పఠనీయం

సాహిత్య సాంస్కృతిక సమాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు
(14-17 శతాబ్దాలు);
రచయిత:డాక్టర్ కె.వి.రాఘవాచార్య;
పుటలు:488, వెల:రూ.150/-,
ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు,
తిరుపతి.
*
‘‘శ్రీరామ కుచహార నాయక మణిశ్రీ ఁ జేయు సాకార శృం
గా రంభై తగు మచ్చ వక్షమున భూ కాంత స్థితిందెల్ప సౌ
ఖ్యారూఢిన్విలసిల్లు వేంకట నగాధ్యక్షుండు రక్షించు గొ
బ్బూరీ తిమ్మ నృపాల సింహు నరసింహోర్వీశ చూడామణిన్’’
ఉదా- 91వ పుటలో అయ్యల రాజు రామభద్ర కవి కవి కృత రామాభ్యుదయ కావ్య ప్రారంభ పద్యం ఇది.
‘వేంకట రమణుడు లక్ష్మీసతిని దగ్గరకు తీసుకున్నపుడు ఆ దేవి కంఠ హారపు కొలికి పూస అయిన ప్రధాన మణి స్వామి ఎదురు ఱొమ్ముకు ఒత్తుకొనుటచేత అక్కడ నల్లని మచ్చ ఏర్పడింది. ఆ నల్లని మచ్చ భూదేవి యొక్క ప్రతిరూపమా అన్నట్లు భాసించింది. ఆ భాసమానతగల వేంకటేశ్వరుడు తన ప్రభువైన గొబ్బూరి నరసరాజును ఎల్లప్పుడూ కాపాడుతుంటాడు’ అని భావం. వేంకటేశ్వర స్వామి ప్రసక్తి ప్రబంధాల్లో తరచుగా కనిపిస్తోంది అని రచయిత రుజువుచేయటానికి పేర్కొన్న పద్యాలలో ఇది ఒక మంచి మచ్చుతునక.
ఈ పుస్తకంలో అన్నమాచార్యుని దాస్యభక్తిని తెలియజేసే ‘దీనుండ నేను..’ అనే సంకీర్తనను 1997లో వేంకటదాస అనే పాశ్చాత్య విద్వాంసుడు ‘హెల్ప్‌లెస్ యామ్ ఐ.. యూ ఆర్ ఆల్‌మైటీ..’ అంటూ ఆంగీక్లరించిన గీతం పూర్తిపాఠము, ఇంకా ఎందరివో ఆంగ్లానువాదాలు చాలా పొందుపరచాడు రచయిత. విద్వాన్ పిసుపాటి కృష్ణమూర్తి, డాక్టర్ కె.రామేశ్వర దత్తా మొదలైన విద్యావేత్తలు ‘సుప్రభాత’ ఆంగ్లానువాద రచనలను ఎన్నో చూడగలం ఇందులో.
వేంకటేశ్వర సుప్రభాత శ్లోకాలకు కొందరు రాసిన, ఇందులో చూపబడిన తెలుగు అనువాదాలు చాలా బాగున్నాయి. ఇంతేకాకుండా ఈ గ్రంథంలో వేంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, ప్రతిపత్తి- వీటికి భావము, బొమ్మలు కలిగిన పుస్తకం ఒకదానిని చుక్కల లింగయ్య శెట్టి ప్రచురణ సంస్థ వారు ప్రచురించారు అని, నీలి వెంకట రమణగారు కూడా ఇలాంటి కళాత్మక కృషి చేశారని తెలిపారు ఆచార్యగారు. ముదావహం.ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రంథంలోని విశేషాంశాలు అసంఖ్యకాలు. కేవలం విషయ సూచికే 9 పుటలు వున్నది అంటే మరి పుస్తకం ఎంత విస్తృత చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక వివరణల సమాహారమో ఊహించుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే 14-17 శతాబ్దాల పరిధిని దాటి ఇప్పటికిప్పుడు కూడా వెంకన్న దొర గురించి ఎంత భక్తిపూర్వక నిస్వార్థ అధ్యయన, సాహితీ రచనల కృషి జరుగుతోందో తెలియజేసే ఒక అక్షరాల వీడియో ఈ గ్రంథం.

సంపూర్ణం

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం