Others

పోరాటమే ఊపిరిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింక్రీదేవి.. ఈ పేరు. పలకడానికి కొంచెం కష్టంగా, క్లిష్టంగా ఉండవచ్చు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన పేరు. పేరులాగే ఆమె కూడా కఠినమైన పోరాటాల బాటలో నడిచి విజయం సాధించిన నిరుపేద, నిరక్షరాస్య మహిళ.
ప్రస్తుతం జీవించి లేకపోయినా ఈమె రగిలించిన స్ఫూర్తి మాత్రం ఆ ప్రాంతంలో జీవించే ఉంది. ప్రకృతి అంటే ఆమెకు ప్రాణం. మరి తన ప్రాణాన్ని ఎవరైనా జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటారు కదా! అలాగే తన ప్రాణమయిన ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా బతికింది.
దాదాపు పాతికేళ్ళ క్రితం హిమాచల్‌ప్రదేశ్ సిరివౌర్ జిల్లాలో పర్యావరణానికి సంబంధించి ఎన్నో సభలు, సమావేశాలు నిర్వహించింది. ర్యాలీలు చేపట్టింది. కాలం గడుస్తున్నకొద్దీ తరిగిపోతున్న కొండలు, కోనలు, వాగులు, వంకల పట్ల ఎందరికో అవగాహన కలిగించింది. మరెందరిలోనో స్ఫూర్తి రగిలించింది. ఇదంతా విని ఈవిడేదో సామాజిక కార్యకర్తో, పర్యావరణ శాస్తవ్రేత్తో అనుకుంటే పొరపాటే. కేవలం ప్రకృతి పట్ల ప్రేమను పెంచుకుని, ఆ ప్రకృతి కలుషితమవుతుంటే చూసి తట్టుకోలేక ఏదో చెయ్యాలన్న తపనపడిన ఒక నిరక్షరాస్యురాలు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని సిరివౌర్ జిల్లా ఘాటన్ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో 1925లో జన్మించింది కింక్రీదేవి. తండ్రి కలియారామ్ వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. కింక్రీదేవి కూడా తన పసి వయసులోనే చిన్న చిన్న పనులు చేస్తూ తండ్రికి సాయపడేది. పేదరికం కారణంగా నామమాత్రపు చదువుతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది కింక్రీదేవికి. 14 సంవత్సరాల పిన్నవయసులోనే వివాహం చేసుకుని భర్తతో అత్తింటికి వచ్చిన కింక్రీదేవి పదహారేళ్లకే తల్లయింది. 22 ఏళ్లు వచ్చేసరికి భర్తను కోల్పోయింది. సంపాదించే భర్త చనిపోయాక కుటుంబ పోషణకు స్వీపర్‌గా పనిలో చేరింది. చేసేది స్వీపరుద్యోగమయినా పర్యావరణం పట్ల ఎంతో అవగాహనతో వుండేది. అదే సమయంలో మైనింగ్ కారణంగా ఆ ప్రాంతంలో రాబోయే పర్యావరణ సమస్యల గురించి పోరాడడం మొదలుపెట్టింది. జరగబోయే దారుణం గురించి అక్కడి ప్రజలకు అవగాహన కలిగించడం మొదలుపెట్టింది. పర్యావరణ విషయంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ ఆమె చేసే ప్రసంగాలు ఎంతో గొప్ప విద్యావేత్తల మాదిరిగా ఉండేవట. ఇతరులు ఆమెను ఎంతో విద్యావంతురాలని పొరపడేట్టు చేసేవట. కాని నిజానికి ఆమెకు అక్షరజ్ఞానం శూన్యం. కేవలం ప్రకృతిమీద తనకుగల ప్రేమ, అవగాహన కారణంగానే దాని గురించి ప్రజలను ఉత్తేజితులను చేయడం జరిగిందని ఆమె చెప్పింది.
1985లో ఆ అవగాహనతోనే చుట్టుప్రక్కల అందరినీ కూడగట్టుకుని పీపుల్ యాక్షన్ ఫర్ పీపుల్ ఇన్ నీడ్ అనే ఒక గ్రూప్‌ను తయారుచేసి పర్యవరణ పరిరక్షణకు నడుం కట్టింది. చివరికి 1987లో ఉద్దండులైన మైనింగ్ సంస్థలపైన కోర్టులో కేసు పెట్టింది. న్యాయం జరిగేవరకు పోరాటాలు కొనసాగించింది. న్యాయం కోసం కోర్టు ముందే 19 రోజులు నిరాహారదీక్ష చేసింది. ఈ పోరాటంలో ఆమె ఎన్నో సవాళ్లను, పెద్దవాళ్ల బెదిరింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా తన పట్టుదలను వదలలేదు. చివరికి ఆమె పోరాటానికి ఫలితంగా పర్యావరణానికి చేటు తెచ్చే మైనింగ్ నిలిపివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతటితో ఆ ప్రముఖులు ఊరుకుంటారా.. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్లారు. 1995లో అక్కడ కూడా విజయం సాధించింది కింక్రీదేవి. 2002లో స్థానికంగా డిగ్రీ కాలేజీ ఏర్పాటుకోసం పోరాటాన్ని మొదలుపెట్టింది. మూడేళ్ల పోరాటం తరువాత ప్రభుత్వం 2005లో డిగ్రీ కాలేజీని ఏర్పాటుచేసింది.
పర్యావరణంపట్ల తనకున్న బాధ్యత కారణంగా, తన పోరాటాల ఫలితంగా ఆమె ప్రపంచం ముందు ఒక పర్యావరణ వేత్తగా నిలిచింది. తన పోరాటాలకు గుర్తింపుగా 1995లో బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానాన్ని అందుకుంది. ఆ సదస్సు ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వలనం చేసే అరుదైన అవకాశంతో ఈమెను గౌరవించింది సదస్సు. ఇక 2001లో ఝాన్సీ లక్ష్మీబాయి స్ర్తి శక్తి పురస్కారాన్ని కూడా అందుకుంది. హిమాచల్ సాహిత్య పరిషత్ అవార్డుతోపాటు పలు ప్రముఖ సంస్థలనుంచి కూడా అవార్డులను అందుకున్నారు.తన జీవితంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన కింక్రీదేవి 2007, డిసెంబర్ 30న తన 82వ ఏట ఊపిరితిత్తుల వ్యాధితో మరణించింది. ఆమె మరణించినా ఆమె రగిలించిన స్ఫూర్తి మాత్రం అక్కడ ఇంకా బ్రతికే ఉంది. ఆమె అడుగుజాడల్లో ఇప్పుడెందరో ముందుకు సాగుతున్నారక్కడ.

చిత్రం కింక్రీదేవి

-మావూరు విజయలక్ష్మి