చిత్తూరు

కల్యాణ వైభోగమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 15: ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు, వేలాది మంది భక్తజనం సాక్షిగా పట్టణం నడిబొడ్డులో కల్యాణోత్సవం జరుపుకోవడానికి కైలాసం నుంచి ఆది దంపతులు దిగి వచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దక్షిణకైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో గురువారం స్కందరాత్రి ఉత్సవం జరిగింది. ఉదయం అధికార నంది, కామధేనువు వాహనాలపై విహరించిన పార్వతీ పరమేశ్వరులు రాత్రి గజ వాహనం, సింహ వాహనాలపైన ఊరేగుతూ కల్యాణ మండపానికి తరలివచ్చారు. పాల సముద్రంలో పుట్టిన కాలకూట విషాన్ని తాగిన పరమశివుడు మగత నిద్రలోకి వెళ్లి తిరిగి మేల్కొన్న తరువాత కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి దగ్గరుండి తల్లిదండ్రులకు కల్యాణోత్సవం జరిపించిన రాత్రి కాబట్టి స్కంద రాత్రి అంటారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి 11 గంటల తరువాత స్వామి, అమ్మవార్లు గజ, సింహ వాహనాలపై ఊరేగుతూ బయలుదేరారు. స్వామివారి వాహనం ముందుగా పట్టణం మధ్యలో ఉన్న పెండ్లి మండపానికి చేరుకుంది. దేవస్థానం సిబ్బంది పెండ్లి మండపాన్ని విద్యుత్ దీపాలతో, మామిడి తోరణాలతో, అరటిచెట్లు, పూలతో సుందరంగా అలంకరించారు. ఎతె్తైన పందిరి వేసి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. కల్యాణోత్సవం కోసం పరమేశ్వరుడ్ని శిష్యుడైన చండికేశ్వరుడు పార్వతీ దేవి తండ్రి హిమవంతుడితో రాయబారం జరిపారు. శివుడి గుణగణాలను కీర్తిస్తూ పార్వతీదేవిని శివునికిచ్చి వివాహం చేయాల్సిందిగా కోరుతారు. ఆయన చెప్పిన నిబంధనలను తిరిగి పరమేశ్వరుడికి విన్నవించి ఆయన వద్ద మాట తీసుకొని మళ్లీ హిమవంతుని దగ్గరకు రాయబారానికి వెళ్లే ఘట్టం అందర్నీ ఆకట్టుకుంది. ఉత్సవాల ప్రత్యేకాధికారి రఘునాధ్, దేవస్థానం ఈఓ భ్రమరాంబ, అధికారులు, సిబ్బంది, భక్తుల సమక్షంలో కల్యాణోత్సవం ఏర్పాట్లు జరిగాయి. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో హోమం వెలిగించి కల్యాణోత్సవం క్రతువును ప్రారంభించారు.
నూతన వధూవరులతో కళకళ
స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవంతో పాటు సామూహిక వివాహాలు చేసుకునే వధూవరులు కూడా కల్యాణ మండపానికి చేరుకున్నారు. స్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగుతుండగా వీరుకూడా మాంగళ్యధారణ చేస్తారు. నూతన వధూవరులకు దేవస్థానం అధికారులు బంగారు తాళిబొట్టు, చీర, పంచెలను అందజేశారు. మరికొందరు భక్తులు కూడా నూతన వధూవరులకు తాళిబొట్లను, కానుకలను అందజేశారు. ఆరేళ్ల క్రితం వరకు సుమారు 300కు పైగా వివాహాలు జరిగేవి. అయితే వీటిలో బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో అన్ని శాఖల అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రభుత్వం విధించిన వయోపరిమితి కలిగిన యువతీ యువకులు మాత్రమే వివాహం చేసుకుంటున్నారు. దీని వలన కల్యాణోత్సవానికి భక్తుల రాకకూడా తగ్గిపోయింది. బాల్య వివాహాలు జరుపుకోవడానికి ఎవరైనా వచ్చినా పట్టణంలోని ప్రధాన దారుల్లో అధికారులు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటుచేసి పరిశీలించిన తరువాతే కల్యాణమండపం వద్దకు పంపుతున్నారు. వయస్సు తక్కువగా ఉన్న వారికి కౌనె్సలింగ్ ఇచ్చి పంపేస్తున్నారు. ఈసారి కూడా పోలీసు, రెవెన్యూ, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించి నూతన వధూవరుల వయస్సును నిర్ధారించిన తరువాత పెండ్లి మండపం వద్దకు అనుమతించారు. పలువురు దాతలు అన్నదానం చేశారు.