పర్యాటకం

కామితార్థ ప్రదాయని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆద్యంతాలకు కారణభూతురాలు, సర్వసృష్టి నియంత, తన కనుసన్నల్లోనే ముల్లోకాలను ఆజమాయిషీ చేస్తూ చల్లగా చూచే తల్లిగా కీర్తింపబడే ఆదిపరాశక్తినే అనేక రూపాలతో, అనేక నామాలతో తన్ను తాను సృజించుకొంది.
తన బిడ్డలను, తన భక్తులను కాపాడడానికే ఆమెను ఆమె ముగ్గురమ్మలుగా తీర్చిదిద్దుకొంది. ముక్కంటిని తన నాథునిగా చేసుకొంది. తానే లక్ష్మి అయి వైకుంఠాధిపతిని లక్ష్మీపతిని చేసింది. సత్యలోకానికి సరస్వతిగా వెళ్ళి బ్రహ్మను వాణీపతిని చేసింది.
వరప్రభావంతో విర్రవీగుతూ కన్ను మిన్ను కానక సజ్జనులను, దేవతలను భయభ్రాంతులను చేసే అజ్ఞానులైన రాక్షసులను ఏరిపారేసింది. వారికంటిమీద కునుకు రాకుండా చేసింది. అట్లా ఎనె్నన్నో చేసినా సృష్టే తానే అయినా సర్వుల్లోను తానే ఉన్నా మళ్ళీ తన సృష్టిలోని ప్రాణులను సంరక్షించడానికి అడుగడుగునా నిలిచింది. మానవులను సృజియించింది. వారికి వాక్కు, విచక్షణ జ్ఞానాలను ఇచ్చింది. అమ్మ ఇచ్చిన శక్తితోనే మానవుడు ఆ అమ్మకోసం శక్తిపీఠాలను నెలకొల్పి పూజిస్తున్నాడు. ఆ అమ్మ కోసమే దేవాలయాలను నిర్మించి, అమ్మను దేవీగా ఆరాధిస్తున్నాడు. ఆ మానవుడే తన్ను ఎల్లవేళలా రక్షించి, కాపాడమని గ్రామదేవతగానూ నిలిపి అర్చిస్తున్నాడు.
ఆ గ్రామ దేవతనే జ్ఞానశక్తులను ప్రసాదించే గాయత్రీదేవిగాను, ఓంకారరూపిణిగాను, మణి ద్వీపంలో వెలిగే మణిదీపేశ్వరిగాను స్నిగ్ధదృష్టులతో సమస్త విశ్వాన్ని రక్షించే మహాలక్ష్మినే నేడు శ్రీకాకుళం జిల్లా, కవిటి మండల కేంద్రంలో చింతలు బాపే చింతామణిగా నెలకొందని అమ్మభక్తులు చేతులెత్తి మొక్కుతారు. చింతామణి తల్లి భక్తుల కోర్కెలు, బాధలు(చింతలు) తీర్చే ఇలవేల్పుగా ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా పూజలు అందుకుంటుంది. ఈ అమ్మ దర్శనార్థం జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాలైన ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
ఈ తల్లి లీలలను, మహిమలను ఇక్కడి స్థలపురాణం వివరిస్తుంది. ఈ అమ్మ గురించి అనేక మహిమోపేతమైన గాథలను స్థానికులు చెప్తుంటారు. మొట్టమొదట- ప్రస్తుతం ఆలయం వెలిసి ఉన్న ప్రదేశానికి కూతవేటు దూరంలో ఒక మర్రిచెట్టు నీడనఅమ్మను అమ్మోరుగా కొలిచేవారు. ఈ మర్రి చెట్టు చెంతనే జిల్లా వాసులంతా వచ్చి అమ్మను కొలిచి వారు నైవేద్యంగా తెచ్చిన పదార్థాలను అమ్మకు నివేదించి తర్వాత అమ్మ ప్రసాదంగా అందరూ పంచుకుని తినేవారట. ‘సాంత్య’ తెగకు చెందిన ‘జన్ని’లుగా పేరొందిన వారు అమ్మకు నిత్యం పూజచేసే పూజారులుగా ఉండేవారు. ఓ మంగళవారం రోజున భక్తులు తమ మొక్కుబడులను తీర్చేందుకు సంబరంగా వారి ఇంటి వద్ద నైవేద్యాలను తెచ్చి అమ్మను తనివితీరా పూజించి యథాప్రకారం ఇంటికి వెళ్లారట. కాని వారు వెళ్ళేటప్పుడు అమ్మ ప్రాంగణంలో ఓ చెంబును మరిచిపోయారు. తెల్లవారు జామున మామూలుగా అమ్మను పూజించడానికి వచ్చిన పూజారి అక్కడ- అమ్మవారు తనను ఎల్లవేళలా సేవిస్తూ తాను చెప్పిన పనులను చేసే తన భటులకు ప్రసాదం వడ్డిస్తుండడం చూశాడట. ఆ దృశ్యాన్ని చూచిన జన్ని(పూజారి) శరీరం ఒక్కమాటుగా జలధరించింది. అమ్మను చూచిన చర్మచక్షువులు ఆనందం, భయం రెండు మిళతమై జలజలా కన్నీళ్ళురాల్చాయట. అమ్మా అని అనాలోచితంగా అంటూ చేతులెత్తి మొక్కాడట. తన్ను చూచి ఆనందించే ఆ భక్తుని అమ్మ కరుణించింది. జన్నిని చూచింది. అమ్మ దయకు పాత్రుడైన జన్ని ఇంకా అమ్మనే చూపుమర్చలకుండా చూస్తునే ఉన్నాడు. అప్పుడమ్మ కిందట రాత్రి వారు మరిచి వెళ్ళిన చెంబును దూరంగా విసిరి ‘ఓ జన్నీ! నీవు ఇక మీదట ఆ చెంబు పడిన చోటునే నాకు ఓ దేవాలయాన్ని నిర్మించు. ఇకనుంచి మిమ్ము ఆ దేవాలయం నుంచే కాపాడుతాను. నేను వచ్చి ఆ దేవాలయంలో కొలువుతీరుతాను’ అని ఆదేశించిందట.
అమ్మ మాటలను విని ఇహలోకంలోకి వచ్చిన జన్ని అమితానందోత్సవాలతో అమ్మను కనులారా వీక్షించిన ఆనందంతో ఊరిలోకి వెళ్ళి తానుచూచిన అద్భుతాన్ని వివరించాడు. ఊరివారందరూ కలసి అమ్మ ఆదేశం మేరకు ఇపుడున్న ఆలయ నిర్మాణం చేశారు. పాత్రనే అమ్మరూపంగాను, మూల విరాట్‌గాను భావించి కొలుస్తున్నారు. ప్రభుత్వ సిజిఆర్ నిధులతో అమ్మవారి మందిరం చుట్టూ మండపాన్ని కూడా నిర్మించారు. భక్తుల విరాళాలతో భజన మందిరం వంటి ఇతర వసతులను ఏర్పాటు చేశారు. ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచవలసిన అవసరం ఉందని ఇక్కడి నివాసితుల అభిప్రాయం. ప్రతి మంగళవారం నాడు అమ్మకు మొక్కుకున్న భక్తులు తమ బాధలు తీరాక నెయ్యిలు, బెల్లం లేక పంచదారతో చేసిన పానకాన్ని అమ్మవారికి తెచ్చి నివేదన చేసి, అమ్మ ఆశీర్వాదం లభించిందని, సంబరం జరుపుతారు.
అమ్మ ప్రసాదించిన ఈ మానవ జన్మ సార్థకం చెందాలన్న భావనతో తమ తమ శక్తి మేరకు మేళతాళాలతో అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ ఉత్సవాల్లో వివిధ రకాలైన జానపద కళారూపాలు ప్రదర్శించి, అమ్మను భక్తులను ఆనందింపచేస్తారు. ఈ కార్యక్రమాలతో భక్తులు తమ ఇంటి వద్ద నుంచి అమ్మవారి రూపాన్ని భక్తిశ్రద్ధలతో తలపై పెట్టుకుని గ్రామంలో ఊరేగిస్తూ కవిటిలోని కోవెలకు చేరుకుంటారు. ఆపై అక్కడ అమ్మను తనివి తీరా పూజించి, ఆ ఆనందంతో ఇళ్ళకు వెళ్ళి అమ్మకు ప్రీతినిచ్చే విధంగా వారు జీవనయానం సాగిస్తారట. ఈ అమ్మను దర్శించిన వారికి ఈలోకంలో సంపదలతోపాటు పరలోక సంపదలు ఒనగూరుతాయని భక్తుల విశ్వాసం.

- గున్న కృష్ణమూర్తి