AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృషణాలు పడిపోయిన దేవేంద్రుడు ఋషులు, చారణులతో, అగ్ని మొదలైన దేవతలతో ఇలా చెప్పాడు.
‘గౌతముడికి కోపాన్ని, అతని తపస్సుకి విఘ్నాన్ని కలిగించాను. అలా అతను నాకు, అహల్యకి శాపాలు పెట్టడం ద్వారా అతని తపశ్శక్తిని ఖర్చు చేసేశాను. ఇప్పుడు మీరు తిరిగి నాకు వృషణాలు వచ్చేలా చేయండి’
వారంతా మరుద్గణాలతో పితృదేవతల దగ్గరకి వెళ్లి యజ్ఞంలో వారికి భాగంగా లభించే గొర్రెకి ఉన్న వృషణాలని తీసి దేవేంద్రుడికి ఇవ్వమని అర్థించారు. వారా ప్రకారం చేశారు. రామా! అప్పట్నించీ పితృదేవతలు అంతా వృషణాలు లేని గొర్రెలనే తింటున్నారు. దేవేంద్రుడికి కూడా అప్పటి నించి గొర్రె వృషణాలే ఉన్నాయి. గౌతముడి ఆశ్రమానికి వెళ్లి అహల్యకి శాప విమోచనం కలిగించు’
రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెనకే నడుస్తూ ఆ ఆశ్రమంలోకి వెళ్లారు. అదృశ్యం ఉన్న అహల్య తపస్సుతో వచ్చిన గొప్ప తేజస్సుతో, నీళ్లల్లోని సూర్య ప్రతిబింబంలా, మేఘాలు కప్పిన పూర్ణచంద్రుడిలా అందరికీ కనపడసాగింది. ఘోర తపస్సు వల్ల శరీరం పరిశుద్ధమైన అహల్యని దేవతలు మెచ్చుకుని దుందుభులు మ్రోగించి పుష్ప వర్షాన్ని కురిపించారు. గంధర్వులు పాడితే అప్సరసలు నృత్యం చేశారు. ఆమె రామలక్ష్మణుల పాదాలని స్పృశించి నమస్కరించింది. అహల్య వారికి అతిథి మర్యాదలు చేసింది. తర్వాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలా నగరానికి వెళ్లి, ఈశాన్యం వైపు ఉన్న యజ్ఞవాటికని చేరారు.
అక్కడికి చేరాక రాముడు విశ్వామిత్రుడ్ని ఇలా అడిగాడు.
‘మహామునీ! ఇక్కడ అనేక దేశాల నించి వచ్చిన విద్యా సంపన్నులైన వేల కొద్దీ బ్రాహ్మణులు ఉన్నారు. వందల కొద్దీ శకటాలతో ఋషి వాటికలు ఇరుకుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం బస చేయడానికి అనువైన ప్రదేశాన్ని నిర్ణయించు’
విశ్వామిత్రుడు వారిని జనం ఆట్టే లేని, నీరు సమృద్ధిగా ఉన్న విడిదికి తీసుకెళ్లాడు. విశ్వామిత్రుడు వస్తున్న సంగతి విని జనక మహారాజు తన పురోహితుడితో వచ్చి వినయంగా ఆయనకి ఎదురెళ్లాడు. ఋత్విక్కులు మంత్రపూర్వకంగా పూజాద్రవ్యాలని విశ్వామిత్రుడికి సమర్పించారు. వాటిని స్వీకరించి ఆయన జనకుణ్ని అడిగాడు.
‘నువ్వు క్షేమంగా ఉన్నావా? యజ్ఞం ఎలాంటి లోపాలు లేకుండా జరుగుతోందా?’
తర్వాత విశ్వామిత్రుడు ఉపాధ్యాయులని, పురోహితుడ్ని, మునులని కుశల ప్రశ్నలు వేశాడు.
‘విశ్వామిత్రా! పూజ్యుడైన నీ దర్శనం లభించడంతో ఈ రోజు దేవతలు నా యజ్ఞాన్ని సఫలం చేశారు. ఇది ఒక పనె్నండు రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత యజ్ఞ భాగాలని స్వీకరించడానికి వచ్చే దేవతలని చూడచ్చు. కత్తులు, అంబులపొది, ధనస్సులని ధరించి, పెద్ద కళ్లు, ఏనుగు, సింహాల్లాంటి నడకతో, వీరులైనవారు, అశ్వనీ దేవతల్లా అందమైన వారు, పులి, ఎద్దులతో సమానమైన వారు, యవ్వనవంతులు, శ్రేష్టమైన ఆయుధాలని ధరించిన దేవతల్లా ఉన్న ఈ ఇద్దరు వీరులు ఎవరి కొడుకులు? ఇక్కడికి ఎందుకు కాలినడకన వచ్చారు? మహామునీ! రూపంలో, చర్యల్లో, తెలివిలో వీరు ఒకరికి మరొకరు పోలి, సూర్యచంద్రులు ఆకాశం నించి వెలుగు ఇచ్చినట్లుగా ఈ ప్రదేశాన్ని ప్రకాశింప జేస్తున్నారు. దయచేసి ఈ వీరుల గురించి నాకు చెప్పండి’ జనక మహారాజు అడిగాడు.
‘వీరు దశరథుడి కొడుకులు. నా వెంట సిద్ధాశ్రమానికి వచ్చి అక్కడ నివసించే రాక్షసులని చంపారు. విశాల నగరాన్ని చూసి, అహల్యకి శాపవిమోచనం చేసి, గౌతముడితో ముచ్చటించి, నా వెంట మిథిలకి వచ్చారు’ విశ్వామిత్రుడు వివరించాడు. (బాలకాండ సర్గ 49-50)
వెంటనే ఓ పాతికేళ్ల యువకుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
‘నా పేరు రామదాసు. నేను రామాయణం మీద రీసెర్చ్ స్కాలర్‌ని. మీరు చెప్పిన కథంతా బావుంది కాని కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని చెప్తాను వినండి’
ఈ భాగంలో ఎన్ని తప్పులు ఉన్నాయి? అవి ఏవి? మీరు కనుక్కోగలరా?

మీకో ప్రశ్న
భగీరథుడు గంగని భూమికి దింపిన స్థలం ఏది? నేడు అది ఏ రాష్ట్రంలో ఉంది?

మీకో ప్రశ్నకి జవాబు
నరకబడ్డ దితి గర్భస్థ శిశువుకి మరుత్తులు అనే పేరు ఎందుకు వచ్చింది?
ఇంద్రుడు వారిని నరికేప్పుడు ‘మారుద’ (ఏడవ్వద్దు) అని చెప్పాడు కాబట్టి వారికి ‘మరుత్తులు’ అనే పేరు వచ్చింది.

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.గర్భస్థ శిశువు ఏడు ముక్కలుగా నరకబడ్డాడు. ఐదు కాదు.
2.విశాలుడు ఇక్ష్వాకుడికి, అలంబుసకి పుట్టాడు. అప్సరసకి కాదు.
3.సుమతి ఇక్ష్వాకు వంశీయుడు అని హరిదాసు చెప్పడం మరిచాడు.
4.అహల్యని మోహించింది దేవేంద్రుడు. విష్ణువు కాదు.
5.ఇంద్రుడు విష్ణువుకి కాపలాగా రావడం రామాయణంలో లేదు. హరిదాసు కల్పన అది.
6.వాల్మీకి రామాయణంలో ‘మట్టిలో పడి ఉండు’ అని మాత్రమే గౌతముడు శపించాడు. ‘రాయివి అయి’ అన్నది బహుశ కాల్పనిక సినిమాల ప్రభావంతో హరిదాసు చెప్పాడు.
7.రామస్పర్శతో అన్నది కూడా వాల్మీకి రాయలేదు. ‘ఆ అడవిలోకి ప్రవేశించగానే నీకు పాపం నించి, శాపం నించి విమోచనం కలుగుతుంది’ అని మాత్రమే వాల్మీకి రాశాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి