Others

మోహినీ భస్మాసుర (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ: వాలి
నృత్యం: రాజు-జయరాం
ఎడిటింగ్: మార్తాండ్
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
ఛాయాగ్రహణం: ఎల్లప్ప
అసోసియేట్ దర్శకులు: కెఎస్ ప్రకాశరావు
నిర్మాత, దర్శకులు: బిఎ సుబ్బారావు.
**
యక్షగానాలుగా, నృత్య నాటికలుగా ప్రదర్శింపబడి ప్రాచుర్యం పొందిన పురాణగాథ ‘మోహిని భస్మాసుర’. చలనచిత్రంగా తొలిసారి ఆంధ్ర టాకీసు బ్యానర్‌పై సి పుల్లయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. వెంకటావధాని రచన, ఎటి రామానుజాచార్యులు సంగీతం, భక్తవేల్ ఛాయాగ్రహణంతో వచ్చిన చిత్రంలో మోహినిగా పుష్పవల్లి, భస్మాసురునిగా ఏవి సుబ్బారావు నటించారు. అవుట్‌డోర్‌లో రూపొందిన తొలి టాకీ చిత్రంగా దీనికి పేరుంది. డిసెంబర్ 1, 1939న చిత్రం విడుదలైంది.
పౌరాణిక గాథలపట్ల ఆసక్తిగల దర్శక నిర్మాత బిఎ సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో బిఎఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మరోసారి ‘మోహిని భస్మాసుర’ చిత్రం రూపుదిద్దుకుంది. ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తూ రచయితగా పేరొందిన గబ్బిట వెంకట్రావు ఈ చిత్రానికి కథ, మాటలు, పద్యాలు సమకూర్చారు. గబ్బిట రాసిన ‘అల్లూరి సీతారామరాజు’ను బందా కనకలింగేశ్వరరావు ప్రదర్శించారు. పలు పౌరాణిక చిత్రాలకూ పాటలూ పద్యాలు అందించిన అనుభవం గబ్బిటకు ఉంది. ‘విష్ణుమాయ’ చిత్రాన్ని నిర్మించటమే కాదు, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్తఅంబరీష, ఇద్దరు కొడుకులు చిత్రాలకూ గబ్బిట పని చేశారు.
దానవ జాతి ఉద్ధరణ కోసం రాక్షస గురువు శుక్రాచార్యులు (్ధళిపాళ) నడుంకడతాడు. ఆయన ఆరాధన మెచ్చిన ఈశ్వరుడు (రామకృష్ణ) ఓ బాలుని అనుగ్రహిస్తాడు. భస్మం నుంచి ఉద్భవించిన ఆ శిశువుకు భస్మాసురుడని నామకరణం చేసి, పెంచి పెద్ద చేస్తాడు ఆచార్యులు. బాలునిగా ఉన్నపుడే అతనివల్ల తన ఇంద్ర పదవికి ముప్పు వాటిల్లుతుందని నారదునివల్ల తెలుసుకున్న దేవేంద్రుడు (రఘురామయ్య), భుస్మాసురుని అంతంచేయ ప్రయత్నించి విఫలుడౌతాడు. అసుర రాకుమారి కల్యాణి (అనురాధ)ని వివాహం చేసుకొని సింహాసనం అధిష్టించిన భస్మాసురుడు (ఎస్‌వి రంగారావు) ఈశ్వరుని గూర్చి తపస్సు చేసి, తన చేయి ఎవరి నెత్తినపెడితే వారు మరణించేలా వరం పొందుతాడు. వర గర్వంతో విష్ణు భక్తులను భస్మం కావిస్తాడు. ఇంద్రుడు, విష్ణువు (కాంతారావు), లక్ష్మి) రత్నం) భయకంపితులపై భస్మాసురునికి దూరంగా వెళ్తారు. ఒకసారి పొరపాటున తన కుమార్తె తలపై భస్మాసురుడు చేయి తాకించటంతో, ఆ బాలిక మరణిస్తుంది. దీనికి కారణం శివుడేనని నారదుడు (బాలయ్య) చెప్పడంతో, ఈశ్వరుని వద్దకు వెళ్ళిన అసురుడు తన కుమార్తెను బ్రతికించమని కోరతాడు. అది అసాధ్యమని చెప్పిన ఈశ్వరునిపై ఆగ్రహించి, నెత్తిన చేయిపెట్టి భస్మం చేయడానికి ప్రయత్నించగా ఈశ్వరుడు పలాయనం సాగిస్తాడు. విష్ణుమూర్తి, మోహిని (పద్మిని) అవతారంలో భస్మాసురునికి తారసపడి, అతని ధ్యాసను ఆత్మశక్తి సాధనకై మళ్ళించి, ఆ ప్రయత్నంలో చేసే నృత్య సాధనలో అసురుడు తన తలపై చేతిని పెట్టుకోవడంతో తనకుతానే భస్మం కావటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో విష్ణ్భుక్తులు, సాధువులుగా నాగేష్, రమణారెడ్డి, పద్మనాభం, అల్లురామలింగయ్య నటించారు. చిత్రంలో శుక్రాచార్యుని నేత్రం పోవటానికి కారణం చూపుతూ బలిచక్రవర్తి వామనునికి దానమిచ్చే సన్నివేశం చూపించారు. బలిచక్రవర్తిగా సత్యనారాయణ నటించారు. వారిపై భాగవత పద్యాలు ‘ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై’, ‘కారే రాజులు రాజ్యములు’ ‘నిరయంబైన నిబంధనమైన’ పద్యాలు (ఘంటసాల) చిత్రీకరించటం ఆకట్టుకుంది. చిత్ర ప్రారంభంలో భస్మాసుర జననం కోసం శుక్రాచార్యుల ప్రార్థన, శివపార్వతుల తాండవ నృత్యం, ప్రార్థన గీతం ‘చంద్రశేఖర, చంద్రశేఖర శరణు శరణు మహేశ్వర’లాంటి సన్నివేశాలు భక్త్భివం రేకెత్తేలా చిత్రీకరించారు. భస్మాసురుని ఆహార్యం బాలునిగా, యువకునిగా వెరైటీగా చూపించారు. బాలునిగా ఇంద్రమాయ అయిన విచిత్ర ఆకారాన్ని ఎదుర్కొన్న సన్నివేశంలో రవికాంత్ ట్రిక్స్ అద్భుతం అనిపిస్తాయి. యువకునిగా ప్రేమ మోహం తెలియని అమాయకునిగా, సింహాసనం అధిష్టించాక భస్మాసురుని ఆహార్యం, వైఖరిలో మార్పు, భార్యని తప్ప అన్య స్ర్తిలను ఆశించని సుగుణం, ఇంద్రాణి (్ఛయాదేవి)ని తన భార్యకు సేవకురాలిగా తేవటం, కల్యాణి అది తగదని అంటూ ఆమెను గౌరవించటం, ఆకసంలో చంద్రుడిని తన కుమార్తె ఆడుకునే బాలుడిగా మార్చటం లాంటి సన్నివేశాలు దర్శకుడు బిఎ సుబ్బారావు దర్శకత్వ పటిమకు అద్దంపడతాయి. చిన్నారులపై గీతం -అనగాఅనగా ఒక పాప కోరే జాబిలిని (ఆరుద్ర -గానం బెంగుళూరు లత), విష్ణుమూర్తి వద్దకు నారదుడు వచ్చే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో చెంచులక్ష్మి చిత్రంలోని ‘కరుణాలవాల’ గీతం వినిపించే చేయటంలాంటి వాటిని గమనిస్తే దర్శకులు సుబ్బారావు ఎంతో ఆసక్తికరంగా సన్నివేశాలను రూపొందించారన్న భావన కలుగుతుంది.
చిత్రంలో భస్మాసురునిగా ఎస్‌వి రంగారావు సన్నివేశానుగుణమైన అమాయకతను, శౌర్యాన్ని, భక్తివినమ్రతలను ప్రదర్శిస్తూ భావయుక్తమైన, గంభీరమైన నిండుతనంతో కూడిన నటన కనబర్చారు. మిగిలిన పాత్రధారులను డామినేట్ చేసేలా ఆ పాత్ర రూపొందటం, దాన్ని అంత పరిణితితో ఎస్వీఆర్ మెప్పించటం విశేషం. పద్మినితో సమానంగా నృత్యాభినయానికి, తన పర్సనాలిటీతో కొంత కష్టమే అయినా ప్రశంసనీయంగా శ్రమించటం వారికే తగింది. మిగిలిన పాత్రధారులందరూ పరిపక్వతతో రాణించే నటనతో మెప్పించారు.
మోహినిగా ప్రముఖ నృత్య తార పద్మిని నటించటం చేత ఆమెపై నాలుగు విధాలైన నృత్యాలను చిత్రీకరించారు. పూల తోటలో -నేనే సుమా లేత చిరుగాలిని, వూయలపై నిలబడి వూగుతూ -తీయనైన ఊహల తేలీ తేలీ ఊగెద, ఆకసంలో మబ్బులపై తేలుతూ -ప్రశాంతమే నిశీధము, కోనేరువద్ద -కోనీట నా నీడ అంటూ సాగే నృత్యాలు ఆకట్టుకుంటాయి. చివరిగా భస్మాసురునితో కలిసి పాడాలి. మది ఆడేలా పట్టు సాధన చేయాలి. ఆ విషయంలో నృత్య తార పద్మిని తన అనుభవాన్ని రంగరించి అద్భుతానే్న ప్రదర్శించారు. పద్మిని నృత్యం, ఆరుద్ర రచన, పి సుశీల గానంతో సాగే గీతాలు అద్భుత కళారాధనతో సాగుతాయి. అసురునితో నృత్యం మోక్షసాధన మార్గంగా వివిధ భంగిమలలో సాగటాన్ని ఉత్తేజకరంగా చిత్రీకరించి ఆనందింప చేయటం విశేషం.
ఆత్మశక్తి వలన మోహినిపై తన వరం పనిచేయలేదని, దానిని సాధించి కుమార్తెను బతికించుకోవాలనే తపనతో భస్మాసురుడు మోహిని మాయలో పడ్డాడని కథను నడపటం ప్రత్యేకతగా నిలిచింది. పౌరాణిక చిత్రాల స్థాయికి తగిన సంభాషణలు, ఇంద్రుడు, భస్మాసురునిపై చిత్రీకరించిన పద్యాలను అర్ధవంతంగా రచయిత వెంకట్రావు సమకూర్చారు.
‘త్రిజగాల పాలించు దేవేంద్రా’ (రఘురామయ్య, మాధవపెద్ది సంవాద పద్యాలు), ‘పతిత పోవనికేగ’ ‘మంత్రినై రాజ్యాంగమర్మముల’ (మాధవపెద్ది) పద్యాలు అద్భుతం. ఈశ్వరుడు తన బృందంతో కోయవేషంలో చేసే నృత్య గీతం -కొండకోనలో పూలతోటలో (ఆరుద్ర -ఘంటసాల, సుశీల బృందం), అనురాధపై చిత్రీకరించిన గీతం -ఇది ఏమిటో నా మేను (ఆరుద్ర -పి సుశీల), నాగేష్‌పై చిత్రీకరించిన గీతం -నారాయణ అనరాదా (కొసరాజు -మాధవపెద్ది) వినసొంపుగాను, చూడముచ్చటగానూ అనిపిస్తాయి.
ఎస్ రాజేశ్వరరావు స్వరాలలో ఆరుద్ర, కొసరాజు, గబ్బిట సాహిత్యంతో, పద్మిని నృత్యాలతో ‘మోహిని భస్మాసుర’ చిత్రం వైవిధ్య భరితంగా రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవలు మాస్టర్ ప్రవీణ్, బేబీ అవంతి ఈ చిత్రంలో (అనగాఅనగా పాటలో) నటించారు. బేబీ అవంతి భస్మాసురుని కుమార్తెగానూ కనిపిస్తుంది. మోహినీ భస్మాసుర చిత్రం జనరంజకంగా రూపొందినా ఆర్థికంగా విజయం సాధించలేదు. ఒకసారి రూపొందిన పౌరాణిక చిత్రాలు మైరావణ, మోహినీ భస్మాసుర, భీష్మ, చెంచులక్ష్మి వంటి చిత్రాలను తిరిగి నిర్మించటం, నిర్మాత బిఏ సుబ్బారావుకు పౌరాణికాల పట్లవున్న ఆసక్తి, అభిరుచిని తెలియజేస్తాయి. ఈ విషయంలో జయాపజయాలను లెక్కించని ఆయన వైఖరిని అభినందించాలి. ‘మోహినీ భస్మాసుర’ చిత్రాన్ని కన్నడంలో రాజ్‌కుమార్, లీలావతి, ఉదయకుమార్, టిఎన్ బాలకృష్ణలతో ఎన్‌ఎస్ వర్మ దర్శకత్వంలో టి మాడర్ నిర్మించారు. సంగీతం టి చలపతిరావు సమకూర్చారు.

-సివిఆర్ మాణిక్యేశ్వరి