AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరిగి హరిదాసు చెప్పే రామకథని ఆశే్లష వినసాగాడు.
దితి దుఃఖిస్తూ దేవేంద్రుడితో చెప్పింది.
‘నా లోపం వల్లే గర్భస్థ శిశువు ఐదు ముక్కలుగా నరకబడ్డాడు తప్ప ఇందులో నీ తప్పు లేదు. నాకో పని చేసి పెట్టు. నరకబడ్డ నా ఏడు మంది కొడుకులు అంతరిక్షంలోని వాతస్కంధాలకి (ఇవి నక్షత్ర మండలాలు, మొదలైన వాటికి ఆధారాలని పురాణాల్లో ఉంది) అధిష్టాన దేవతలై అంతరిక్షంలో సంచరించాలి. ఒకరు బ్రహ్మలోకంలో, ఒకరు ఇంద్రలోకంలో, మరొకరు వాయువు అనే అంతరిక్షంలో తిరగాలి. మిగిలిన నలుగురు నాలుగు దిక్కుల్లో తిరగాలి. వీరు ‘మరుత్తులు’ అనే పేరుతో ప్రసిద్ధి చెందాలి’
‘ఇంద్రుడు వాటికి అంగీకరించాడు. రామా! అక్కడ నించి దితి, ఇంద్రుడు స్వర్గానికి వెళ్లారు. దితికి ఇంద్రుడు సేవ చేసిన ప్రదేశం ఇదే. ఇక్ష్వాకుడికి, అప్సరసకి పుట్టిన విశాలుడు ఇక్కడ విశాలపురిని నిర్మించాడు. అతని కొడుకు హేమచంద్రుడు. అతని కొడుకు సుచంద్రుడు. సుచంద్రుడి కొడుకు ధూమ్రాశ్వుడు. అతని కొడుకు సృంజయుడు. అతని కొడుకు సహదేవుడు. సహదేవుడి కొడుకు కుశాశ్వుడు. కుశాశ్వుడికి సోమదత్తుడు, అతనికి కాకుత్థ్సుడు పుత్రులు. ఇప్పుడు సుమతి ఈ నగరాన్ని పాలిస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం జనక మహారాజుని దర్శిద్దాం’
విశ్వామిత్రుడు రాక గురించి తెలుసుకున్న సుమతి బంధువులు, పురోహితులతో ఆయనకి ఎదురెళ్లి, కుశలప్రశ్నలు వేసి స్వాగతం చెప్పాడు. ఆయన తన దేశానికి రావడం వల్ల తను ధన్యుడ్ని అయ్యానని కూడా చెప్పాడు.
విశ్వామిత్రుడు కూడా సుమతి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. సుమతి ఇలా చెప్పాడు.
‘ఓ మహర్షీ! నీ వెంట ఉన్న ఈ ఇద్దరూ దేవతలతో సమానమైన పరాక్రమం గలవారిలా కనపడుతున్నారు. ఏనుగు, సింహాల్లా నడిచే వీరి అందం అశ్వనీ దేవతలని పోలి ఉంది. ఈ ఇద్దరూ ఎవరి కొడుకులు? కత్తులు, బాణాలు ధరించిన వీరు దుర్గమమైన ఈ మార్గంలో కాలినడకన ఇక్కడికి ఎందుకు వచ్చారు?’
విశ్వామిత్రుడు అతనికి సిద్ధాశ్రమంలోని రాక్షస వధ గురించి చెప్పాడు. రామలక్ష్మణులని సుమతి సత్కరించాక ఆ రాత్రి వారు అక్కడే నిద్రించి మర్నాడు మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలకి దగ్గరలో గల నిర్మానుష్యమైన ఓ ఆశ్రమాన్ని చూసి రాముడు అడిగాడు.
‘మునులు ఎవరూ లేని ఈ ఆశ్రమం ఎవరిది?’
‘రామా! ఇది గౌతముడి ఆశ్రమం. తన భార్య అహల్యతో అతను చాలా సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడు. గౌతముడు లేని సమయంలో విష్ణువు గౌతముడి రూపాన్ని ధరించి అహల్య దగ్గరికి వెళ్లి ఆమెతో సంగమాన్ని కోరాడు. అతను ఎవరో తెలిసి కూడా ఆమె అందుకు అంగీకరించింది. తర్వాత చెప్పింది.
‘గౌతముడు వచ్చే లోగా నువ్వు తక్షణం ఇక్కడ నించి వెళ్లిపో’
సరిగ్గా ఆ సమయంలో స్నానంతో తడిసిన గౌతముడు సమిధలతో, దర్భలతో వస్తూ విష్ణువుకి కాపలాగా వచ్చిన దేవేంద్రుడ్ని చూశాడు. జరిగింది గ్రహించి ఆయన కోపంతో ఇలా శపించాడు.
‘నువ్వు చేసిన పాడు పనికి నీ వృషణాలు పడిపోవాలి’
తక్షణం అవి నేల రాలాయి. తర్వాత అహల్యని కూడా ఆయన ఇలా శపించాడు.
‘ఎవరికీ కనపడకుండా గాలిని భోజనం చేస్తూ, ఆహారం లేక తపస్సు చేస్తూ ఈ ఆశ్రమంలోనే మట్టిలో రాయివి అయి పడి ఉండు. దశరథుడి కొడుకైన రాముడి పాదస్పర్శతో నీకు పాపం నించి, శాపం నించి విమోచనం కలుగుతుంది. నువ్వు రాముడికి అతిథి సత్కారాలు చేశాక నీలోని లోభం, మోహం తొలగి తర్వాత నాతో కలిసి జీవిస్తావు’
వెంటనే గౌతముడు ఈ అరణ్యాన్ని విడిచి సిద్ధులు, చారణులు నివసించే హిమాలయ శిఖరాలకి వెళ్లి అక్కడ తపస్సు చేయసాగాడు. (బాలకాండ సర్గ 47-48)
ఆ కథ విన్న అమ్మమ్మ మీనమ్మ ఆశే్లషతో చెప్పింది.
‘హరిదాసు ఏడు తప్పులని చెప్పాడు. అవేమిటో కనుక్కో చూద్దాం’
‘ఏడు తప్పులు కనుక్కున్నావా?’ ఆశే్లషకి మాటలు వినిపించాయి.
ఆశే్లష వెంటనే తన మంచం పక్కనే నిలబడ్డ ఋషిని చూసి అడిగాడు.
‘లేదు. మీరు ఎవరు?’
‘నీ కల్లో జవాబులు చెప్పడానికి వచ్చిన విశ్వామిత్రుడ్ని’ ఆయన చెప్పాడు.
మర్నాడు వాటిని ఆశే్లష తన అమ్మమ్మకి చెప్తే మెచ్చుకుంది.
విశ్వామిత్రుడు చెప్పిన ఏడు తప్పులని మీరు కనుక్కోగలరా?
**

మీకో ప్రశ్న
నరకబడ్డ దితి గర్భస్థ శిశువుకి మరుత్తులు అనే పేరు ఎందుకు వచ్చింది?
**
మీకో ప్రశ్నకి జవాబు
దశావతారాల్లోని రెండో అవతారం ఏది?
-కూర్మావతారం. అంటే తాబేలు (మొదటిది మత్స్యావతారం)
**

కిందటి వారం రామాయణ కథలో తప్పులు
1.మంథర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలికారు. వింధ్య పర్వతాన్ని కాదు.
2.క్షీరసాగర మథనం అంకంలో వాల్మీకి చంద్రుడు, లక్ష్మి పుట్టడం గురించి రాయలేదు.
3.రెండోసారి వెయ్యి సంవత్సరాలు చిలికారు. వంద సంవత్సరాలు కాదు.
4.అరవై కోట్ల మంది అప్సరసా స్ర్తిలు బయటకి వచ్చారు. ఆ సంఖ్యని హరిదాసు చెప్పలేదు.
5.దితి భర్త కాశ్యపుడు. ఈ సమాచారం కూడా హరిదాసు చెప్పలేదు.
6.దితి తల స్థానంలో పాదాలని ఉంచి నిద్రించింది మధ్యాహ్నం. రాత్రి కాదు.
7.ఏడు తప్పులు లేవు. ఉన్నవి ఆరే. ఏడు ఉన్నాయని చెప్పడం ఓ తప్పు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి