పఠనీయం

సామాజిక సంఘర్షణ ముఖచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలుతురు వాకిట- (కవిత్వం)
రచన: రెడ్డి శంకరరావు,
వెల:రూ.100/-,
ప్రతులకు: సాహితీ స్రవంతి,
విజయనగరం,
ఫ్రంట్‌లైన్ సర్వీసెస్,
గురజాడ అప్పారావు రోడ్,
విజయనగరం. ఫోన్:08922-232777.
*
వస్తువేదైనప్పటికీ సామాజిక చైతన్య కోణంలోంచి కవిత్వాన్ని పలికించడం, సమకాలీన ప్రాపంచిన పోకడలను వర్తమాన జీవన సంఘర్షణల రూపంలో అద్దం పట్టిస్తాయి. అలాంటి భావ వ్యక్తీకరణతో, వామపక్ష భావజాలంతో మార్క్సిజం తీరుతెన్నుల్ని ఆకళింపు చేసుకుని ‘వెలుతురు వాకిట’ కవిత్వ సంపుటితో మన ముందుకొచ్చారు కవి రెడ్డి శంకరరావు.
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని సమస్య మూలాల్ని అనే్వషించే క్రమంలో, ఒక విమర్శనాత్మక ధోరణితో వచనప్రాయంగా ముందుకు సాగిపోతారు. 64 కవితలతో ఉద్యమ స్ఫూర్తిని నింపే ఈ అక్షరకారుడు కార్యకర్తగా మునిగి తేలుతూనే కవిత్వంతో ప్రపంచీకరణ కంఠస్వరానికి ప్రతిబింబంగా నిలుస్తాడు.
‘‘రెండో ప్రపంచ యుద్ధం తెచ్చిన వినాశనంతో / వింత పాఠం నేర్పిన సామ్రాజ్యవాదం / డాలర్ డేగ ప్రపంచీకరణ జపం చేస్తూ / రెండు దశాబ్దాల క్రితమే / దేశంలో వాలింది’’ అంటారు ‘మరణశయ్యపై పురిటిగడ్డ’ కవితలో కవి శంకరరావు. ‘గాట్ ఒప్పందం’తో మొదలైన డంకెల్ ప్రతిపాదన దేశ వ్యాప్తంగా విస్తృతమైన మార్పులకే శ్రీకారం చుట్టింది. అగ్ర దేశాల ఆధిపత్యంలో తృతీయ దేశాలు వలలో చిక్కుకున్న చేపపిల్లల్లా గుత్త్ధాపత్యం కింద నలిగిపోసాగాయి. ప్రపంచీకరణ ముసుగులో ఈ విషాద తీవ్రత ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది. సామ్రాజ్యవాదం నీడలో ఏకచ్ఛత్రాధిపత్యం రాజ్యమేలుతోంది. ఈ స్థితినే కళ్లకి కట్టినట్లు దృశ్యీకరించాడు కవి.
‘చైతన్య వసంతం’ కవితలో కవిలోని మార్క్సిస్టు దృక్పథం శ్రామిక చైతన్య ధిక్కార స్వభావంతో బయటపడుతుంది.
‘శ్రమ జీవి కన్నీరు ఆవిరై / కలవారి లోగిళ్ళలో కనకవర్షం / కురిపిస్తున్న ఈ దుష్ట సమాజం/ కష్టజీవుల చెమట చుక్కలు చైతన్య ధారలా / ప్రవహించిన రోజున / పేకమేడలై కూలిపోక తప్పదు’- అనే తార్కిక సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. పెట్టుబడీదారి సమాజంలో వ్యవస్థీకృతమైన ‘మిగుల విలువ’ ప్రతిఫలం ఉత్పత్తి శక్తులకి అందకుండా పోతుందనే అంతర్లీన ఆవేదన ఈ పలుకుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పీడిత పక్షపాతిగా శ్రామిక జనం పక్షాన నిలబడి పోరాడుతూ చైతన్యవంతమైన పాత్రను పోషించడం ఇందులో బహిర్గతమవుతుంది.
ఇంకోచోట - ‘్భగ్గుమన్న బాలవరం’ శీర్షికలో ప్రాంతీయ అస్తిత్వ పోరాటాల నేపథ్యాన్ని ఉద్యమస్ఫూర్తి రూపంలో బహిరంగపరుస్తారు కవి.
‘కాకరాలపల్లి సోంపేటలో / నేలరాలిన పోరుమందారాలు / ఉద్యమ విత్తు మొలకెత్తి / కొవ్వాడలో అణుపోరాటానికి / ఆయుష్షు పోస్తాయి’ అంటూ పోరు పతాకాన్ని ఎగరేస్తారు శంకరరావుగారు.
స్థానిక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఊపిరిపోసుకున్న నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడి ప్రభుత్వ వ్యతిరేకతకు కొమ్ము కాస్తూ వచ్చాయి. కాకరాపల్లి, సోంపేటల తిరుగుబాట్లు, అణు విద్యుత్ కేంద్రస్థాపనలో రైతులు, స్థానికులతోపాటు పలు ప్రజాసంఘాలు, వామపక్షాలు నిర్వాసితులకు అండగా చైతన్యవంతమైన పాత్రను పోషించాయి. ఈ సందర్భానే్న కొవ్వాడ రూపంలో అక్షరధ్వనిని వినిపించారు కవి. ‘అమ్మా బతకాలని ఉంది’ కవితలో.. ‘‘వేయి గుండెలలకు / ప్రాణాలు పోయాల్సిన అమృతహస్తం / మరణశయ్యపై మృత్యుఘోషపై పెడుతుంటే / నూరుకోట్ల భారత ప్రజల చైతన్యం / పొద్దుపొడుపై / తూర్పు దిక్కున ప్రభవించాల్సిందే’’ అని చెబుతారు. ‘చెమట చుక్కల సంఘర్షణ’ శీర్షికలో దళిత గుండె చప్పుడుని సున్నిత పదాల్లో చాలా తీవ్ర స్థాయిలో వ్యక్తీకరిస్తాడు.
‘ఇప్పుడు / భూమి / భగభగమండుతున్న అగ్నిగుండంలా ఉంది / గగనం / గాయపడ్డ దళితుడు నెత్తురులా ఎర్రబారింది’ అంటారు. ఈ భూమ్యాకాశాల ఆకర్షణ- వికర్షణ శక్తిలోంచి పదునెక్కిన చూపు నిమ్నకులాల అట్టడుగు స్వభావాన్ని ఆత్మన్యూనతా భావ స్వరంతో వెలికితీస్తోంది.
ఇంకా ఈ అక్షరాలతో ప్రతిధ్వనించే కవిత్వ పంక్తులు అనేక కొత్త కోణాల్ని స్పృశిస్తాయి. వీటిలో ‘ప్రతి ఉదయం రాలిపోతోంది’, ‘్ధక్కార స్వరం నిరసన జ్వాలలా ఎగిసిపడింది’,
‘బుల్లెట్ల శబ్దానికి హామీల అద్దం ముక్కలైన వేళ’, ‘నేలమ్మ ఒడిలో సేదతీరుతున్న చెట్లు’, ‘నేను ఒంటరిని కాను / సముద్రపు కెరటాల సమూహాన్ని’, ‘నెర్రెలు బారిన నేలపై తొలకరి చినుకుల్లా’, ‘ఇపుడు మా జీవన / మరణంతో సావాసం’, ‘వలసపక్షై తిరుగుతున్న కష్టజీవిని వెతుక్కుంటూ’, ‘రోడ్డు పొడవునా గుట్టలు గుట్టలుగా పడివున్న చెట్లు / యుద్ధంలో తలలు తెగిపడ్డ శవాల్లా ఉన్నాయి’ వంటివి కవిత్వ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇలా మత, స్ర్తివాద, దళితవాద స్పృహతో పాటు, వ్యక్తులు, పల్లె, బాల్యంపై రాసిన కవితలు వైవిధ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. తొలి ప్రయత్నంలోనే మంచి కవితా సంపుటిని అందించిన కవి రెడ్డి శంకరరావుని అభినందించకుండా ఉండలేం.

- మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910