పఠనీయం

‘అక్షరమేఘాలు’ కురిపించిన జీవన చినుకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అక్షరమేఘాలు’
పేజీలు: 157, వెల:రూ.100/-
ప్రతులకు: సి.ఎస్.ఆర్, 101, సుశీల సదన్ అపార్ట్‌మెంట్స్, 6-3-628/10, ఆనంద్‌నగర్, ఖైరతాబాద్, హైదరాబాద్-04
*
ఆత్మీయమైన బంధాలు.. అనుబంధాలను సమకాలీన సామాజిక స్థితిగతులను.. వాస్తవిక దృక్పథంతో కవిత్వీకరించి.. ‘అక్షరమేఘాలు’ కవితా సంపుటికి సి.ఎస్.ఆర్. (చిట్టిప్రోలు సుబ్బారావు) గారు అక్షరాకృతినిచ్చారు. ఈ కవితా సంపుటినిండా అక్షరమేఘాలు ఆర్ద్రంగా కురిపించే జీవన చినుకులు కానవస్తాయి. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రృవత్తిగా మలచుకుని.. చక్కని కవితా వస్తువులతో చిక్కని కవిత్వాన్ని పండిస్తూ ‘అక్షరమేఘాలు’ గ్రంథాన్ని తీర్చిదిద్దారు. జీవన స్పర్శలతో కొనసాగిన ఇందలి కవిత్వం.. సనాతన ధర్మంపై గౌరవ భావాన్ని ప్రకటిస్తూనే.. అసంగత ఆచారాలను శాస్ర్తియ దృక్పథంతో ఆవిష్కరించే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం! సామ్యవాదం.. హేతువాదం... సామాజిక దృక్పథం వంటి అంశాలతో ముప్పేట అల్లుకుపోయిన సి.ఎస్.ఆర్ గారి కవిత్వంలోని పంక్తులు అడుగడుగునా మనల్ని ఆలోచింపజేస్తాయి.
అమ్మ యొక్క ఔన్నత్యాన్ని, నాన్న యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క ప్రాశస్త్యాన్ని తెలుపుతూ కవి రాసిన కవితలు ఆయన సంస్కారానికి అద్దంపట్టే విధంగా ఉన్నాయి.
‘ఒకటి’ శీర్షికతో రాసిన కవితలో.. ఒక్క కన్నీటి చుక్క చాలు.. రాలితే.. వెయ్యి హృదయాలు రగలడానికి... ఒక్క హృదయం చాలు.. రగిలితే.. ప్రపంచాన్ని కుదిపివేయడానికి అన్న పంక్తులు కవి యొక్క పరిణతిని సూచిస్తున్నాయి.
‘తేనెమబ్బులు’ కవితలో కవి చక్కని భావుకతను ప్రకటించారు. సౌందర్యాన్ని సాంద్రపరిచి మకరందాన్ని.. తుమ్మెలకిచ్చాయి.. పూలు అంటూ రాసిన తీరు బాగుంది. స్ర్తిలు ప్రతినెల పడే ‘ముట్టు’ ఇక్కట్లను.. ‘ఐదు రోజులూ.. పద్దెనిమిది మెట్లూ’ కవితలో సుదీర్ఘంగా ప్రస్తావించారు. మానవ జాతి స్ర్తిలకే ఎందుకో ప్రతినెలా.. తప్పని తిప్పలు అవి వ్యాఖ్యానించారు. స్ర్తిల సౌందర్యాలను కొనియాడిన కావ్యాలకు.. వారి ముట్టు ఇక్కట్లు ఎందుకో పట్టలేదని వాపోయారు.
పంచేంద్రియాలు, అష్టరాగాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య మొత్తం పద్దెనిమిది మెట్లనూ స్ర్తి మూర్తుల ఐదు రోజులనూ సమిధలు చేసి రగిల్చిన యజ్ఞాన్ని దావాగ్నిగా చెలరేగక వెలుగుబాట కావాలని కాంక్షించారు.తెలుగు వెలుగు జిలుగులను ఓ కవితలో అందంగా ఆవిష్కరించారు.
తెలుగు రాస్తుంటే.. పలకమీద ముత్యాలను పేర్చినట్లు / ముంగిట్లో ముగ్గులను తీర్చినట్లు.. మబ్బుమీద సంతకాలు పెట్టినట్లు అని కవితను చక్కగా ప్రారంభించారు.
నాలుగు పంక్తులో.. ‘హెచ్చరిక’ కవిత ద్వారా కవి యొక్క రచనా వైచిత్రిని ప్రదర్శించారు.
కళ్ళను నలపకండి / ఎర్రబడతాయి / జనాన్ని అణచకండి / తిరగబడతారు అని రాసిన భావాలను ఎంతైనా విశే్లషించుకోవచ్చు.
‘ఎర్రదనం పలుచబారుతోందా’ కవితలో కవి తమ భావాలను సుదీర్ఘంగా ప్రకటించారు.
శ్రీమంతుల.. మితిలేని.. ఐశ్వర్య ప్రదర్శనలు..
పేదల అసంతృప్తికి ఆజ్యం పోస్తున్నాయని కవి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. కొడిగట్టుకుపోతున్న సామ్యవాద పునరుజ్జీవనం కోసం.. ఇప్పటిదాకా వాడిన.. పంథాలు వ్యూహల స్థానంలో.. భారతీయత వౌలికమయ్యే విధానాలు రావాలనీ.. జనం నాడిని పసిగట్టే నూతన విధాతలు కావాలని కాంక్షించారు. ‘ప్రేయసి’.. ‘విరహం’ కవితలు ఆసక్తికరంగా రూపుదిద్దబడినాయి.
‘వారింపు’ కవితలో.. చేరువకంటే.. చేరువ ఊహే మధురమని.. మభ్యపెట్టకు.. మధుపానానికి కావలసింది.. మకరందం గానీ... పరిమళం కాదని తేల్చి చెప్పారు. కవి ‘ఆశాభంగం’ కవితలో అలతి అలతి పదాలతో అద్భుతమైన భావాలను పండించారు.తుమ్మెద రావాలని / పువ్వులు పెట్టుకుంది / చెట్టు / తుమ్మెదవచ్చి / పువ్వులనే గానీ / చెట్టును కనె్నత్తి చూడలేదు.. అన్న పంక్తులు చాలా బాగున్నాయి.. ‘స్పందన సౌందర్యాలు’ కవితలో.. పాము పడగ / నెమలి పింఛం / సింహం జూలు / కవి హృదయం / స్పందించి విప్పారే / సౌందర్య ప్రభాసాలు అని వ్యాఖ్యానించారు.
చిన్ని చిన్ని కవితల్లో కవి చక్కని ఉపమానాలతో.. కవిత్వాన్ని అల్లి పాఠకులను మెప్పించారు.
‘సంతృప్తగీతం’ కవితలో.. నీ విరహంలో / పాటలు పాడిన / నా గొంతు / నీ కౌగిలిలో / మూగబోయింది.. అంటూ ఆగక.. కవి పాఠకులను కన్విన్స్ చేయడానికి.. తుమ్మెద ఝుంకారం / పువ్వుమీద వాలే వరకే అంటూ ముగించారు.
‘టముకు’ కవితలో.. నిద్ర వర్షం .. ముంచుకొస్తోందహో.. కంటి పాపల్ని / రెక్కల గొడుగుల్లో / దాచుకోండహో అంటూ అక్షర దండోరా వేశారు.
చెట్టు వ్యధలకు అద్దం పడుతూ.. ‘నిస్సహాయత’ కవితను రాశారు.. రాళ్లు రువ్వారు / పండ్లు తిన్నారు. / వెళ్లిపోయారు / వాళ్ళెవరూ / చెట్టు గాయాలకు / కట్టు కట్టలేదు / తిన్న పండ్లకూ / విలువ కట్టలేదు / రైతులాగే / చెట్టుదీ మూగయాతననేనని చెప్పడం బాగుంది. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కవి తమ కలాన్ని సంధిస్తూ.. ‘త్వరితం కీచక సంహారం’ కవితను రాశారు.
‘రెండవ బాల్యం’ కవితలో జీవన సంధ్యలోని వెతలకు అద్దం పట్టారు.
మనసంతా తుడిచేసిన పలకయ్యింది / బాల్యం మళ్లీ వచ్చినట్లయ్యిందని చెప్పడం బాగుంది. ‘మన పరిణయ ప్రతీక్షణ’లో కవిత యందు రమణీయ భావాలు కొలువుదీరాయి!
‘నిజమైన ప్రేమ’ కవితలో.. నిజమైన ప్రేమంటే ఎలా వుండాలో చక్కగా ఆవిష్కరించారు.
పున్నమిరోజు కాదు / చంద్రుణ్ణి ప్రేమించడమంటే అమావాస్య రోజు వెనె్నలను కళ్లలో చూపించడం అని ప్రకటించడం బాగుంది.
కవి తమ సతీమణి హేమలత గారిపై రాసిన హేమ పుట్టిన రోజు కవితలో కవి ఆత్మీయంగా వెలిబుచ్చిన భావాలు అందంగా ఒదిగిపోయాయి! వారి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ప్రతి పంక్తీ కొలువుదీరడం విశేషం! ఇలా ఈ గ్రంథంలో కవి పండించిన కవిత్వం.. అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. మంచి పుస్తకాన్ని చదివామన్న ఓ అనుభూతిని పాఠకులు పొందుతారు.

- దాస్యం సేనాధిపతి