వినమరుగైన

రమణ స్మరణానుభూతి ‘వ్యాసికలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చెప్పు, ఏం చేయమంటావు?
నన్ను రమణా!’
(వ్యాస సంకలనం)
రచయిత: ఒక భక్తుడు
సేకరణ: దోనేపూడి అవధాని,
దోనేపూడి రేణుకగారలు;
వెల: 30 రూ.; పుటలు: 42;
ప్రచురణ: రమణభక్త మండలి ట్రస్టు,
ప్రతులకు: డా.దోనేపూడి నరేష్‌బాబు,
శ్రీ షిర్డీసాయిబాబా దేవాలయం,
జూలేపల్లి- 518674,
గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా
*
ఒక పరమ ప్రశాంత వాతావరణం ఎప్పుడూ మరచిపోలేని ఒక అనుభూతినిస్తుంది. ఒక ఆదరణ పూర్వకపు పలకరింత మనస్సును నిర్మల నిశ్చల ఆహ్లాదతను అందిస్తుంది. ఒక్క చిరునవ్వు ఎంతో ఊరటనిస్తుంది. ఒక మంచి పుస్తకం మస్తకాన్ని సమస్తాన్ని లోబరచుకొని మళ్ళీమళ్ళీ చదివిస్తుంది. ఒకరివౌనం ఎన్నోఎన్నో అర్థాలను ‘పుష్పిస్తుంది’, ఏవో ఆలోచనా లోకాల్లోకి నెట్టేస్తుంది. ఇలా ఎన్నోఎన్నో చెప్పలేని మహోదాత్తమైన, మాటలకందని స్పందనలను, ప్రతిస్పందనలను రూపెత్తించే అనుభూతుల కల్పవృక్షపు ‘చల్లని నీడ’ తిరువణ్ణామలైలోని రమణాశ్రమం. అక్కడ నేడు భగవాన్ రమణమహర్షి భౌతికంగా కనిపించకపోయినా అక్కడికి వెళ్ళిన ప్రతి జిజ్ఞాసువు మనో ఫలకం మీద సజీవమూర్తిగా సుందర మందహాస వదనంతో సాక్షాత్కరిస్తారు- మనో నేత్రాలతో దర్శించగలిగితే, అనుభూతులను పొందగలిగే నిర్మల అంతరంగం ఉంటే.- ఈ భావజాలచ్ఛాలతో ఒక రమణ మహర్షి భక్తుడు రాసిన అనుభవాలు- అనుమానాల వ్యాస సంకలనం ‘‘చెప్పు, నన్ను ఏం చేయమంటావు రమణా!’’అనే ఒక చిన్న పుస్తకం. ఆ భక్తుని అనుభూతి వ్యాసాల సేకరణ చేసిన వారు దోనేపూడి అవధాని, దోనేపూడి రేణుకగారలు. రమణాశ్రమ ప్రశాంతత, అక్కడి జీవజాలాల ముగ్ధత, ఆ ఆశ్రమంలో రమణులు తిరుగాడిన ప్రదేశాలు, వారు విశ్రమించినచోటు మొదలైన వివరాలు దీనిలో ‘కనిపిస్తాయి.’ రమణుల సాన్నిధ్యం గాని, వారి వాక్కులుగాని ఎన్నిరకాల ప్రాకృతిక, పౌరాణిక ఉపమానాలతో ఉపమించబడ్డాయో ఇందులో చదువుతుంటే రమణుల మహోన్నత వ్యక్తిత్వం పాఠకుని మనసులో చెరగని ముద్ర వేసుకొంటుంది.
‘‘శ్రీరమణుల నామాన్ని అచంచల భక్తివిశ్వాసాలతో స్మరిస్తే చాలు. ఆ నామస్మరణే వివేకాగ్నిని ప్రజ్వలింపజేసే ఆరణి’’- ఇలా కవితాత్మకంగా రాశాడు కొన్ని వాక్యాలు ఆ భక్త రచయిత. ‘‘ర- మ- ణ’అనే మూడు అక్షరాలు త్రిమూర్తుల స్వరూపాలు’’అనటం గంభీర భావాత్మకంగా ఉంది.
‘శ్వాస కేంద్రీకృత ధ్యాసా విధాన’ ధ్యానం, ‘‘సుషిప్తిలో ‘నేను’ సంగతి’’మొదలైన కొన్ని అంశాలమీద కొంత వివరణకూడా ఈ పుస్తకంలో చోటుచేసుకుంది.
భగవాన్ రమణ మహర్షి గుఱించి అనుభూతిపరంగా ఒక జిజ్ఞాస రేకెత్తించే పుస్తకం ఇది.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం