పఠనీయం

అపురూప ఘట్టాల దిక్సూచి ‘విజయనగర వైభవానికి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగర వైభవానికి దిక్సూచి
-చివుకుల శ్రీలక్ష్మి
ప్రతులకు: రచయిత్రి
ఇం.నెం.20.24-18
వెంకటేశ్వర కాలనీ
విజయనగరం - 535002
9441957325
*
గడచిన రోజుల పేజీలను కాల పుస్తకం మీద తిరగెయ్యడమే చరిత్ర. గతాన్ని శోధించి పలు సందర్భాల్ని తవ్వి తీయడంలో దీని ప్రస్థానం చాలా గొప్పది. ఇలాంటి అక్షర యజ్ఞానికి ప్రయత్నపూర్వకంగా పూనుకొని శ్రీకారం చుట్టి సఫలీకృతమైన ఘనత రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మిది. ‘విజయనగర వైభవానికి.. దిక్సూచి’ అన్న పేరుతో ఈ మహద్గ్రంథానికి ఊపిరి పోసి ప్రాణప్రతిష్ట చేసిందీమె. ఈ తపన వెనుక పైకి కనిపించని ఎన్నో వ్యయప్రయాసలు, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష దాగి వున్నాయి. కాలికి బలపం కట్టుకుని దేశమంతా తిరిగింది. ఈ కృషి ఫలితం ఊరకనే పోలేదు. చివరికి 1100 పేజీల ఇతివృత్త చరిత్ర తగిన ఆధారాలతో సహా ఇందులో పొందుపరచబడింది. ఇది సామాన్యమైన విషయం కాదు. విజయనగర వాసులు గర్వంతో ఉప్పొంగాల్సిన క్షణాల్ని నిజం చేసింది. ఆర్థిక భారాన్ని, అపరిమితమైన కాలాన్ని, ఊహకు పదునుపెట్టే మేధస్సుని ఒకచోట నిక్షిప్తం చేసి, అపార విజ్ఞానసంపత్తిని పాఠకులకి కానుకగా అందించారీమె. కాబట్టే భవిష్యత్తు తరాలకి ఈ కీర్తి మకుటాయమైన కలికితురాయిని అంకితం చేసింది. దీనిలో 12 అధ్యాయాలు, అనుబంధాలు అవిశ్రాంత కృషికి దర్పణం పట్టి, చారిత్రిక వారసత్వ సంస్కృతికి ప్రతిబింబాల్లా నిలిచాయి.
‘నాంది’ ప్రస్తావనలో మొదలయ్యే మొదటి అధ్యాయం ‘విజయనగరం కోట’ చరిత్రనీ, ప్రాధాన్యతనీ, విభిన్న మతాల సామరస్య సాంస్కృతిక సాంప్రదాయ విశిష్టతల్నీ విడమర్చి చెబుతుంది. క్రీ.శ.17వ శతాబ్ది మొదలుకొని, జిల్లా ఆవిర్భావ నేపథ్యాన్నీ, కాలపురుషుడితో చర్చించే విజయానంద్ కథనాన్ని తెలియజేస్తుంది. చారిత్రక సాంస్కృతిక ఆధారాలైన బొర్రా గుహల్లోని మూర్తులు, శ్రీకూర్మ, పంచముఖేశ్వర, త్రిపురాంతక స్వామి (పాండవులు ఆయుధాలు దాచిపెట్టిన జమ్మిచెట్టు) ఆలయాల ప్రస్తావన కనిపిస్తుంది. రామతీర్థం, సారిపల్లి, పుణ్యగిరి, శివరాంపురంల వివరణ కానవస్తుంది. కళింగ సామ్రాజ్యంలో అంతర్భాగమైన విజయనగర నాగరికత, శిలాశాసనాలు, రాగిరేకులు, తాళపత్ర గ్రంథాలు, జైన బౌద్ధ మతాల మనుగడ కథనం కళ్లకి కట్టిస్తుంది. దక్షిణ కళింగను పాలించిన రాజ వంశాలలో శాతవాహనులు, గుప్తులు, వాశిష్టులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, నాటికాలపు నాణేలు, వాయిద్య పరికరాలు, నృత్యరీతులు, సౌర - చంద్రమాన సిద్ధాంతాలు, జ్యోతిషం వంటి అంశాలు ప్రసక్తికొస్తాయి. తూర్పు గాంగులు - ఇతర రాజవంశాలు, ఆలయాలు, నిర్మాణ శైలి, నటరాజ శిల్పం, పూరి - జగన్నాథ రథోత్సవం, నవకళేబరోత్సవం స్ఫురణకొస్తాయి. గంట్యాడ, గలావెల్లి, నారాయణపురం, జయంతి ఆలయాల ప్రసక్తి దొర్లుతుంది. కులోత్తుంగ చోళుని శాసనం, తామ్రపత్రాలు, చిలుక జోస్యం, తామ్ర - రాగి శాసనాలు, కాకతీయుల ప్రస్తావన రూపుకడుతుంది. శ్రీకృష్ణ దేవరాయలు, కళింగ గజపతులు, కుతుబ్‌షాహీలు, మొఘలులు, తూర్పు ఇండియా వర్తక సంఘాల పాత్ర ఘనంగా కీర్తించబడింది.
రెండవ అధ్యాయంలో పూసపాటి రాజుల వంశావళి బొమ్మ కడుతుంది. 6వ శతాబ్దిలోని విజయభూపతి మొదలుకొని ఇప్పటి ఆనంద్ - అశోక్ గజపతిరాజుల సంతతి దాకా. రాచిరాజు క్షత్రియ రాజవంశ పట్టిక పూసగుచ్చినట్టు వివరిస్తుంది. సంస్థానాల చరిత్ర - ఆవిర్భావం - కొండ జమీందారుల పాలనను వ్యక్తీకరిస్తుంది. వీటిలో పార్వతీపురం జమీందారి, జయపురం, విజయనగరం, బొబ్బిలి, ఆండ్ర, కురుపాం, పాలకొండ, పాచిపెంట, మేరంగి, సాలూరు, చీకటి సంస్థానాల ప్రాశస్త్యం అవగతమవుతుంది. జానపదుల జీవనం, మతం, జాతరలు, కళారూపాలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి. గైరమ్మ జాతర, శంబర పోలమాంబ సంబరం, అసిరితల్లి ఉత్సవం, ఎల్లమ్మ, ఎరుకమ్మ, కొండలావేరు పండుగలు, జకర - మందెంగి దేవతల ఆరాధన ముఖ్యమైనవి. జానపద నృత్యాలలో థింసా, గజ్జెల, గరగ, కోయ, పూసల, తోంగ్‌సేన్, నాగిని ప్రత్యేకతను సంతరించుకున్నాయి. జముకుల - బుర్రకథలు, చెక్క భజన, తప్పెటగుళ్లు, తోలుబొమ్మలు, ఇంద్రజాలం, తూర్పు భాగవతం, నాటకం, బయలాటలు, జానపద గీతాల ఔన్నత్యాన్ని చాటిచెప్పాయి. కుమిలి, కోనాడ ఆలయాల ప్రాచీనతను గుర్తుచేస్తాయి. యోగుల్లో విశ్వంభరదాసు, త్రైలింగ స్వామి ప్రసిద్ధులు. క్రీడల్లో ద్యూతక్రీడ, చదరంగం, గుప్తమణి, వామనగుంటలు, గొబ్బెమ్మలు, ఒప్పులకుప్ప, అశ్వక కందుక, కుమారీ, చెమ్మచెక్క, అచ్చనగండ్లు, ఉయ్యాల, అష్టాచెమ్మ, వైకుంఠపాళీ, పులిజూదం, కోతికొమ్మచ్చి, బొంగరాలాట, చెడుగుడు, దాగుడుమూత - దండాకోర్, వెనె్నల కుప్పలు, గీరన గింజలు, గుజ్జనగూళ్లు, వనె్నలపత్తి, కోలాటం వంటివి విస్తృత ప్రచారాన్ని పొందాయి.
మూడవ అధ్యాయంలో పెద విజయరామరాజు కాలంనాటి భౌతిక రాజకీయ పరిస్థితులు, ఉత్తర సర్కారుల చరిత్ర, ఆసిఫ్‌జాలు, విజయనగర సంస్థాన భౌగోళిక స్థితిగతులు, నేలలు, నీటి వనరులు, ఇతర చెరువులు, పరిశ్రమలు, తూనికలు కొలతలు, రవాణా సౌకర్యాలు, నగదు చెలామణి వ్యవస్థ, వస్తధ్రారణ, ఆచార వ్యవహారాలు, వర్ణ వ్యవస్థ ప్రస్తావించబడ్డాయి. రాజ్యవిస్తరణకై యుద్ధాలు, సాహిత్యం - భాష, వర్తక సంఘాల రాజకీయాధిపత్య పాకులాట, బొబ్బిలియుద్ధం కళ్లకు కడతాయి. నాలుగవ అధ్యాయంలో బొబ్బిలి యుద్ధానంతర పరిస్థితులు,. పైడితల్లమ్మ వారి లాంటి గ్రామదేవత పండుగలు, రాజ్య యుద్ధాలు ఉన్నాయి. అయిదవ అధ్యాయంలో చినవిజయ రామరాజు ద్వంద్వ పాలన, సాహిత్య పోషణ, బ్రిటీష్ దౌర్జన్యం, పద్మనాభ యుద్ధం చెప్పబడ్డాయి. ఆరు - ఏడవ అధ్యాయాలలో బొబ్బిలి వీణ తయారీ, కైపియతులు, తెల్లదొరల పాలన, విజయరామ గజపతి విద్యాభిమానం, కొండదొరల తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు విపులీకరించబడింది.
ఎనిమిదవ అధ్యాయంలో యుగకర్తల జననం చెప్పుకోదగ్గది. వీరిలో ఆధిభట్ల నారాయణదాసు, దూర్వాసుల సూర్యనారాయణ, సోమయాజులు, పప్పు వెంకన్న, వాసా వెంకటరావు తదితరుల కీర్తి విశేషాలు ఉన్నాయి. గిడుగు, గురజాడ, మల్లాది వెంకట విశ్వనాథ శర్మ, పేరి కాశీనాథశాస్ర్తీ, ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ, తాతా సుబ్బరాయ శాస్ర్తీ, వజల చినసీతారామశాస్ర్తీ, సి.వై.చింతామణి, పార్వతీశ అవధానులు, బుర్రా శేషగిరిరావు, కోడి రామ్మూర్తి, దేవరాజు వెంకట కృష్ణారావు, మామిడిపూడి వెంకట రంగయ్య, చిలుకూరి ఆదినారాయణ, భోగరాజు నారాయణమూర్తి, ద్వారం వెంకటస్వామి నాయుడు, పేర్ల రామమూర్తి శ్రేష్ఠి, గరిమెళ్ల సత్యనారాయణ, ఎడ్ల రామదాసు మున్నగు చరిత్ర పురుషులంతా విజయనగర కాంతి జ్యోతుల్ని ప్రపంచమంతటా దేదీప్యమానంగా ప్రకాశింప జేసినవారే. ప్రసిద్ధ కన్యకాపరమేశ్వరి, వేణుగోపాల స్వామి ఆలయాలు, చారిత్రిక కట్టడాలైన మెసానిక్ టెంపుల్, ప్లాటినం బాప్టిస్ట్ చర్చ్, హుస్సేన్ - జామియా మసీదులు, మూడు కోవెళ్లు, గుచీ, బొంకులదిబ్బ, పేర్లవారి భవనం, హస్తబలహాలు, సిటీ క్లబ్, అవుట్‌ఖానా, గంటస్తంభం, మూడు లాంతర్లు, సంస్కృత - సంగీత కళాశాలలు, గురజాడ అప్పారావు స్మారక భవనం, మచ్చకొండ, కోయ సాహెబ్ మేడ వంటివి అత్యంత పేరు ప్రతిష్ఠలు సంపాదించి పెట్టాయి.
12వ అధ్యాయంలో ఆనంద్, అశోక్ గజపతులు, కోలగట్ల, బొత్స, రాజన్న దొరల ప్రసక్తి రూపుకడుతుంది. పి.మోహన్, రామినాయుడు, బొంతలకోటి, రామసూరి, ధవళ, ఆకాశవాణి విశాఖపట్నం, ఆనంద గజపతి ఆడిటోరియం, మిమ్స్ హాస్పిటల్, కల్కి భగవాన్ మందిరం అవగతమవుతాయి. పడాల కళ్యాణి, నిర్మల, ప్రవల్లికా నారాయణ్, మీగడ, కట్టమూరి, బులుసు అన్నపూర్ణ, పలురకాల స్టేడియంలు, సమైక్యాంధ్ర ఉద్యమం, శోభా స్వాతిరాణి, హైమావతి, మీసాల గీత, మృణాళిని, ఝాన్సీరాణి, లలితకుమారి, నారాయణ స్వామినాయుడు, తదితరులు ఎదురుపడతారు. వీటితోపాటు 12 అనుబంధాలు పలు ముఖ్య ఘట్టాల్ని తెరకెక్కిస్తాయి. కళలకు నిలయమైన విద్యల విజయనగరం చరిత్ర ఈ రకంగా పుస్తక రూపాన్ని సంతరించుక్యోవడం ఒక అపురూప మహత్తర ఘట్టానికి చిరకాల వేదికగా పొందుపరిచినట్టయింది. ఈ ఘనతను సొంతం చేసుకోవడంలో రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి చరిత్రలో ఒక శాశ్వత స్థానాన్ని నిలబెట్టుకొని అజరామరంగా నిలిచిపోతుంది.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910