Others

రంగుల రాట్నం (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: పాలగుమ్మి పద్మరాజు
స్క్రీన్‌ప్లే: బిఎన్ రెడ్డి
మాటలు: డివి నరసరాజు
ఛాయాగ్రహణం: యు రాజ్‌గోపాల్
కళ: ఎకె శేఖర్
ఎడిటింగ్: ఎంఎస్ మణి, కె సత్యం
నృత్యం: వెంపటి చిన సత్యం, వేణుగోపాల్
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నిర్మాత, దర్శకుడు: బిఎన్ రెడ్డి
**
జాతీయ స్థాయిలో చలనచిత్ర పరిశ్రమకు లభించే అత్యున్నత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్’ అందుకున్న ప్రథమ దక్షిణ భారత సినీ దర్శకుడు, కళాత్మక చిత్ర దర్శకునిగా పేరుపొందిన వ్యక్తి బొమ్మిడి నరసింహారెడ్డి (బిఎన్ రెడ్డి). వాహిని పిక్చర్స్ పతాకంపై పూజాఫలం (1964) చిత్రం తరువాత వీరు రూపొందించిన సినిమా -రంగుల రాట్నం.
నటుడు లింగమూర్తి ద్వారా ఏలూరులో అగ్రికల్చర్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్న చంద్రమోహన్, బిఎన్ రెడ్డికి పరిచయమయ్యాడు. తాను నిర్మిస్తున్న చిత్రంలోని పాత్రకు చంద్రమోహనే సరైన ఆర్టిస్టుగా భావించిన బిఎన్ రెడ్డి, ‘రంగుల రాట్నం’ ద్వారా ఆయన్ని చిత్రసీమకు పరిచయం చేశారు. అదేవిధంగా చిత్రంలోని టైటిల్ సాంగ్ ‘ఇంతేరా ఈ జీవితం’ పాటను కావలి జవహర్ భారతి కళాశాల్లో లెక్చరర్‌గా పనిచేస్తున్న భుజంగరాయశర్మతో వ్రాయించి, వారినీ చిత్రసీమకు పరిచయం చేశారు. అలాగే వాణిశ్రీ, కాకరాలవంటి వారికీ ఈ చిత్రం ద్వారా మంచి అవకాశాలు లభించాయి. జనవరి 7, 1967లో చిత్రం విడుదలైంది.
***
రామాపురానికి చెందిన సుందర రామయ్య (సిహెచ్ కృష్ణమూర్తి), సీతమ్మ (అంజలిదేవి) దంపతులు. పల్లె వదిలి తమ పిల్లల చదువుకోసం పట్నం వస్తారు. నేతి వ్యాపారం చేస్తూ తీవ్రంగా నష్టపోయిన సుందరయ్య గుండెపోటుతో మరణిస్తాడు. భర్త ఆశయం కోసం అష్టకష్టాలు పడిన సీతమ్మ, పెద్దకొడుకు సూర్యం (రామ్మోహన్)ను లాయర్ని చేస్తుంది. చిన్నకొడుకు వాసు (చంద్రమోహన్) అన్న కోసం చదువు మానేస్తాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుస్తీ పోటీల్లో పాల్గొంటుంటాడు. కూతురు జయ (విజయనిర్మల) కాలేజీలో చదువుతుంటుంది. మున్సిపల్ చైర్మన్ అప్పలస్వామి (రమణారెడ్డి) కూతురు వనజ (సుకన్య)తో సూర్యం వివాహం జరుగుతుంది. సూర్యం బావమరిది సుబ్బారాయుడు (కాకరాల) జయను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. కానీ జయ తన స్నేహితురాలు సరళ (విజయలలిత) సోదరుడు వేణు (నగరాజారావు)ని ప్రేమిస్తుంది. జయ పెళ్లికి వేణు తండ్రి నాగభూషణం (వల్లభనేని శివరాం)కు ఇవ్వాల్సిన కట్నం 50 వేలు. మంచివాడైన పహిల్వాన్ శంకర్రావు (త్యాగరాజు) అందుకుసాయం చేస్తాడు.
చైర్మన్ పదవికి ఎన్నికలు రావటంతో బడుగువర్గం తరఫున వాసు, ధనికవర్గం తరఫున సూర్యం పోటీకి సిద్ధపడతారు. చివరి క్షణంలో తల్లి, శంకర్రావులను ఆశ్రయించి వాసును పోటీనుంచి విరమింపచేసిన సూర్యం, ఎన్నికల్లో విజయం సాధించి చైర్మన్ అవుతాడు. శంకర్రావు తన కూతురు జమున (వాణిశ్రీ), వాసులకు పెళ్లి నిర్ణయించగా, ఆ పెళ్లినాడు శంకర్రావు ఇల్లు జప్తుచేయిస్తాడు సూర్యం. అతని ఎమ్యూజ్‌మెంటు పార్క్ లైసెన్స్ రద్దు చేస్తాడు. దాంతో వాసు, సూర్యంపై దాడి చేయటం, అన్నదమ్ముల పోరు ఆపాలని వెళ్ళిన తల్లి సీతమ్మ గాయపడగా సూర్యం తన తప్పులు గ్రహించి తల్లిని క్షమించమని కోరటం, అందరూ కలుసుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో చిన్ననాటి జయగా ప్రఖ్యాత హిందీ తార భానురేఖ నటించారు. -చేప రూపమున జలనిధి దాగిన (గానం- బి వసంత, ఏపి కోమల, రచన-దాశరథి). అనే చక్కని దశావతార వర్ణనతో కూడిన నృత్యగీతాన్ని భానురేఖ, అంజలీదేవిపై చిత్రీకరించారు. చిత్రంలో రేఖ తల్లి పుష్పవల్లి రమణారెడ్డి భార్యగా ఓ వెరైటీ భాష, గెటప్‌తో కనిపిస్తుంది. ఇంకా బొడ్డపాటి, వంగర, రాధాకుమారి ఇతర పాత్రలు పోషించారు. సూర్యం, వాసులుగా బాల నటులు నరసింహాచారి, మాస్టర్ రామకృష్ణ నటించారు.
చిత్రంలో అంజలిదేవి ఒక తల్లిగా బిడ్డల ఉన్నతికి పాటుపడిన సీతమ్మ పాత్రలో కనిపిస్తుంది. కరుణరస పూరితంగా, గంభీరంగా, పరిస్థితులను ఎదుర్కోవటంలో నిగ్రహం.. లాంటి సన్నివేశాల్లో ఆమె పరిణితితో కూడిన నటనతో మెప్పించారు. సూర్యంగా రాంమోహన్ పాత్రోచితమైన నటన చూపారు. వాసుగా చంద్రమోహన్ చిచ్చరపిడుగులా కొన్నిసార్లు, ఉద్రేకం అణుచుకుంటూ సాత్వికంగా కొన్నిసార్లు.. ఎంతో అనుభవజ్ఞుడిలా నటించాడు. అంతేకాదు ‘వెనె్నల రేయి’ పాటలో డప్పును లయబద్దంగా వాయించటం, మరోసారి తబలా వాయించటంలో పరిపూర్ణత చూపారు. దీనికి దర్శకుల సూచనలను దీక్షతో పాటించటం, పాత్రపట్ల ఆయనకు ఉన్న నిబద్ధత తెలియచేసింది. విజయనిర్మల (తొలుత నీరజ) ఎంతో అమాయకమైన యువతిగా పాత్రోచితంగా అలరించింది. ఇక వాణిశ్రీ చొరవైన, చురుకైన యువతిగా నృత్యంతో, నటనతో ఆకట్టుకోగా పాత్రోచితమైన అహంభావిగా సుకన్య మెప్పించారు.
దర్శకులు బిఎన్ రెడ్డి అన్నదమ్ముల వాత్సల్యాన్ని చిత్రంలో అద్భుతంగా చూపించారు. సూర్యం పాత్రలో స్వార్థం, అవకాశవాదాన్ని.. త్యాగరాజు పాత్రలో కరుణరసం, గంభీర్యాన్ని.. సీతమ్మ పాత్రలో నిండుతనం, మాతృమూర్తిగా బిడ్డల ఎడ అభిమానం, దయ, త్యాగం లక్షణాలతో సన్నివేశాలు రూపొందించి ఆకట్టుకున్నారు. జయ పెళ్లికి నాగభూషణం అంగీకరించే సన్నివేశంలో, ఆ ఆనందాన్ని తల్లితో జయ పంచుకోవటాన్ని పాటలో అద్భుతంగా చిత్రీకరించారు. ‘-కోయిల కోయని పిలిచినది.. గీతాన్ని చక్కని తోటలో పూల చెట్లపై, శివపార్వతులు, రాధాకృష్ణుల విగ్రహాలు, దీపాలతో ఆహ్లాదకరంగా (గానం- పి సుశీల, రచన- దాశరథి) రూపొందించారు. దేవుని సుప్రభాతం శ్లోకంతో ప్రార్థనలు, వాసు పోటీనుంచి విరమించుకోగా త్యాగరాజు, వాణిశ్రీలపై -నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చెనో’ గీతాన్ని (గానం -ఎస్ జానకి, ఘంటసాల, రచన-దాశరథి) సన్నివేశం రక్తికట్టేలా చిత్రీకరించారు. అలివేలుమంగ పటం చూపుతూ పాట పూర్తికాగానే వాసు, జమునల పెళ్లి శుభలేఖను అలిమేలుమంగ ఫొటో చిత్రంతో సూర్యం చూపటం.. ఇలా ప్రతి చిన్న సన్నివేశాన్నీ అర్ధవంతంగా తీర్చిదిద్దారు.
విజయనిర్మల, విజయలలిత బృందంపై చిత్రీకరించిన గీతం -కనరాని దేవుడే కనిపించినాడే (గానం-పి సుశీల బృందం, రచన -దాశరథి), రాజారావు, విజయనిర్మలపై చిత్రీకరించిన మరో ఆహ్లాద గీతం -కన్నుల దాగిన అందాలు (గానం- పిబి శ్రీనివాస్, పి సుశీల, రచన -సినారె). చంద్రమోహన్, వాణిశ్రీలపై చిత్రీకరించిన నృత్య గీతం -వెనె్నలరేయి చందమామా (గానం -ఎస్ జానకి, బి గోపాలం, రచన -కొసరాజు) అలరిస్తాయి. ఎన్నికల గీతం -దేశభక్తులం మేమండి.. పలు బుర్రకథల ప్రచారంతో (గానం -మాధవపెద్ది, పిఠాపురం బృందం, రచన- కొసరాజు) వైవిధ్యంగా సాగుతుంది. టైటిల్ సాంగ్ -కలిమి నిలువదు (గానం- ఘంటసాల బృందం, రచన- భుజంగరాయశర్మ) అర్థవంతంగా సాగుతుంది. చిత్రం చివరలో తల్లీకొడుకులపై చిత్రీకరించిన వందేమాతరం గీతాన్ని ఘంటసాల బృందం పాడారు.
చిత్రంలోని ‘నడిరేయి ఏ జాములో’ గీతాన్ని తొలుత శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడికి దగ్గర గ్రామానికి చెందిన వర్థమాన గాయకుడు దారపు వెంకట్రావుచే పాడించారు. కారణంతరాలవల్ల తిరిగి ఘంటసాలతో పాడించటం విశేషం. అలాగే సంతోషకర సన్నివేశాల్లో జయవీణపై నీలాంబరి రాగంలో ‘సనిసని పదపమ’ స్వరాలను నేపథ్యంగా ఈమని శంకరశస్ర్తీ వినిపించారు. వనజా నివాస్ పేరిట చిత్రంలో చూపిన సుకన్య ఇల్లు శ్రీమతి అంజలిదేవి భవంతి. అలాగే ఓ విచార సన్నివేశంలో నటించాల్సిన త్యాగరాజు కంట నీరు రాకపోవటంతో దర్శకులు ఎందుకని కారణం అడిగితే, తన పుట్టిన రోజని త్యాగరాజు చెప్పాడట. విషయం తెలుసుకుని అప్పటికప్పుడు కేకు తెప్పించి సెట్లో త్యాగరాజు పుట్టినరోజు వేడుకలు జరపటం విశేషం.
రంగులరాట్నం చిత్రానికి సంగీత దర్శకుడు రాజేశ్వరరావుకు బి గోపాలం సహాయం అందించారు. స్టంట్ మాస్టర్ సాంబశివరావు చేకూర్చిన పోరాటాల్లో చంద్రమోహన్ డూప్‌లేకుండా పాల్గొని కొన్నిసార్లు గాయాలపాలయ్యాడు. ఎంతో సహజంగా పలు సన్నివేశాల్లో చంద్రమోహన్ నటించాడు. విజయవంతమైన ‘రంగుల రట్నాం’ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం బంగారు నందిని అందించింది. శత దినోత్సవాలు జరుపుకున్న చిత్రం వేడుకలకు నందమూరి తారకరామారావు అతిథిగా హాజరై చంద్రమోహన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. చిత్రానికి పని చేసిన మిగిలిన తారలంతా ఆ తరువాత మరింతగా రాణించారు. చిత్ర నిర్మాణం పట్ల బిఎన్ రెడ్డి అభిరుచి, కృషి ‘రంగుల రాట్నం’లో కనిపిస్తాయి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి