Others

చివరకు మిగిలేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: అశుతోష్ ముఖర్జీ
సంగీతం: అశ్వత్ధామ
నృత్యం: వేదాంతం జగన్నాథశర్మ
కళ: వి రాజేంద్రకుమార్
ఎడిటింగ్: వి అంకిరెడ్డి
కెమెరా: ఎంకె రాజు
నిర్మాత: వి పురుషోత్తమరెడ్డి
దర్శకత్వం: జి రామినీడు
**
పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో జన్మించిన గుత్తా రామినీడు బిఎస్సీ చదివే రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. నటుడు ఎస్‌వి రంగారావు ద్వారా చిత్రసీమలో ప్రవేశించారు. ‘అన్నదాత’ చిత్రానికి వేదాంతం రాఘవయ్య వద్ద, ‘చరణదాసి’ చిత్రానికి తాతినేని ప్రకాశరావు వద్ద సహాయ దర్శకునిగా పనిచేశారు. కొందరు మిత్రులతో కలిసి నవశక్తి బ్యానరుపై పి.గంగాధరరావు నిర్మాతగా ‘మా ఇంటి మహాలక్ష్మి’ చిత్రం నిర్మించారు. ఆ చిత్రం విజయం సాధించటమే కాదు, కేంద్ర ప్రభుత్వ ప్రశంసాపత్రం పొందింది. వీరి సామర్థ్యం గమనించిన మరికొందరు మిత్రులు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి, ఎం సత్యనారాయణ, కొండలరెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కలిసి ఒక క్వాలిటీగల చిత్రాన్ని జి రామినీడు దర్శకత్వంలో రూపొందించాలని సంకల్పించారు. కలకత్తావెళ్ళి పలు చిత్రాలు చూసిన వీరికి బెంగాలీలో అసిత్‌సేన్ నిర్మించిన ‘దీప్ జలే జాయే’ నచ్చింది. బెంగాలీలో అశుతోష్ ముఖర్జీ వ్రాసిన ‘నర్సుమిత్ర’ కథ ఆధారంగా ‘దీప్ జలే జాయ్’ రూపొందించబడింది. అనిల్‌చటర్జీ, సుచిత్రసేన్ జంటగా నటించారు. ఈ చిత్రం ఆధారంగా తెలుగులో రూపొందించిన చిత్రమే -చివరకు మిగిలేది. 1960 నవంబర్ 25న విడుదలైంది. ‘చివరకు మిగిలేది’ చిత్రానికి తొలిసారి మాటల రచయితగా అట్లారి పిచ్చేశ్వరరావు పరిచయమయ్యారు. దీనికి పర్యవేక్షణ మల్లాది రామకృష్ణశాస్ర్తీ కావటం విశేషం.
***
డ్రమ్ముపై కాలి గజ్జెలు శబ్దం వినిపిస్తుండగా, టైటిల్స్ ప్రారంభమవుతాయి. కల్నల్ చంద్ర (ప్రభాకర్‌రెడ్డి-తొలి పరిచయం) మెంటల్ ఆసుపత్రి చీఫ్ డాక్టరు. నర్సు పద్మ (సావిత్రి). విదేశాలలో వైవిధ్యమైన చికిత్సాపద్ధతుల్లో శిక్షణ పూర్తి చేసుకుని వస్తుంది. ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికుడు భాస్కర్ (కాంతారావు) ట్రీట్‌మెంట్ కోసం ఈ ఆస్పత్రికి వస్తాడు. అతన్ని బాగుచేసే ఉద్దేశంతో కల్నల్ ఆదేశాల మేరకు.. భాస్కర్‌ను ప్రేమించినట్టు పద్మ నటిస్తుంది. ఈ ప్రయత్నంలో ఆమె నిజంగానే భాస్కర్‌ను ప్రేమిస్తుంది. భాస్కర్ మానసికస్థితి మెరుగవుతుంది. అనంతరం కల్నల్ మాటలను బట్టి పద్మ ప్రేమ నటనేనని భావించి భాస్కర్ వెళ్లిపోతాడు. అతనికి పెళ్లి కుదరటంతో పద్మ మనసు దెబ్బతింటుంది. మరోసారి లక్ష్మీ (మాలిని) అనే యువతివల్ల ప్రకాశం (బాలయ్య) మతి చలించగా, అతన్నీ సరిచేయాల్సిన బాధ్యత పద్మపైన పడుతుంది. పద్మ ట్రీట్‌మెంటుతో ఆరోగ్యవంతుడైన ప్రకాశం, పద్మను ప్రేమించి ఆమెకోసం ఆరాటపడతాడు. కాని భాస్కర్‌ను మర్చిపోలేకపోయిన పద్మ మతిస్థిమితానికి గురవుతుంది. డాక్టరు చంద్ర తాను కనిపెట్టిన ‘పేషెంటుతో ఎమోషనల్ రిలేషన్‌షిప్’ సిద్ధాంతాల ప్రాతిపదికన ఆమెను పరీక్షించి పద్మ జీవితం దెబ్బతిన్నదని గ్రహించి విచారించటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో లక్ష్మిని ఆకర్షించిన ధనికుడైన ప్రియుడిగా బ్రహ్మం, ప్రకాశం తండ్రిగా చదలవాడ, లక్ష్మి తండ్రి రమణారెడ్డి ఆస్పత్రిలో నర్సుగా భానుమతి, పేషెంట్లుగా హాస్యనటులు రాజ్‌బాబు, బాలకృష్ణ, వేళంగి, నల్లరామ్మూర్తి, సీతారాం నటించారు. మందు ప్రియునిగా హరనాథ్, నృత్యాలలో(జ్యోతి, రాజేశ్వరి) నటించారు. నాయిక పాత్రకు తొలుత జమునను సంప్రదించగా కారణాంతరాలవల్ల ఆమె అంగీకరించలేకపోయింది. అంతకుముందు రామినీడు చిత్రంలో నటిస్తానని సావిత్రి మాటిచ్చివుంది. దానికితోడు బెంగాలీ చిత్రం ‘దీప్ జలే జాయ్’ చూసి అందులో సుచిత్రసేన్ నటనకు ముచ్చటపడింది. దాంతో మక్కువతో తక్కువ పారితోషికంతో ఈ చిత్రంలో నటించటమేకాక, ఆ చిత్రాన్ని తమిళంలో నిర్మించాలని నిర్మాతల వద్ద హక్కులు కొనుగోలు చేశారు. కానీ తమిళంలో సావిత్రి ఆ చిత్రాన్ని రూపొందించలేదు. నర్సు పద్మగా మహానటి సావిత్రి ఎంతో సున్నితంగా కంటిచూపులో, పెదవి విరుపులో నవ్వునూ ప్రేమను వెల్లడించి మురిపించారు. భాస్కర్‌ను బాగుచేసే ప్రయత్నంలో అతనితో నిజంగానే ప్రేమలోపడి, తిరిగి ప్రకాశంతో అదే పరిస్థితులు ఎదుర్కొనే సన్నివేశాల్లో భావ సంఘర్షణను చూపించటంలో అనుభవంతో కూడిన నటనను ప్రదర్శించారు. బాలయ్య మతిస్థిమితానికి గురయ్యే పరిస్థితులు కల్పించిన లక్ష్మివంటి యువతుల పట్ల వేదన, ఆక్రోశం చూపుతో పాత్రలో ఎంతో నిండుతనాన్ని, అవధులులేని నటనను ప్రదర్శించారు. ఎందరో విజ్ఞులు, విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ చిత్రం హిందీలో రూపొందించగా వహిదా రెహమాన్ ఆ పాత్రను పోషించారు. ఆమెకూడా తన నటనకంటే సావిత్రి నటనే ఎంతో ఉన్నతంగా ఉందని ప్రశంసించటం అరుదైన విశేషం. భాస్కర్ పాత్రలో కాంతారావు సాత్వికం, పరిణితితో కూడిన గంభీరమైన నటనతో అలరించారు. ఆవేశపూరితమైన కళాకారునిగా, కవిగా, ప్రియునిగా ఆకట్టుకునేలా నటించారు. ఎంబిబిఎస్ చదువుతూ తొలిసారి నటునిగా, డాక్టరుగా పరిచయమైన ప్రభాకర్‌రెడ్డి ఆ పాత్రకు తగిన హుందాతనం చూపించారు. అమాయకపు నటనతో హరనాథ్ పాత్రోచితంగా మెప్పించారు.
భావుకతకు అద్దంపట్టే సన్నివేశాలను రూపొందించగల సమర్ధులు జి రామినీడు. పద్మ, భాస్కర్‌ల మధ్య సన్నివేశాలు, ఆమె భాస్కర్ భుజంపై తలవాల్చి సేదదీరటం, తిరిగి ప్రకాశంతో అదే సన్నివేశంలో భాస్కర్ అని పలకరించటం, భాస్కర్ తన ప్రేమ తెలియచేస్తాడని పద్మ ఆశించటం.. తరువాత ఆశాభంగం, భాస్కర్ తన పెళ్లి విషయం పద్మతో చెప్పటం, పద్మ ఏసుప్రభువు విగ్రహంముందు కంటిచూపుతో తన భావాలు పంచుకోవటం లాంటి సన్నివేశాలు ఎంతో సున్నితంగా చిత్రీకరించారు. అవకాశవాద యువతిగా లక్ష్మిపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రామినీడు భావుకతకు, కెమెరా ఎంకె రాజు సరైన సహకారం అందించటంతో, అలరించే వెనె్నల గీతాలు ఆవిష్కతమయ్యాయి. -అందానికి అందమునేనే అనే గీతం చక్కని సెట్టింగ్స్‌తో (జమునారాణి- మల్లాది) సాగుతుంది. లక్ష్మి నృత్యం, బ్రహ్మం పియానో వాయించే గీతం -కవికోకిల తీయని పలుకులలో (పి సుశీల- మల్లాది). మరో ఆహ్లాదకర గీతం -చిన్నారి నీమనసే వెనె్నలల్లిన చాందిని అని నీ వన్నది (మల్లాది- తొలిసారి గానం సునంద). ఈ చిత్రంలో ఘంటసాల ఆలపించగా హరనాథ్ బృందంపై చిత్రీకరించిన -అయినవారు నాకెవరు ఓ విను సిస్టర్ (రచన-కొసరాజు) చమత్కారంగా సాగుతుంది. (హేమంతకుమార్ బాణీలో మన్నాడే పాడిన బెంగాలీ గీతం ‘ఎమనబందుతుమార్’ను కొంతవరకూ ఉపయోగించారు. కాంతారావుపైనా, సావిత్రిపైనా చిత్రీకరించిన ఆకట్టుకుని అలరించే గీతం (పలుసార్లు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది) దర్శకుని ప్రతిభకు దర్పణంగా నిలిచింది. స్వరకర్త హేమంత్‌కుమార్ గానం చేసిన బెంగాలి గీతం ఏరాత్ తొమార్ తొమార్ అంటూ సాగితే, తెలుగులో మల్లాది రచన ఘంటసాల గానంతో -సుధవో సుహాసిని మధువో విలాసిని అంటూ సాగుతుంది. సంగీతపరంగా, కథాపరంగా, చక్కని భావుకతతో నిండిన చిత్రంగా ‘చివరకు మిగిలేది’ నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘ఖామోషి’గా స్వరకర్త హేమంత్‌కుమార్, అసిత్‌సేన్ దర్శకత్వంలో 1969లో నిర్మించారు. బెంగాలీ చిత్రంలోని హిట్ సాంగ్స్ బాణీలను మార్చి కొత్త బాణీలతో తీర్చిదిద్దారు. ఆ గీతాలు అలరించేలా రూపొందటం విశేషం. వహిదా రెహమాన్, ధర్మేంద్ర, రాజేష్‌ఖన్నా నటించిన ఆ చిత్రం విజయవంతమైంది. బెంగాలీ చిత్రం -దీప్ జలే జాయ్ కూడా ప్రముఖ నగరాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడింది. కాని తెలుగుచిత్రం చివరకు మిగిలేది ఆర్థికంగా సక్సెస్ కాకపోయినా ప్రముఖుల అభినందనలు పొందింది. మహానటి సావిత్రి మహోన్నత నటనకు ఆనవాలుగా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు, తమ కుమార్తె పెళ్లి సందర్భంగా రిసెప్షన్‌లో ప్రదర్శించారు. ప్రముఖ రచయిత్రి డాక్టర్ లత తన స్నేహితులకు ఫోనుచేసి ఈ చిత్రాన్ని తొందరగా చూడమని, లేకుంటే మంచి ఫీల్ మిస్సవుతామని చెప్పారట. చిత్ర గీతాలు నేటికీ రసజ్ఞ శ్రోతలను పరవశింపచేయటం లాంటివి ‘చివరకు మిగిలేది’ విశేషాలుగా చెప్పుకోవాలి. మంచి అభిరుచిగల నిర్మాతలను అభినందించాలి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి