AADIVAVRAM - Others

మోక్షప్రదాయని... కామాఖ్యాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవీ భాగవతంలో, దేవీ పురాణంలో, కాళికా పురాణంలో, యోగినీ తంత్రంలో, హేవజ్ర తంత్రంలో, తంత్ర చాముండామణిలో, కామరూప (గువాహటి) జిల్లాలోని శ్రీ కామాఖ్యాదేవి గురించిన సాహిత్య చర్చ (8వ శతాబ్దం), తాంత్రిక పూజా విధానంలో ముఖ్యమైనదిగా, యోగినీ తంత్రంలో, కాళికా పురాణంలో కామాఖ్యా దేవిని శాక్త తంత్రంగా అభివర్ణించారు.
కామాఖ్యా దేవి ప్రాగ్జోతిషపురం (ఇప్పటి గువాహటి (గౌహతి)లోని నీలాచల పర్వతాలపై అధిష్టించి ఉంది. రెండు నీలాచల పర్వతాల మధ్య ఉన్న ఓ ఆదిమ తెగలకి చెందిన శాక్తీయులు, ఈ దేవిని ఆరాధించేవారు. వీరు మాతృస్వామ్య వ్యవస్థను ఇప్పటికీ పాటిస్తారు. ఒక తెగ ‘ఆస్ట్రో-ఏషియాటిక్’ కుటుంబాలకు, రెండవ తెగ మంగోలాయిడ్ జాతికి చెందిన ‘గారోస్’. వీరు ప్రకృతి మాత, సృష్టికి మూలం అయిన కామాఖ్య దేవిని ఆరాధిస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. యోని భాగంలా ఉండే శిలారూపమే ఆరాధనకు కేంద్రం. దక్ష యజ్ఞంలో అవమానించబడిన సతీదేవి కాలిన శరీరాన్ని పరమశివుడు చేతబుచ్చుకుని చేసిన తాండవంలో సతీదేవి యోని భాగం ఇక్కడ పడి శక్తి పీఠంగా ప్రసిద్ధమైనదని స్థల పురాణం తెలుపుతుంది.
కామాఖ్య ఆలయం ప్రీ-ఆర్యన్ కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విశ్వకర్మ సహాయంతో కామదేవుడు రాతితో నిర్మించాడని పురాణాలలో చెప్పబడింది.
ఆలయ గోడలపై 64 యోగినీమూర్తులు, 18 భైరవ మూర్తులు అద్భుతంగా చెక్కబడ్డాయి. 7వ శతాబ్దంలో ‘కామరూప’ని పరిపాలించిన ‘పాల’ రాజవంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర తెలుపుతోంది. గువాహటి విశ్వవిద్యాలయానికి చెందిన జియో సైన్స్ విభాగం సైంటిస్టులు, రేడియో కార్బన్ ఐసోటోపింగ్ సహాయంతో ఆలయం శిలల వయస్సును నిర్ధారించారు. ఆలయం అడుగు భాగం శిలలు 2200 ఏళ్ల క్రిందట, రెండవ వరుస శిలలు 1500 ఏళ్ల క్రిందటివిగా నిర్ధారించారు. వీటి సహాయంతో ఆలయం క్రీ.పూ.500 లోనిదిగా తెలుస్తోంది. 1555 - 1565 సం. మధ్య ‘కోచ్’ రాజవంశస్థుడైన రాజు నారాయణన్ ఆలయం పైభాగాన్ని పునరుద్ధరించినట్లుగా చరిత్ర తెలుపుతోంది. కోచ్ వంశస్థుల తరువాత పాలించిన ‘అహోం’ రాజులు శ్రీ కామాఖ్యను వారి దేవతగా పూజించారు. 1227 సం.లో నసీరుద్దీన్, మాలిక్‌ఖాన్ అనే ముస్లింలు ఆలయాన్ని ధ్వంసం చేశారు. దేవాలయ ధనసంపదను దోచుకున్నారు. తరువాత 1897, 1950 సం.లలో వచ్చిన భూకంపాల వల్ల కూడా ఆలయానికి తీవ్ర నష్టం జరిగింది. 1960 సం.లో తిరిగి ఆలయాన్ని పునరుద్ధరించారు.
శ్రీ కామాఖ్య ఆలయం హిందూ మత కేంద్రమే కాకుండా ప్రకృతి మాతకి నిలయం. చుట్టూ నీలాచర పర్వతాలు, తూర్పు వైపు కొండపై వసించిన భువనేశ్వరీ మాత ఆలయం, బ్రహ్మపుత్ర నదీ పరవళ్లు, చుట్టూ అందమైన ప్రకృతి ఒక రకమైన అలౌకిక పారవశ్యాన్ని కలుగజేస్తుంది.
మూలవిరాట్టు ఆలయంలో కామాఖ్యదేవి చుట్టూ ‘పది మహావిద్య’లున్నారు. వీరు - భువనేశ్వరి, బాగలముఖి, చిన్నమస్తకదేవి, త్రిపురసుందరి, తార, కాళిక, భైరవి, ధూమావతి, మాతంగి, కమల. వీరిలో త్రిపురసుందరి, మాతంగి, కమల ప్రధాన ఆలయంలో కొలువుతీరి ఉండగా, మిగతా మహా‘విద్య’లు ప్రధాన ఆలయం చుట్టూ వున్న ఆలయాల్లో పరివేష్ఠించారు.
గర్భ గృహాలయంలోని ఒక చిన్న చీకటి గుహ మాదిరి నిర్మాణంలోని మెట్ల గుండా కిందికి దిగితే ఒక వెడల్పైన రాతి భాగం రెండు వైపులా పైకి లేచి లోపలి భాగం లోతుగా యోని మాదిరిగా ఉంటుంది. ఈ లోతైన యోని భాగంలో భూగర్భం నుంచీ వచ్చే ఊట ద్వారా నీరు నిండి ఉంటుంది. వేసవిలో జూన్ నెలలో వచ్చే ‘అంబూబాచి’ ఉత్సవ సమయంలో ‘ఖాసి’ గిరిజన తెగ వారు (మగ) మేకపోతులను శక్తికి బలి ఇస్తారు. ఆడ జంతువులను బలి ఇవ్వరు. వేలాది మంది భక్తులు, శాక్తేయులు (శక్తి ఆరాధకులు), అఘోరాలు ఇక్కడికి వచ్చి దేవిని పూజించి ఆమె ఆశీస్సులు పొందుతారు. కాళికా పురాణంలో వర్ణించిన ఈ శక్తి స్వరూపిణి అన్ని కోరికలను తీర్చేది, మోక్ష ప్రదాయిని, శివుని ఇల్లాలైన సతీదేవియే శ్రీ కామాఖ్యాదేవి.

- కె. సీత