సాహితి
పాటనే పాఠశాలగా మలిచిన కవి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
"Words make you think. Music makes you feel.
A song makes you feel and thought''.
- E.Y.Harburg
ఫాట - పల్లెల ఆస్తి. జానపదుల గుండెల చప్పుడు. పశుపక్ష్యాదుల శ్రవణం వీక్షణం అలికిడి ఉరుకుడు. ఏరుపారుతున్న దృశ్యంలో ముద్దుగా ఎగిసిపడే అల. ప్రకృతి కాంచిన అనాది కల. అడవిలో వీచే అందమైన గాలి. కోయిల కుటీరం. పందిరిని ఎక్కి నేను పూస్తాను కాస్తాను అని చెప్పుకున్నట్టుగా మెరిసే వల్లరి. ఆకాశంలో చందమామ, నక్షత్రాలు కలసి చేసే అల్లరి. ఊరవతల సాయంకాలం గుడారం ముందు కూర్చొని శివోహం అంటూ శారదకాడు ఎత్తుకునే తత్త్వం. ఆలుమగల కలహానికి సున్నితమైన ముక్తాయింపు, సునిశితమైన పరిష్కారం. కష్టజీవులు బరువు ఎత్తుకున్నప్పుడు పాట, దించి కూర్చున్నప్పుడు పాట. ఎక్కడి బాధనైనా, ఎంతటి అరిగోసనైనా విడమరిచి చెప్పే సాహిత్య సూత్రం - పాట.
పాటకు ఆబాలగోపాలం వీరాభిమానులు. పాట సప్తసముద్రాలు నదీనదాలు, చెరువులు, కుంటలు, వాగువంకలు, సరస్సులు చెలిమెలు అన్నీ కలిసి ఏకకాలంలో కొట్టే కరతాళధ్వని. పాట పాలబుగ్గల జీతగాడి చేతి ముల్లుగర్ర. పాట కరకు భూస్వాముల కడపటి ఓటమి. పాట శ్రామికుల ఓరిమి. పాట పసిపాపల నిదుర కనులలో ముసిరిన కూరిమి. పాట ఊరట. పాట త్యాగాల తల్లి పేగు. పాట మెత్తని నాగేటి చాలు. పాట మోట మొత్తలో ప్రవహించే వెచ్చటి నీటికి ఎదురెక్కే చేప పిల్ల. ఎరుపెక్కే కెరటం పాట. నేలకొంగు పాట. మిట్ట పాట. వంపు పాట. ఇసుకలో వయ్యారంగా పాదముద్రలు లిఖించుకుంటూ సాగే ఒంటె నెమ్మదితనం పాట. పాట సమూహం. పాట అనేకానేక ఏకాంతాల మోహతూర్యం. పాట వృత్తిదారుల దినచర్య. మనిషి జీవాల్ని మచ్చిక చేసుకోవడం పాట. అవి మేసే పచ్చిక కూడా పాట. మంచె పాట. దౌష్ట్యానికి జ్ఞానం వేసే కంచె పాట. మా-మాల చంద్రయ్య తాత వాయించే ఏకునాదం పాట. మాదిగ లింగయ్య బాబాయి కొట్టే వీరుని డప్పు పాట. పల్లవి అనే పడగవిప్పి చరణాలు చరణాలుగా ఆడే రాగశేషుడు పాట. వర్షం చాటున ఇంద్రధనస్సు పాట. నిండుగ్రీష్మం పాట. పాట పాలకులను నీళ్ళు తాపిస్తుంది, ప్రజల దాహార్తిని తీరుస్తుంది. ఒకటి రెండేమిటి పాటకు కోటిన్నొక్క ఉపమానాలు రూపకాలు చెప్పుకోవచ్చు. చింతల యాదగిరి ఆధునిక తెలుగు సాహిత్యంలో మూడో తరానికి చెందిన యువ వాగ్గేయకారుడు. ప్రజాసమస్యలను తలకెత్తుకొని గద్దె చెప్పే ప్రజానాట్యమండలికి చెందిన సృజనశీల కార్యకర్త. ప్రజాకవి. ఊరు నల్లగొండకు తూర్పున ఉన్న మేళ్లదుప్పలపల్లి. వరుస కరువుల్ని తట్టుకొని నిలబడ్డ బాల కార్మికుడు, గీత కార్మికుడు. తన వలెనే మరెవరూ బడి మాన్పించబడి బాల్యాన్ని భవితను కోల్పోవద్దని కోట్లాది మంది బడిఈడు పిల్లల తరఫున తల్లిదండ్రులకు సమాజానికి ప్రాధేయపడిన వినమ్రశీలి, శాంతస్వభావి - వెరసి అతను ప్రగతిశీల కవి. నా కవిత- ‘నేను గొర్రెల్ని కాస్తుంటాను’ లో- ‘‘తడి దుక్కి నా ముద్దు పలక / దుడ్డు కొన నా సుద్ద ముక్క’’ అన్నట్టుగా లేత ప్రాయంలో దుప్పలపల్లి దుబ్బ చెల్కల్లో పాటలు కడుతూ పెరిగిన పసివాడు యాదగిరి. తనే రాసుకున్నట్టు- ‘ఉరుమే ఉరుమై / మెరిసే మెరుపై పిడుగై / వరదై కదలాలి / వడిగా సుడిగా ఎగిసే అలగా / మనమే మనకై దూకాలె’ - అని జీవన సమరంలో అక్షర శంఖం పూరిస్తూ మూడువందల దాకా పాటలు రాసిన ఎర్రసిపాయి. ‘తీగో నాగో ఎన్నియలో’ యాదగిరి మొదటి సంపుటి.
ప్రజల ఆకాంక్షకు ప్రభలు కట్టే మట్టి ముద్రణలు- ఆలగడప 23వ ప్రచురణ ద్వారా ఈ గేయ సంపుటి లోకం చూస్తుంది. పాటలు కట్టే నైపుణ్యమే కాదు అద్భుతంగా పాటను పాడగల శక్తిమంతుడు చింతల యాదగిరి. నా చిట్టి చేతులు పాటకు ఇరవై ఏండ్లు నిండిన సందర్భంలో యాదగిరి పాటల చిత్తాన్ని, చిత్రాల్ని ప్రజలకు పరిచయం చేయాలి.
‘కళారత్నమ్ గీతమ్’ అని ఆర్యోక్తి. కళలన్నింటిలో పాట రత్నం వంటిది అని అర్థం. ఎవరూ వాళ్లకు వాళ్ళు ఆయా కళారూపాల్లోకి సృజనకారులుగా ప్రవేశించరు. భౌతిక పరిస్థితులు, మానసికంగా దగ్గరితనంవల్ల ఒక్కో ‘కళ’లో ఒక్కొక్కరు ప్రవేశికను తీసుకుంటారు. చింతల యాదగిరి కూడా అట్లానే పాటలు రాసి పాడే పర్ఫార్మింగ్ ప్రక్రియలోకి ప్రవేశించాడు. ప్రజల పాట నిర్మాణం (స్ట్రక్చర్), అల్లిక (టెక్షర్)లను సులువుగా పట్టుకున్నాడు. అస్తిత్వ సంవేదనలో ఎన్ని పార్శ్వాలు దిశలు ఉంటాయో అన్ని పార్శ్వాలు దిశలు యాదగిరి పాటకున్నాయి. ఉన్న ఊరు కన్నతల్లిని వదిలిపోలేనే అంటూ తానెత్తుకునే రాగం తాళం భావం తన స్వీయానుభవం. ‘గుండెల్లోన రగిలిన బాధ’ కన్నీరవుతున్న క్రమంలో ఎక్కడ ఎంతమేరకు వీలైతే అక్కడ అంతమేరకు పాటను హ్రస్వ, లంబిత, విలంబిత లయల్లో నడిపించిన భావధార, జీవనరాగం యాదగిరి.
గ్రామం అంటే ఊరు అనేది సహజార్థం. సంగీత శాస్త్రంలో- ‘స్వరాలు ఏడూ, గ్రామాలు మూడూ, మూర్ఛనలు ఇరవైయొకటి, తానాలు నలభై తొమ్మిది’లను కలిపి స్వరమండలంగా చెపుతారు. ఇందులో షడ్జ, మధ్యమ, గాంధారాలుగా గ్రామం పేర్కొనబడింది. శాస్త్రార్థంలో గ్రామాలు భిన్న లోకాలకు సంబంధించినవే అయినప్పటికీ, సాంఘికార్థంలో గ్రామం సబ్బన్న జాతుల కూడలి. సమస్తవృత్తుల మేళవింపు. ఒక సొగసు ఒక నయగారం గ్రామ్య సంస్కృతిలో ఉంటాయి. ఈ మొత్తం (గ్రామం) ప్రమాణాల్ని చింతల యాదగిరి పాటల్లో పల్లవి చరణాలకు భావ విస్ఫురణకు నిర్మలంగా వాడుకున్నాడు. ‘తీగో నాగో ఎన్నియలో’ అనేది తీగకూ నాగుకూ వెనె్నలకూ సంబోధన. ఉత్ప్రేక్షలుగా పల్లె ప్రజలు చెప్పుకునే వాచకం. అయితే నా మటుకు నేను తీగో అంటే పల్లవి, నాగో అంటే చరణాలు. ఎన్నియలో అంటే భావ విస్ఫురణగానే భావిస్తాను. ఆలాపన, దరువు, వంత శ్రోతలను రసవివశులుగా మార్చి ఆనందసాగరంలో ముంచెత్తే- నాగదారిలో, మల్లియలో, వలలో, వెనె్నలో వెనె్నల, ఉయ్యాలో జంపాలో, గొబ్బియ్యలో, చందమామయ్యో మాదిరిగానే అనుపల్లవిగా తీగో నాగో ఎన్నియలో పల్లె పాటలకు అమర్చి ఉంటుంది.
కొంచెం శైవంలోకి ద్రావిడ సంప్రదాయంలోకి వెళ్ళి చూస్తే- శివుడి జటాజూటం (సిగ) పుట్టను పోలి ఉంటుంది. దాన్ని ఆనుకొని నెలవంక ఉంటుంది. అక్కడే నాగు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జటాజూటం మానవ కృత్యం, పుట్ట ప్రాకృతిక దృశ్యం. తీగ నాగూ సహజన్ములు. వెనె్నల సావకాశంగా రెండింటినీ పెంపుజేసే చలువల రేడు. అంతేకాదు తీగ పరిమళానికి ఉత్పత్తికి గుర్తు. నాగు జ్ఞానానికి యోగానికి ప్రతీక. వెనె్నల భోగానికి వైభవానికి చిహ్నం. అందుకే మన జానపదులు ఆ మూడింటిని తమ గానానికి పల్లవి అనుపల్లవి ముక్తకాలుగా నిలుపుకున్నారు. చింతల యాదగిరి పల్లెనుంచి ఎదిగి వచ్చిన గాయకుడు, కవి. పల్లెనే పంచప్రాణాలుగా పాటలు సృజిస్తున్న ఉద్యమకారుడు. నిత్యం పల్లెను, పల్లెకు రెండు కళ్ళైన పాడిపంటలు వర్ధిల్లాలని తపించే పామరుడు. పల్లీయ సంగీత బాణీల్లో ముద్దుగా ఏ భావానికైనా అతికే అలంకార వాక్యం తీగో నాగో ఎన్నియలో. ఇది మరికొన్ని ముచ్చటైన పిల్లరాగాలకు మాతృక కూడా. యాదగిరికి సూర్యుడితో పాటు చంద్రుడు కూడా ఎంతో ఇష్టమైన కవి సమయం- అందుకే కరుణ వీర రసాల చుట్టూ తిరిగే తన పాటలకు కావ్య నామంగా తీగో నాగో ఎన్నియలో సరిగ్గా సరిపోయింది. ఔచిత్యవంతంగానూ ఉంది. పాటలు, కవిత్వం రెండూ వేర్వేరు. మాట రాగయుక్తమై నడిస్తే పాట. మాట అలంకార నిష్ఠమై నడిస్తే కవిత్వం. పాటలు రాసే వాళ్ళు పాడే వాళ్లు లయ జ్ఞానాన్ని సర్వజ్ఞానాన్నిబట్టి బతికేస్తారు. కవి అట్లా కాదు. పదప్రయోగం వెనకాల ధ్వని కాకువు, వక్రోక్తి, అర్థ్భేదాల అమరిక కుదిరిందో లేదో చూసుకోవాలి. ‘కావ్యం గ్రాహ్యమలంకారాత్’ అని వామనుడు చెప్పినట్టు భావం అలంకారాన్ని సునాయాసంగా మోయాలి. రాగ సౌందర్యం చేత పాట పాటైతే, అర్థసౌందర్యం చేత అలంకార సౌందర్యం చేత కవిత్వం కవిత్వం అవుతుంది. రాగ సౌందర్యమే కాదు అర్థసౌందర్యం అలంకార సౌందర్యం పుష్కలంగా కలిగి వున్నందునే్న ఈ పాటలు గేయకవిత్వం అనడానికి అక్షరాలా అర్హత కలిగి వున్నాయి. ‘్ఫ్లరిన్ నీళ్ళు తాగి పెలుసు బారినా / ఎండుకర్ర పుల్లలెక్క బిర్ర బిగిసినా / నరకాన్ని ఈ నేలన నేను చూసినా / బతుకంతా చావుకొరకు ఎదురుచూసినా’ (్ఫ్లరిన్). ఇది మహావిషాద గేయమైనప్పటికీ ఉపమరూపక ఉత్ప్రేక్షలు సమయోచితంగా ప్రయోగించబడ్డాయి. ఇక యతిప్రాసల విషయానికొస్తే యాదగిరి అంత్యప్రాస అద్భుతంగా ఉంటుంది. అక్షరయతి భంగం కనిపించినా అర్థయతి అని చెప్పుకోదగిన కొత్త యతి భేదాన్ని తన పాటల్లో వాడడం ద్వారా ఛందశ్శాస్త్ర వ్యాప్తికి కూడా పరోక్షంగా దోహదపడ్డాడు.
"Your mind is the garden/ Your thoughts are the seeds / the harvest can either be / flowers are weeds'' అంటాడు వర్డ్స్‌వర్త్ మహాశయుడు.
అక్షరాల్ని రాతపూత వరకే నేర్చుకున్న చింతల యాదగిరి సమాజంలోని కలుపును ఏరివేయడానికి తన నాడీ మండలమనే తోటలో ఆలోచన విత్తనాలతో పాటలపూల రూపంలో మనకు ఎదురుపడుతున్నాడు. భావజాలం మార్క్సిస్టు పార్టీ నుండి క్రమశిక్షణగా అందినప్పటికీ ఫూలే అంబేడ్కర్‌ల దళిత బహుజన దృక్పథం వైపు స్పష్టంగా నిలబడ్డాడని అర్థవౌతుంది.
ఏదీ ఎప్పుడు స్థిరంగా ఉండదు. అన్నీ మారుతుంటాయి. పార్టీ స్థితిగతులను, త్యాగమూర్తుల స్మృతులను రాయడమే కాకుండా అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి అంశాల పట్ల అవగాహన కలిగించే ఇంపైన పాటలు ఇందులో ఉన్నాయి. నేటి యువతరానికి అవసరమైన స్ఫూర్తిని ప్రేరణను అందించే వ్యక్తిత్వ వికాస గేయాలూ ఉన్నాయి. ఎవ్వరం ఏ భావజాలం కలిగి ఉన్నా అంతిమంగా దేశసమగ్రతకు ఐక్యతకు కట్టుబడి బతుకవలసిన బాధ్యత పౌరుడిగా ప్రతి మనిషికీ ఉంది. వందేమాతరం పాట చదివితే, వింటే నరనరాల్లో దేశభక్తి పొంగిపొర్లవలసిందే. తల్లిని, పల్లెతల్లిని, దేశమాతను అమిత భక్తిప్రపత్తులతో కొలిచే పాట కవి ఈయన.
"The highest education is that which does not merely give us information but makes our life in harmony with all existence'' అంటారు విశ్వకవి రవీంద్రుడు. కళాశాలలు విశ్వవిద్యాలయాలు అందించిన ఉన్నత విద్యావంతులు ఉపాధ్యాయులుగా ఉత్త సమాచారాన్ని పిల్లలకు చేరవేస్తుంటే, నామమాత్రపు అక్షరాస్యుడైన యాదగిరి బతుకు పాఠంలోంచి అబ్బిన జ్ఞానంతో- ప్రజలంతా సిరిసంపదలతో శాంతి సామరస్యాలతో విలసిల్లాలని కోరుతూ అందుకు జరుగుతున్న సంఘటిత పోరాటాలకు కలాన్ని గళాన్ని అందిస్తున్నాడు. పాటనే పాఠశాలగా నిర్వహిస్తున్నాడు.