పఠనీయం

అనాధ బాలల ఆర్తగీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడ్డిపువ్వు గుండె సందుక
-శాంతి ప్రబోధ
వెల: రూ.100
పుటలు: 134
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
*
గడ్డిపువ్వు వికసించినా, మిణుగురులు మెరిసినా, సీతాకోక చిలుక ఎగిరినా, కోయిల కూసినా ఆశ్చర్యపడే బాల్యం, ఆనందపడే బాల్యం కొందరికే సొంతం. అమ్మ ఆలనా, నాన్న పాలనా లేని బాలలకు బాల్యం ఓ అందరాని చందమామ. అమ్మ నాన్న లేని పిల్లలు గడ్డిపోచకన్నా హీనం. సంఘం ఎప్పుడూ అలాంటి వాళ్లపై కనే్నసి ఉంచుతుంది. అవమానాల వడిసెల రాళ్లు రువ్వుతుంది. పరిహాసాల శూలాలు గుండెల్లో గుచ్చుతుంది.
తమ తోటి పిల్లలు అమ్మ ఒడిలో ఆనందంగా ఆడుకుంటుంటే కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకుల కోసం నానా కష్టాలు పడతారు అనాధ పిల్లలు. అక్షరాలు దిద్దాల్సిన చేతులు అంట్లు తోముతాయి. రైలుపెట్టెలు తుడిచి చిల్లర నాణేల కోసం ఎదుటివారి ముందు చాపే చేతులౌతాయి. హోటల్లో కాఫీ కప్పులు కడిగే చేతులౌతాయి.
బాలకార్మిక చట్టాలు ఎన్ని వచ్చినా వాస్తవ జీవితంలో మార్పులు లేవు. అబ్బాయిలైతే తాగుబోతులవుతారు. సంఘ విద్రోహక శక్తులుగా పరిణమిస్తారు. అమ్మాయిలైతే వ్యభిచార కూపంలో చిక్కుకుపోతారు. బాల్యంలో ఆడుతూ పాడుతూ హాయిగా గడపాల్సిన వారు సమస్యల వలలో చిక్కుకున్న పిట్టలౌతారు. ఈ బాలల వెతల గీతాలే వి.శాంతిప్రబోధ గారి ‘గడ్డి పువ్వు గుండె సందుక’ కథలు. ఈ పుస్తకంలోని పదకొండు కథల్లో ఒకటి, అర తప్ప మిగిలినవన్నీ అట్టడుగు వర్గాల వారి బాధల గాథలు, అనాథ బాలల ఆర్తనాదాలు, కష్టాల కన్నీటి పాటలు.
‘నిప్పుల నడకలోంచి కళ్యాణి’ కథ ఆడపిల్లల అక్రమ రవాణాను చిత్రించిన కథ. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆడపిల్లల శరీరాలు వ్యాపార వస్తువులై పోవడం, నోట్లకట్టల సంపాదన కోసం ముక్కుపచ్చలారని అమాయకమైన ఆడపిల్లలపై వలలు వేయడం, ఆ వలలో చిక్కుకున్న ఆడపిల్లలు బయటకు రాలేక విలవిలలాడడం, ఆ హింసలో నలిబిలి కావడం ఈ కథాసారాంశం.
‘పూబాల’ కథానాయిక విశాల. ఆ పిల్లకు ఏడేళ్లు. ప్రకృతి ప్రేమికురాలు. బడికి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు దారిలో పూలమొక్కల దగ్గర ఆగి ప్రతి పువ్వును పలకరిస్తుంది. అన్నిటితో కబుర్లు చెప్తుంది. ఒకరోజు ఒక గులాబీ మొగ్గపైకి పురుగు ఎగబాకుతుంటే ‘మొగ్గని పురుగు ముట్టుకుంటే అది చచ్చిపోతుందట కదా. మీనా అలాగే చనిపోయిందట’ అని ఆ మొగ్గతో మాటలాడుతుంది.
మీనా తల్లిదండ్రులకు ఎయిడ్స్. ఆ ఎయిడ్స్‌తో కూతురు మీనా మరణిస్తుంది. కొనే్నళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ బాగా విజృంభించింది. ఎయిడ్స్ మహమ్మారి బారిన పడి చాలామంది మరణించారు. పితృస్వామ్య వ్యవస్థలో ‘మగవాడు ఏం చేసినా చెల్లుతుంది’ అని అంటారు. కుటుంబ యజమాని తిరుగుబోతు కావడంతో భార్యకు ఆ రోగం వస్తుంది. వాళ్ల దగ్గర నుంచి పిల్లలకు తేలిగ్గా వస్తుంది. చేయని నేరానికి భార్యాపిల్లలు బలౌతారు. ఈ ఇతివృత్తాన్ని ఈ కథలో కొత్తరకంగా చెప్పారు రచయిత్రి. ఏడేళ్ల అమ్మాయితో ఎయిడ్స్ వలన కలిగే నష్టాలను, పూలతో మాట్లాడిస్తూ సున్నితంగా చెప్పిన శైలి పాఠకులను ఆకట్టుకొంటుంది.
‘గడ్డిపువ్వు గుండె సందుక’ 14 ఏళ్ల మణి కథ. ఐదవ తరగతి చదివాక హైస్కూల్‌లో 6వ తరగతిలో చేరుతుంది మణి. తరగతి టీచర్ రిజిస్టర్‌లో ఆమె పేరు రాసుకొంటూ ‘ఇంటి పేరు ఏమిటి?’ అనడుగుతుంది. నాకు తెలీదంటుంది. తరగతిలో పిల్లలందరు ఎగతాళి చేస్తారు. మణికి కులం పేరు కూడా తెలియదు. క్లాసులో ఓంప్రకాష్ ఆడపిల్లలంటే చులకన భావం. ‘ఇంటి పేరు తెలీదు. కులం పేరు తెలీదు. దీనికి బడి అవసరమా’ అని అంటాడు. ఇలాంటి పిల్లను క్లాసు టీచరు చెయ్యడమేమిటి అని వాళ్లలో వాళ్లే అనుకొంటారు.
ఇవన్నీ విని మణి మనసు అల్లకల్లోలం అవుతుంది. నా చదువుకి కులం, మతం, ఇంటి పేరు, ఇవన్నీ అవసరమా? అమ్మా నాన్న లేకపోయినంత మాత్రాన నేను వాళ్ల లాంటి దాన్ని కాదా? అని బాధపడుతుంది. అంతలోనే తనకి తాను ధైర్యం చెప్పుకొంటూ మేము గడ్డిపువ్వులం కాదు. సువాసనలు విరజిమ్మే పూవులం అనుకొంటుంది.
ఇది ఇంటర్‌నెట్ యుగం. ఐనా మనం కులానికి, మతానికీ ప్రాధాన్యం ఇస్తూనే వున్నాం. ఈ కులాలు, మతాలు చిన్న పిల్లలపై ఎలాటి ప్రభావం చూపిస్తాయో ఈ కథ ఆవిష్కరిస్తుంది. కులం లేనిదని, కులం తక్కువదని, వేరే మతమని ఎన్నో తారతమ్యాలు, అంతరాలు చూపించి అణగారిన వర్గాలపై ఎన్నో గాయాలు చేస్తుంది సమాజం. చిన్నారి మనసుపై చేసిన మానని గాయం ఈ కథ.
‘లంచ్‌టైం’ కథ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల సమస్యలను చిత్రించిన కథ. మనిషికి ప్రాథమికావసరాలైన విద్య, వైద్యం ప్రజలందరికీ అందించడంలో ప్రభుత్వం ఎప్పుడో విఫలమైంది. ఈ రెండింటినీ వ్యాపారంగా మార్చేసిన కార్పొరేట్ సంస్థలకు అండగా వుంటూ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ వహించని ప్రభుత్వ విధానాలను ఈ కథలో ఎండగడతారు రచయిత్రి.
‘గడ్డిపువ్వు గుండె సందుక’ లోని కథలన్నీ అనాధ బాలల జీవితాల్లోని విషాదాన్ని చిత్రించిన కథలు. ఈ కథల్లోని పాత్రలన్నీ అనాథలే కానీ అణగిమణగి పడి వుండేవారు కారు. చైతన్యశీలురు. ఇలా మమ్మల్ని తక్కువగా ఎందుకు చూస్తారు అని ప్రశ్నించే స్వభావం కలవారు ఆత్మ గౌరవ గీతాలు.
కథలన్నీ సజీవమైన భాషతో చదివింపచేస్తాయి. ఆలోచనల అగ్నికీలలు రగిలిస్తాయి. మనసులో చైతన్యాన్ని కలిగించి, ప్రశ్నలను రేకెత్తించే కథలు రాసిన శాంతిప్రబోధ గారు అభినందనీయులు.

-మందరపు హైమవతి