. ఫలానా చిత్రమని తెలియగానే ‘అరె ఈ సినిమా ఎప్పుడొచ్చింది?. సినిమా పేరే వినలేదే? పేపర్లోనో పోస్టర్‌పైనో దీనిగురించి చూడనైనా చూళ్లేదుగా. బహుశ, బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టిన సినిమా అయివుంటుంది. అందుకే.. చానెల్‌కు వచ్చేసింది’లాంటి అభిప్రాయాలు వీక్షకులు వెలిబుచ్చడం సర్వసాధారణమైంది. అంటే అలాంటి పరమ చెత్త చిత్రం తీసిన వారిది తప్పా? ప్రదర్శిస్తున్న బుల్లితెర ఛానల్‌వారిది తప్పా? లేక వాటినీ చూసేస్తున్న ప్రేక్షకులదా?

ఏదో ఆశించి, ఇంకేదీ ఆలోచించకుండా చెత్త చిత్రాలను ప్రేక్షకుల మీదకు ప్రయోగించే సాహసం చేయడం -నిర్మాణకర్తల తప్పు? తక్కువకు దొరికింది కనుక -చెత్త చిత్రానికి సూపర్‌హిట్ బూస్ట్‌నిచ్చి, బ్లాక్‌బస్టర్ ప్రశంసలతో ప్రదర్శించడం ఛానళ్ల తప్పు. -్థయేటర్లలో టికెట్ రేట్లు, అభిమానుల పేరిట సాగే అల్లరి భరించలేక ఫ్రీగా వచ్చేది ఏదైనా ఒకటేలే అనుకుంటూ బిట్లు బిట్లుగా సినిమాను కాలక్షేపం చేయడం వీక్షకుల తప్పు అని సరిపెట్టుకోవాలేమో. చానెళ్లలో వచ్చేవాటిని సినిమాగాకంటే, టైంపాస్ బిట్లుగా చూడటానికే వీక్షకులు ఇష్టపడుతున్నారనడానికి ప్రత్యేకమైన అధ్యయనాలేవీ అక్కర్లేదు. అదేపనిగా వస్తున్న అర్థంపర్థం లేని ఏడుపుగొట్టు సీరియళ్లు, వాటిని మించిన వ్యాపార ప్రకటనలు చూడలేక... ఛానల్స్ మార్చుకుంటూ పోడానికి ప్రేక్షకులు ఎప్పుడో అలవాటుపడ్డారు.
****
చక్కని సందేశమిచ్చే చిత్రాలు, నీతిని బోధించే చిత్రాలు, కళాత్మక విలువలున్న చిత్రాలు, కుటుంబ కథాచిత్రాలు, స్ర్తి ప్రాముఖ్యత వివరించే చిత్రాలు, బాలల చిత్రాలు, నవలా చిత్రాలు, చక్కని జానపద చిత్రాలు, యధార్థ సంఘటన ఆధార చిత్రాలు, దేశభక్తి చిత్రాలు, మహనీయుల జీవిత చరిత్ర వివరించే చిత్రాలు, కల్పితగాథ చిత్రాలు.. లాంటి జోనర్లను తెలుగు సినిమా ఎప్పుడో మర్చిపోయింది. దశాబ్దాల క్రితమే వదిలేసింది. కేవలం చెప్పుకోవడానికే -ఏడాదికో రెండేళ్లకో చారిత్రాత్మక, జానపద, పౌరాణిక చిత్రాల కోటాలో అతి కష్టంమీద ఓకటో రెండో నిర్మిస్తోంది మన టాలీవుడ్. వందేళ్ల సినీ చరిత్రలో ‘బాహుబలి’ని మాత్రం గొప్పగా చెప్పుకుంటుంది సినిమా రంగం. నిజం చెప్పాలంటే హాలీవుడ్ చిత్రాలు చూసేవారికి ‘బాహుబలి’ సర్వసాధారణం. విశ్వ క్రీడల్లో దేశానికి ఒకట్రెండ్ రజిత, కాంస్య పతకాలు రాగానే ప్రభుత్వం, అధికారులు, క్రీడాసంఘాలు, సెలబ్రిటీలు పొంగిపోయినట్టు ఒక్క బాహుబలిని చూసుకుని భుజాలెగేస్తున్న టాలీవుడ్‌ను ఎలా అర్థం చేసుకోవాలి. ఏడాదిలో వందకు ఒక్క చిత్రాన్ని ఓకే అనిపించుకోవడానికే నానా తిప్పలు పడుతున్న దశలోవుంది టాలీవుడ్. ప్రారంభోత్సవ వేడుక, ఫస్ట్‌లుక్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, వ్యూస్, యూట్యూబ్, లైక్స్, ఆడియో, ఫంక్షన్లపై పెడుతున్న శ్రద్ధ చిత్ర నిర్మాణంపై చూపడం లేదన్నది తెరపైకి వస్తున్న సినిమాలు చూసి చెప్పొచ్చు. మొన్నటి దసరా సమయానికి అంటే పది నెలల్లో లెక్కకుమించి సినిమాలే విడుదలయ్యాయి. కనీసం పది చిత్రాలైనా మనసుకు హాయి కలిగించేలా పలకరించాయా? అంటే సమాధానం చెప్పలేం. టాలీవుడ్‌లో వివిధ విభాగాల్లో స్టార్లుగా కాలర్లు ఎగరేస్తున్న ఎవ్వరూ ‘వచ్చాయి’ అని గట్టిగా చెప్పలేని పరిస్థితి.
సినిమాకు పని చేస్తున్న 24 విభాగాలను -విడుదలకు ముందు మిక్కిలి గొప్పగా చెప్పుకోవడం తప్పించి, విడుదల తరువాత ఆ సత్తాను చూపుతున్న సినిమా ఒక్కటీ లేదనడంలో అతిశయోక్తి ఏమీ ఉండదు. కథారచనలో ఓనమాలు దిద్దనివాళ్లూ సినిమా కథలు అల్లేస్తున్నారు, హీరో హీరోయిన్లు తామేదో ‘ఘంటసాల’- సుశీల’ అనుకుని గీతాలాలపించేస్తున్నారు. సంగీత దర్శకులు వాయిద్యాల హోరు పెంచేసి, గీత సాహిత్య మాధుర్యాన్ని చవిచూసే అవకాశాన్ని తుంచేస్తున్నారు. ఆలపిస్తున్న గాయకుల్లో ఒక్కరూ సాహిత్యాన్ని స్వచ్ఛంగా వినే అవకాశం ఇవ్వడం లేదు.
చక్కని కథామలుపులు, గుర్తుండిపోయే పాత్రలు, మనసును హత్తుకునే సెంటిమెంట్లు, జీవిత సత్య సంభాషణలు.. అలా 24 సినీ రంగ శాఖలు చిత్ర నిర్మాణాన్ని యజ్ఞంలా భావించి కృషి చేశాయన్న భావన ఏ సినిమా చూసినా కలగటం లేదు. జూదమాడినట్టు పెట్టుబడి పెడతాం. లాభం వస్తే జేబు నింపుదాం. నష్టం వస్తే ఖర్మనుకుందాం.. అన్నట్టే కనిపిస్తోంది టాలీవుడ్ పరిస్థితి.
అరకొర దుస్తుల స్థానంలో నిండుతనం ఎప్పుడొస్తుందో. పిచ్చి పచ్చి గెంతులు ఆపి డాన్స్‌ను కళగా చూపించే అవకాశం ఎక్కడుందో. హీరోయిజంతో కథను నడిపించే స్థానంలో, కథనుంచే హీరో పుట్టుకొచ్చే సినిమాలు వస్తాయో రావోనన్న భయాలు సినిమాను సినిమాగా చూడాలనుకునే ఆడియన్స్‌ను వెంటాడుతున్నాయి. ఈ భావనలో ప్రేక్షకులు ఉన్నారు కనుకే -తెలివిని ప్రదర్శిస్తున్నారు. సత్తాలేని చిత్రాన్ని రోజు గడవకముందే సాగనంపుతున్నారు. వైవిధ్యం, సత్తావున్న చిత్రాలకు పట్టంగడుతున్నారు.
**
చిత్రం నాలుగువేల థియేటర్లలో విడుదల చేశాం. దాదాపు 20 దేశాల్లో విడుదలకు రంగం సిద్ధం చేశాం. ఆడియో ప్రజలల్లోకి వెళ్లిపోయింది. ఫస్ట్‌లుక్ పిచ్చెక్కించింది. కోట్లకొద్దీ లైక్స్ వస్తున్నాయి.. లాంటి హంగామా డ్రైలాగులకు ప్రేక్షకులు పడిపోయే పరిస్థితి లేదు.
టాలీవుడ్‌లో ప్రతి సినిమాకు పెడుతున్న సక్సెస్ మీట్ లెక్కల ప్రకారం చూస్తే -వారంలో నాలుగైదు సినిమాల విడుదలవుతున్నాయి కనుక ఏ థియేటర్ ఖాళీగా ఉండటానికి వీల్లేదు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఈగలు తోలుతూనే ఉన్నాయి. ఎప్పుడు మూతపడతాయోనని భయపెడుతూనే ఉన్నాయి. వంద, యాభై కోట్ల సినీ డబ్బా శబ్దాలు తప్పా, ఈ సినిమాను చూడొచ్చు అన్న సౌండ్ ధైర్యంగా ఏ థియేటర్ వద్దా వినిపించటం లేదు. కారణం వస్తున్నవన్నీ పరమ చెత్త చిత్రాలు కనుక. తెలుగు సినిమా ఎందుకు విఫలమవుతుంది? అన్న అధ్యయనాలు నిర్మాణకర్తల నుంచి మొదలయ్యేంత వరకూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునేంత వరకూ.. ‘తిక్క’ తప్పదేమో. ‘లోఫర్స్’, ‘మెంటల్స్’ని భరించక తప్పదేమో.

-మురహరి ఆనందరావు