తూర్పుగోదావరి

పంచారామ క్షేత్రానికి ట్రస్టుబోర్డు నియామకం జరిగేనా !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, ఫిబ్రవరి 26: సామర్లకోట పంచారామక్షేత్రం భీమేశ్వరాలయానికి ట్రస్టు బోర్డు నియామకం మహాశివరాత్రి ఉత్సవాలలోపు జరుగుతుందా? లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన నేపధ్యం, తదుపరి గత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ట్రస్టు బోర్డుల నియామకం జరగ్గా, తాజాగా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి ఈ ఆలయానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు కాలేదు. ఇప్పటికే దరఖాస్తులు కూడా దేవాదాయశాఖ స్వీకరించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇప్పటికే ఈ ఆలయానికి ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా మండల రైతు సంఘం అధ్యక్షుడు కంటే జగదీష్‌మోహన్‌బాబు ఆధ్వర్యంలో పలువురి పేర్లను దేవాదాయ శాఖకు సిఫార్సు చేశారు. సిఫార్సు చేసి నెలలు గడుస్తున్నా ఆదేశాలు రాకపోవడంతో ట్రస్టు బోర్డు ఏర్పాటులో జాప్యం తప్పడం లేదన్న వాదనలున్నాయి. అయితే ఇటీవల ఆర్డీవో సమీక్షా సమావేశంలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలకు ముందుగానే ట్రస్టు బోర్డు ఏర్పాటు చేద్దామని చెప్పారు. మరి మంత్రి రాజప్ప హామీ ఎంతవరకూ అమలుజరుగుతుందో వేచిచూడాల్సిందే.

‘స్వచ్ఛ’ సంకల్పం అభినందనీయం
-దుళ్లలో పారిశుద్ధ్య నిర్వహణపై
సర్పంచ్‌ను అభినందించిన కలెక్టర్-
కడియం, ఫిబ్రవరి 26: స్వచ్ఛ సంకల్పంతో దుళ్ల గ్రామం సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన కడియం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా దుళ్ల గ్రామంలో దాత సత్తి భాస్కరరెడ్డి రూ.4లక్షలు విలువైన ట్రాక్టర్‌ను కలెక్టర్ చేతుల మీదుగా గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరు గురించి సర్పంచ్ గుర్రపు సత్యనారాయణ చేసిన కృషిని కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలో మండలానికి ఒక గ్రామం చొప్పున స్వచ్ఛ గ్రామంగా ప్రకటించినట్టు తెలిపారు. దీనిలో దుళ్ల ఒక గ్రామమని చెప్పారు. మార్చి 31వ తేదీ నాటికి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలని, అలానే సామాజిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటుచేసి బహిర్భూమి సమస్య లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది 278 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి తాగునీటి పథకం కింద రూరల్ నియోజకవర్గంలో మంచినీటి ట్యాంకుల నిర్మాణం జరిగిందని, అయితే ఆ ట్యాంకుల నుండి పైపులైన్లు లేవని, దీంతో అవి నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ అరుణకుమార్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటుచేసే దిశగా ప్రణాళిక రూపొందించాలని, ఎస్సీఎస్టీలను మినహాయించి ఇంటికి రూ.5వేలు చొప్పున ఫీజు చెల్లిస్తే అదనపు సొమ్మును ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిపి మార్గాని లక్ష్మీసత్యనారాయణ, వైస్ ఎంపిపి వెలుగుబంటి నాని, జడ్పీటీసీ పాలపర్తి రోజ తదితరులు ఉన్నారు.
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఆర్‌ఐఓ ఎ వెంకటేష్ వెల్లడించారు. ప్రతీరోజూ ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు జరుగుతాయన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 128 పరీక్షా కేంద్రాల్లో 97,517 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 42,446 మంది జనరల్, 5,892 మంది ఒకేషనల్ విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 43,941 మంది సాధారణ, 5,237 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశామన్నారు. పరీక్షా కేంద్రాల మీదుగా ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను కోరామన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా ఐదు ఫ్లయింగ్, 4 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెల్‌ఫోన్లు వినియోగించకుండా ప్రతీ పరీక్షా కేంద్రంలో జిపిఆర్‌ఎస్ విధానాన్ని అమలుచేస్తున్నామని వివరించారు. అడ్డతీగల, కూనవరం పరీక్షా కేంద్రాల్లో ఇప్పటికే సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని, తాజాగా ఈసారి రంపచోడవరం, రాజోలు కేంద్రాల్లో కూడా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు. జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను సున్నిత కేంద్రాలుగా గుర్తించామని చెప్పారు. ప్రతీ పరీక్షా కేంద్రం పరిధిలో 144సెక్షన్‌ను అమలుచేస్తున్నామని, సమీపంలోని జిరాక్సు సెంటర్లను కూడా మూసివేయాల్సిందిగా ఆదేశించామన్నారు. ఈసారి జిల్లాలో ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ప్రగతి సాధిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రతీరోజూ సాయంత్రం 4నుంచి గంట పాటు స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ చేశామన్నారు.
మంజూరైన వారంలోగా గ్రౌండింగ్ జరగాలి

కాకినాడ, ఫిబ్రవరి 26: జిల్లాలోఎస్సీ, బిసి కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసే యూనిట్లను సకాలంలో గ్రౌండింగ్ చేసేందుకు కృషిచేయాలని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధింత అధికారులను ఆదేశించారు. మంజూరైన యూనిట్లను వారం రోజుల్లోగా గ్రౌండింగ్ చేయాలన్నారు. కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాల్‌లో శుక్రవారం ఎంపిడిఒలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుండి విడుదలైన సబ్సిడీ బ్యాంకులకు విడుదల చేసినా బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వకపోవడంతో యూనిట్లు గ్రౌండింగ్‌లో ఆలస్యం కావడం సరికాదన్నారు. ఎక్కడైతే సబ్సిడీ విడుదల చేశారో ఆయా యూనిట్లకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు పూర్తిగా తోడ్పడాలన్నారు. ఏదైనా బ్యాంకులు అందుకు నిరాకరిస్తే ఆయా బ్యాంకుల ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నెల ఒకటి నుండి 5వ తేదీ లోగా వివిధ రకాల పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలు, వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు. స్వచ్ఛ్భారత్ మిషన్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో మార్చి నెలాఖరుకు నూరుశాతం బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేయాలన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లను ఉపాధి హామీ అనుసంధానంతో వేగంగా నిర్మాణం చేయాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువలు మూసేముందు అన్ని మంచినీటి చెరువులను 50రోజులకు సరిపడా నీటితో నింపాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఒ కె పద్మ, బిసి, ఎస్సీ కార్పొరేషన్ ఇడిలు ఎం జ్యోతి, ఆర్ అనురాధ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రాజేశ్వరరావు, డ్వామా పిడి ఎ నాగేశ్వరరావు, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.
అధికార్లను సమావేశాలకు రానీయకుండా అడ్డుకుంటున్నారు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: సమాచారహక్కు చట్టం అమలులో జిల్లా కలెక్టర్ వైఖరిపై కమిషనర్ ఎల్ తాంతియా కుమారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. అధికారులను కూడా సమావేశాలకు హాజరుకాకుండా కలెక్టర్ అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. శుక్రవారం ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 27 అప్పీళ్లపై ఆమె విచారణ నిర్వహించారు. విచారణకు హాజరుకాని అధికారులకు, సమగ్ర సమాచారం ఇవ్వని అధికారులకు ఈసందర్భంగా ఆమె షోకాజ్ నోటీసులు జారీచేశారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ స.హ. చట్టంపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోందన్నారు. అయితే అధికారుల్లో మాత్రం అవగాహన పెరగాల్సి ఉందన్నారు. జిల్లాస్థాయి సమన్వయ కమిటీల ఏర్పాటు, సమావేశాల నిర్వహణను కలెక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. అవగాహన సమావేశాలు, విచారణ సమావేశాలకు హాజరుకాకుండా అధికారులను అడ్డుకుంటున్నారన్నారు. అధికారుల అవినీతివల్లే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడం లేదన్నారు. అలాంటి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం తమకు ఉందని తాంతియాకుమారి స్పష్టం చేశారు. సహచట్టం సక్రమంగా అమలు చేయని అధికారులకు ఇప్పటి వరకు రూ. 9లక్షల అపరాధ రుసుంను విధించామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంను కూడా సహచట్టం పరిధిలోకి తీసుకుని వచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. సమాచారహక్కు చట్టంపై సామాన్యులు, నిరక్షరాస్యులకు అవగాహన కల్పించేందుకు నిధులు కేటాయించాలని లోక్‌సత్తా పార్టీ నగర అధ్యక్షుడు ఎంవి రాజ్‌గోపాల్ తాంతియాకుమారికి విజ్ఞప్తి చేశారు.
నేటి నుండి మన్యం జాతర
మారేడుమిల్లి, ఫిబ్రవరి 26: మన్యం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఐటిడిఎ పిఒ కెవిఎస్ చక్రధరబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక విలేఖర్లతో పిఒ మాట్లాడుతూ శనివారం నుండి మూడు రోజులపాటు నిర్వహించే ఈ మన్యం జాతర ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోరబాబు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్టు పిఒ తెలిపారు. ఏజన్సీలోని గిరిజన సాంస్కృతిక సంబరాలతోపాటు రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి కళాజాత బృందాలు వచ్చి కనువిందుచేస్తాయన్నారు. ఏజన్సీ ప్రాంతాలలోని 15 మండలాలకు కళా రూపాలు ప్రదర్శించే అవకాశం కల్పించినట్టు ఆయన తెలిపారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు వెరసి 50 స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఉద్యానవన శాఖ, గిరిజన వంటకాలు చూపరులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయని తెలిపారు. ప్రతి రోజు ఉదయం సాంప్రదాయ గిరిజన క్రీడలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఏజన్సీలోని గిరిజనులతోపాటు 13 జిల్లాల్లోని ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి మన్యం జాతరను తిలకించాలని పిఒ చక్రధరబాబు విజ్ఞప్తి చేశారు. విస్తృతంగా మన్యం జాతరకు ప్రచారం చేశామని, బ్యానర్లు, వాల్ పోస్టర్లు తదితర ప్రచార సామాగ్రి ద్వారా ప్రజలకు తెలియజేసినట్టు తెలిపారు. వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, బస్సు సౌకర్యం, అల్పహారం ఏర్పాటుచేస్తున్నట్టు పిఒ చెప్పారు. మారేడుమిల్లి యువ శిక్షణా కేంద్రంలో లబ్ధిదారులకు మంత్రుల చేతుల మీదుగా ఉపకరణాలు పంపిణీ చేస్తామన్నారు. అక్కడ నుండి కళాబృందంతో కలిసి వనవిహారి చేరుకుని ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు.

కోనసీమలో ఆగని రైలు సంబరాలు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, ఫిబ్రవరి 26: బిజెపి నాయకులు, కేంద్ర మాజీ మంత్రి యువి కృష్ణంరాజు ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురంలో కోనసీమ రైలు సంబరాలు జరిగాయి. పట్టణ బిజెపి అధ్యక్షులు అయితాబత్తుల అభిషేక్ అధ్యక్షతన బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక చిన్నవంతెన వద్ద గతంలో రైల్వే మంత్రి మమతాబెనార్జీ ప్రారంభించిన కోనసీమ రైల్వే శిలాఫలకం వద్ద బిజెపి నాయకులు కృష్ణంరాజుచే కేకు కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటిపల్లి- నరసాపురం రైల్వేలైను కోసం కోనసీమ వాసులు 60 ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారని అది బిజెపి ప్రభుత్వం ద్వారా సాకారమవుతోందన్నారు. రైల్వే లైనుకు కృషిచేసిన బిజెపి ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్‌దేవ్‌ను అభినందించారు. దీనికి కారణమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు బిజెపికి అండగా నిలవాలని, మార్చి 6న రాజమండ్రిలో జరిగే మహాసభ జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్‌వి రాయుడు, యాళ్ల దొరబాబు, కృష్ణంరాజును దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పి తిరుపతిరావు, వి సూర్యనారాయణరాజు, కర్రి చిట్టిబాబు, బసవా శివరామప్రసాద్, ముదునూరి రంగరాజు, నిమ్మకాయల రెడ్డినాయుడు తదితరులు పాల్గొన్నారు.
అమిత్‌షా సభకు తరలిరండి
అల్లవరం: వచ్చే నెల 6న రాజమహేంద్రవరంలో జరుగనున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని కేంద్ర మాజీమంత్రి, బిజెపి నాయకుడు యువి కృష్ణంరాజు కోరారు. శుక్రవారం ఆయన అల్లవరం మండలం సామంతకుర్రులో ఇంటింటాప్రచారం నిర్వహించారు. అమిత్‌షా రాకతో రాష్ట్ర రాజకీయాలు మారిపోనున్నాయని, విప్లవాత్మకమైన మార్పులు సంభవించి రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన రాజకీయాలు జరగనున్నాయని బిజెపి నాయకులు ప్రచారం చేసారు. ఆయన వెంట రాష్ట్ర ఆల్డ్ఛార్మన్ యాళ్ల దొరబాబు, జిల్లా మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బసవా శివరామప్రసాద్, ఆర్‌వి నాయుడు, బసవా చినబాబు, మల్లాడి హనుమంతరావు, అడపా శ్రీను తదితరులున్నారు.
మన్యం జాతరకు ముస్తాబైన వన విహారి
మారేడుమిల్లి, ఫిబ్రవరి 26: మన్యం జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మారేడుమిల్లి వన విహారి ప్రాంతం వేడుకల నిర్వహణకు సర్వాంగ సుందరంగా అలంకరించారు.. అతిథులు, పర్యాటకు, గిరిజనుల కోసం ముస్తాబైంది. ఎల్‌ఇడి స్క్రీన్‌తో వేదికపై ఆధునిక సౌండ్ సిస్టమ్ అమర్చారు. వన విహారి ప్రాంగణాన్ని విద్యుద్దీకరణ (్ఫ్లడ్‌లైట్స్) వెలుగుతో పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా మాతృశ్రీ గడి బాపనమ్మ, గండి పోశమ్మ నమూనా దేవాలయాలు, వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను వచ్చిన పర్యాటకులకు తెలియజేసేందుకు వీలుగా 50 స్టాల్స్‌ను, ఇతర వంటకాల స్టాల్స్, ఉర్రూతలూగించే సాంస్కృతిక కార్యక్రమాలతో వనవిహారి ప్రాంగణం హోరెత్తనుంది. సుమారు 3వేల మంది కూర్చునే విధంగా ఏర్పాటుచేశారు. విఐపిలు, అతిథుల కోసం ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లుచేశారు.
మూడు రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు
మూడు రోజులపాటు స్థానిక గిరిజన కళాకారులతోపాటు, ఇతర జిల్లాల నుండి వచ్చే గిరిజన కళా బృందాల ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
తొలిర రోజు సాంస్కృతిక ప్రదర్శనలు: టెలివిజన్ ఫేమ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, కవి గోరేటి వెంకన్న బృందంచే రేలా రేలా జనపద సంగీత విభావరి, శాటిలైట్ ఛానల్ నృత్య ప్రదర్శనల విజేత సంతోష్ బృందంచే దశవతారం నృత్యం, ఫోర్ డాల్స్ షో, మదర్ అండ్ ఛైల్డ్ టెక్నికల్ షో, నేహ అక్షయ, వి శ్రీవిద్య (ఆంధ్రా సూపర్ కిడ్స్) జానపద నృత్యం, అంతర్జాతీయ జగ్లర్ రోహిత్ షో.
28వ తేదీన జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు: సంబర్ పురి ఒడిస్సా గిరిజన సాంప్రదాయ నృత్యాలు, గిరిజన సంబంధిత సినీ సంగీత విభావరి, ధ్వని అనుకరణ, ప్రోపర్టీ డాన్స్ షో.
29వ తేదీన జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌చే జానపద గీతాలాపన, శ్రీమతి మురళిచే జానపద గీతాలాపన, అసోం రాష్ట్ర గిరిజన ప్రాంత కళాకారులచే బిహు నృత్య ప్రదర్శనలు, గిరిజన జానపద నృత్యం కోబ్రా.
ప్రతి రోజూ ఉదయం 10గంటల నుండి వనవిహారి ప్రాంగణంలో గిరిజన సాంప్రదాయ జానపద కళారూపాలు, వస్తు ప్రదర్శనలు, ఆటల పోటీలు, వంటలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి విచ్చేసే గిరిజన కళా బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
జాతిభేదం లేని మాతృత్వం!
శంఖవరం, ఫిబ్రవరి 26: నేటి ఆధునిక సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న కుల, మత భేదాలతో మానవత్వం మంటగలసిపోతోంది. కాని జంతు జాతుల్లో అవి ఏ జాతికి చెందినవి అయినా ఐకమత్యాన్ని చాటడంతోపాటు, మాతృత్వానికి అవధుల్లేవని చాటి చెబుతున్నాయి. మండల కేంద్రం శంఖవరంలో ఒక మేక పిల్లకు వరాహం పాలిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సన్నివేశాన్ని చూసిన స్థానికులు వాటి అనుబంధాన్ని చూసి ఆనందం వ్యక్తంచేస్తున్నారు.