పఠనీయం

అదో గౌరవప్రదమైన అంశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాచపాళెం పీఠికలు
సంకలనం: డా.తన్నీరు నాగేంద్ర
వెల: రూ.150
ప్రతులకు: పాల్యం (విలేజ్ అండ్ పోస్ట్)
పమిడి మండలం
అనంతపురం, ఆం.ప్ర.
99493 44032
*
పీఠికా, అచ్చుతప్పుల పట్టిక లేని తెలుగు పుస్తక స్వరూపాన్ని ఊహించడం కష్టం అనేవారు ఆరుద్ర. తమ గ్రంథాలకు ఏ సాహితీ ప్రముఖుల చేతనో, ఆత్మీయ మిత్రుల చేతనో మున్నుడి రాయించుకోవడం చాలామంది రచయితలు చేసే పనే. అడిగి రాయించుకుంటున్నారు కాబట్టి ఆ ముందు మాటలు రాసే సాహితీ ప్రముఖులు గ్రంథకర్తను, అతని రచనను ప్రశంసించడమే ప్రధానంగా చేస్తారు. అయితే తమ పీఠికల ద్వారా ఆ గ్రంథం గురించీ, ఆ గ్రంథకర్త గురించే కాకుండా సందర్భోచితంగా ఓ సాహితీ చర్చనో, సాహిత్య సమాచారాన్నో అందులో నిక్షిప్తం చేసే వారుంటారు. పీఠిక పేరుతో తమ పాండిత్య ప్రదర్శన చేసేవారూ వుంటారు. పనిలో పనిగా తమ గురించీ చాటింపు వేసుకునే వారుంటారు.
నిజానికి పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు తెలుగు సాహిత్య విమర్శలో.. గుర్తించదగిన అంశాలు. పీఠికలను సాహిత్య విమర్శలో భాగంగా గుర్తించడానికి అవి సింహభాగం ఆ రచన పట్లా, ఆ గ్రంథకర్త పట్లా ప్రశంసా పత్రాలుగా వుంటాయన్న భావన అవరోధం కావచ్చు. కానీ నిజానికి పీఠికలే అసలు గ్రంథాలుకన్నా విలువైనవిగా భాసించిన ఘట్టాలు సాహిత్య చరిత్రలో లేకపోలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానంకు చలం యోగ్యతా పత్రం వంటివి అందుకు ప్రబల నిదర్శనాలుగా వున్నాయి. కట్టమంచి, రాళ్లపల్లి, విశ్వనాథ, కుందుర్తి, రా.రా., జి.వి.సుబ్రహ్మణ్యం వంటి వారి పీఠికలకు సాహిత్య గ్రంథం ఎంతో వుంది. ఎందరో కవులను, రచయితలను కె.శివారెడ్డి, అద్దేపల్లి వంటి వారు ప్రోత్సహిస్తూ ముందు మాటలు రాసినా వారికి విమర్శకులుగా కన్నా కవికుల గురువులుగానే గౌరవం వుంది. సినారె, ఎన్.గోపి వంటి వారు వందలాది ముందు మాటలు రాశారు. కానీ వాటన్నింటినీ సాహిత్య విమర్శలో ఒక ప్రత్యేక భాగంగా గుర్తించడానికి చాలామందికి మనస్కరించకపోవచ్చు.
విమర్శకులుగా పేరొందిన వారిచేత పీఠికలు రాయించుకోవడం వల్ల ఆ తరువాత ఏ పత్రికల్లోనో వారి పాలబడకుండా ముందస్తు బెయిల్ పొందినట్లు భావించి ప్రసిద్ధులనిపించుకున్న విమర్శకులను తమ గ్రంథాలకు పీఠిక సంతరించమని కోరే తెలివిడి కవులు, రచయితలు కూడా లేకపోలేదు. అడిగినంతనే మొహమాటానికో, కాదంటే అహంకారి వంటి ఏ ముద్రనో వేయించుకోవలసి వస్తుందనో, నాలుగు మంచి మాటలు చెప్పి రచయితను ప్రోత్సహించడం సాహితీవేత్తలుగా గుర్తింపు పొందిన వారి కర్తవ్యమేననే సహృదయ భావనతోనో పీఠికలు సంతరించే వారున్నారు. అయితే నిజానికి పీఠిక రాయడం ఓ గౌరవప్రదమైన అంశమే! కొందరి పీఠికలు నిజంగా పుస్తకాలకు విలువ తెస్తాయి. ఆయా గ్రంథకర్తలకు ప్రోత్సాహకరంగా వుంటూనే సరియైన పంథాలో సాగే మార్గదర్శనం చేస్తాయి.
ఇవాళ మంచి సాహిత్య విమర్శకులలో ఒకరుగా పేరుగాంచి సాహిత్య అకాడెమీకి సలహా సంప్రదింపులు ఇచ్చే కీలక స్థాయిలో వున్న రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు తాను ఇతరుల పుస్తకాలకు ముందు మాటలు రాసే దశకు ఎదిగీ, వాళ్ల గురువు ఆచార్య జి.ఎన్.రెడ్డి గారి పీఠికల్ని సంకలనం చేసి ప్రచురించిన వైనాన్ని గుర్తించిన రాచపాళెం వారి శిష్యుడు డా.తన్నీరు నాగేంద్ర ఆయన పట్ల గౌరవాదరాలతో పూనుకుని రాచపాళెం వారి నలభై అయిదు పీఠికలను తానే ఆర్థిక భారం వహించి ప్రచురించాడు. ఇది గురువు పట్ల అభిమానాన్ని చాటుకోవడానికే కాక సాహిత్య విమర్శకు అందించిన ఒక మంచి ఉపాయనంగా అభినందనీయ విషయం.
గోర్కీ వ్యాసాలకు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వ్యాస సంకలనానికి, కేతవరపు రామకోటి శాస్ర్తీ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, జూలూరి గౌరీశంకర్, కొండ్రెడ్డి, వినోదిని, రజని, గాయత్రి వంటి వారి పుస్తకాలకు రాచపాళెం రాసిన పీఠికలు, ముఖ్యంగా సీమ రచయితలు పలువురి గ్రంథాలకు ఓ గురుస్థానీయునిగా రాసిన పలుకులు వీటిల్లో చెప్పుకోదగినవి.
‘మార్క్సిస్టు విమర్శకుల్లో సిద్ధాంతాలు చెప్పేవాళ్లు ఎక్కువ. సిద్ధాంతాన్ని అన్వయించి సాహిత్య విమర్శ చేసేవాళ్లు తక్కువ. అప్లికేషన్ దాకా వచ్చినా ఎక్కువమంది దృష్టంతా వస్తువు మీద, దాని నేపథ్యం మీద కేంద్రీకరిస్తారు. శిల్పం జోలిగి వెళ్లేవాళ్లు అతి తక్కువమంది.’
‘తెలుగు విమర్శకులలో కవిత్వ ప్రియులు ఎక్కువ. అందుకే కవిత్వ విమర్శ ఎక్కువగా వచ్చింది. కథ, నవలల విమర్శకు ఒక కొత్త సంస్కారం కావాలి. కవిత్వంలో విమర్శకులకు పద ప్రయోగ వైచిత్రి సహకరిస్తుంది. కథలో, నవలల్లో ఆ వీలు లేదు. అందుకే ఎక్కువమంది విమర్శకులు ఇటు మొగ్గరు.’
‘పరిశోధించి సిద్ధాంత గ్రంథం రాయడమంటే సాహిత్య విమర్శ రంగంలోకి అడుగుపెట్టడమనే అర్థం. అదే సర్వస్వమని మీసాలు మెలేసుకోకూడదు.’
‘మన విమర్శకులు గుర్తించవలసిన అంశం మరొకటున్నది. ఇప్పటికే చర్చల్లో బాగా నలిగిన విషయాల మీద విమర్శ రాయడంలో విమర్శకులు రెండు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి అంశాల మీద కొత్త సమాచారం అందించడం, పాత సమాచారం ఆధారంగా కొత్తగా వ్యాఖ్యానించడం. సమాచారం పాతదై వ్యాఖ్యానమూ పాతదైతే విమర్శను వర్తమాన గుణం వుండదు.’
‘సమీక్షించే గ్రంథాన్ని సమగ్రంగా చదవడం ఒక ఎత్తు. చదివి జీర్ణమైన దానిని నిర్మాణాత్మకమైన పద్ధతిలో, నిర్మాణాత్మకమైన భాషతో చెప్పగలగడం మరో ఎత్తు. ఈ రెండు ఎత్తులకూ ఎదిగిన వారే నమ్మదగిన సమీక్షకులవుతారు.’
పీఠికా రచన మూలకందంగా ఇలాంటి ఉపయుక్త అంశాలను రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు వెలువరించినందునే ఈ గ్రంథం సాహిత్య విమర్శలో భాగంగా ఆమోదయోగ్యమవుతోంది. మంచి సంకలనం అందించిన నాగేంద్రకు అభినందనలు.

-సుధామ