పఠనీయం

నీతికీ అవినీతికీ విభజన రేఖలు కామేశ్వరి కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండెల్లో గోదారి
( కథలు)-
వెల:రూ.120/-
రచన: చెంగల్వల కామేశ్వరి
జె.వి.పబ్లికేషన్స్ ప్రచురణ
ప్రతుల ప్రాప్తిస్థానం
ఫ్లాట్ నెం.106, 1-12-159,
రాయల్ రెసిడెన్సీ,
జె.జె.నగర్, అల్వాల్,
సికింద్రాబాద్,
*
పరిణామశీలమవుతున్న సంక్లిష్ట మానవ సంబంధాల వైచిత్రిని చెబుతున్న కథలు చెంగల్వల కామేశ్వరి గారి ‘గుండెల్లో గోదారి’. గోదావరికి ఆటుపోట్లు ఎంత సహజమో మన జీవితాలలోనూ అలాంటి ఆటుపోట్లు సహజం. అయితే గోదావరి అనగానే ఒక పవిత్రత ద్యోతకమయినట్లుగా బ్రతుకు ఉదాత్తమై భాసించాలన్న స్పృహ కలిగించే లేఖిని కామేశ్వరిది. ఇరవై అయిదు కథలున్న ఈ సంపుటి పైలాపచ్చీసు యువతరం కూడా చదివి గ్రహించాల్సిన అంశాలతో వుంది.
ఇందులోని కొన్ని కథలు నిజానికి ‘షాకింగ్’గా అనిపించేవే! అయితే వర్తమాన సమాజంలో సహజాతాలుగా గోచరిస్తున్న వైఖరులవి. ఆ వైక్లబ్యాలను వివరిస్తూనే వాటిని విలోమ స్థితినుండి ఎలా సవరించుకోవాలో సందేశించే ధోరణి రచయిత్రి అవలంభించారు.
‘పాపం కోమలి’ కథలో బ్లూఫిల్మ్‌ని ఆనందించిన స్ర్తిల రహస్య చర్య దాంపత్య జీవనంలో వయోధిక కాలంలోనూ శృంగారంలో ఎలా కొత్తపాఠాలు పటిష్టబంధన ఆనంద సంధాయకాలు కాగలుగుతాయో చెబుతుంది. అలాగే ‘వ్యాపారం’ కథ కూడా సంచలనాత్మకమే!
ఆడది కనిపిస్తే చాలు ఆమెతో లైంగిక కార్యానికై అర్రులు చాచే పురుష పుంగవునికి బుద్ధిచెప్పేందుకు అతని చేత బలాత్కరింపబడిన వనితలిద్దరు (వనజ, సౌదామిని) కూడబలుక్కుని జ్యోతి అనే సిఫిలిస్, ఎయిడ్స్ రోగిని శృంగారకేళికి దివాకర్ వద్దకు పంపి అతని ‘రోగం’ కుదురుకునేలా చేస్తారీ కథలో.
‘ఒకే షాట్’ కథ కూడా స్ర్తి లౌల్యంగల గిరిధర్‌కు ‘మోతీని’ మేస్ర్తి రాజు ఎరగా వేసి లాభపడిన వైనాన్ని వివరించేదే! నీతికీ అవినీతికీ విభజన రేఖలు మాసిపోతూ అవినీతిలో భాగస్వామ్యం వర్థిల్లడమనే వర్తమాన వైఖరికి దర్పణమే ఈ కథ.
ఈ సెనే్సషనల్ కథల సంగతి పక్కనబెడితే ఉత్తమ గృహిణిగా, బాధ్యత నెరిగిన సామాజిక రచయిత్రిగా, మహిళా చైతన్యంపట్ల నిబద్ధతగల వ్యక్తిగా కామేశ్వరిగారి ఈ కథల సంపుటిలో ‘పోయిరాతల్లి! పోయిరామ్మా’- కుటుంబ జీవన వ్యవస్థను నిలబెట్టేదిగా, ‘ఋణానుబంధం, రుణానుబంధ రూపేణా’- జంతు విశ్వాసాన్నీ, భూతదయనూ అభివ్యక్తీకరించేవిగా, ‘అచ్చు నీలాగే’లో తరాల అంతరాలున్న అనుభూతి గాఢత ఒకటే కావచ్చునని నిరూపించేదిగా, ‘స్నేహం’- సత్ప్రవర్తనలకు కులం కాక గుణమే ప్రధానమని కనువిప్పు కలిగించేదిగా భావిస్తున్న కథలు.
మనోసౌందర్యం ప్రధానమని చెప్పే- ‘మా అత్త బంగారం’, తమ కళ్ళముందే మరో పెళ్లి చేసుకుని సరసాలు సాగించే తండ్రిని ఎదిరించిన మహతి- ‘జీవితమే సాహసం’, ప్రేమికులుగా విడిపోయి పెద్ద వయసులో కలిసిన ఓ ఆడా మగాలో, మగవాడి వక్రబుద్ధిని పసిగట్టి వివేకంతో నిలబడిన మైథిలి- ‘గుండెల్లో గోదారి’ కథలు- స్ర్తిల సమస్యలు, వాటి పరిష్కారాలే మూలకందంగా సాగిన కథలు.ఆలోచనాత్మక కథాంశాలను ఎన్నుకుని సరళ శైలిలో చెంగల్వల కామేశ్వరి రాసిన ఈ కథల సంపుటి మంచి చెడుల సంగమం, విచక్షణా వైఖరి అందిపుచ్చుకుంటే అభినందనీయమైన ప్రచురణ.

-సుధామ