పఠనీయం

శ్రీనివాస ప్రబంధ ప్రశస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి ప్రణీత శ్రీనివాస ప్రబంధ ప్రశస్తి
వ్యాఖ్యానం: భారతీసంహిత
వెల: రూ.200.. పేజీలు: 151
ప్రతులకు: ఎన్.సి.హర్షవర్థన్, ప్లాటు నెం.37
వంశీ నిలయం, తరుణ ఎవెన్యూ
లక్ష్మీనగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్
మల్కాజ్‌గిరి, హైదరాబాద్-47
*
మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు వ్రాసిన ‘శ్రీనివాస ప్రబంధ’మనే బృహత్ గ్రంథాన్ని సంక్షిప్త వ్యాఖ్యానం కొన్ని పద్యాలతో ‘భారతీసంహిత’ రచించిన పరిచయ గ్రంథం ఇది. శ్రీనివాస ప్రబంధంలో 2420 గద్య పద్యాలున్నాయి. దాని వైశిష్ట్యాన్ని వివరిస్తూ 113 పద్యాలను మాత్రమే తీసుకొని మూలంలోని 5 ఆశ్వాసాలను వ్యాఖ్యానించారు.
మొదటి పద్యం పంచాయుధ వర్ణనలోని సుదర్శనాన్ని వివరించారు. సుదర్శనం మొదటే అది చెప్పటంలో రచయిత ఈ గ్రంథం మొత్తం సుదర్శనమని మనకు సూచిస్తున్నారు. షడక్షరాత్మకమైన ఈ సుదర్శనం ఎంతో మహిమాన్వితమైంది. 8వ పద్యం (పుట.9)లో కవి ప్రయోగం ‘మదహలహల హలహలమగు’ అంటూ లాటానుప్రాస ప్రయోగించటం పుట్టపర్తి వారి కవితా విన్యాసానికి నిదర్శనం. విశిష్టాద్వైత సిద్ధాంతంలో తదారాధన కంటె తదీయారాధన శ్రేష్ఠం అనే భావన అంటూ 12వ పుటలో వివరించారు. భగవంతుడు, భక్తుడు, భక్తి ఒక్కటే అనేది విశిష్టాద్వైతం. పుట.12లో కవి యొక్క ‘రీతి’ని వివరించారు. అలాగే పుట 21 పద్యం 21లో పుట్టపర్తి వారి సంగీత పాండిత్యాన్ని వ్యాఖ్యానించారు. పుట 39 పద్యం 26లో ధర్మగుప్తుని కథలో, ‘కరికిరి కాసర చమరీ శరభాదుల’ అంటూ బాణాలను సంధించి వేస్తున్నప్పుడు వచ్చే ‘సరసర’ నాదాన్ని కవి పలికిస్తున్నారు. పుట 45 పద్యంలో ‘నేను నాది’ అనే భావాన్ని చెపుతూ ‘నేను’ను దాటితే నాది అనే భావం పచ్చికుండలాగ విరిగిపోతుంది అని కవి చెప్పటం వారి అద్వైత తత్త్వజ్ఞానానికి ప్రతీక.
పుట 52 పద్యం 46లో ఇంద్రుని క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ని వ్యాఖ్యాత అద్భుతంగా వివరించారు. పుట 99లో శంఖణుని కథను గురించి పుట్టపర్తి వారు వర్ణించిన తీరు వ్యాఖ్యాత మాటలలో ‘శ్రీనాథుని సీస పద్యం, ముక్కుతిమ్మనార్యుని ముద్దు పలుకులు, తిక్కన శబ్దశక్తి, నాటకీయత, ధూర్జటి జానపద ఆవాసాల వర్ణన, వసుచరిత్రకారుని సంగీత సాధికారత, తెలుగు సాహిత్యంలోని అనేక కవిరీతుల ఛాయలను ప్రోదిచేసుకున్న ఇంద్రధనుస్సు.
అలాగే పుట 20లో కాళిదాసు విక్రమోర్వశీయం, నన్నయ్య ఋతువర్ణనలు (పుట 22), తిక్కన శైలి, అన్నీ కవిలో ఉన్నాయని చెపుతూ తృతీయాశ్వాసం ‘నన్నయ్య ప్రసన్న కథా కవితార్థ యుక్తి పుట్టపర్తి’ వారు వారసులనిపిస్తుంది అంటారు వ్యాఖ్యాత.
ఈ గ్రంథంలో ఎన్నో కథలు, సప్తగిరుల కథలు చాలా ఉన్నాయి. పుట్టపర్తి వారిని మహాకవియని, సరస్వతీ పుత్రుడని ఎందుకు అంటారో ఈ వ్యాఖ్యానం చదివితే తెలుస్తుంది. వ్యాఖ్యాత యొక్క సర్వతోముఖ ప్రజ్ఞ కూడా ఈ వ్యాఖ్యానంలో తెలుస్తున్నది. ఇది చదివిన వారికి మొత్తం గ్రంథం చదవాలనే కోరిక కలిగేట్లు వ్యాఖ్యాత వివరించిన తీరు అద్భుతం. అయితే కొన్నిచోట్ల ‘హిరణ్యకశిపుడు’ అనే పేరుకు హేమకశిపుడు అని ఎందుకు వాడారో తెలియటం లేదు.

-నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ 9849793649