మెయిన్ ఫీచర్

పిల్లలు మొండికేస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ వ్యాన్ రాగానే ఎంతో ఉత్సాహంతో పరుగెత్తుకెళ్లి ఎక్కే పావని- వారం రోజులుగా వాళ్ళమ్మ కేకలేస్తే గానీ బడికి వెళ్లడం లేదు. అదీ ముభావంగా ప్రవర్తిస్తూ మొక్కుబడిగా స్కూల్ వ్యాన్ ఎక్కుతూ వుంది. పావని ముఖంలోని నిర్లిప్తత, స్కూల్ అంటే కలిగిన అయిష్టత గురించి వాళ్ళమ్మ నాలుగు రోజులుగా తెగ ఆలోచిస్తోంది. ఎప్పుడూ ఎంతో చలాకీగా పాఠశాలకు వెళ్లే కూతురిలో ఇలాంటి మార్పు ఎందుకొచ్చిందో ఆమెకు అర్థం కావడం లేదు.
***
నిత్యం హుషారుగా వుండే రవి నెల రోజులుగా బడి నుండి రాగానే ముభావంగా వుంటున్నాడు. యాంత్రికంగా హోమ్‌వర్క్ పూర్తిచేయడం, ఆ తర్వాత వౌనంగా గదిలో గడుపుతుండడంతో వాళ్ళమ్మ రజనికి ఏమీ అంతుపట్టడం లేదు. వుండబట్టలేక ఆమె అడిగితే- ‘ఆ స్కూల్ వద్దు, నన్ను వేరే స్కూల్‌కి పంపండి’’ అన్నాడు. కారణం అడిగితే.. ‘మా స్కూల్లో ప్లేగ్రౌండ్ లేదు. నాకు ఆటలంటే ఇష్టం. అక్కడ మాకు ఆటలు ఆడించరు..’ అన్నాడు.
***
... ఇది పావని, రవి వంటి పిల్లల సమస్యే కాదు. ఎందరో పిల్లలు బడి పట్ల అయిష్టతను కలిగి వుండటం సహజం. చాలామంది చిన్నారులు అదివరకు బాగా చదువుకుంటూ, వేళకి బడికి వెళ్లటానికి ఆసక్తి చూపించేవాళ్లు కూడా అకస్మాత్తుగా అనాసక్తి ప్రదర్శించడం జరుగుతూ వుంటుంది. బుద్ధిగా బడికి వెళ్ళే పిల్లల్లో హఠాత్తుగా ఇలాంటి అనాసక్తి, నిర్లిప్తత ఎందుకొచ్చాయో పేరెంట్స్ గమనించాలి. వారిలో మార్పుకి కారణాలను తెలుసుకోవాలి. తగిన కౌనె్సలింగ్ ద్వారా వారిలో మునుపటి ఉత్సాహాన్ని నింపడానికి కృషిచేయాలి. పిల్లలు ఇలా మారడానికి ఎన్నో కారణాలుంటాయి.
క్లాసులు మారేటప్పుడు స్నేహితులలో కొందరు దూరం అయ్యే అవకాశం వుంది. వారితో ఉన్న ఆ అనుబంధం ఒక్కసారిగా దూరం కావటం కొంత బాధను కలిగించవచ్చు. దీంతో బడికి వెళ్లాలంటే ఆసక్తి తగ్గే వీలుంది. స్కూలు వాతావరణంలో కూడా అప్పుడప్పుడు మార్పులు వుంటాయి. తరగతి గదిని మార్చడం, తన సీటును మార్చడం లాంటివి. అంతవరకు గణితం లేదా మరో సబ్జెక్ట్ బాగా చెపుతున్న టీచర్ అకస్మాత్తుగా మారిపోయి మరో కొత్త టీచర్ రావటం.. ఆ కొత్త టీచర్ చెప్పే పాఠాలు అర్థం కాకపోవటం.. రోజూ బడికి తీసుకెళ్ళే వ్యాన్‌లో అప్పుడప్పుడు సీటు దొరకకపోవడం లేదా ఇరుకుగా వుండటం.. స్కూల్ వర్క్, హోంవర్క్‌ల ఒత్తిడి పెరగడం కూడా కారణాలు అవుతుంటాయి.
ఇలా ఏ కారణంగా పిల్లలు స్కూలు పట్ల అనాసక్తి ప్రదర్శిస్తున్నారో గమనించాలి. దానికి అనుగుణంగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సున్నితంగా సమస్యను తెలుసుకుని పరిష్కరించాలి. క్లాసులు మారేటప్పుడు పాతవారు దూరం కావటం, కొత్తవారు రావటం సహజమనే భావన పిల్లల్లో కలిగించాలి. పాతవారి అడ్రసులు, ఫోన్ నెంబర్లు తీసుకొని వారితో స్నేహం కొనసాగించవచ్చునని, కొత్తవారితోనూ స్నేహం పెంచుకోవచ్చునని సున్నితంగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి.
తరగతి గదుల మార్పు, సీట్ల మార్పులు వంటి విషయాలను పెద్దగా పట్టించుకోనక్కరలేదని, అన్నింటికంటే చదువుముఖ్యమని పిల్లలకు తెలియజేయాలి. టీచర్ల మార్పు కూడా సహజమే. ఒకరు వేరే తరగతికి పోయి మరొకరు వచ్చినా వారూ సబ్జెక్ట్ బాగా చెబుతారనే భావన కలిగేలా పిల్లల్లో ధైర్యం నింపాలి. ఇలాంటి విషయాలపై పాఠశాల యాజమాన్యాలు దృష్టి సారించాలి. స్కూల్ వర్క్, హోం వర్క్‌ల్లో ఒత్తిడి గురించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సంప్రదించి, పిల్లలకు తగ్గట్టుగా మార్పులు చేసేలా చొరవ చూపాలి. స్కూల్ వ్యాన్ పిల్లలకు ఇబ్బంది కలిగేలా వుండకూడదని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి పిల్లలు హాయిగా వెళ్ళేట్లు చూసుకోవాలి. ఇక, పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఆటలు ముఖ్యమే. కొంతమంది పిల్లలకి ఆటలపట్ల మక్కువ అధికంగా వుంటుంది. అది గమనించి చక్కటి ప్లేగ్రౌండ్ వుండే స్కూళ్ళలో చేర్పించాలి.
హఠాత్తుగా బడి పట్ల అనాసక్తి కలిగిన పిల్లలను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని అసలు విషయం రాబట్టి దానికి తగిన విధంగా తరుణోపాయం ఆలోచించి సరైన మార్గంలోకి నడిపించాలి. తల్లిదండ్రులే కాదు, ఉపాధ్యాయులు కూడా పిల్లల ఆసక్తిని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారిలోని నిర్లిప్తతను అర్థం చేసుకుని దానికి తగిన విధంగా మార్గదర్శకాలను రూపొందించుకోవాలి. అపుడే పిల్లలు బడిపట్ల ఉత్సాహం చూపుతారు.

-కైపు ఆదిశేషారెడ్డి