పర్యాటకం

అలంపురం జోగులాంబ సౌభాగ్యాల రాశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లంబస్తనీం, వికృతాక్షీం, ఘోరరూపాం, మహాబలాం!
ప్రేతాసన సమారూఢాం, జోగుళాంబాం నమామ్యహం!
అని స్తుతించబడే జోగులాంబ అమ్మవారు ప్రతిష్ఠితమైన స్థలం అలంపురం.
శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారం, శ్రీ జోగుళాంబా బ్రహ్మేశ్వర దంపతుల విహార నిలయం, ఉత్తర వాహినీ తుంగభద్రా తీరం, దక్షిణ కాశీ ఇలా ఎన్నింటికో ప్రసిద్ధిచెందిన శైవ పీఠం అలంపుర క్షేత్రం. అష్టాదశపీఠాల్లో ప్రముఖమైంది. భక్తులచేత సేవించబడుతోంది. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల, కొన్ని అసాంఘిక శక్తుల వల్ల ఈ అమ్మవారి దేవాలయం కొన్నాళ్లు ధూపదీప నైవేద్యాలకు దూరంగా ఉంది. కాని అమ్మశక్తితో తిరిగి ఈ దేవాలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించిన అమ్మవారి ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిశంకరులు సందర్శించి శ్రీచక్రాన్ని ప్రతిష్టించినట్టు జనశృతి. ఇక్కడి అమ్మవారిని జోగుళాంబా దేవిగా కొనియాడుతారు. శక్తి స్వరూపిణి అయిన జోగుళాంబా అమ్మవారి ఆశీస్సులందుకున్న వారికి ఎలాంటి కీడు జరగదన్న విశ్వాసం నమ్మకం ఇక్కడివారిలో బలంగా కనిపిస్తుంది. అష్టాదశ పీఠాల్లో ఐదవదైన అలంపురంగా ఈ తల్లి ప్రసిద్ధివహించింది.
‘‘అలంపుర్యాం జోగుళాంబా, శ్రీశైలే భ్రమరాంబికా..’’ అని అష్టాదశ పీఠనామావళి ఈ తల్లి కీర్తిని దశదిశలా చాటుతోంది.
‘‘మహాయోగ పీఠస్థలే తుంగుభద్రా!
తటే సూక్ష్మకాశ్యాం, సదా సంనసంతీం!
మహాయోగి బ్రహ్మేశ వామాంక సంస్థాం!
శరచ్చంద్ర బింబాం భజే జోగుళాంబాం!!
అని జోగుళాంబఅష్టకం తల్లిని స్తుతి చేస్తే చాలు తల్లి కరుణాకటాక్షం తప్పక కలుగుతుంది.
యోగీశ్వరీ, యోగినీశ్వరీ, జోగీశ్వరీ అనే పేర్లు కూడా ఈ జోగుళాంబాదేవికే తగినవి అని ఇక్కడి నివాసితులు చెప్తారు.
ఈ దేవీ ఇక్కడ దర్శనం ఇస్తున్న రూప లక్షణాలను పరిశీలిస్తే ఈ తల్లి భీకర మూర్తికాక, సౌజన్యమూర్తిగా దర్శనమిస్తుంది. అంతేకాదు ప్రేతాసనీయై, దిగంబరిగా ఉన్న ఈ దేవి తాంత్రికులకు, యోగులకు, శక్తి ఉపాసకులకు ఆరాధ్య దైవం.
అమ్మవారిని తంత్ర దేవతగా తాంత్రికులు ఇక్కడ ఎక్కువగా వచ్చి తల్లిని పూజిస్తుంటారని ఇక్కడి వారు చెబుతుంటారు. అలంపురంలో 7వ శతాబ్దం నాటికే బ్రహ్మపురి విశ్వవిద్యాలయం ఉన్నట్టు శాసన ఆధారాలు ఉన్నాయి. అమ్మవారి ఆలయంతోపాటు ఇక్కడ ప్రధాన ఆలయం బాల బ్రహ్మేశ్వర ఆలయం. ఇక్కడి లింగాన్ని రసలింగంగా స్కాందపురాణం పేర్కొంటుంది.
తంత్ర గ్రంథాలు, స్థలపురాణాలు, చారిత్రక ఆధారాల ద్వారా కదంబవనంలో జలగుండం మధ్యలో జోగుళాంబాదేవీ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. అమ్మవారి విగ్రహం నుదటిమీద తేలు, బల్లి ఉండటం యోగ తాంత్రిక చిహ్నమని చెబుతారు.
పవిత్ర తుంగభద్రానది ఒడ్డున విశాలమైన ప్రాంగణంలో అత్యంత సుందరంగా నిర్మించిన ఆలయంలో ప్రస్తుతం జోగుళాంబ అమ్మవారు నిత్య పూజలందుకుంటున్నారు. ఇక్కడి ప్రకృతి అమ్మవారి ప్రశాంత వదనం భక్తుల్లో కోటి ఆశలను కలిగిస్తాయ. కాని ఇక్కడ యాత్రీకులకు తగిన వసతి సదుపాయాలు అంతగాలేవు. వాటిని అభివృద్ధి పరిస్తే మరింతగా భక్తుల రాకపోకలు జరుగుతాయని ఇక్కడివారు చెబుతారు.
దసరా నవరాత్రుల్లో అమ్మవారికి వివిధ సేవలతో పాటుగా నవఅలంకారాలు చేసి పెద్దఎత్తున పూజాదికాలు సమర్పిస్తుంటారు. దసరా నవ రాత్రుల్లో అమ్మను దర్శించుకోవడం అంటే పూర్వ జన్మపుణ్యఫలంగా చెబుతారు.
హైదరాబాద్ నుంచి కేవలం 210 కి.మీ దూరంలో కర్నూలుకు అతి సమీపంలో అలంపురం క్షేత్రముంది. జోగుళాంబా బాలబ్రహ్మేశ్వర ఆలయాలతోపాటు నవబ్రహ్మాలయాలు, ఇంకా మరెన్నో చారిత్రక కట్టడాలను కాపాడుకుంటూ వస్తున్న అలంపురం సందర్శన నిజంగా ఓ మరపురాని అనుభూతిని మిగులుస్తుంది.
ఒకరోజులోనే అలంపురంకు పోయి రావచ్చు. ఎక్కడా లేనివిధంగా అలంపురంలో నవావరణ విధానంలో అమ్మవారికి పూజలు చేస్తారు. ప్రతిరోజు నిత్యపూజలు ప్రత్యేక సందర్భాలల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. కుంకుమ పూజలు ఇక్కడి ప్రసిద్ధి అమ్మవారిని దర్శనం చేసుకొన్నవారికి అపమృత్యు దోషాలు అంటవని, దీర్ఘ సుమంగళులుగా ఉంటారని కుటుంబ సమేతంగా వచ్చి అందరూ అమ్మను దర్శనం చేసుకొంటారు.

- చోడిశెట్టి శ్రీనివాసులు