క్రైమ్ కథ

చిన్న పగ - పెద్ద పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్మన్ లోగన్ ఏపిల్ పై, కాఫీలకి డబ్బు చెల్లించి తన ట్రేతో కేఫ్టీరియాలోని ఓ టేబుల్ ముందుకి వెళ్లి కూర్చున్నారు. అతనికి దూరంగా ఉన్న విలియం కనపడ్డాడు. వెంటనే నార్మన్ లేచి విలియం టేబుల్ దగ్గరికి వెళ్లి అడిగాడు.
‘నేను ఇక్కడ కూర్చోవచ్చా?’
కేష్ కౌంటర్‌లోంచి తలెత్తి చూసినట్లుగానే విలియం తలెత్తి అతని వంక చాలా మామూలుగా చూసి చెప్పాడు.
‘కూర్చోండి. కానీ ఆ రెండు వందల డాలర్ల మాట మాత్రం ఎత్తకండి’
‘మిస్టర్ విలియం. ఆ రెండు వందల డాలర్లు మీరు నాకు ఎప్పుడు తిరిగి ఇస్తున్నారు?’ కూర్చున్నాక లోగన్ ప్రశ్నించాడు.
‘ఇది పది నెలల కిందటి మాట. నేను ఆ రెండు వందల డాలర్లు మీనించి దొంగతనం చేయలేదని బేంక్ ఆడిటర్స్, మిస్టర్ పింక్సన్ నిర్ధారించారు’ విలియం అభ్యంతరం చెప్పాడు.
‘మీరు దొంగిలించారు. ఆ సంగతి మీకు తెలుసు. ఆ రోజు మూడు వందల ఇరవై నాలుగు డాలర్లు మీకు ఇచ్చాను. కానీ మీరు నూట ఇరవై నాలుగు డాలర్లే నా ఎకౌంట్‌లో క్రెడిట్ చేశారు. మిగిలిన రెండు వందల డాలర్లు మీరు దొంగిలించారు’
‘మీరు ఈ విషయాన్ని వెయ్యిసార్లు చెప్పారు. కాని మీరు ఫిర్యాదు చేసే సమయానికి నా కేష్ టేలీ అయింది’
‘జరిగిన పొరపాటు గ్రహించాక మీరు మీ తప్పుని ఒప్పుకునే బదులు ఆ డబ్బుని జేబులో వేసుకున్నారు. పొరపాటు ఒప్పుకుంటే మీ ఉద్యోగం ఊడచ్చనే భయంతో మీ తప్పుని దాచడానికి నా డబ్బుని దొంగిలించారు’
‘అది మీ కథ మిస్టర్ లోగన్. నేను పొరపడి ఉంటే, వ్యక్తిగతంగా ఈపాటికి ఆ డబ్బుని ఓ కవర్‌లో ఉంచి, మీకు పోస్ట్ చేసేవాడిని’
‘మీకు తగిన శాస్ర్తీ చేస్తాను మిస్టర్ విలియం’ లోగన్ కోపంగా చెప్పాడు.
‘నాకు తెలుసు. ఈ మాటని మీరు గత పది నెలలుగా చెప్తున్నారు. గుడ్‌బై’
ఖాళీ కాఫీ కప్పుని టేబుల్ మీద పెట్టి విలియం బయటికి నడిచాడు.
అతను ఎదురుగా ఉన్న బేంక్‌లోకి వెళ్లడాన్ని కిటికీలోంచి చూస్తూ లోగన్ తన కాఫీని పూర్తి చేశాడు. తర్వాత తను కూడా బేంక్‌లోకి వెళ్లి సేఫ్ డిపాజిట్ బాక్స్‌లోంచి మూడు ఇరవై ఐదు డాలర్ల బాండ్స్ తీశాడు. ఆ డబ్బుతో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టదల్చుకున్నాడు.
అక్కడ ఉన్న ఓ పాత బల్ల ముందు కూర్చుని బాండ్లని నింపి సంతకం చేశాడు. ఆ బల్లకి ఉన్న హేండిల్ లేని దుమ్ము పట్టిన డ్రాయర్ లోగన్ కంటపడింది. చెక్కలో కనిపించే నల్లని చిన్న పగులులా ఆ డ్రాయర్ కనిపిస్తోంది. ఆ డ్రాయర్‌కి ఉన్న రంధ్రాలనిబట్టి అవి ఊడిపోయిన డ్రాయర్ హేండల్స్‌వి అని గ్రహించాడు. ఆసక్తిగా ముందుకి వంగి తన గోళ్లని ఆ పగుళ్లలో ఉంచి నెమ్మదిగా లాగాడు. ఆ డ్రాయర్ సొరుగు మృదువుగా, నిశ్శబ్దంగా బయటికి వచ్చింది. లోపలంతా మురికిగా ఉండి, తుప్పు పట్టిన పేపర్ క్లిప్స్, వెలిసిపోయి పసుపుపచ్చ రంగుకి మారిన కాగితాలు కనిపించాయి. అందులోని డెస్క్ కేలండర్ మీద అక్టోబర్ 2, 1936 అనే తారీఖుని ఓ సాలెగూడు లోంచి చూశాడు. అది అప్పటి నించి మూసే ఉండి ఉంటుందని అనుకున్నాడు.
డ్రాయర్‌ని మూసి, లేచి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ కేబిన్స్ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. మేనేజర్ పింక్సన్ అద్దాల తలుపులోంచి లోగన్‌ని చూసి గుర్తు పట్టి నవ్వాడు. లోగన్ ఆ బాండ్స్‌ని ఆయనకి ఇస్తే, ఇనీషియల్ వేసి చెప్పాడు.
‘కౌంటర్ ఒన్‌కి వెళ్లండి. మిస్టర్ విలియం మీకు నగదుని ఇస్తాడు’
అతను విలియం కౌంటర్ దగ్గరికి వెళ్లాడు.
‘మూడు బాండ్లు. డెబ్బై ఐదు డాలర్లు. దయచేసి వీటిని నా ఎస్‌బి ఎకౌంట్‌లో డిపాజిట్ చేస్తారా? సరైన మొత్తం డిపాజిట్ చేయండి’ బాండ్స్ విలియంకి ఇస్తూ లోగన్ కోరాడు.
‘తప్పకుండా మిస్టర్ లోగన్’
తన పనయ్యాక కౌంటర్ నించి బయటికి వెళ్తూ లోగన్ ఆలోచనగా మరోసారి ఆ దుమ్ము పట్టిన డ్రాయర్ వంక చూశాడు. బస్‌స్టాప్‌కి వెళ్లి బస్సెక్కి యూనివర్సిటీకి వెళ్లే దాకా ఆ డ్రాయర్
గురించే ఆలోచించసాగాడు. అంత శుభ్రమైన బేంక్‌లో అలాంటి మురికి డ్రాయర్ ఉండడం అతన్ని ఆశ్చర్యపరచింది.
బయాలజీ డిపార్ట్‌మెంట్‌లో తన బల్ల ముందు కూర్చుని పరీక్షా పత్రాలని దిద్దుతూండగా లోగన్‌కి అకస్మాత్తుగా మెరుపులా ఆ ఆలోచన కలిగింది. ఆ డ్రాయర్‌ని ఎలా ఉపయోగించుకోవాలా అనే ప్రశ్నకి జవాబు దొరికింది. మొత్తం పథకం ఆ ఆలోచనలో స్ఫురించింది. బేంక్‌లో దొంగతనం చేసి దాన్ని విలియం మీదకి నెట్టడమే అతని పథకం. కొద్ది రోజులపాటు ఆ పథకం గురించి అన్ని కోణాల్లో ఆలోచించి, అది సరైన పథకమే అన్న నిర్ణయానికి వచ్చాడు.
* * *
54 స్ట్రీట్‌లోని ఓ నావెల్టీ అండ్ ట్రిక్ స్టోర్‌కి వెళ్లి లోగన్ ఓ సిగరెట్ పెట్టెని కొన్నాడు. నల్లటి స్టీల్‌లా కనిపించే ఆ ప్లాస్టిక్ పెట్టె పాయింట్ త్రీ ఎయిట్ రివాల్వర్‌ని పోలి ఉంది. ట్రిగర్‌ని నొక్కితే, రివాల్వర్ మీది మూత తెరుచుకుని లోపలి సిగరెట్లు కనిపిస్తాయి. దాన్ని కొని బస్‌లో సెకండ్ అవెన్యూలోని రివాల్వర్స్, రైఫిల్స్ అమ్మే దుకాణంలోకి వెళ్లాడు.
‘పాయింట్ త్రీ ఎయిట్ రివాల్వర్‌ని చూపించండి’ కోరాడు.
‘పర్మిట్ లేకుండా రివాల్వర్స్‌ని అమ్మకూడదు. సల్లివాన్ లా గురించి మీకు తెలుసు అనుకుంటాను’ సేల్స్ మేన్ చెప్పాడు.
‘నేను కొనడానికి రాలేదు. అది దీనిలాగా ఉంటుందేమో చూద్దామని వచ్చాను’ సిగరెట్ కేసుని చూపించి చెప్పాడు.
అతను చిన్నగా నవ్వి కౌంటర్ కింది నించి పాయింట్ త్రీ ఎయిట్ రివాల్వర్‌ని తీసి లోగన్ తెచ్చిన బొమ్మ రివాల్వర్ పక్కన ఉంచాడు. చూడడానికి రెండూ ఒకేలా ఉన్నాయి.
‘మీకో సలహా. మూతని సెలిఫోన్ టేప్‌తో అతికించండి. లేదా దొంగతనం చేస్తూ మీరు ట్రిగర్ నొక్కితే, మూత తెరుచుకుంటుంది. మీరు సిగరెట్‌ని ఆఫర్ చేసి పారిపోవాలి’ అతను నవ్వుతూ చెప్పాడు.
‘్థంక్స్. గుర్తుంచుకుంటాను’ లోగన్ కూడా నవ్వుతూ చెప్పాడు.
‘కావాలంటే నా దగ్గర సెలిఫోన్ టేప్ ఉంది’
‘ప్లీజ్ ఇవ్వండి’ లోగన్ అర్థించాడు.
దాన్ని అతికించాక లోగన్ లెగ్జింటన్ అవెన్యూకి చేరుకున్నాడు. అతను బేంక్‌లోకి ఐదు నిమిషాలు తక్కువ మూడుకి వెళ్లాడు. బూడిద రంగు యూనిఫాంలోని గార్డ్ లోగన్‌ని చూసి, మర్యాదపూర్వకంగా తన టోపీని తాకాడు. బేంక్ రద్దీగా ఉంది. ఆ పాత టేబుల్ ముందు ఎవరూ లేరు. మిస్టర్ పింక్సన్ కేబిన్ ఖాళీగా ఉంది. లోగన్ విలియం కేష్ కౌంటర్ ముందు ఆగాడు.
‘మళ్లీ బాండ్స్ తెచ్చారా మిస్టర్ లోగన్?’ విలియం ప్రశ్నించాడు.
‘లేదు. డిపాజిట్ చేయడానికి వచ్చాను’
తన జీతం చెక్కుని డిపాజిట్ చేసి కస్టమర్స్ వంక చూశాడు. అంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. బల్ల దగ్గరికి వెళ్లి డ్రాయర్ తెరిచి బొమ్మ తుపాకీని, ఐదు డాలర్ల నోట్‌ని చటుక్కున అందులో పడేసి మళ్లీ డ్రాయర్ మూశాడు.
నవంబర్ నెలలో బేంక్‌కి వెళ్లినప్పుడు రెండుసార్లు ఆ డ్రాయర్‌ని తెరచి చూశాడు. బొమ్మ రివాల్వర్, నోటు అలాగే ఉన్నాయి. బేంక్ సిబ్బందిలో ఎవరూ దాన్ని తెరిచి చూడరని అతనికి నిర్ధారణ అయింది.
* * *
డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు ఉదయం పది తర్వాత లోగన్ బేంక్‌కి వెళ్ళాడు. స్పీకర్ లోంచి క్రిస్మస్ కరోస్ పెద్దగా వినపడుతూండడంతో అది తనకి ఉపయోగం అని సంతోషించాడు. సేఫ్ డిపాజిట్ బాక్స్‌లోంచి నాలుగు బాండ్లని తీసి నింపి సంతకం చేశాడు. డ్రాయర్ని తెరిచి అందులోంచి బొమ్మ రివాల్వర్ని తీసుకున్నాడు. విలియంని తన దగ్గరకి రమ్మని సౌంజ్ఞ చేసి ఆ బాండ్స్ ఇచ్చాడు. అతను కూడి చెప్పాడు.
‘మిస్టర్ లోగన్. ఎనభై మూడు డాలర్ల ఏభై సెంట్లు మీకు వస్తాయి’
‘దానికి మరి కొంత మొత్తం కలిపి ఇవ్వండి’ లోగన్ చెప్పాడు.
‘ఏమిటి? ఎందుకు?’
‘పది వేల డాలర్లు. అన్నీ ఇరవై డాలర్ల నోట్లే’
విలియం నవ్వుతూ లోగన్ వంక చూశాడు. లోగన్ చేతిలోని రివాల్వర్ కనిపించగానే అతని నవ్వు ఆగిపోయింది.
‘వెంటనే ఇవ్వు. లేదా...’
విలియంకి గతంలో ఇలాంటి అనుభవం లేదు.
‘మిస్టర్ లోగన్. మీకు డబ్బు అవసరం ఉంటే అప్పిస్తాం...’
‘ముందు డబ్బివ్వు. ఇది నాకూ కొత్తే. భయంతో కాల్చినా కాల్చగలను. కేబిన్‌లోకి వెళ్లి డబ్బు తీసుకురా’ కఠినంగా చెప్పాడు.
‘సరే సరే’
విలియం కేబిన్‌లోకి వెళ్లాక మిస్టర్ పింక్సన్ టెలిఫోన్ మోగింది. రిసీవర్ అందుకుని చెప్పేది విన్నాక అతను నిటారుగా కూర్చున్నాడు. అకస్మాత్తుగా గార్డ్ చేతిలోని తుపాకీని ఎక్కుపెట్టి లోగన్ దగ్గరికి వచ్చి చెప్పాడు.
‘చేతులెత్తు’
‘దేనికి?’
లోగన్ భయం నటిస్తూ చేతులెత్తాడు. విలియం, పింక్సన్, గార్డ్‌లు అతన్ని చుట్టుముట్టారు.
‘జాగ్రత్త లూరుూ. అతని దగ్గర రివాల్వర్ ఉంది’ విలియం గార్డ్‌ని హెచ్చరించాడు.
‘ఇదంతా ఏమిటో నాకు ఎవరైనా వివరిస్తారా?’ లోగన్ ప్రశ్నించాడు.
‘మిస్టర్ లోగన్. అయాంసారీ. విలియం నాకు...’
‘... పదివేల డాలర్లు దొంగతనం చేయబోయావని చెప్పాను’ విలియం కఠినంగా చూస్తూ చెప్పాడు.
‘నేను... నేను ఏం చేసాను?’
‘నాకు రివాల్వర్ చూపించి బేంక్ సొమ్ముని దొంగిలించాలని చూసావు’
వెంటనే లోగన్ మొహంలో ఆశ్చర్యం తొంగి చూసింది. చిన్నగా నవ్వి చేతులు దింపి చెప్పాడు.
‘మిస్టర్ విలియం! మీరు చెప్పింది అబద్ధం’
‘లూరుూ! అతని దగ్గరున్న తుపాకీని తీసుకో’ విలియం గార్డ్‌ని ఆజ్ఞాపించాడు.
వెంటనే గార్డ్ ముందుకి వచ్చి లోగన్ శరీరాన్ని తడిమి చెప్పాడు.
‘ఇతని దగ్గర రివాల్వర్ లేదు మిస్టర్ విలియం’
‘ఉంది. కోట్ జేబులో’
లోగన్ కోటు ఎడమ జేబులో చేతిని పెట్టి వెదికి విలియం చెప్పాడు.
‘ఈ జేబులో లేదు’
‘ఏ జేబులోనూ లేదు. నా దగ్గర రివాల్వర్ లేదు. కావాలంటే వెతుక్కోవచ్చు’ లోగన్ చెప్పాడు.
‘ఉండాలి. నేను చూశాను. ఇక్కడే ఎక్కడో ఉండాలి’ అతని కోటు జేబులన్నీ వెదికి విలియం టేబుల్ చుట్టూ తిరుగుతూ చెప్పాడు.
‘నేను నా దుస్తులన్నీ విప్పదీసే ప్రదేశం ఏదైనా ఈ బేంక్‌లో ఉందా?’ లోగన్ వెంటనే అడిగాడు.
అప్పటికే కస్టమర్స్ అంతా వారి చుట్టూ చేరారు.
‘ఆ అవసరం లేదు మిస్టర్ లోగన్. లూరుూ, విలియంలు వెదికారు. మీ దగ్గర రివాల్వర్ లేదు. లూరుూ! నీ తుపాకీని కిందికి దింపు’ పింక్సన్ చెప్పాడు.
‘మిస్టర్ పింక్సన్! నేను చెప్పేది నమ్మండి. నాకు తుపాకీ చూపించి..’
‘విలియం. నువ్వు చెప్పేది నమ్మడం కష్టం. డబ్బేమీ లేదు. ఇంకా మిస్టర్ లోగన్‌ని ఇబ్మంది పెట్టడం సబబు కాదు.
‘కానీ మిస్టర్ పింక్సన్, ఇతని దగ్గర రివాల్వర్...’
‘విలియం! నువ్వు నీ కౌంటర్‌కి వెళ్లు’ పింక్సన్ కోపంగా చెప్పాడు.
‘ఇది ఎవరి పొరపాటో కాని నేను పోలీసులకి ఫిర్యాదు చేస్తాను. దయచేసి వారిని పిలవండి’ లోగన్ కోరాడు.
‘కానీ అది మా బేంక్‌కి బేడ్ పబ్లిసిటీ అవుతుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి’ పింక్సన్ అర్థించాడు.
‘సరే. ఎందుకనో విలియం నా చేతిలో రివాల్వర్ ఉందని భ్రమ పడ్డాడు. మామూలు వాళ్లు కూడా ఒక్కోసారి భ్రమపడటం జరుగుతుంది. నా ఎనభై మూడున్నర డాలర్లు ఇస్తే నేను వెళ్తాను’
బయటికి వచ్చాక లోగన్ చిన్నగా ఈల వేస్తూ తన పథకంలోని మొదటి భాగం విజయవంతమైందని ఆనందిస్తూ బస్ స్టాప్ వైపు నడిచాడు.
* * *
తర్వాత కొన్ని వారాలు లోగన్ బేంక్‌కి వచ్చినప్పుడల్లా విలియంతో ఏం జరగనట్లే ప్రవర్తించాడు. విలియం మాత్రం అతన్ని చూడగానే భయంతో వణికిపోతూ, ఒక్కోసారి లెక్క తప్పు చేయసాగాడు.
‘నా దగ్గర విలియం మళ్లీ రివాల్వర్‌ని చూసినట్లు ఎందుకు వణికిపోతున్నాడు?’ మిస్టర్ పింక్సన్‌ని లోగన్ ప్రశ్నించాడు.
‘క్రితం నెల జరిగిన ఆ సంఘటన తర్వాత విలియం త్వరగా అప్సెట్ అవుతున్నాడు’
‘బేంక్ ఉద్యోగి భ్రమలకి లోనవడం మంచిది కాదు. ముఖ్యంగా కేష్ కౌంటర్‌లో కూర్చున్నవాడు. అతను దీంట్లోంచి త్వరగా బయటికి వస్తే బావుండు’
‘మీ భావాలు నాకు తెలుసు మిస్టర్ లోగన్. అతను వృద్ధిలోకి వస్తాడనుకున్నాను’
* * *
మార్చి పదో తారీఖున నార్మన్ లోగన్ తన పథకంలోని ఆఖరి భాగాన్ని అమలుపరిచాడు. అతను టేబుల్ ముందు కూర్చుని ఉండగా డబ్బుతో వచ్చిన విలియంని చూసి, మళ్లీ డ్రాయర్లోంచి తీసిన బొమ్మ రివాల్వర్‌ని చూపించి అత్యంత కఠినంగా చెప్పాడు.
‘పదివేల డాలర్లు తీసుకురా. ఈసారి నిజంగా. మేనేజర్‌కి కాని చెప్పావో గుండు నీ గుండులోకి వెళ్తుంది’
విలియం కేష్ కౌంటర్‌లోకి వెళ్లి పదివేల డాలర్లని తీసుకువచ్చాడు. ఈసారి పింక్సన్ ఫోన్ మోగలేదు. గార్డ్ ముందు అలారం లైట్ కూడా వెలగలేదు. అతను చూస్తూండగా ఆ డబ్బుని బ్రీఫ్ కేస్‌లో ఉంచి కఠినంగా చెప్పాడు.
‘విలియం విను. నేను పారిపోయే కారు బయట సిద్ధంగా ఉంది. నేను బేంక్‌లోంచి బయటికి వెళ్లేలోగా క్రితంసారిలా చేస్తే నీ గుండెలో గుండు దిగుతుంది. వెళ్లు. వెళ్లి ఏం జరగనట్లుగా కూర్చో’
అతను వెనక్కి తిరగ్గానే బ్రీఫ్ కేస్‌లోని డబ్బుని, రివాల్వర్‌ని డ్రాయర్‌లో భద్రపరచి లేచాడు.
నింపాదిగా బయటికి వచ్చి బస్టాప్‌లో నిలబడ్డ లోగన్‌కి బర్గ్‌లర్ అలారం శబ్దం గట్టిగా వినిపించింది. గార్డ్, పింక్సన్, విలియం, అసిస్టెంట్ మేనేజర్లు లోగన్ దగ్గరకి వచ్చారు. మళ్లీ గార్డ్ తుపాకీని ఎక్కుపెట్టాడు. గతంలో జరిగినట్లుగానే అంతా జరిగింది. అయితే ఈసారి విలియం దగ్గర పదివేల డాలర్లు నగదు నిజంగా మాయమైంది.
‘ఈసారి నేను సిద్ధంగా ఉన్నాను. ఇరవై డాలర్ల నోట్ల మీద నా ఇనీషియల్స్ చేశాను. ఆ కట్ట అతని బ్రీఫ్‌కేస్‌లో ఉంది’
‘విలియం! నేను దొంగైతే బస్ కోసం వేచి ఉంటానా? నువ్వు ననె్నందుకు ఇరికించాలని అనుకుంటున్నావో నాకు అర్థం కావటంలేదు’ లోగన్ అసహనాన్ని ప్రదర్శిస్తూ అడిగాడు.
‘ఎవరిది నాటకమో తేలుతుంది’ చెప్పి విలియం అతని బ్రీఫ్‌కేస్‌ని లాక్కుని తెరిచాడు.
ఒక్క సెంట్ కూడా లేదు. ఖాళీ. విలియం దాన్ని గోడకేసి కొట్టి లోగన్ చొక్కా కాలర్ని పట్టుకుని గట్టిగా ఊపుతూ అరిచాడు.
‘కానీ ఇప్పుడే నీకు డబ్బిచ్చాను. దాన్ని నువ్వు బ్రీఫ్‌కేస్‌లో పెట్టడం నేను చూశాను’
‘విలియం! ఆపు’ పింక్సన్ అరిచాడు.
గార్డ్ లోగన్ పేంట్, కోటు జేబులని వెదికాడు. డబ్బు లేదు.
‘డబ్బు ఎక్కడ దాచాడో నాకు తెలుసు. చూపిస్తే ఎవరు అబద్ధమాడుతున్నారో తేలిపోతుంది’ అరిచి విలియం బేంక్‌లోని బల్ల దగ్గరికి పరుగెత్తుకెళ్లి దాని మీది డిపాజిట్ స్లిప్స్‌ని కిందకి తోసేశాడు. బల్లని ఆకుపచ్చ రంగు కార్పెట్ మీదకి పడేసి ఒంగుని కార్పెట్ మీద చేత్తో తడమసాగాడు. దుమ్ము పైకి లేచింది. చాలామంది దూరం నించి జరిగేది చూస్తున్నారు. డ్రాయర్ అరంగుళం తెరుచుకోవడం లోగన్ చూశాడు. కింద కూర్చున్న విలియంకి తెరచుకున్న సొరుగు కనపడలేదు.
‘మిస్టర్ పింక్సన్. విలియం ప్రమాదకరమైన మనిషి. అతన్ని మీరే శాంతింపజేయాలి’ చెప్పి లోగన్ పింక్సన్‌ని చెయ్యి పట్టి తీసుకెళ్లాడు. ఆయనని కొద్దిగా తోయడంతో ఆయన శరీరం సొరుగుని తగిలి అది మూసుకుంది.
‘మిస్టర్ పింక్సన్. మీరు నన్ను నమ్మాలి’ విలియం ఏడవసాగాడు.
‘లోగన్ చేతిలో రివాల్వర్ చూపించినప్పుడు సీక్రెట్ అలారం బటన్‌ని ఎందుకు నొక్కలేదు?’ పింక్సన్ అడిగాడు.
‘క్రితంసారి నన్నంత మూర్ఖుడనుకున్నారు. కాబట్టి నేనీసారి రుజువు చేయాలనుకుని అతను బేంక్ దాటేదాకా ఆగాను’
‘కానీ క్రితంసారి నీది భ్రమ. పదివేలు మాయమయ్యాయి. ఇప్పుడు ఇది భ్రమ కాదు. నీ మనసులో ఏదో అయోమయం జరుగుతోంది’
‘బహుశా విలియం ఇక బేంక్ ఉద్యోగానికి పనికిరాడని నా అభిప్రాయం’ లోగన్ చెప్పాడు.
‘బహుశాని కొట్టేయండి’ పింక్సన్ చెప్పాడు.
విలియం చెల్లాచెదురు చేసిన డిపాజిట్ స్లిప్స్, పెన్స్ ఏరడంలో లోగన్ అసిస్టెంట్ మేనేజర్‌కి సహాయం చేశాడు. ఇద్దరూ కలిసి టేబుల్‌ని యధాస్థానంలో ఉంచారు.
మర్నాడు లోగన్ బేంక్‌కి వచ్చాడు. విలియం కేష్ కౌంటర్‌లో లేడు. డిపాజిట్ స్లిప్‌ని నింపి డ్రాయర్‌ని తెరిచి, బొమ్మ రివాల్వర్‌ని, డబ్బు కట్టని తన కోటు జేబులో ఉంచుకుని బయటికి వెళ్తూంటే, పింక్సన్ ఎదురుపడి చెప్పాడు.
‘ఘోరం! ఘోరం!’
‘ఏమిటి?’ లోగన్ శాంతంగా అడిగాడు.
‘హాస్పిటల్‌లోని డాక్టర్స్‌తో నేను మాట్లాడాను. అతనికి పిచ్చి లేదని రిలీజ్ చేశారు. విలియం అన్ని ప్రశ్నలకి చక్కటి జవాబులు చెప్పాడు. ‘డబ్బెక్కడుంది?’ అన్న ప్రశ్నకి మాత్రం మీ బ్రీఫ్ కేస్‌లో ఉందని మాత్రమే చెప్తున్నాడు’
‘అతనికి నా సానుభూతి. డబ్బెక్కడుందో అతనికి తెలీదేమో’ డబ్బున్న కోటు జేబులో చేతిని ఉంచుకుని లోగన్ చెప్పాడు.
తన అపార్ట్‌మెంట్‌కి వెళ్లాక లోగన్ అద్దెకి తెచ్చిన పోర్టబుల్ టైప్‌రైటర్‌లో ఓ కాగితం మీద ఇలా టైప్ చేశాడు.
‘డియర్ మిస్టర్ పింక్సన్. నేను డబ్బుని తిప్పి పంపుతున్నాను. ఐయాంసారీ. కొద్దికాలంగా నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావడంలేదు’
విలియం ట్రిక్స్ ఇనీషియల్స్ డబ్ల్యు.టి. అని టైప్ చేశాడు. లోగన్ ఆ కాగితం మీది, నోట్ల కట్ట మీది తన వేలిముద్రలని తుడిచి, వాటిని ఓ కాగితంలో చుట్టాడు. ఆ డబ్బు ఉంచేసుకుంటే? అని క్షణకాలం అనిపించింది. కానీ తన పథకం నించి పక్కకి మళ్లడం ఇష్టంలేక, విలియం ట్రిక్స్ అపార్ట్‌మెంట్ సమీపానికి కారులో వెళ్లి అక్కడ నించి పింక్సన్‌కి. బేంక్ అడ్రస్‌కి దాన్ని పోస్ట్ చేశాడు.
మర్నాడు పింక్సన్ నించి లోగన్‌కి ఫోన్ వచ్చింది.
‘సమస్య సమసిపోయింది. విలియం తను దొంగిలించిన డబ్బుని తిప్పి పంపాడు. దాంతో మా పోలీస్ కేస్‌ని విత్‌డ్రా చేసుకున్నాం. అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాం. డబ్బు దొంగిలించాననే కాక, తిప్పి పంపానని కూడా అతను అంగీకరించడం లేదు’
‘అతనేం చేస్తున్నాడో అతనికి తెలిసి చేయడం లేదని నా అభిప్రాయం’
‘అవును. ఉత్తరంలో కూడా అదే రాశాడు. మిస్టర్ లోగన్! మీకు కలిగిన ఇబ్బందికి మిమ్మల్ని కలిసి క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను’
‘ఇబ్బందేమీ లేదు’ జవాబు చెప్పి లోగన్ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు.
*
(హేరీ మూహైమ్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి