Others

జనరంజకం.. జానపదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా ఆవిర్భావానికి ముందే జానపదాలకు ఓ ప్రత్యేకస్థానం ఉన్నా -సినిమాల్లో వాటికి స్థానం దొరికిన తరువాత మరింతగా అవి జనాలకు దగ్గరయ్యాయి. సినిమా రంగంలో ఉద్దండులైన సంగీత దర్శకులు మైమరిపించే జానపద బాణీలుకట్టి మెప్పించారు. చేయి తిరిగిన గీత రచయితలు సందర్భానికి తగిన జానపద గీతాలు అందించి అబ్బురపర్చారు. నిజానికి -తెలుగు పరిశ్రమ కోసం పుట్టిన జానపద గీతాలు ఎప్పటికీ ఆణిముత్యాలే! ప్రజల నోళ్ళల్లో ఎప్పుడూ పలికేపాటలే.
ఎన్నో చిత్రాలకు జానపద గీతాలు అందించిన వారిలో -కొసరాజు పాత్ర ప్రత్యేకం. తరువాత కొసరాజు వారసుడిగా జాలాది అలాంటి కృషే చేశారు. ఇప్పుడు ఆ స్థానం సాహితి అందుకున్నారు. జానపద గీతాల్లో ఆంగ్ల, హిందీ పదాలు కలిపి రాయడంలో కొసరాజుది ఓ స్టయిల్. జాలాది మాత్రం అచ్చతెలుగు మాండలిక పదాలతోనే వ్రాశారు. ఇద్దరికీ ఆ ఒక్కటే తేడా. కొన్ని తెలుగు సినిమాల్లో పాపులర్ అయిన జానపదాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
ఎన్టీఆర్, అంజలీదేవి జంటగా సి పుల్లయ్య దర్శకత్వం వచ్చిన ‘లవకుశ’ చిత్రానికి సంగీత దర్శకుడు ఘంటసాల. ఈ చిత్రంలో మైమరిపించే పాటలు, పద్యాల మధ్య ఓ జానపద గీతం తళుక్కుమంటుంది. ఘంటసాల, జిక్కి, స్వర్ణలత గానం చేసిన ఆ పాటే -వొల్లనోరి మామ నీ పిల్లను. రేలంగి అద్భుత నటన, జానపద నుడికారపు సొగసు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్టీఆర్, అక్కినేని, ఎస్వీయార్, సావిత్రిలాంటి ఉద్దండులతో కెవి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మాయాబజార్’. రసరమ్య గీతాలున్న ఈ చిత్రానికీ సంగీత దర్శకుడు ఘంటసాలే. సురభి నాటక సమాజం నుంచి సేకరించిన ‘వివాహ భోజనంబు/ వింతైన వంటకంబు’ జానపద గీతాన్ని మాధవపెద్ది సత్యం తనదైన స్టయిల్‌లో ఆలపించి మెప్పించారు. గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో మహానటుడు ఎస్వీయార్ మీద మాయా సన్నివేశాలను ట్రిక్ ఫొటోగ్రఫీతో చిత్రీకరించిన వైనం అత్యద్భుతం. ఇక బిఏ సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో అక్కినేని నటించిన ‘చెంచులక్ష్మి’లో ఓ జానపద గీతం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కొసరాజు అక్షర సృష్టికి సాలూరి రాజేశ్వర రావు బాణీ కడితే ఘంటసాల, జిక్కి ఆలపించిన ఆ పాటే -చెట్టులెక్కగలవా/ఓ నరహరి పుట్టలెక్కగలవా. తాపి చాణక్య దర్శకత్వంలో వచ్చిన ‘రోజులు మారాయి’ చిత్రంలో కొసరాజు రచనకు మాస్టర్ వేణు ఓ అద్భుతమైన జానపద బాణీ ఇచ్చారు. జిక్కీ పాడిన ఆ పాటే -ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా/ నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా!. ఇంగ్లీష్, హిందీ పదాల కలబోతతో ‘తోడికోడళ్ళు’ చిత్రం కోసం కొసరాజు రాసిన ‘టౌను పక్కకెళ్లొద్దురో డింగరి’ పాటను ఘంటసాల, జిక్కి గానం చేశారు. కలిసివుంటే కలదు సుఖం చిత్రంలో -ముద్దబంతి పూలు పెట్టి/ మొగిలిరేకుల జడను చుట్టి/ హంసలా నడిచివచ్చే చిట్టెమ్మా/ మా ఇంటికేం తెచ్చావమ్మా చెప్పమ్మా.. పాట ఎప్పటికీ జ్ఞాపకం ఉండేదే. తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ‘్భర్యాబిడ్డలు’ చిత్రంలో ఘంటసాల, ఎల్‌ఆర్ ఈశ్వరి పాడిన -ఆకులు పోకలు ఇవ్వొద్దు/నా నోరు ఎర్రగ చేయొద్దు.. అన్న పాటతో జానపదానికి ఎంత అద్భుతమైన బాణీ కట్టవచ్చో కెవి మహదేవన్ చేసి చూపించారు.
జానపద గీతానికి సైతం అభ్యుదయ సొగసులద్ది ‘వెలుగునీడలు’ చిత్రం కోసం శ్రీశ్రీ రచించిన ‘ఓ రంగయో/ పూలరంగయో’ గీతానికి పెండ్యాల నాగేశ్వర రావు ఇచ్చిన బాణీ మరో అద్భుతం. మూగమనసులు చిత్రంలో -గౌరమ్మా నీ మొగుడెవరమ్మా/ ఎవరమ్మా? వారెవరమ్మా?’ పాటను నాగేశ్వరరావు, జమున బృందంపై చిత్రీకరించి హిట్టు చేసి చూపించారు. ఇక క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రాణంఖరీదు’ సినిమా కోసం జాలాది రచించిన జానపద గీతం -యేతమేసి తోడినా యేరు ఎండదు/ పొగిలిపొగిలి యేడ్చినా పొంత నిండదు. ఈ పాట జానపద గీతాల్లో బాద్‌షాగా ఇప్పటికీ గుర్తింపు పొందుతోంది.
దాశరథి రంగాచార్య నవలను ‘చిల్లరదేవుళ్ళు’ పేరిట చిత్రంగా రూపొందించారు. కెవి మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో నాలుగు జానపద గీతాలున్నాయి. తెలంగాణ మాండలికంతో రూపుదిద్దుకున్న పాటల్లో -జానపదులు చాలాకాలంగా పాడుకుంటున్న పాటనే రాళ్ళపల్లి మీద చిత్రీకరించారు. -ఏటికేతంబట్టి ఎయ్యిపుట్లు పండించి గంజిలో మెతుకెరుగరన్నా? నేను గంజిలో మెతుకెరుగరన్నా. అన్న ఈ గీతం నేటికీ కలికితురాయే! ఇక బి నర్సింగరావు స్వీయదర్శకత్వంలో ‘రంగుల కల’ నిర్మితమైంది. ఇందులో గూడ అంజయ్య జానపద గీతాన్ని గద్దర్ అద్భుతంగా ఆలపించారు. -కొడుకో కొమురన్న జర భద్రంకొడుకో.. జర పైలం కొడుకో పాట వింటుంటే -జానపద పరిమళం స్పష్టంగా గోచరిస్తుంది.
తిలక్, బి నర్సింగరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మా భూమి’ చిత్రం తెలంగాణ సాయుధ పోరాటం ఇతివృత్తంతో నిర్మితమైంది. నైజాంకు వ్యతిరేకంగా సాగుతున్న రైతాంగ సాయుధ పోరాటం సమయంలో యాదగిరి అనే రచయిత ఓ గీతాన్ని రచించారు. అప్పట్లో ఈ గీతం ప్రజలను ఉర్రూతలూగించింది. బండెనక బండికట్టి/ పదహారు బండ్లుకట్టి/ ఏ బండ్లె పొతవు కొడుకో.. నైజాము సర్కరోడా/ ఏ బండ్లె పొతవు కొడుకో నైజాము సర్కరోడా? -గీతాన్ని గద్దర్ గొంతులో వింటున్నపుడు జానపద బంగారం విలువ అర్ధమవుతుంది. తాతినేని రామారావు దర్శకత్వంలో ‘మరుపురాని మనిషి’ చిత్రం కోసం సి నారాయణరెడ్డి ఓ జానపద గీతం రచించారు. -వచ్చింది వచ్చింది లచ్చిమి.. వనలచ్చిమి పాట అప్పట్లో ఓ సెనే్సషన్. అచ్చ తెలుగు సాంప్రదాయ కుటుంబ చిత్రంగా వచ్చిన బాపు రూపొందించిన ‘ముత్యాలముగ్గు’ చిత్రం కోసం సినారే రచించిన జానపద గీతాన్ని పి.సుశీల అద్భుతంగా ఆలపించారు. -గోగులు పూచే గోగులు కాసే ఓ లచ్చగుమ్మాడీ/ గోగులు కోసే వారెవరమ్మా ఓ లచ్చగుమ్మాడీ అంటూ సాగే ఆ గీతాన్ని ఎలా మర్చిపోతాం. శివనాగేశ్వర రావు దర్శకత్వంలో వచ్చిన ‘మొండిమొగుడు పెంకిపెళ్ళాం’ చిత్రం కోసం సాహితి రాసిన ఓ జానపద గీతానికి ఎంఎం కీరవాణి చక్కటి జానపద బాణీనిచ్చారు. ‘లాలుదర్వాజ కాడ లష్కర్ బోనాల్‌కొత్తనని రాకపోతివి/ లకిడికాపూల్‌కాడ లబ్బర్ గాజులు తెత్తనని తేకపోతివి. విజయశాంతి, సుమన్ మీద చిత్రీకరించిన ఈ పాట ఓ మంచి జానపద గీతమే. జానపద గీతాలు కూడా మారుతున్న ఆధునిక సంగీత ధోరణులకు అనుగుణంగా మారుతూనే వచ్చిందని చెప్పడానికి ప్రేమికుడు చిత్రాన్ని ఉదహరించుకోవాలి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో ఎఆర్ రెహమాన్ జానపదానికి వెస్ట్రన్ టచ్ ఇస్తూ ఒక బాణీని రూపొందించారు. -అక్కెంపేట్/ కొబ్బరిమట్టె అంటూ సాగే పాటకు అప్పట్లో ఎంతటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వునేను’ చిత్రం కోసం సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ డిజైన్ చేసిన బాణీ ‘గాజువాక పిల్లా/ మేం గాజులోల్లం కాదా’ అన్నది ఒక రసరంజక జానపదమే. ఇక రవి చావలి దర్శకత్వంలో ‘కాలేజ్’ చిత్రం కోసం సంగీత దర్శకుడు ఘంటాడి క్రిష్ణ ఒక జానపదుల బాణీని అచ్చంగా అలాగే తీసుకున్నారు. బోనాల వేడుకల్లో జానపదులు పాడుకునే -మాయదారి మైసమ్మో మైసమ్మా/ మనం మైసారం పొదమే మైసమ్మా.. ట్యూన్‌ను కాలేజ్ ఫేర్వల్ నేపథ్యంగా చిత్రీకరించి హిట్టు అందుకున్నారు. శీనువైట్ల దర్శకత్వం వహించిన ‘కింగ్’ చిత్రంలో -సింత కింద పాల సుక్కకే/ ఒక్క బొట్టు బయ్ సుక్కకే/ నింగిలోని సుక్కలన్ని గలగల రాలిపోయే/ చార్‌మినార్, గోల్కొండ గిరాగిరా తిరిగిపాయే/ ఎంత పని చేశావురో ఏములాడ రాజన్నా/ నువ్వెంత పని చేశావురో ఏములాడ రాజన్నా అంటూ సాగే సాహితి రచనకు దేవిశ్రీ ప్రసాద్ మంచి జానపద బాణీనిచ్చారు. ‘బొబ్బిలియుద్ధం’ చిత్రంలో ఆరుద్ర జానపద గీతానికి సాలూరివారు అత్యద్భుత బాణీనిచ్చారు. పి.సుశీల గానంలో -ముత్యాల చెమ్మచెక్క/ రతనాల చెమ్మచెక్క/ ఓ చెలి ఆడుదమా పాడుదమా/ కిలకిల కిలకిల నవ్వులతో అంటూ సాగే గీతం నేటికీ ఓ వజ్రమాలికే! ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రం కోసం ఆత్రేయ రాసిన ‘ఏడుకొండలసామి/ ఎక్కడున్నావయ్యాయా/ ఎన్ని మెట్లెక్కిన కానరావేవయ్యా.. జానపద గీతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒకప్పటి టూరింగ్ టాకీసుల్లో సాయంత్రం మొదటి ఆటకుముందు ప్రతి థియేటర్ యజమాని ఈ పాటని తప్పనిసరిగా వేసేవారు. లౌడ్‌స్పీకర్ ద్వారా ఈ పాట చుట్టుపక్కల ఐదారు కిలోమీటర్ల దూరం వినబడేది. చుట్టుప్రక్కల వున్న పల్లెజనం సినిమాకి వెళ్ళడానికి సిద్ధమయ్యేవారు.
ఇలా చలనచిత్రాల ప్రారంభం నుంచి ఈనాటి వరకు ప్రతి చిత్రంలో జానపద గీతం తన ప్రస్థానం సాగిస్తూనే వుంది. ఆ నుడికారపు సొగసులతో రస హృదయాలను ఉర్రూతలూగిస్తూనే వున్నాయి.
చలనచిత్రాల్లో జానపద గీతాలు ఏ ఒక్క రసానికో పరిమితం కాకుండా నవ రసాలతో ఒలలాడిస్తూనే వున్నాయి. అదీ జానపద గీతాలకు, బాణీలకు ఉన్న భాషణం... మహాభూషణం!

-ఆకుల రాఘవ