పఠనీయం

మంచిని పెంచే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగమంత కుటుంబం- కథాసంకలనం- రచన: డా కె.మీరాబాయి.
వెల:రూః.150/-, కాపీలకు:జ్యోతివలబోజు, ఫోను: 8096310140 మరియు ప్రముఖ పుస్తక విక్రేతలు
==================================================

సమాజంపట్ల ప్రేమ, బంధు, మిత్రులపట్ల ఆదరాప్యాయతలు గల మంచి మనసులకు జగమంతా కుటుంబమే! ప్రతి వ్యక్తీ, కుటుంబ సభ్యుడే!! ఇంతటి ప్రేమను పంచే మంచి మనుషులకు ఎల్లెడలా మంచివారే తారసపడుతారు. అమలాపురంలోవున్నా, అమెరికాలో వున్నా, ఫిజీ దీవుల సందర్శనార్థం వెళ్లినా ‘బూలా’ (్ఫజీ దీవుల భాషలో పలకరింపు) అంటారు. అనిపించుకుంటారు.
తెలుగు సాహిత్యంలో ప్రత్యేక పరిచయం అక్కర్లేనివారు శ్రీమతి డా కె.మీరాబాయిగారు. 1963 నుండి రాస్తున్న వీరు ఇంతవరకు రెండు వందలకుపైగా కథలు, నవలిక / నవలలు రాసారు. పలు దేశ, విదేశ పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఇంతవరకు ఆరు కథా సంకలనాలు వెలువరించారట.
కధను సూటిగా నడుపుకుంటూపోవడం, అనవసర సూర్యోదాస్తమానాల వర్ణనలను గుప్పించపోవటం, సురళమైన పదాల ఎంపిక- వీరి కథల విజయ రహస్యం. వీటన్నింటివల్ల పాఠకుడు, రచయితల మధ్య అడ్డు తెరలేమీ ఉండక, పాఠకుడు చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతాడు.
సంకలనంలోని 27 కధలు లోగడ పత్రికలు / అంతర్జాల పత్రికలులో కనిపించినవే! ఇదివరకే చదివిన పాఠకుడు, మొదటిసారి చదువుతోన్న పాఠకుడు ఇద్దరూ- ఒకే రకమైన అనుభూతి పొందటం విశేషం. చెప్పే తీరును బట్టి - రాజకుమారులు, ఏడు చేలు ఎండని ఒక చేప కథ- వందా ఒకటోసారి విన్నా, ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ బోర్న్ రచయిత్రి, అధ్యాపకురాలిగా తన కథా కౌశలాన్ని మెరుగుపరచుకున్నారనిపిస్తుంది.
కథలెక్కడ్నుంచో ఊడిపడవు. రచయిత ఊహాలోకంలోంచి ఊడిపడతాయి లేదా తమ అనుభవాల్ని కధలుగా మారుస్తారు. ఈ రచయిత్రి రెండవ పంథా అనుసరించారు. కనుక కథలన్నీ ‘సహజత్వం’ అనేక ఏకసూత్రతతో అలరారుతాయి.
సంకలంలోని మొదటి కథే తీసుకుందాం. నరసమ్మ ముసల్ది అయింది. కొడుకు వెంకటేశు మరియు కోడలికి భారం అయింది. అంతో ఇంతో కాలు చేయి ఆడుతున్నా ఇంటి పనుల్లో ఎంతో కొంత సాయం చేస్తున్నా, నరసమ్మను వదిలించుకోవాలన్న దుర్బుద్ధి కొడుకూ కోడలికి కలిగింది. తిరణాళ్ళ వంకతో పొరుగూరికి తీసుకెళ్లి వదుల్చుకుంటారు. ఏకాకి అయిన నరసమ్మకు గుబులు పుట్టింది. ఆమెలో మొట్టమొదట చోటుచేసుకున్న భావం- ‘ఎవరికీ ఏమి కాలేదు కదా. దేవుడా చల్లగా కాపాడు తండ్రీ’ అని. ఇదీ ఆ తల్లిలో సహజంగా కలిగిన భావం/ భయం. కావాలనే వదిలిపెట్టి పోయారన్న నిర్థారణకు వచ్చినాక. ఆ తల్లి ఏడుస్తూ, విమూఢురాలై కూర్చోలేదు. ఇక ‘ఆయనే’ దిక్కు అనుకుంది. నరసమ్మ ఆశించినట్లుగానే, నమ్మినట్లుగానే, ఆ రాముడే ఆదుకున్నాడు. ఆమెకూ కూడూ, నీడా కల్పించి, తనకో ఆశ్రయం కల్పించుకుని, నరసమ్మకూ ఆశ్రయం కల్పించి, ఆమెను ‘దేవుళ్ళమ్మ’ను చేస్తాడు.
చీకూ చింతా లేకుండా గడిచిపోతున్నా దేవుళ్ళమ్మ జీవితంలోకి, మళ్లీ కొడుకూ కోడలు, మనవడూ, మనవరాలూ వస్తారు. దేవుళ్ళమ్మను ‘తమది’గా ప్రకటించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ రచయిత్రి ప్రదర్శించిన స్థితప్రజ్ఞత గమనిద్దాం. దేవుళ్ళమ్మ మళ్లీ నరసమ్మగా మారదలచుకోలేదు. అట్లాగని నిర్దయగా వదిలిపెట్టిన కొడుకూ కోడలిపై, మానవ సహజమైన ఉద్రేకం కోపం ప్రకటించలేదు. ‘జగమంతా నా కుటుంబమే. నాకు వేరే కుటుంబం లేదు’ అని కళ్ళు మూసుకుంటుంది.
తాము సృష్టించిన పాత్రలపై రచయితలకు ‘సానుభూతి’ ఉంటుందంటారు. అలాంటివాటికిలోను కాకుండా నిర్వికారంగా, దేవళ్ళమ్మగానే ఆ నరసమ్మ ఉండిపోవాలనుకోవటం రచయిత్రి ‘పరిణతి’కి గొప్ప ఉదాహరణ.
రెండవ సగం కథలు రచయిత్రి స్వానుభవాల్లా అనిపిస్తాయి. అందుకే సహజత్వం, మానవత చిప్పిల్లుతుంటాయి.
‘జరిమానా’ కధలోని సుధీర తండ్రి మేజిస్ట్రేట్ భవానీ శంకర్ పాత్రనే తీసుకుందాం. మానవత్వం, కూతురిమీద ప్రేమ, విధి నిర్వహణ- ఈ మూడింటి మధ్య నలిగిపోతాడు మేజిస్ట్రేట్‌గారు. దేన్నీ విస్మరించలేరు. ఋజువర్తనంలో మూడింటికీ సమన్యాయం చేకూర్చలేరు. చట్టప్రకారం వన సంపద ప్రభుత్వానిది. పొట్టకూటికి ఆ ఆటవిక యువతి అమ్ముకుంటుంది ఆ వన సంపదను. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత భవానీ శంకరానిది. చట్టప్రకారం ఫైను విధించి, ఆ ఫైను మేజిస్ట్రేట్‌గారే కట్టుకుంటారు. మానవత్వం జయించింది. ‘దోషి’కి శిక్షపడింది. ఏ అతిక్రమణ కాంప్రమైజ్ కాకుండా రచయిత్రి కధ నడిపారు. ఇల్లు ఎంత విశాలమైనా, మనసు ‘ఇరుకు’ కాకూడదు. మనసు విశాలమైతే ఇల్లు ఎంత ‘ఇరుకు’ అయినా ఇబ్బంది లేదు ‘ఇరుకు’కథలో.
సుధామగారు తన ముందుమాటలో అన్నట్లు.. ఇది అపురూప కథాసంపుటి. అన్ని కధలు ఆసక్తిదాయకమే! మంచితనాన్ని పంచమని ఉద్బధించే కథలివి. సహజ సరళమైన శైలి, అనవసర సాగదీతలు లేకుండా ఆహ్లాదకరంగా చదువుకోగలిగే కథలు. సహృదయతగల పాఠకులకు తప్పక నచ్చే కథలివి.

-కూర చిదంబరం 8639338675