పఠనీయం

చిన్నారి కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారి కథలు (బాలల నీతి కథలు)
రచయిత:లక్కోజు రాజా గణేష్, పేజీలు:68, వెల:రూ.45/-; ప్రతులకు:శైలి ప్రచురణలు, 30-23, జి3, ఉప్పులూరి వీరన్న ఎన్‌క్లేవ్, వడలివారి వీధి, తణుకు-534211, ప.గో.జి.
*
నేడు బాల సాహిత్యంలో చిన్నారుల కోసం పిల్లల కథలు, నీతి కథలు పుంఖాను పుణకాలుగా వెలువడుతూనే ఉన్నాయి. ఈ లఘు కథా సంపుటి పేరే ‘చిన్నారి కథలు’. అందునా నీతిని బోధించగల కథలూను. దీని రచయిత లక్కోజు రాజాగణేష్ విద్యాధికులు. చక్కగా తాను చెప్పదలచుకున్న అంశాలను సులభశైలితో, ఎటువంటి భాషా భేషజాలకు పోకుండా ఈ చిరు గ్రంథంలో 42 కథల్ని గుదిగుచ్చి ప్రచురించారు. ఇటువంటి సాహిత్యాన్ని ప్రచురించేందుకు కంకణం కట్టుకుంది శైలీ ప్రచురణల సంస్థ.
ఈ గ్రంథకర్త తెలుగు భాషలో గల చాలా ప్రక్రియలలో అభినివేశం కలిగిన సాహిత్య పిపాసి. ‘ప్రాణం నిలిపిన కథ’తో ప్రారంభమై ఈ గ్రంథం ‘సూది కొండమ్మగుడి’ కథతో ముగుస్తుంది. చివరి కథయైనా ఈ కథ ఒక స్థల పురాణాన్ని తలపించే సంవిధానంతో సాగిన చక్కని ముగింపుతో పరిసమాప్తమవుతుంది. కొన్ని కథల్లో జంతువులు పాత్రలైతే, కొన్ని కథల్లో పక్షి సంతానం పాత్రలుగా కనిపించినా, ఏదో ఒక నీతిని కథకులు ఆయా పాత్రల ద్వారా చెప్పించిన విధం పాఠకుల్ని ఆకట్టుకుంటుంది.
కొన్ని కథల్లో ఒకే పేర్లతో కథాగమనం సాగినా, అవి నూతనమైన అంశాల్ని ఆవిష్కరించేందుకు ఎంతగానో సహకరించాయి. చెప్పదలచుకున్న అంశాన్ని క్లుప్తంగా, సరళంగా, సుబోధకంగా కథలో విషయం ముందుకు సాగుతుంటుంది. ప్రముఖంగా గణేష్‌గారి కథల్లో కొన్నింట్లో అక్కడక్కడ పూర్వ జానపద మూలాలకు అనుసృజన కనిపిస్తుంటుంది. అది దోషంగా భావించడం సబబు కాదు. ‘రాము బ్లూవేల్స్ గేమ్’ కథలో కథకుడు ఆధునిక కంప్యూటర్ ఆట అయిన ప్రమాదభరితమైన దానిని నడిపించినతీరు ఆకట్టుకుంటుంది. ‘రాణి ఈగ చెప్పిన కథ’తో తేనెటీగల గురించి చెప్పిన అంశాలు ఆలోచనాత్మకంగా సాగుతాయి.
ఎక్కువ కథల్లో ఈ కధకుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు పాత్రలుగా చిత్రించిన కథలు నీతిదాయకాలే కాదు విజ్ఞానదాయకాలుగా కూడా ఉంటాయి. ‘గురువు’ అనే పదాన్ని రచయిత మంచి గుర్తింపు కలిగించే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చును. తాను విశాఖపట్టణ నివాసి కావున కొన్ని కథల్లో పట్టణంలోని ప్రదేశాలను ఉటంకిస్తూ కథలు నడిపించారు. అవి కూడా సహజత్వానికి అతి దగ్గరగా తోస్తాయి.
ప్రాథమికంగా స్నేహం గురించి, పిల్లల సాహసకృత్యాల గురించి ఆవిష్కరించిన కథలు బాలల్ని ఉత్తేజపరుస్తాయి. అన్ని కథల మాట ఎలాగున్నా, అడవి నేపథ్యంలో పులిని మట్టుపెట్టిన లేడి కథ పశువులలోగల ఆలోచనలకు అక్షరరూపం కల్పించిన కథ. కించిత్ విలక్షణంగా అనిపించినా బుర్ర ఉపయోగిస్తే పులి రాజును కూడా అంతం చేయవచ్చుననే అంశాన్ని బోధిస్తుంది.
‘పాత్రల దృశ్యమానం’ కథ హరిశ్చంద్రుడు, లోహితాస్యుడు, నక్షత్రకుడు, చంద్రమతి పాత్రలతో నడిపించినా దీనిలో ఒక సత్యవాక్పరిపాలకుడు సత్యం గురించి పడే తపనకన్నా ఒక్క అబద్దం ఆడటానికి నీకెందుకింత పట్టుదల అనే నక్షత్రకుడు వంటి పాత్రలతో ఒత్తిడి చేయించినా హరిశ్చంద్రుడు చలించలేదు. ధర్మమార్గాన్ని విడిచిపెట్టలేదు. అదే నాటకం నడుస్తుండగా శ్యాము అనే విద్యార్థి లేచి స్టేజీమీద నటిస్తున్న నక్షత్రకుణ్ణి లెంపలు వాయించడంతో ఆ కథ నీతి ఆవిష్కరింపబడుతుంది.
గ్రహాంతరం వెళ్లిన సుమ-ఇది ఓ అద్భుత కథ. పిల్లలకు ఈ మాదిరి కథలు చదివేందుకు ఇష్టపడతారు. ‘చిలకలూరిపేట చిట్టెమ్మ’ కథ పక్షుల తాలూకు అంశాన్ని, అవి గాయపడితే మనుషుల్లో ఏర్పడే దయ, జాలి వగైరాలు ఏవిధంగా ఉంటాయో వివరిస్తుంది. మొత్తం కథలన్నీ చదివించేటట్లుగా ఉండి పాఠకుల్ని ఉత్సాహపరుస్తాయి.
లక్కోజు రాజాగణేష్ కథలు బాలల మేధస్సు పెంచే దిశలో నీతిదాయకాలై దర్శనమిస్తాయి. భావిలో వీరు మరిన్ని నీతి కథలు వ్రాయాలని ఆశిద్దాం!

-డా మంతెన