AADIVAVRAM - Others

సలహా (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధరణీపుత్ర మహారాజుకు లేకలేక కలిగిన ఏకైక సంతానం భోగేశ్వర్. ఆ బిడ్డను ఎంతో గారాబంగా అల్లారుముద్దుగా పెంచసాగారు. గురుకులానికి పంపి విద్యాబుద్ధులు నేర్పవలసిన వయస్సు వచ్చినా ఆ విషయంపై మహారాజు అంత ఆసక్తి చూపలేదు. తన కుమారుడ్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనని మహాపండితుల్ని, గురువుల్ని రాజమందిరానికే పిలిపించి చదువు చెప్పమని ఆదేశించారు.
అయితే భోగేశ్వర్‌కు చదువు అబ్బడం లేదు. ఇంటికొచ్చిన గురువుల పట్ల గౌరవభావం లేదు. ‘ఈ గురువులు మా దయాదాక్షిణ్యాలపై బతికేవారు’ అని భోగేశ్వర్ మనసులో బలంగా ఉంది. ఎదుటి వ్యక్తి కష్టం అతనికి తెలియదు. రాజుగారికి భయపడి ‘ఆహా! ఓహో!’ అంటూ కుమారుడ్ని ప్రశంసిస్తున్నారే తప్ప లోపం ఎక్కడ జరుగుతుందో చెప్పడంలేదు. భోగేశ్వర్ పెద్దల యెడల గౌరవం చూపేవాడు కాదు. ‘వీళ్లంతా మా పనివాళ్లు’ అనే ధోరణిలో వ్యవహరించేవాడు. ఒకరోజు ధరణీపుత్ర మహారాజు దిగాలుగా కూర్చున్నారు. మంత్రి ఉత్తముడు అక్కడకు వచ్చారు.
‘మహామంత్రీ! నా తరువాత ఈ రాజ్యభారాన్ని మోయవలసిన నా కుమారుడికి విద్యాబుద్ధులు అబ్బడం లేదు. ఏం చేస్తే నా బిడ్డను ఉన్నత స్థితికి తేగలనో అర్తం కావడంలేదు’ అని మహారాజు వాపోయారు. తన బిడ్డ ఎదుగుదలకు మంచి సలహా ఇవ్వమని కోరారు.
‘మహారాజా! మీకు ఏకైక సంతానం కావడంతో గురుకులానికి పంపడం లేదు. కొంతకాలం ఈ భోగభాగ్యాలకు దూరంగా మీ బిడ్డను గురుకులానికి పంపండి. అక్కడ సాధారణ జీవితం గడిపి కాయకష్టం తెలుసుకుని, విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. ఏ కష్టం తెలియకుండా భోగవిలాసాలలో తేలియాడుతుండే అందరూ తనలాగే సుఖంగా ఉన్నారనుకునే ప్రమాదం ఉంది. రేపు ప్రజల కష్టాల పట్ల ఎలా అవగాహన కలుగుతుంది మహారాజా? మీకు భయపడి పండితులు మీ బిడ్డను మందలించలేకపోతున్నారు. మంచి చెడుకున్న విచక్షణ తెలియక పోవడంతో నేను ఈ దేశానికి కాబోయే రాజుననే గర్వం రోజురోజుకూ పెరిగిపోయి అహంకారిగా మారిపోతున్నాడు’ అని సవినయంగా చెప్పారు మంత్రి.
ఈ మాటలు విన్న మహారాజు అదే రోజు తన కుమారుడు భోగేశ్వర్‌ను గురుకులానికి పంపాలని నిర్ణయించారు. గురుకులానికి వెళ్లిన భోగేశ్వర్‌కు నిద్రించడానికి హంసతూలికా తల్పాలు లేవు. కటిక నేలపై నిద్రపోవలసి వచ్చేది. తినడానికి పంచభక్ష్య పరమాన్నాలు లేవు. అడవికి వెళ్లి కందమూలాలు తెచ్చుకుని తినవలసి వచ్చేది. బారెడు పొద్దెక్కిన వరకు నిద్రపోయే అవకాశం దొరికేది కాదు. ఉదయానే్న నిద్రలేచి నదికి వెళ్లి స్నానమాచరించి, సూర్య నమస్కారాలు చేసి దినచర్య ప్రారంభించవలసి వచ్చేది. ఈ విధంగా ఒక క్రమశిక్షణగల జీవితానికి భోగేశ్వర్ అలవాటుపడి చక్కటి విద్యాబుద్ధులు, యుద్ధ విద్యలు నేర్చుకుని గురుకుల పాఠాలతోపాటు జీవిత పాఠాలు సైతం చక్కగా నేర్చుకున్నాడు. భోగేశ్వర్‌కు యుక్తవయస్సు వచ్చేవరకు గురుకులంలో అన్ని విద్యలు నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న అనంతరం అతను నగరానికి వచ్చాడు. మునుపటిలా కాక గురువులకు, పెద్దలకు నమస్కారం చేశాడు. పెద్దల పట్ల వినయ విధేయతలు ప్రదర్శించాడు.
తన బిడ్డలో వచ్చిన మార్పునకు ధరణీపుత్ర మహారాజు ఎంతగానో సంతోషించాడు.
మహామంత్రిని పిలిచి ‘మీరు చక్కటి సూచనలు చేయడం వల్ల నా బిడ్డ చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడయ్యాడు.’ అన్నారు.
అందుకు మంత్రి ‘మహారాజా! మీ బిడ్డ గురుకులంలోనే విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. బాహ్య ప్రపంచం గురించి తెలియవలసి ఉంది. రెండేళ్లపాటు మహారాజు కుమారుడిగా కాక సాధారణ వ్యక్తిగా దేశాటన చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న తరువాత పట్ట్భాషేకం చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది’ అని సూచించారు.
ఈ సూచన మహారాజుకు బాగా నచ్చింది. భోగేశ్వర్ దేశాటనకు వెళ్లి ప్రజా జీవితంలో మమేకమయ్యే ఏర్పాటు చేశారు. కొనే్నళ్లపాటు ప్రజల్లో సాధారణ జీవితాన్ని గడిపిన భోగేశ్వర్ అందరి కష్టసుఖాలను తెలుసుకుని మానవత్వమున్న మహోన్నత వ్యక్తిగా ఎదిగాడు. దేశాటన పూర్తి కాగానే మహారాజుగా పట్ట్భాషేకం జరిగింది. ఆ తరువాత భోగేశ్వర్ ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలిస్తూ దేశాభివృద్ధికి ఎంతగానో కృషి చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు.

-షేక్ జాని