తూర్పుగోదావరి

పుష్కరాలరేవులో సూర్యధాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14: సూర్యభగవానుడి జయంతిరోజైన పవిత్ర రథసప్తమిని పురస్కరించుకుని స్థానిక పుష్కరాలరేవులో ఆదివారం ఉదయం మారథాన్ తరహాలో సూర్యనమస్కారాలతో సూర్యథాన్‌ను నిర్వహించారు. విద్యార్థులు, ఔత్సాహికులు సూర్యనమస్కారాలు చేశారు. సుమారు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని సూర్యుడికి అభిముఖంగా సూర్యనమస్కారాలు చేశారు. గోదావరి స్విమ్మర్స్‌క్లబ్, భారత్‌యోగా సమితి ఆధ్వర్యంలో జరిగిన సూర్యథాన్‌లో గౌతమీ యోగాలయ శిక్షకుడు పి రామచంద్రరావు సూర్యనమస్కారాలను అభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్విమ్మర్స్‌క్లబ్ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఆరోగ్యంతోనే నిజమైన ఆనందం లభిస్తుందన్నారు. ఎన్ని ఆస్తులు సంపాదించినా ఆరోగ్యానికి వెలకట్టలేమన్నారు. ఆరోగ్యమే నిజమైన సంపద అన్నారు. 60 ఏళ్లకు ఒకసారి వచ్చే అశ్విని నక్షత్ర సహిత రథసప్తమి ఎంతో విశిష్టమైనదని, ఈరోజున సూర్యథాన్ జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సూర్యభగవానుడికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాశీ విశే్వశ్వరరావు, దొండపాటి సత్యంబాబు, కె తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
దేవాలయాల వారీ వంద మందితో భక్త బృందాలు
దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14: హిందూ ధర్మప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని దేవాలయాలవారీ భక్త బృందాలను నియమించామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. రాష్ట్ర బిజెపి కోర్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి ఆదివారం రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా ఆయన ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడారు. ప్రతి దేవాలయానికి వంది మందితో భక్త బృందాలను నియమించాలని నిర్ణయించామన్నారు. ఈ బృందాలను సమన్వయపరిచి, కార్యక్రమాలను పర్యవేక్షించడానికి మండలాలవారీ ఇన్‌చార్జిలను నియమిస్తామన్నారు. భక్త బృందాలు ఉచితంగా సేవలందిస్తాయని, కానీ ఇన్‌ఛార్జిలకు మాత్రం గౌరవ వేతనాన్ని ఇస్తామన్నారు. ‘సమరస్త ఫౌండేషన్’ అనే స్వచ్చంద సేవా సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. పర్వదినాలు, ప్రతి శుక్ర, శనివారాలు తదితర ముఖ్యమైన రోజుల్లో ఆయా దేవాలయాల్లో భక్త బృందాలు లలితాసహస్రం, విష్ణుసహస్రం పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. ఇప్పటికే 70మంది మండల ఇన్‌చార్జిలకు శిక్షణ ఇచ్చామని, మరో 80మందికి శిక్షణా కార్యక్రమం నడుస్తోందన్నారు. ఉగాది నుండి దేవాదాయశాఖ ప్రారంభించనున్న ‘్భక్తుని వద్దకే భగవంతుని ఆశీస్సులు’ కార్యక్రమాలను కూడా మండలాలవారీ నియమించనున్న ఇన్‌చార్జిలు పర్యవేక్షిస్తారన్నారు.
బిడ్డ పుట్టినపుడు, అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, వివాహం అనంతరం దంపతులకు ఆశీస్సులు, సీమంతం తదితర సందర్భాల్లో ఆలయ అర్చకుడితో సహా భక్త బృందాలు వెళ్లి భగవంతుడి ఆశీస్సులను అందిస్తాయన్నారు. ఆలయంలో ప్రసాదం, భగవంతుడి ఫోటోను కూడా భక్తులకు అందిస్తాయన్నారు. ఎవరైనా మృతి చెందినపుడు శివాలయంలోని అభిషేక జలాన్ని తీసుకెళ్లి ఇంటిని భక్త బృందాలు శుద్ధిచేస్తాయన్నారు.
మత్స్యకారులు నివసించే ప్రాంతాల్లో మత్స్యనారాయణస్వామి ఆలయాలను, పద్మశాలీలు నివసించే ప్రాంతాల్లో భావనారాయణస్వామి ఆలయాలను, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు నివాసముండే ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల వారు కోరుకునే అమ్మవారి దేవాలయాలను నిర్మించాలని నిర్ణయించామన్నారు. అయితే అదే కులానికి చెందిన వారిలో ఎవరైనా అర్చక శిక్షణ పొందితేనే ఈ ఆలయాల నిర్మాణాన్ని చేపడతామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ఉచితంగా అర్చకత్వంలో శిక్షణ ఇప్పిస్తామని, ఆలయంలో అర్చకునిగా పనిచేసినందుకు నెలకు రూ.5000 చెల్లిస్తామన్నారు.
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించినట్టే, కృష్ణా పుష్కరాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో కృష్ణా పుష్కరాల కోసం 187 ఘాట్లు కొత్తగా నిర్మించాలన్న ప్రతిపాదనలు వచ్చాయని, సుమారు 230 ఆలయాలను పుష్కరాలకు అభివృద్ధిచేస్తామని చెప్పారు. 3కోట్ల మంది భక్తులు వస్తారని అంచనావేస్తున్నామని, గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరంపై అధిక ఒత్తిడి ఉన్నట్టే, కృష్ణా పుష్కరాలకు విజయవాడ నగరంపై ఒత్తిడి ఉంటుందని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. దీనికి అనుగుణంగానే రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోందన్నారు. గోదావరి అంత్య పుష్కరాలకు కూడా ఈసారి అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనా వేస్తున్నామని, దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఘనంగా లక్ష కలముల మహోత్సవం
అయినవిల్లి, ఫిబ్రవరి 14: చదువుల పండుగ సందర్భంగా సిద్ధివినాయకస్వామి ఆలయంలోనిర్వహిస్తున్న లక్ష కలముల మహోత్సవం విద్యార్థులకు ఎంతోఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం సిద్ధివినాయకస్వామి ఆలయంలో నిర్వహించిన లక్ష పెన్నుల మహోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి రాజప్ప, పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు నిర్వహించిన గణపతి హోమం కార్యక్రమంలో మంత్రి రాజప్ప సతీ సమేతంగా పాల్గొని పూజలు చేశారు. పెన్నుల కోసం విద్యార్థులు బారులు తీరారు. మంత్రి రాజప్ప పాల్గొని విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ రథసప్తమి ఎంతో పవిత్రమైన రోజని, నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుని జయంతి కూడా ఆదివారం రావడంతో స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉంటాయని అన్నారు. హోం మంత్రి రాజప్ప వెంట ఎంపిపి సలాది పుల్లయ్యనాయుడు, జడ్పీటిసి గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణ, సర్పంచ్ కొపనాతి శ్రీరామచంద్రమూర్తి, ఆలయ ఛైర్మన్ రావిపాటి సుబ్బరాజు, ఆలయ ఇఓ ముదునూరి సత్యనారాయణరాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు ఉన్నారు.

అప్పులబాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య
కాట్రేనికోన, ఫిబ్రవరి 14: వ్యవసాయం కోసం చేసిన అప్పుల బాధలు తాళలేక మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాట్రేనికోన మండలం లక్ష్మీవాడ గ్రామానికి చెందిన రైతు మారిశెట్టి సత్యనారాయణ (47) ఆదివారం సాయంత్రం పశువుల పాకలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. సత్యనారాయణ కుటుంబం లక్ష్మీవాడ గ్రామంలో దేవస్థానానికి చెందిన ఐదెకరాలు, సన్నవిల్లి గ్రామ రైతుకు చెందిన పది ఎకరాల భూమిని కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. గత ఏడాది తొలకరి పంట ఆకాల వర్షాలు కురిసి దెబ్బతినడంతో సత్యనారాయణ అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో (మిగతా 6వ పేజీలో)
రైతుకూలీలు, వ్యాపారుల నుండి అప్పుతీర్చమని వత్తిడి పెరిగింది. కొందరు కూలీలు తమకు రావలసిన కూలీ సొమ్ము ఇవ్వలేదంటూ రెండు రోజుల క్రితమే ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సత్యనారాయణ పెద్దకుమారుడు మారిశెట్టి కృష్ణను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అప్పులు తీర్చలేక ఆర్థికంగా కుదేలైన మారిశెట్టి సత్యనారాయణ మనస్తాపంతో ఆదివారం సాయంత్రం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పశువులపాకలో వేల్లాడుతున్న సత్యనారాయణ మృతదేహాన్ని చూసిన బంధువులు కాట్రేనికోన పోలీస్‌స్టేషన్, మండల తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. కాట్రేనికోన ఎస్‌ఐ జానీబాషా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సర్పంచ్ అయితాబత్తుల ప్రమోద్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
నీటి ఎద్దడి లేకుండా చర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఫిబ్రవరి 14: ప్రస్తుత రబీకి నీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. స్థానిక తిమ్మాపురంలోని అతిథి గృహంలో ఆదివారం సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటిఎద్దడి లేకుండా అన్ని రకాల పంటలను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఆయన ఆదేశించారు. ఇతర జలాశయాల నుండి అదనపు నీటిని గోదావరి నదిలోకి తీసుకువచ్చే చర్యలను ముమ్మరం చేయాలని, వంతుల వారీ విధానంలో రబీకి పూర్తిస్థాయిలో సాగునీటిని అందించాల్సి ఉందన్నారు. డ్రెయిన్లకు అడ్డుకట్టలు వేసి, ఇంజన్లతో నీటిని తోడి రైతులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు అయ్యే ఆయిల్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందన్నారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద 12,500 ఎకరాలకు, పంపా రిజర్వాయర్ కింద 12 వేల ఎకరాలకు కూడ సాగునీటిని అందజేయాలని సూచించారు. సాగునీటికి సంబంధించి ఏ విధమైన సమస్యలున్నా తక్షణం తెలుసుకునేందుకు వీలుగా ఎస్‌ఇ కార్యాలయంలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. తొండంగి మండలం కోన ప్రాంతానికి తాగునీటి సమస్య రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీర ప్రాంత మండలాలు సహా జిల్లాలోని ఏజన్సీ, మెట్ట ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా తగు జాగ్రత్త వహించాలని యనమల స్పష్టం చేశారు. ఇరిగేషన్ ఎస్‌ఇ సుగుణాకరరావు మాట్లాడుతూ గోదావరిలో ప్రస్తుతం 7 టిఎంసిల నీటి కొరత ఉందని, అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఈ కొరతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రికి వివరించారు.
సాగునీటితో పాటు వచ్చే వేసవిలో ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జిల్లాలోని పరిశ్రమలు, పర్యాటక శాఖ తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి చర్చించారు. జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, పర్యాటక శాఖ అఖండ గోదావరి ప్రాజెక్టు అధికారి భీమశంకరం తదితరులు పాల్గొన్నారు.
ప్రహారీ కూలి ఇద్దరు వృద్ధ మహిళలు మృతి
సీతానగరం, ఫిబ్రవరి 14: మండలంలోని రఘుదేవపురం గ్రామంలో ఆదివారం ప్రహారీ గోడ కూలి ఇద్దరు వృద్ధ మహిళలు మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..రఘుదేవపురం గ్రామానికి చెందిన నిడదవోలు సూర్యకాంతం (70) తన సొంత ఇంట్లో నివసిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరికీ వివాహాలయ్యాయి. ఈమె పక్క ఇంట్లో ఎర్రగోగుల మంగ తాయారు (72) అద్దెకు ఉంటోంది. ఈమెకు భర్త, పిల్లలు లేరు. కూలి పనిచేసుకుని జీవిస్తోంది. అయితే గత కొద్ది రోజుల క్రిందటే ఇంటి ప్రహారీగోడ బీటలు వారి ఉంది. ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రహరీగోడ వద్ద సూర్యకాంతం, మంగ తాయారులు మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా గోడ కూలి వీరిపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలియగానే సీతానగరం తహసీల్దార్ కనకం చంద్రశేఖర్ రఘుదేవపురం చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై ఎం పవన్‌కుమార్ తెలిపారు.
హల్‌చల్ చేసిన స్కై రైడర్స్
మండపేట, ఫిబ్రవరి 14: మండలంలోని కేశవరంలో స్కై రైడర్స్ పారాచూట్‌లతో ఆకాశమార్గాన రకరకాల విన్యాసాలతో హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు మదన్, యాదవ్, కులదీప్, మనోజ్‌ల ఆధ్వర్యంలో 13 మంది సిబ్బంది అమరవీరులకు నివాళులర్పించే నేపథ్యంలో పారాచూట్ మీదుగా ఆకాశంలో ప్రదక్షణలు చేశారు. వీరు 45 రోజుల పాటు ఆకాశంలో 10 వేల కిలోమీటర్లు పారాచూట్‌పై ఆకాశమార్గాన ప్రదక్షణలు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి బయలుదేరి బీహార్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఒరిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాలను చుట్టుముట్టి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చామన్నారు. తిరిగి పారాచూట్‌ల మీదుగా పశ్చిమబెంగాల్ ప్రయాణిస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగా పారాచూట్‌లు మీదుగా ఆదివారం కేశవరం పంటపొలాల్లోకి దిగామన్నారు. ఇక్కడ ప్రజలు తమకు చూపిన ఆదరణ మరువలేనిదని ఆ బృందం తెలిపారు.
అమిత్‌షా బహిరంగ సభ విజయవంతం చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాజమహేంద్రవరంలో మార్చి 6న పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బిజెపి కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. ఆదివారం రాజమహేంద్రవరంలో బిజెపి రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశం జరిగిన అనంతరం బిజెపి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరం సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే విధంగా కృషిచేయాలని ఆయన సూచించారు. బహిరంగ సభ ఏర్పాట్లను చర్చించేందుకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈనెల 16న రాజమహేంద్రవరంలో సమావేశమవుతుందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 18న జిల్లా కమిటీలు సమావేశాలు నిర్వహించాలన్నారు. 10 నుండి 22వరకు బిజెపి మండల కమిటీలు సమావేశాలు నిర్వహించాలన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే బహిరంగ సభపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని, ఫ్లెక్సీలు ఏర్పాటుచేయటం, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రచారం చేయటం వంటి కార్యక్రమాలను బిజెపి కార్యకర్తలు చేపట్టాలని సూచించారు. బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ మాట్లాడుతూ బిజెపికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బలమేమిటో బహిరంగ సభ ద్వారా చూపించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పరిష్కారాలను చూపిస్తుందన్నారు.
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ గోదావరి జిల్లాలు రాజకీయ వాతావరణాన్ని ముందుగానే చెప్పగల ప్రాంతాలని రాష్ట్రప్రజలు విశ్వసిస్తుంటారని, అలాంటి గోదావరి జిల్లాల్లో బిజెపి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభ ద్వారా బిజెపి బలమేమిటో చూపించగలిగితే, మార్చి 6తరువాత అధికార యంత్రాంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. జన్మభూమి కమిటీల్లో తమకు స్థానం కల్పించలేదని బిజెపి కార్యకర్తలు చెబుతున్నపుడు బాధకలుగుతోందని, తమ అధికారులు వినటం లేదని కార్యకర్తలు దీనంగా చెబుతున్నపుడు జాలి కలుగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు రావాలంటే మార్చి 6న జరగనున్న సభ విజయవంతం కావాలన్నారు.
ప్రస్తుతం ప్రాథేయపడే స్థాయి నుండి మార్చి 6తరువాత బిజెపి కార్యకర్తలు అడిగిన విషయాలను అధికారులు ఇంటికొచ్చి సమాధానం చెప్పే స్థాయికి మార్పులు సంభవిస్తాయన్నారు. బలం లేకపోతే ఎవరూ మాట వినరని, అందువల్ల మన బలమేమిటో చూపించాలని మంత్రి మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. సభకు కార్యకర్తలు తరలిరావటం ఒక్కటే సరిపోదని, తమ కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని తీసుకురావాలన్నారు. తమకు తాము బిజెపి కార్యకర్తగా వ్యక్తిగతంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే రాజమహేంద్రవరం సభ విజయవంతం కావాలన్నారు.
విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సమయంలో తమ నియోజకవర్గంలో 200మంది కార్యకర్తలు మాత్రమే ఉండేవారని, ఇప్పుడా సంఖ్య లక్ష 63వేలకు పెరిగిందన్నారు. జన్మభూమి కమిటీల్లో తమ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి జన్మభూమి కమిటీల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చోటు కల్పించామన్నారు. పార్టీ బలం పెరిగితేనే కార్యకర్తలకు గుర్తింపు వస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో జరగనున్న అమిత్‌షా బహిరంగ సభ రాష్ట్రంలో బిజెపి దశ దిశను నిర్ణయించే సభ అని చెప్పారు. ఈ సభను ప్రతి కార్యకర్త ప్రతిష్ఠాత్మకంగా భావించాలని పిలుపునిచ్చారు. సభలో ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు, బిజెపి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి జి రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, లక్ష్మీపతిరాజు, మాజీ కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, శాంతారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, మాజీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం చేరిన సైన్స్ ఎక్స్‌ప్రెస్
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14: విశాఖపట్నం నుంచి సైన్స్ విజ్ఞానాన్ని మోసుకుని వచ్చిన సైన్స్ ఎక్స్‌ప్రెస్ రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఆదివారం సైన్స్ ఎక్స్‌ప్రెస్ వాతావరణ మార్పులు, చర్యల స్పెషల్ రైలులో ప్రదర్శనలను విజయవాడ డివిజన్ అదనపు రైల్వే మేనేజర్ వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్, వాతావరణ మార్పులు, ప్రభావానికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈప్రదర్శన ఎంతో దోహదపడుతుందన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో డిల్లీలో సైన్స్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైందన్నారు. పుస్తకాల్లో చదివిన అంశాల కన్నా ఈప్రదర్శనలో మరింత విజ్ఞానాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శిస్తున్నారని కితాబునిచ్చారు. ఈఅవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎడిఆర్‌ఎం పిలుపునిచ్చారు. రైల్వేబడ్జెట్‌లో విజయవాడ డివిజన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ బిహెచ్ సుబ్రహ్మణ్యశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు. కాగా, మొత్తం 16 పెట్టెల్లో 13 పెట్టెల్లో వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలతో కూడిన ప్రదర్శనలు ఉన్నాయి. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ 2వ ప్లాట్‌ఫారంపై ఉన్న ఈఎక్స్‌ప్రెస్‌లోని ప్రదర్శనలను ప్రతీరోజూ ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు తిలకించే అవకాశాన్ని కల్పించారు. ఈనెల 16వ తేదీ వరకు ఈరైలు రాజమహేంద్రవరంలో నిలుస్తుంది. అనంతరం గుంటూరు బయలుదేరి వెళుతుందని స్టేషన్ మేనేజర్ తెలిపారు. 1వ బోగీలో గ్రీన్‌హౌస్ ప్రభావం, ఇందుకు దారితీసిన పరిస్థితులు వాటికి కారణమైన మానవ చర్యలకు సంబంధించిన అంశాలతో ప్రదర్శనలు ఉన్నాయి. 2వ బోగీలో అధిక ఉష్ణోగ్రతలు, రుతుపవనాల్లో మార్పులు, సముద్రనీటిమట్టం పెరుగుదల, జలవనరులు, వ్యవసాయం, అడవులు, జీవన వైవిధ్యం, మానవ ఆరోగ్యంపై ప్రభావం, నివారణ చర్యలపై ప్రదర్శనలు ఉన్నాయి. 3,4 బోగీల్లో నిత్యజీవితంలో ఎదురవుతున్న సమస్యలు, నివారణ చర్యలు, భారతదేశంలో తీసుకుంటున్న నివారణ చర్యలు, కథలు, దత్తాంశాలను తెలియజేస్తూ వివరించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 5,6వ బోగీల్లో సహజ వనరులు, వాటి నిర్వహణలను ఉదాహరణలతో వివరించారు. మిగుల వనరుల నిర్వహణలో మెళకువలు, సాంకేతి విధానం ద్వారా శక్తి పునరుత్పాదన, వృధా నివారణ, కనిష్ట కర్బన వినియోగం, భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రాజెక్టులను ప్రదర్శించారు. బోగీ నెంబర్ 7లో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ చర్చలు, అంతర్జాతీయ ఆమోదం పొందిన చర్యలు, లక్ష్యాలను వివరించారు. 8వ బోగీలో పాఠశాలలు, రోడ్లు, ఇళ్లు, కార్యాలయాల్లో చేయాల్సిన మంచి పనుల గురించి వివరించే ప్రదర్శనలు ఉన్నాయి. 9,10బోగీల్లో బయోటెక్నాలజీ రంగంలో ప్రభుత్వం తీసుకుని వస్తున్న మార్పులు, పరిశోధనా ఫలితాలు, రసాయన పర్యావరణం, సహజ వనరుల వినియోగం, అనే్వషణ, పులల సంరక్షణ తదితర అంశాలను వివరించే ప్రదర్శనలు ఉన్నాయి. 11వ నెంబర్ బోగీలో ఎంపిక చేసిన నవకల్పకల ప్రదర్శన, ప్రజానీకం చేస్తున్న వృధా వినియోగాలు, సైన్స్, సాంకేతికరంగాల్లో వస్తున్న మార్పులు, సైన్స్, టెక్నాలజీ శాఖ పథకాలు, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. తొలిరోజు సైన్స్ వాతావరణ మార్పులు, చర్యల ఎక్స్‌ప్రెస్‌ను తిలకించేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఔత్సాహికులు బారులుతీరారు. రైలులోని అంశాలను అహ్మదాబాద్‌లోని విక్రమ్‌సారాబాయ్ కమ్యూనిటీసైన్స్ సెంటర్ వలంటీర్లు విద్యార్థులకు చక్కగా వివరిస్తున్నారు.
69 తుని విధ్వంసం కేసులు సిఐడికి బదిలీ
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14: కాపు ఐక్యగర్జన సందర్భంగా గతనెల తునిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి 69 కేసులను ప్రభుత్వం సిఐడికి బదిలీచేసింది. విధ్వంసంలో భాగంగా ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా దహనం చేసిన సంగతి తెలిసిందే. శనివారం సిఐడి ఐజి కె సత్యనారాయణ, జిఆర్‌పి ఎస్పీ సుమిషిబాజ్‌పేయి కేసుల దర్యాప్తు ప్రగతి, కేసుల బదలాయింపు తదితర అంశాలపై సమీక్షించారు. మొత్తం 69లో 6కేసులను జిఆర్‌పి పోలీసులు నమోదుచేశారు. మిగిలిన వాటి తుని, తుని రూరల్ పోలీసులు నమోదుచేశారు.

వంద కిలోల గంజాయి స్వాధీనం
కోటనందూరు, ఫిబ్రవరి 14: విశాఖ ఏజన్సీ ప్రాంతం నుండి మహరాష్టక్రు చెందిన ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్న వంద కిలోల గంజాయిని కోటనందూరు పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహరాష్టల్రోని నాశిక్ ప్రాంతానికి చెందిన ఆజయ్‌బాబు మోహిత్, దేవిదాస్‌బాబులాల్ అనే ఇద్దరు వ్యక్తులు విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి పరిసర ప్రాంతాల నుండి ఎర్రకారులో వంద కిలోల గంజాయి తరలిస్తుండగా ఆదివారం ఉదయం తుని రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చెన్నకేశవరావు అధ్వర్యంలో కోటనందూరులోని తలుపులమ్మ గుడి వద్ద పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం నుండి తుని వైపు వస్తున్న ఈ కారులో గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి వెనుకభాగంలో ఉంచి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కారును, గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. సిఐ చెన్నకేశవరావు అధ్వర్యంలో ఎస్‌ఐ రాజు కేసు నమోదు చేశారు.
60 కిలోల గంజాయి స్వాధీనం
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు జాతీయ రహదారి పెట్రోలు బంకు సమీపంలో 60 కేజీల ఎండిన గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ప్రత్తిపాడు ఎక్సైజ్ సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారు. విశాఖపట్నం నుండి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీస్ సిబ్బంది తెలిపారు. ఈ కేసులో డ్రైవర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఈ గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న యజమాని వేణు పరారీలో ఉన్నట్టు ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్ సిఐలు, ఎస్సైలు ఎం రాంబాబు, బి నారాయణరావు, జె విజయ్‌కుమార్, గోపాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.