జాతీయ వార్తలు

మొబైల్ ఫోన్లలో ఇక ‘ప్యానిక్’ బటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలకు భద్రత పెంచేందుకు మొబైల్ కంపెనీలను ఒప్పించిన మేనకా గాంధీ
పాతవాటిలో కూడా ఏర్పాటు చేసుకునే వీలు
మార్చికల్లా అందుబాటులోకి సదుపాయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఇకపై ప్రమాదంలో ఉండే మహిళలకు పోలీసు సాయం క్షణాల్లో అందనుంది. ఎమర్జెన్సీ అలర్ట్‌లు పంపించడానికి వచ్చే ఏడాది మార్చిలోగా మొబైల్ సెట్లలో ఒక బటన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి మేనకా గాంధీ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలను ఒప్పించడంతో ఇది సాధ్యమవుతోంది. దీనికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను టెలీ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ త్వరలోనే విడుదల చేస్తుందని మేనకా గాంధీ చెప్పారు. మొబైల్ ఫోన్ల తయారీదారుల అంగీకారంతో ఖరారు చేస్తున్న ఈ ప్రణాళిక వల్ల మహిళా భద్రతకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్త మొబైల్ ఫోన్లలోనే కాకుండా ఇప్పుడున్న పాత ఫోన్లలో కూడా ఈ అదనపు ఫీచర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ‘ఈ చర్యను ఖరారు చేయడానికి మాకు ఏడాది పట్టింది. మొబైల్ కంపెనీలతో మేము అనేక సమావేశాలు నిర్వహించాం. మొబైల్ ఫోన్లలో ప్యానిక్ బటన్లను ఏర్పాటు చేయడానికి వారు ఎట్టకేలకు అంగీకరించారు’ అని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ చెప్పారు. తాను ప్రమాదంలో ఉన్నట్లు ఏ మహిళ అయినా భావించినప్పుడు ఆమె చేయవలసిన పనల్లా తన మొబైల్ ఫోన్‌లోని పానిక్ బటన్‌ను నొక్కడమే. అది వెంటనే పోలీసులకు ఒక మెస్సేజిని పంపిస్తుంది’ అని వివరించారు.
కొత్త మొబైల్ ఫోన్లలో తయారు చేసేటప్పుడే ఇలాంటి బటన్ నిర్మాణం ఉంటే ఇప్పటికే ఉన్న మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కౌంటర్లలో కస్టమర్లు ఈ అదనపు సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ వాడకందార్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని అదనపు బటన్‌ను ఏర్పాటు చేసుకోవడానికి దేశవ్యాప్తంగా కనీసం 10వేల సెంటర్లను ఏర్పాటు చేయాలని తాము మొబైల్ ఫోన్ కంపెనీలను కోరినట్లు మేనకా గాంధీ చెప్పారు. ఇప్పుడున్న, అలాగే కొత్తగా వచ్చే ఫోన్లలో ఈ అదనపు బటన్‌ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన సాంకేతిక పరిష్కారాలపై మొబైల్ కంపెనీలు ఇప్పుడు దృష్టిపెట్టి ఉన్నాయని ఆమె తెలిపారు.
ఇదే కాకుండా మహిళల భద్రతకు సంబంధించి మహిళా, శిశు సంక్షేమ శాఖ తీసుకుంటున్న చర్యల్లో ప్రమాదంలో ఉండే మహిళలకు సాయం అందించడానికి దేశవ్యాప్తంగా ఒకే విధమైన హెల్ప్‌లైన్‌ను ప్రారంభించడం కూడా ఉంది. కష్టాల్లో ఉండే మహిళలకు పోలీసుల పరంగా, న్యాయపరమైన, వైద్యపరమైన, అలాగే కౌనె్సలింగ్ సహాయం అందించే ఒన్‌స్టాప్ సెంటర్లతో ఈ హెల్ప్‌లైన్ కార్యకలాపాలను అనుసంధానం చేస్తారు. అలాగే కమ్యూనిటీ పోలీసింగ్‌లో చదువుకున్న యువతులు పాలుపంచుకోవడానికి గ్రామాల్లో స్పెషల్ పోలీసు వలంటీర్లను ఏర్పాటు చేయడానికి ఒక పథకాన్ని కూడా మంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది. పోలీసులకు, గ్రామాల్లోని మహిళకు వారధిలాగా పనిచేయడంతో పాటుగా అన్ని రకాల హింసల విషయంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ మహిళా వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు.