కర్నూల్

పార్నపల్లెలో విషాదఛాయలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల/బండి ఆత్మకూరు, ఫిబ్రవరి 15: దేశరక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీరజవాను ముస్తాక్ అహ్మద్ పార్థివదేహం సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత పార్నపల్లె చేరుకుంది. వీరజవాను సయ్యద్ ముస్తాక్ అహ్మద్ మరణవార్త తెలియగానే కుటంబసభ్యులతో పాటు పార్నపల్లె గ్రామస్థులు తల్లడిల్లిపోయారు. గత 11 రోజులుగా గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇబ్రహీం, నజీమున్సీసా చివరి సంతానం సయ్యద్ ముస్తాక్ అహ్మద్ సియాచిన్ గ్లేసియార్‌లో మంచుతుఫానులో చిక్కుకుని వీరమరణం పొందిన వార్తతో పార్నపల్లె ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రానికి ముస్తాక్ పార్థివదేహం పార్నపల్లె చేరుకుంటుందని తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వేయి కళ్లతో ఎదురుచూడసాగారు. అయితే సైనిక లాంఛనాలు పూర్తి చేసుకుని హైదరాబాదు నుండి బయలుదేరే సమయానికి చీకటి పడడంతో హెలిక్యాప్టర్ తరలించడం వీలుకాదని అధికారులు చెప్పడంతో రోడ్డు మార్గంలో ప్రత్యేక వాహనంలో పార్నపల్లెకు తరలించారు. అర్ధరాత్రి దాటిన తరువాత గ్రామానికి చేరుకున్న వీరసైనికుడు ముస్తాక్ పార్థివదేహాన్ని అధికారులు సైనిక లాంఛనాలతో అందుకున్నారు. మంగళవారం ముస్తాక్ అంత్యక్రియలు గ్రామంలో ముస్లిం సంప్రదాయంలో జరుగనున్నాయి. ఆరు నెలల క్రితం సెలవుల్లో వచ్చిన ముస్తాక్ తల్లిదండ్రులు, సోదరులు, అక్కతో ఆప్యాయంగా గడిపాడు. మళ్లీ ఆరు నెలలకు సెలవులో వస్తానని భార్య నసీమున్నీసాకు మాటిచ్చి వెళ్లిన ముస్తాక్ అహ్మద్ నిర్జీవంగా రావడంతో అంతా ఖిన్నులయ్యారు. ముస్తాక్ మరణవార్త విన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఏడ్చిఏడ్చి అలసిపోయారు. భార్య దుఖః వర్ణించడం అలవికానిది. మరో ఆరు నెలల్లో వచ్చి మూడు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకుందామని మాటిచ్చి పోయిన భర్త నిర్జీవంగా రావడంతో గుండెలవిసేలా విలిపించింది.
ఇబ్రహీం, నజీమున్నీసా దంపతుల చివర కొడుకు ముస్తాక్ అహ్మద్ దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి గ్రామస్తుల్లో దేశభక్తి రగిల్చాడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామానికి చెందిన మరో 8 మంది సైన్యంలో చేరి సేవలందిస్తున్నారు. మంచి విద్యార్థిగా పేరు పొందిన ముస్తాక్ అహ్మద్ 2002లో బండి ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. నంద్యాల పట్టణంలోని నేషనల్ జూనియర్ కళాశాలలో 2004లో ఇంటర్ పూర్తి చేశాడు. మద్రాసు రెజిమెంట్‌లో 2004లో సైనికుడుగా చేరారు. 2014లో నంద్యాల పట్టణంలోని సాదిక్‌నగర్‌కు చెందిన నసీమున్నీసాతో సాదిక్ పెళ్లి జరిగింది. వారికి ప్రస్తుతం నెలల బాబు ఉన్నాడు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి
వీర జవాను ముస్తాక్ అహ్మద్ పార్ధీవదేహం సోమవారం సాయంత్రానికి హెలికాఫ్టర్‌లో నంద్యాల చేరుకుంటుందన్న సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే రోడ్డుమార్గంలో వస్తున్నట్లు సాయంత్రం సమాచారం అందడంతో అధికారులు పార్నపల్లె చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో కర్నూలు, నంద్యాల మీదుగా పార్నపల్లె గ్రామానికి పార్థివదేహం చేరుకుంది. మంగళవారం జరిగే వీరజవాన్ అంత్యక్రియలకు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సైతం వస్తున్నట్లు సమాచారం. ఎంఎల్‌సి, జిల్లా టిడిపి అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, డిఐజి రమణకుమార్, కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
వీర జవాన్ ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలకు పార్నపల్లె గ్రామంలో ఏర్పాట్లు చేసినట్లు ఆర్మీ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. వీరజవాన్ బౌతికకాయాన్ని హైదరాబాదు నుంచి ఆర్మీ వాహనంలో తీసుకువస్తున్నారన్నారు. నంద్యాల ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డిఎస్పీ హరినాధరెడ్డిలు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కలెక్టర్ విజయమోహన్, డిఐజి రమణకుమార్ నంద్యాలకు చేరుకున్నారు. సుమారు వంద మంది ఆర్మీ సిబ్బందితో అంత్యక్రియలకు రిహార్సల్స్ నిర్వహించారు.
‘హౌస్ ఫర్ ఆల్’ కింద
దరఖాస్తుల స్వీకరణ
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 15:ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా ఇల్లు లేని పేద వారందరికీ గృహాలు నిర్మించేందుకు నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ సిహెచ్. విజయమోహన్ ఆదేశించారు. నగర పాలక సంస్థ సమావేశ భవన్‌లో సోమవారం హౌసింగ్ ఫర్ ఆల్ స్కీంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, హౌసింగ్ పిడి రాజశేఖర్, ఆర్‌డిఓ రఘుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగన్నాథగట్టు ప్రాంతంలో ఫేస్-3 కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నగరంలో గృహాలు లేని పేదలందరికీ జీ+3 2 పడక గదుల అపార్టుమెంట్ తరహాలో నిర్మించే గృహాలకు దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. అలాగే జగన్నాథగట్టు ప్రాంతంలో వెడల్పు రోడ్లు, తాగునీరు, పాఠశాల, ఆసుపత్రి, బస్టాప్‌తో పాటు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను స్వీకరించేందుకు హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ సిబ్బందితో 47 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు ఇంటింటికీ తిరిగి సర్వే చేసి అర్హుల నుంచి ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ గ్రాంటు కింద రూ. 1,50,000లు, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటు కింద రూ. 80,000లతో పాటు బ్యాంక్ రుణం కింద రూ. 2 లక్షలు, లబ్ధిదారుని వాటా కింద రూ. 50,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో నివసిస్తూ సొంత ఇల్లు లేని పేద వారందరూ రేషన్ కార్డు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ముఖ్యంగా కేటాయించిన బృందాల్లో ఒక్కో బృందం రోజుకు 50 గృహాల చొప్పున ఇంటింటికీ తిరిగి పేద ప్రజల్లో సొంత ఇంటిపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,618 ఇళ్లు నిర్మించడం లక్ష్యం కాగా, వాటి నిర్మాణం కోసం రూ. 354 కోట్లు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో కర్నూలు, కల్లూరు తహశీల్దార్లు, నగర పాలక సంస్థ, హౌసింగ్ సిబ్బంది, విఆర్‌ఓలు, తదితరులు పాల్గొన్నారు.
సీమ భవిష్యత్తు కోసమే ఉద్యమం
* బస్సు యాత్రలో బైరెడ్డి
ఆస్పరి, ఫిబ్రవరి 15: రాయలసీమ భవిష్యత్తు కోసమే ఉద్యమం చేస్తున్నామని రాయలసీమ పరీరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రాయలసీమ రాష్ట్రం కోసం సాగిస్తున్న బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఆస్పరికి చేరుకున్న బైరెడ్డి నాలుగు రోడ్లు కూడలీలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. జపాన్ స్థాయి అభివృద్ధి పేరుతో ఇక్కడి నిధులు తరలిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో ఉన్న వనరులను వదిలి అభివృద్ధి చెందిన ప్రాంతాలవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి పెట్టడం శోచనీయమన్నారు. రాయలసీమలో ఎలాంటి వనరులు లేకపోవడంతో 10 లక్షల మంది వలసపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. సీమలోని వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి చేసుకుంటామన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడితే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. తమకు అన్ని వనరులు ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే అభివృద్ది చేసుకుంటామన్నారు. సీమ రాష్ట్రం ప్రత్యేకతను గురించి ప్రజలకు వివరించడానికే బస్సు యాత్ర చేస్తున్నట్లు చెప్పారు.
సిల్వర్‌జూబ్లీ విద్యార్థి
ఆత్మహత్యపై నిరసన
* బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కర్నూలు అర్బన్, ఫిబ్రవరి 15:నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆర్‌విఎన్‌ఎస్‌ఎస్.హరిరావు ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. దీంతో సోమవారం ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థి మృతికి కళాశాల అధికారుల నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్. నాయక్ మాట్లాడుతూ విద్యార్థి హరిరావు తన సూసైడ్ నోట్‌లో కళాశాలలో నెలకొన్న అసౌకర్యాలపై ప్రశ్నించినందుకు కళాశాల ప్రిన్సిపాల్, మరో ఏడుగురు అధ్యాపకులు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తామని భయబ్రాంతులకు గురి చేశారని, దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాశాడని తెలిపారు. కావున విద్యార్థి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, మృతికి బాధ్యులైన ప్రిన్సిపాల్, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్‌జెడిని అడ్డుకున్న ఎబివిపి కార్యకర్తలు
విద్యార్థి హరిరావు మృతిపై విచారణకు వచ్చిన కడప ఆర్‌జెడి మల్లేశ్వరి వాహనాన్ని ఎబివిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ విద్యార్థి హరిరావు మృతి ముమ్మాటికీ ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. అయి తే సూసైడ్ నోట్‌లో రాసిన విధంగా ప్రిన్సిపాల్, అధ్యాపకులపై నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన అధికారిణి విద్యార్థులను చూసి వెనక్కి వెళ్లడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ధర్నా లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్, నగర సంఘటనా కార్యదర్శి సుమన్, ప్రశాంత్, మహేంద్ర, రవి, మల్లికార్జున, నంద, ఖాజా, నరేష్ పాల్గొన్నారు.
చనుగొండ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
* జెడ్పీ చైర్మన్ మల్లెల, కెఇ ప్రతాప్
డోన్, ఫిబ్రవరి 15:ముఠా కక్షలు, కార్పణ్యాలకు నిలయంగా వున్న చనుగొండ్ల గ్రామంలో శాంతి కపోతాలను ఎగురవేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రజలంతా కలిసికట్టుగా జీవించి, అబివృద్ధి వైపు పయనించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ స్పష్టం చేశారు. వారు సోమవారం మండల పరిధిలోని చనుగొండ్ల గ్రామ వీధుల్లో కలియ తిరిగి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తాగునీరు, టీచర్ల కొరత, రేషన్ కార్డులు, పింఛన్లు తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సర్పంచ్ లక్ష్మిదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్‌పి చైర్మన్ మాట్లాడుతూ ఫ్యాక్షన్ గ్రామమైన చనుగొండ్లను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు కెఇ ప్రతాప్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. గ్రామాభివృద్ధికి తమ వంతుగా జెడ్‌పి నిధుల కింద రూ. 10 లక్షలను మంజూరు చేస్తానన్నారు. గ్రామంలో నిరుపయోగంగా వున్న దిగుడుబావిని ఇంకుడు గుంతగా మార్చి గ్రామంలోని మురికినీటిని వాటిలోకి వదలాలని కోరారు. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా తిరుగుతున్నారని విమర్శించారు. కెఇ ప్రతాప్ మాట్లాడుతూ చనుగొండ్ల గ్రామాభివృద్ధికి రూ. 1.5 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. గ్రామంలో సిసి రోడ్లు, తాగునీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు అందిస్తామన్నారు. చనుగొండ్ల నుంచి ఇందిరాంపల్లెకు తారురోడ్డు, పత్తికొండ నియోజకవర్గంలోని పెండేకల్లు నుంచి జాతీయ రహదారి వరకూ వున్న రోడ్డును ఆర్‌అండ్‌బిలోకి కలిపేసి బిటి రోడ్డు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మురళీకృష్ణగౌడ్, ఎంపిపి టిఇ లక్ష్మిదేవి, మాజీ ఎంపిపి టిఇ శేషఫణిగౌడ్, వైస్ ఎంపిపి చలం, తహశీల్దార్ మునికృష్ణయ్య, పిఆర్ డిఇ మల్లికార్జునమూర్తి, మండల ఇంజినీర్ నారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఇ శివ, ఇఓఆర్డీ మణిమంజరి, ఏపిఓ రమణ, నాయకులు కృష్ణమూర్తి, దేవేంద్ర పాల్గొన్నారు.
ప్రతి పొలంలో
ఫారంపాండ్ తవ్వుకోవాలి
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, ఫిబ్రవరి 15:ప్రతి రైతు తన పొలంలో ఫారంపాండ్ తవ్వుకోవడం ద్వారా డ్రిప్ ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందవచ్చునని, దీనిపై ఉద్యమరీతిలో అవగాన కల్పించాల్సిన గురుతర బాధ్యత నోడల్ అధికారులదే అని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మండలాల్లో నోడల్ అధికారులు చేపట్టాల్సిన అత్యంత ప్రాధాన్యతాంశాలకు సంబంధించి దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, లేబర్ బడ్జెట్ పెంపు, ఫారంపాండ్ల ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సిసి రోడ్ల నిర్మాణాలు, పశుగ్రాసం, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయిలో పర్యటించి ఆయా అంశాలపై పరిష్కార చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ప్రైమరీ మిషన్ అమలులో భాగంగా వ్యవసాయం, ఇరిగేషన్, ఉద్యానశాఖ అధికారులు టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని మండల స్థాయి అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. లేబర్ బడ్జెట్‌కు సంబంధించి లక్ష్యాలు సాధించాలని సూచించారు.
ప్రతి మండాలనికి 1.73 లక్షల మంది కూలీలు పనుల్లో ఉండి తీరాలని ప్రస్తుతం 70 వేల మంది కూలీలు పనిలో వున్నారని, సోమవారం నాటికి లక్ష మందికి పనులు కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. రైతులు తమ పొలాల్లో సొంతంగా లేదా ఒకరిద్దరు జాబ్‌కార్డు కూలీల సాయంతో పారంపాండ్లు తవ్వుకునేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా కుటుంబ జీవనం గడుస్తుందని, వలసలు వెళ్లే అవసరం వుండదన్నారు. సమావేశంలో జెసి-2 రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, సిపిఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న సేవలో
అనంతపురం ఎంపి జెసి
శ్రీశైలం, ఫిబ్రవరి 15: శ్రీశైలంలో కొలువైన శ్రీభ్రమరాంబిక అమ్మవారు, శ్రీమల్లికార్జున స్వామి వార్లను అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు, వేదపండితులు ఎంపిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ భోజనం తినలేకపోతున్నాం..
* శేషారెడ్డి హైస్కూల్ విద్యార్థుల ఆవేదన..
బేతంచెర్ల, ఫిబ్రవరి 15:ప్రతిరోజూ నీళ్ల చారు, పురుగుల అన్నం తినలేక పస్తులుంటున్నామని పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులు వాపోయారు. శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యన్నాభార్గవ్, జిల్లా కా ర్యవర్గ సభ్యులు అశోక్, ఉదయ్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనంపై విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని వాపోయారు. దీంతో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పాఠశాలలో తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి అక్కడి నుంచే మధ్యా హ్న భోజన పరిశీలన కమిటీ సభ్యులైన ఎంపిడిఓ, ఎంఇలకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే అధికారుల నుంచి స్పందన కరువైందని ఏఐఎస్‌ఎఫ్ నా యకులు తెలిపారు. దీంతో పాఠశాల హెచ్‌ఎం ఆదినారాయణకు ఆహార పదార్థాలను చూపించామన్నా రు. మధ్యాహ్న భోజనంపై గతంలో కూడా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి వంట ఏజెన్సీని రద్దు చేసి విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలని, లేనిచో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కిరణ్, శ్రీకర్, జగదీష్, మురళీ, షేక్షావలి, సురేష్, మాధవ్, ఇమామ్, ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.
వీర జవానులకు నివాళి
మంత్రాలయం, ఫిబ్రవరి 15: సియాచిన్‌లో వీరమరణం పొందిన వీర జవాన్ లకు సోమవారం రాత్రి మంత్రాలయం యువసేన సేవా సమి తి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. హాస్టల్ విధ్యార్థులతో కలిసి జడ్పీ పాఠశాల నుంచి రాఘవేంద్ర కూడలివరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీర మర ణం పొందిన వీర జవానులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవానులకు నివాళులర్పించడం మన కర్తవ్యమన్నారు. బండి ఆత్మకూరు మండ లం పార్నపల్లికి చెందిన జవాను ముస్తాక్ అహ్మద్ సేవలను మరవవద్దన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మునిస్వామి, మంత్రాలయం యువ సేన సేవా సమితి అధ్యక్షులు రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు ఎంఆర్‌వి రెడ్డి, కార్యదర్శి భాస్కర్, ప్రధానకార్యదర్శి రామాంజినేయులు, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో బోల్తా.. ఒకని మృతి
* ఐదుగురికి గాయాలు
ఆస్పరి, ఫిబ్రవరి 15: మండల పరిధిలోని చిగిలి బసుస్టాప్ సమీపంలో సోమవారం జరిగిన ఆటో ప్రమాదంలో చాకలి హంపయ్య(65) మృతి చెందినట్లు ఆస్పరి ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. చిన్నహుల్తి నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి బోల్తాపడిందన్నారు. దీంతో ఆటోలో ఉన్న చిన్నహుల్తి గ్రామానికి చెందిన హంపయ్య అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఆటోలోని మరో ఐదుగురికి గాయాలయ్యాయన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురి ఆత్మహత్యాయత్నం
నంద్యాల టౌన్, ఫిబ్రవరి 15: నంద్యాల మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని విశ్వాసపురానికి చెందిన వసంత, కిశోర్‌కుమార్, ఫరూక్‌నగర్‌కు చెందిన ముస్తాక్ సోమవారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కడుపునొప్పితో బాధపడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మట్కారాయుళ్ల అరెస్టు
నంద్యాల టౌన్, ఫిబ్రవరి 15: నంద్యాల వన్‌టౌన్ ప్రాంతంలో మట్కా రాస్తున్న షేక్ హుసేన్, అక్బల్‌బాషాను అరెస్టు చేసినట్లు డిఎస్పీ హరినాధరెడ్డి తెలిపారు. సోమవారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరినాథరెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ ప్రాంతానికి చెందిన హుసేన్, అక్మల్‌ను అరెస్టు చేసి వారినుంచి రూ.31,150 నగదు, మట్కా చీటీలను, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మట్కా, సారా, పేకాటపై నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐ ప్రతాపరెడ్డి, ఎస్‌ఐ సాయినాధ్, హరిప్రసాద్, సుధీష్, చంద్రశేఖర్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.