విశాఖపట్నం

పాస్‌లు అయిపోయాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 24: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి తొలి విడత పాస్‌ల జారీ దాదాపూ పూర్తయింది. తొలివిడత సుమారు 87 వేల పాస్‌లను సుమారు 170 మీసేవా కేంద్రాల నుంచి పంపిణీ చేసినట్టు జిల్లా కలెక్టర్ యువరాజ్ ‘ఆంధ్రభూమి’కి తెలియచేశారు. ఫ్లీట్ రివ్యూని నేరుగా తిలకించాలన్న ఆసక్తి బాగా పెరిగిపోవడం వలన జనం అధిక సంఖ్యలో బీచ్ రోడ్డుకు వస్తారని తెలుస్తోంది. అందువలన రెండో విడత సుమారు 70 వేల పాస్‌లను జారీ చేస్తామని కలెక్టర్ తెలియచేశారు.
రిహార్సల్స్‌తో సరిపెట్టుకోండి!
ఫ్లీట్ రివ్యూకి పాస్‌లు వచ్చాయని సంబరపడితే సరిపోదు. ఆ పాస్‌తో ఫ్లీట్ రివ్యూ వేదిక వద్దకు చేరుకోవడం సామాన్యులకు గగనమవుతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినందువలన సాధారణ జనం లోనికి ప్రవేశించడం కష్టమే. అందులన ఈనెల 27, 28 తేదీల్లో బీచ్ రోడ్డులో ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన రిహార్సల్స్‌ను చూసి జనం సరిపెట్టుకుంటే మంచిది.
రేపు తీరానికి రానున్న యుద్ధ నౌకలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన దేశానికి చెందిన యుద్ధ నౌకలు తీరానికి రానున్నాయి. ఆ రోజు యుద్ధ నౌకలను అందంగా అలంకరించి ఆర్‌కే బీచ్‌కు దగ్గరగా తీసుకురానున్నారు.

తరలి వస్తున్న యుద్ధ నౌకలు
ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నం
వచ్చే నెల నాలుగో తేదీ నుంచి 11వ తేదీ వరకూ విశాఖలో విడిది చేసేందుకు వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు తరలి వస్తున్నాయి. వచ్చే నెల రెండు, మూడు తేదీల నుంచి ఆయా నౌకలు భారత జలాల్లోకి ప్రవేశించనున్నాయి. మన దేశ యుద్ధ నౌకలతోపాటు, వివిధ దేశాల నుంచి వస్తున్న యుద్ధ నౌకలకు సంబంధించిన వివరాలను తూర్పు నౌకాదళం క్లుప్తంగా అందిస్తోంది. వీటిని పాఠకులకు యథాతథంగా అందిస్తున్నాం.
చిచ్చర పిడుగు
శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తే, భారత నౌకాదళంతో ముందు వరుసలో ఉంటుంది ఈ యుద్ధ నౌక. ఇది సముద్రంలోకి నౌకాదళ సిబ్బందని, యుద్ధ ట్యాంకులను, ట్రక్‌లను, పెద్ద ఎత్తున ఆయుధాలను మోసుకెళ్లగలుగుతుంది. అంతేకాదు, భూమీద శత్రు సైన్యంతో పోరాడాల్సి వస్తే సముద్రంమీద ఉన్న మన సైన్యాన్ని ఒడ్డుకు చేర్చుతుంది. ఒకేసారి 200 మంది సైనిక బృందాలను ఎక్కడికైనా అవలీలగా తీసుకువెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. ఎల్‌ఎస్‌టి (ఎల్) తరహాకు చెందిన ఈ యుద్ధ నౌక కోల్‌కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్‌లో తయారైంది. సీ కింగ్ హెలికాప్టర్లను ఈ నౌక తీసుకువెళ్లగలుగుతుంది. దీవుల్లో ఉండే ఉగ్రవాదులను తుదముట్టించేందుకు కావల్సిన సిబ్బంది, ఆయుధాలను తీసుకువెళుతుంది. ఎల్‌ఎస్‌టి (ఎల్) తరహాకు చెందిన ఐఎన్‌ఎస్ షర్డుల్, ఐఎన్‌ఎస్ కేశరి, ఐఎన్‌ఎస్ ఐరావత్ ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి.
హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక
యుద్ధ రంగంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన చార్ట్‌లను సిద్ధం చేస్తుంది ఈ యుద్ధ నౌక. ఇందులో హైడ్రోగ్రాఫిక్ సిస్టమ్, మల్టీ బీమ్ ఎకో సౌండర్స్, సింగిల్ బీమ్ ఎకో సౌండర్స్, ఎకోస్టిక్ డాప్లర్, డిజిటల్ సైడ్ స్కాన్ సోనార్స్ తదితర అత్యాధునిక పరికరాలు ఈ నౌకలో అందుబాటులో ఉంటాయి. ఇందులో సర్వేకు కావల్సిన నాలుగు మోటార్ బోట్లు, రెండు జెమిని క్రాఫ్ట్స్, ఒక రిజిడ్ హల్ ఇన్‌ఫ్లాటబుల్ బోట్ తదితరాలు ఉంటాయి. ఈ తరహాకు చెందిన ఐఎన్‌ఎస్ నిరూపక్, ఐఎన్‌ఎస్ దర్షక్, ఐఎన్‌ఎస్ సంధ్యాయక్ ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి.
బాంగ్లా నేవీలో అతిపెద్ద నౌక
బంగ్లా దేశ నౌకాదళంలో అతి పెద్ద నౌక ఇది. పేరు బిఎన్‌ఎస్ సొముద్ర జాయ్. ఈ నౌకను యుఎస్‌ఎ నుంచి బంగ్లాదేశ్ కొనుగోలు చేసింది. 2013 డిసెంబర్ 23న బంగ్లా నేవీలో ఈ నౌక చేరింది. ఈ నౌక వివిధ దేశాలతో జరిగిన సంయుక్త విన్యాసాల్లో పాల్గొంది. కతార్‌లో జరిగిన ఫాల్కాన్-2015 విన్యాసాల్లో పాల్గొంది, యునైటెడ్ స్టేట్ నేవీతో నిర్వహించిన కో-ఆపరేషన్ ఎఫ్లోట్ రెడీనెస్ అండ్ ట్రైనింగ్‌లో ఈ నౌక పాల్గొంది. ఈ నౌకలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఇందులో ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

మహిళల సాధికారతే లక్ష్యం
* భారత మహిళా సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి అనీరాజ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 24: రాబోయే మూడేళ్లలో మహిళల సాధికారతే లక్ష్యంగా తాము పోరాటం సాగిస్తామని భారతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) ప్రధాన కార్యదర్శి అనిరాజ స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మతోన్మాదం, కుల వివక్షత, మద్యపానం నిషేధించే వరకు పోరాటం సాగుతుందన్నారు. ఇటీవల నిర్వహించిన 20వ జాతీయ మహసభలు విజయవంతమయ్యాయన్నారు. ఈ సమావేశాల్లో ఐదు అంశాలపై తీర్మానాలు చేశామన్నారు. ఈ సమావేశాలకు 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. ప్రతి మూడేళ్లకు ఒక మారు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివక్షకు గురవుతున్న మహిళల హక్కుల పరిరక్షణకు ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు. నేడు విద్యా వ్యవస్థ వ్యాపారాత్మకంగా మారిపోయిందని, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల సాధారణ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలో లోపాల వల్లనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలన్నారు. ఈ సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు జాతీయ కార్యదర్శి నిషా సిద్దు, ఎపి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ, జిల్లా ప్రధాన కార్యదర్శి విమల తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
ఈ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన జాతీయ అధ్యక్షురాలిగా అరుణ్‌రాయ్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనీరాజాను ఎన్నుకున్నారు. రెండో దఫా అనీరాజాను ఎన్నుకోవడం తనకు ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. తనపై ఉంచిన బాధ్యత మరింత పెరిగిందన్నారు. వీరితోపాటు ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు జాతీయ కార్యదర్శులతో 116 మందితో నూతన సమితి ఎన్నికైందన్నారు.

ఆడ పిల్లలకు సమానత్వం తల్లిదండ్రుల వల్లే సాధ్యం
* చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
* మంత్రి పీతల సుజాత
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 24: సమాజంలో ఆడ పిల్లలకు సమ ప్రాధాన్యం కల్పించాలంటే అందుకు తల్లిదండ్రుల ద్వారానే సాధ్యపడుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జెడ్పీలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణకు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. మహిళలు తమ ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలన్నారు. మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతగానో ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. మహిళలపై లైంగిన వేధింపుల నిరోధానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల దృక్పథంలో మార్పులు రావాలన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ మహిళలపై కుటుంబాల్లో వేదింపులు నిరోధించాలన్నారు. మరో ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ లేడి బచావో, బేఠీ పడావో నినాదం ద్వారా ప్రధాని మోదీ మహిళల రక్షణ పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారన్నారు. జిల్లా కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ సమాజంలో ఆడ, మగ నిష్పత్తిలో వ్యత్యాసం ఉంటే సమస్యలు తప్పవన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు మంత్రి సుజాత చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.

మినీ మారథాన్‌కు విశేష స్పందన
* ఉత్సాహంగా పాల్గొన్న ప్రజానీకం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 24: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం బీచ్ రోడ్డులో నిర్వహించిన 5 కిలోమీటర్ల పరుగు (మినీ మారథాన్)కు విశేష స్పందన లభించింది. నగరంలోని ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం వద్ద జిల్లా కలెక్టర్ యువరాజ్, హిందుస్థాన్ షిప్‌యార్డు చైర్మన్ శరత్‌బాబు ఈ పరుగుపందెంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని నింపేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఈ పరుగు పోటీలను నిర్వహిస్తుందన్నారు. ప్రధాని మోదీ సూచన మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. ఇదిలా ఉండగా తరచు ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం కలుగుతుందన్నారు. షిప్‌యార్డు చైర్మన్ రియల్ అడ్మిరల్ శరత్‌బాబు మాట్లాడుతూ నగర ప్రజల నుంచి ఇటువంటి కార్యక్రమాలకు మంచి స్పందన రావడం శుభపరిణామమన్నారు. ఈ పరుగు పందెంనకు జిల్లా యంత్రాంగం, హిందుస్థాన్ షిప్‌యార్డు సహకరించాయి. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి హిందుస్థాన్ షిప్‌యార్డు టీ షర్టులు సరఫరా చేసింది. ఈ పోటీల్లో పాల్గొన్న విజేతలకు కలెక్టర్ యువరాజ్, జెసి నివాస్, షిప్‌యార్డు చైర్మన్ శరత్‌బాబు, జెసి వెంకటరెడ్డి తదితరులు పతకాలను బహూకరించారు. అనంతరం బాలభవన్ వద్ద చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్ సూర్యారావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జిల్లా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.

స్వచ్చంద సంస్ధలు నిస్వార్థంగా సేవలందించాలి
* రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 24: స్వచ్చంద సంస్థలు నిస్వార్థంగా తమ సేవలను అందించాలని ఎయు రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉదయం ఎయు కాన్వొకేషన్ హాల్లో ఏర్పాటు చేసిన ‘అప్‌లిఫ్ట్ ఎ చైల్డ్ ఇంటర్నేషనల్’ నిర్వహించిన వార్షిక కార్యక్రమానికి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను తీర్చిదిద్ది, ఉత్తమ పౌరులుగా మలచాలనే ఆశయం అభినందనీయమన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్ అప్‌లిఫ్ట్ చైల్డ్ సంస్థ అందిస్తుందన్నారు. సంస్థ చైర్మన్ శామ్ పనుము మాట్లాడుతూ ఎంత కాలం జీవించామన్నదీ ప్రధానం కాదని, ఎలా జీవించామన్నదే ప్రధానమన్నారు. జీవితాన్ని ఒక తీపి జ్ఞాపకంగా మలచుకుంటూ ఇతరులకు సాయపడాలన్నారు. సంస్థ అధ్యక్షుడు కె.సుధాకర్ మాట్లాడుతూ 13 దేశాల్లో 4వేల మంది పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని పి.శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాయ్ తనుకుల, పర్వతనేని కృష్ణ కిషోర్, చింతమనేని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మోదకొండమ్మ తీర్థం
పాడేరు, జనవరి 24: పాడేరులో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో భక్తులు క్యూలో నిల్చోని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థం దృష్ట్యా భక్తుల తాకిడి అధికం కావడంతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. అమ్మవారి తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గులు, వాలీబాల్, గాలి పటాలు, ధింసా నృత్య పోటీలకు విశేష స్పందన లభించింది. పలు ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు, కళాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం అమ్మవారి ఊరేగింపును పట్టణ వీధులలో కన్నుల పండువగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు వాయిద్యాలతో చేపట్టిన ఊరేగింపును తిలకించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలిరావడంతో పాడేరు పట్టణ రోడ్లు నూతన శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి, జెడ్పీటీసీ పొలుపర్తి నూకరత్నం, ఎం.పి.పి. వర్తన ముత్యాలమ్మ, ఆలయ కమిటి ప్రతినిధులు బూరెడ్డి నాగేశ్వరరావు, పి.గోవిందరావు, వి.పిన్నయ్యదొర, పట్టణ పుర ప్రముఖలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మోసగాళ్ళ పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలి
కోటవురట్ల, జనవరి 24: మాయమాటలు చెప్పే మోసగాళ్ళ పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఐ.సి.డి. ఎస్. ప్రాజెక్టు సూపర్‌వైజర్ సౌజన్య సూచించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా స్థానిక ఐ.సి.డి. ఎస్. ప్రాజెక్టు సమీపంలో కోటవురట్ల కస్తూరిభా విద్యాలయంలో బాలికా సదస్సును నిర్వహించారు. ఈకార్యక్రమంలో సౌజన్య మాట్లాడుతూ ఆడ పిల్లలు ప్రలోభాలకు లోనుకావద్దన్నారు. ఆడ పిల్లల అక్రమరవాణాను అరికట్టేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. బాలికల రక్షణ కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. భ్రూణ హత్యల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేసారు. స్థానిక సర్పంచ్ గవ్వా గోవిందరావు మాట్లాడుతూ బాలికలు ఉన్నత విద్యావంతులైనప్పుడే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. బాల్యవివాహాలను అరికట్టేందుకు గట్టి చర్యలు చేపట్టామన్నారు. బాలికలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులందరికీ బాలికా సంరక్షణ పథకం అందజేయాలన్నారు. మరో సూపర్‌వైజర్ జోగులమ్మ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం గృహ హింస చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో కస్తూరిభా విద్యాలయం ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ అర్చనమ్మ, స్థానిక నాయకులు జానకి శ్రీనులు పాల్గొన్నారు.

ఉత్తరవాహిని వద్ద పౌర్ణమి పూజలు
నర్సీపట్నం,జనవరి 24: ఇక్కడకు సమీపంలోని ఉత్తరవాహిని వద్ద ఆదివారం పౌర్ణమి పూజలు నిర్వహించారు. పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో ఈపూజలను జరిపించారు. ప్రతీనెలా పౌర్ణమి రోజున ఈపూజలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం నిర్వహించిన పౌర్ణమి పూజలకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు జరిపించుకున్నారు. ఉదయం ఆరు గంటల నుండే భక్తులు తరలిరావడంతో ఆశ్రమం కిటకిటలాడింది. పూజల అనంతరం భక్తులు శివలింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం పాకలపాడు గురుదేవుల సమాధులను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు ఆశ్రమం వద్ద అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమ అర్చకులు రామం పంతులు భక్తులచే గోచార పూజలు జరిపించారు. ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇసుక నిల్వలను పరిశీలించిన మైనింగ్ అధికారులు
మాకవరపాలెం,జనవరి 24: అనకాపల్లి మైనింగ్ శాఖ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో ఇసుక నిల్వలను పరిశీలిస్తున్నామని మైనింగ్ ఎ.డి. సూర్యచంద్రరావు అన్నారు. కొత్త ఇసుక విధానం ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తున్నందున అనకాపల్లి మైనింగ్ పరిధిలో ఉన్న ఇసుక నిల్వలను సర్వే చేస్తున్నారు. ఈమేరకు ఆదివారం మాకవరపాలెం మండలంలోని జంగాలపల్లి, బి. ఎస్.పేట, నారాయణరాజుపేట, బయ్యవరం, గిడుతూరు, తాడపాల, తూటిపాల గ్రామాల పరిధిలో ఉన్న ఇసుక నిల్వలను పై అధికారులు పరిశీలించారు. ఈసందర్భంగా ఎ.డి. విలేకరులతో మాట్లాడుతూ ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం కొత్త పాలసీని ప్రవేశపెట్టిందని, దీనిలో భాగంగా ఈప్రాంతంలో ఉన్న ఇసుక నిల్వలను పరిశీలిస్తున్నామన్నారు. ఇసుక నిల్వలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామిన తెలిపారు. ఈనివేదిక ఆధారంగా ప్రభుత్వం కొత్త రీచ్‌లను మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ సి. ఎస్.రావు, ఆర్.డబ్ల్యు. ఎస్. ఎ. ఇ. రాజేష్, వి. ఆర్. ఓ.లు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి కబ్బడీ పోటీలకు జెన్‌కో కార్మికులు
సీలేరు,జనవరి 24: జాతీయ స్థాయి కబ్బడీ పోటీలకు సీలేరుకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని సీలేరు కాంప్లెక్స్ ఇన్‌చార్జ్ సూపరెంటెండెంట్ ఇంజనీర్ వి. ఎల్.రమేష్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ శాఖకు చెందిన జెన్‌కో ట్రాన్స్‌కో డిస్కమ్‌లు సంయుక్తంగా ఇటీవల తిరుపతిలో రాష్ట్ర స్థాయి కబ్బడీ పోటీలు నిర్వహించారన్నారు. ఈపోటీల్లోసీలేరు జట్టు ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర స్థాయి కబ్బడీలో సీలేరు జట్టుకు చెందిన కొండల శ్రీనివాస్, ఎం.వెంకటేష్, ఎస్. ఆనంద్ అత్యంత ప్రతిభ కనబర్చడంతో వీరు ముగ్గురిని త్వరలో జరుగబోయే జాతీయ స్థాయి కబ్బడీ పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. వీరికి టీమ్ మేనేజర్‌గా ఎస్. నాగేశ్వరరావును నియమించినట్లు ఆయన తెలిపారు.

భక్తులతో కిటకిటలాడిన దారాలమ్మ ఆలయం
సీలేరు, జనవరి 24: దారాలమ్మ ఆలయం ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. విశాఖ ఏజన్సీలో ప్రకృతి అందాలతో పాటు మంచు దుప్పటి కప్పుకుని ఉండడంతో పర్యాటకులు ప్రకృతి అందాలు తిలకించేందుకు ఆదివారం తండోపతండాలుగా వాహనాల్లో వచ్చారు. దారకొండ, సప్పర్ల ఘాట్ రోడ్డులో కురుస్తున్న మంచుతో ప్రకృతి దృశ్యాలు వీక్షించడంతో పాటు అమ్మవారి మొక్కుబడులు కూడా తీర్చుకునే క్రమంలో ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరితో పాటు తెలంగాణాకు చెందిన పలు ప్రాంతాల వారు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులు అనేక ఇబ్బందులు గురయ్యారు.

హోంగార్డుల గుండెల్లో గుబులు
సీలేరు,జనవరి 24: జెన్‌కో చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు గంజాయి వ్యాపారులతో కుమ్మక్కయ్యారనే సమాచారం పోలీసులకు తెలియడంతో చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డు గుండెల్లో గుబులు పుడుతుంది. ఈనేపధ్యంలో పోలీసులు హోంగార్డులను అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజన్సీతో పాటు ఒడిషాలోని పండించిన గంజాయి సీలేరు, మోతుగూడెం మీదుగా ఖమ్మం, హైదరాబాద్, తమిళనాడు, కేరళా ప్రాంతాలకు ప్రతీ రోజు రవాణా చేస్తుంటారు. అయితే ఈమార్గంలో సీలేరు, మోతుగూడెం వద్ద జెన్‌కో చెక్‌పోస్టులున్నాయి. జెన్‌కో సామగ్ర తరలించుకుపోకుండా కాపాడేందుకు ఈ రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసారు. ఈమార్గంలో ప్రతీవాహనాన్ని జెన్‌కో హోంగార్డులు క్షుణ్ణంగా సోదాలు చేస్తుంటారు. దీంతో గంజాయి స్మగ్లర్లు ఈరెండు చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే కొంత మంది హోంగార్డులను మచ్చిక చేసుకుని అక్రమంగా గంజాయి రవాణా సాగిస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడిన గంజాయి కేసులో పోలీసులు విచారణ చేయగా గంజాయి రవాణాకు చెక్‌పోస్టు వద్ద హోంగాద్డులు సహకరిస్తున్నట్లు విచారణలో తెలిసింది. కొంత మంది హోంగార్డులకు బ్యాంకు అకౌంట్లు, మధురై తదితర ప్రాంతాల నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన విషయాన్ని కూడా వెల్లడైంది. చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించే కొంత మంది హోంగార్డులను పోలీసులు మూడు రోజుల పాటు విచారణ చేస్తున్నారు. దీంతో ఇక్కడ విధులు నిర్వహించే హోంగార్డుల గుండెల్లో గుబులు పుడుతుంది.

విలీన గ్రామాలపై జివిఎంసి నిర్లక్ష్యం
అనకాపల్లి(నెహ్రూచౌక్), జనవరి 24: జీవిఎంసి జోనల్ పరిధిలోని విలీనమైన కొత్తూరు, కైలాసగిరి కాలనీ, కెఎన్‌ఆర్ పేట, కొత్తూరు నర్సింగరావుపేట గ్రామాలపై జీవిఎంసి చిన్నచూపు చూస్తుందని, జీవిఎంసిలో ఆయా గ్రామాలు విలీనం కావడమే మాకు శాపంగా మారిందని ఆయా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవిఎంసి జోనల్ అధికారులు ఎంతసేపూ పట్టణానికే పరిమితమవుతున్నారు తప్ప విలీన గ్రామాలపై దృష్టిసారించడం లేదని వారు వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసాయని వారు ఆరోపిస్తున్నారు. విలీనమైన నాటి నుండి ఆయా గ్రామాల్లో కనీసం ఒక అభివృద్ధి పని కూడా చేసినట్లు ఎక్కడా కానరావడం లేదు. డ్రైనేజీ కాలువలు పూర్తిగా శిధిలమవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దోమలు అధికమై పలు వ్యాధులు వ్యాపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పారిశుద్ధ్య లోపం వలనే డయేరియా వ్యాపించి సుమారు 30మంది వరకు వృద్దులు, చిన్నపిల్లలు తీవ్ర అస్వస్థకు గురైన సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ అధికారుల్లో ఎటువంటి చలనం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇంటి పన్ను వసూలు చేయడంలో అధికారులు తీసుకున్న శ్రద్ధ పనులు చేయడంలో చూపడం లేదని వారు వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, సీసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధి లైట్లు ఇలా అనేక సమస్యలతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నామని వారు ఆరోపిస్తున్నారు. గతంలో ఆయా గ్రామాలు పంచాయతీలుగా ఉన్న సమయంలో కాస్తోకూస్తో పంచాయతీ నిధులతో అభివృద్ధి పనులు జరిగేవని జీవిఎంసిలో విలీనమైనప్పటి నుండి ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేని పరిస్థితి ఈ గ్రామాల్లో నెలకొందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.