పర్యాటకం

భాగ్యనగరాన... సిరులిచ్చే శ్రీనివాసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వం జగన్నాథం. జగన్నాథుడు లేని విశ్వాన్ని వూహించలేం. అన్నింటా తానైఅన్నీ తానై ఉన్నవాడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, కర్త కర్మక్రియ మూడింటిని స్వయంగా నడిపించేవాడే జగన్నాథుడు. అన్నీ తానై ఉండి కూడా రూపనామాలు లేనివాడుగా, నిస్సంగుడుగా, నిర్విచారుడు, నిర్వికల్పుడుగా అగోచరంగా ఉంటాడు. ఆ అగోచరుడే గోచరుడై అర్చామూర్తిగా అర్చనలందు కుంటాడు. తన్ను ఆరాధించువారి మనోకామనలు తీర్చే భగవత్స్వరూపుడుగా భాసిస్తాడు. భక్తుల కోసం తన్ను తాను అనేకానేక విధాలుగా సృజియంచుకుంటాడు.అది ఇది అనేదే లేకుండా భక్తుల కోసం పరుగెత్తువచ్చువానిగా ఆర్తిజన బాంధవుడిగా వ్యక్తమవుతాడు.
అటువంటి పరంధాముడు అన్ని యుగాలను కల్పించి ఆయా యుగాలల్లో తన్ను తాను ప్రత్యేకంగా సృజియంచుకున్నాడు. తన్ను నమ్మిన వారికి ఇహపరసుఖాలనే కాదు తన సాయుజ్యాన్ని ప్రసాదించాడు. ఆ పరమాత్మనే సస్వరూపుడై కలియుగంలో వేంకటేశ్వరుడై వేదనలను దూరం చేస్తానని తిరుమల కొండపై నిలిచాడు. భక్తులతో స్వయంగా వ్యక్తరూపుడై మాట్లాడాడు. నిలువెత్తు మూర్తిరూపంలో ఉంటూ నేడు తన్ను నమ్మి కొలిచినవారికి కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు.
ఆ కలియుగ స్వామి భక్తుల కోరిక మేరకు వాడవాడలా విస్తరించాడు. అన్ని రాష్ట్రాల్లోనే కాదు, దేశవిదేశాల్లో భక్తుల కోరిక మేరకు తనకోసం ప్రత్యేకాలయాలను నిర్మింపజేసు కొంటు న్నాడు. తన భక్తులకు కోరిన సిరులిచ్చి శ్రీనివాసుడుగా ఖ్యాతి గాంచుతున్నాడు.
శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే ఏడుకొండలు ఆదిశేషుడి ఏడుతలలపై నిలిచి ఏడుకొండలవాడిగా భక్తులు భక్తిప్రపత్తులతో పిలుచుకునే శ్రీవేంకటేశ్వరుడు ఆనందనిలయంలో వేంచేసి భక్తులను అలరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరంలో భాగ్యాలనిస్తానంటూ తనకుతానై తరలివచ్చి తుర్క యాంజాల్‌లో శ్రీ ఆదివేంకటేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ యాంజాల్‌లో శ్రీభూనీళా సమేత శ్రీఆదివేంకటేశ్వస్వామిగా భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాడు.
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని తుర్క యాంజాల్ పరిధిలో ఆది వేంకటేశ్వర నగర్ (ఏవి నగర్) లో శ్రీభూనీళా సమేత శ్రీ ఆది వేంకటేశ్వరస్వామి కొలవై ఉన్నాడు. శ్రీతిరుమల హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ నోముల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివేంకటేశ్వరస్వామికి అధునాతన ఆలయం నిర్మించారు.
ఈ స్వామిని దర్శించి తరించడానికి తుర్కయాంజలే నివాసులే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలు, కాలనీలు, ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం రావడమనేది స్వామివారి లీలామహాత్మ్యం అని ఇక్కడి నివాసితులు చెబుతారు. భక్తులను పెద్ద సంఖ్యలో అనుగ్రహిస్తున్న భాగ్యనగరంలోని వేంకటేశ్వరుడి ఆలయాల్లో శ్రీభూనీళా శ్రీఆదివేంకటేశ్వరస్వామి ఆలయమే ప్రముఖస్థానాన్ని పొందుతుందని భక్తుల నమ్మకం. నీళాదేవి అంటే శ్రీదేవి అని. మహాలక్ష్మి అవతారాలే భూదేవి, నీళాదేవి. తుర్కయాంజాల్‌లో వేంచేసిన భూనీళా శ్రీఆది వేంకటేశ్వరస్వామి విగ్రహాలను తిరుమల-తిరుపతి నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు.
ఆదివేంకటేశ్వరస్వామి ఆలయానికి 1996 సంవత్సరంలో శంకుస్థాపన చేసి, 1999 లో నిర్మాణం పూర్తి చేశారు. భగవత్ రామానుజుడి అవతారంగా భక్తులు భావిస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో 1999 నవంబర్ 27 న భూనీళా సహిత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్టాపన జరిగినట్టు ఇక్కడి స్థలపురాణాలు చెబుతున్నాయ.
ఆదివేంకటేశ్వరస్వామి ఆలయంలోకి వెళ్లగానే ప్రశాంతమైన వాతావరణంలోకి అడుగిడినట్టు ఉంటుంది. ఆలయంలో ఎడమవైపు వినాయకుడి ఆలయం దర్శనంతో విఘ్నాలు పటాపంచలై వేంకటేశ్వరుని దర్శనం సులభతరం చేస్తుంది.
ప్రధాన గర్భాలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి, ఆ స్వామివారికి కుడివైపు పద్మావతి, ఎడమవైపు ఆండాల్ అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి. గర్భాలయాన్ని ఆనుకుని విశాలమైన మండపం నిర్మించారు. వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు ఎదురుగా ప్రధానమండపం ప్రారంభంలో గరుడాళ్వార్లు వేంచేసి ఉన్నారు.
తిరుమలలోని ఆనందనిలయం నాలుగువైపులా ఉన్న మాడావీధుల తరహాలోనే ఇక్కడ కూడా ఆలయం చుట్టూ నాలుగువైపులా వీధులున్నాయి. ఈ వీధుల్లో స్వామివారు తరచూ ఊరేగుతారు.
ఆలయంలో ఈశాన్యంవైపు యజ్ఞశాలను నిర్మించారు. ఈశాన్య మూలలో పెద్దకోనేటిని నిర్మించారు. కోనేటిలో స్వామివారి ఉత్సవమూర్తికి ఉత్సవాల సందర్భంగా చక్రస్నానం తదితర పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం చుట్టూ హరితహారం తరహాలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. వాయవ్యంలో ఉన్న అందమైన ఉద్యానవనంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడి తిరుప్పావై పాశురాలను అనుసంధానిస్తూ ధనుర్మాసంలో ఆండాళ్ తల్లి పూజలను కూడా చేస్తుంటారు.

ఆలయానికి దారి
హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోను, సాగర్ రింగ్‌రోడ్డు నుండి ఇబ్రహీంపట్నం వెళ్లే మార్గంలో 9 కి.మీ. దూరంలో యాంజాల్ క్రాస్ రోడ్డు ఉంటుంది. ఈ క్రాస్ రోడ్డు నుండి కుడివైపు రెండుకిలోమీటర్ల దూరంలో టి.యాంజాల్ పరిధిలో స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి వివిధ మార్గాలనుండి అనేక సిటీబస్సులు ఉన్నాయ. ఎల్‌బి నగర్, సాగర్ రింగ్‌రోడ్డునుండి ఆటోలు, టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయ.

- చివుకుల రామమోహన్