పఠనీయం

అందరికీ నచ్చే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నచ్చిన నా కధ కథల సంకలనం,
సంపాదకులు:ఎన్.కె.బాబు, వెల:రూ.200/-,
పంపిణీదారులు: సాహితీ ప్రచురణలు, 33-28-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ-4, ఫోన్:0866-2336642/43.
===================================================
పరస్పర సహకారంతో వ్యవసాయం, పరస్పర సహకారంతో పరిశ్రమలు స్థాపన, పరస్పర సహకారంతో గృహ నిర్మాణం- నేడు ఈ ‘పరస్పర సహకారం’ సాహిత్య రంగానికి కూడా విస్తరించింది. పత్రికలే కానివ్వండి- ప్రచురణకర్తలే కానివ్వండి- పేరుమోసిన రచయిత్రులకు / రచయితలకు మాత్రమే చోటుకల్పిస్తున్నారు. ఒక వర్థమాన రచయిత కధ ఎంత భేషుగ్గా ఉన్నా, వేసుకోవటానికి తటపటాయిస్తున్న సమయమిది. పత్రికల్లో కనబడితేగాని, పేరు రాదు; పేరుంటే గాని ప్రచురణకు నోచుకోదు. ఈపీటముడిని విప్పేదెట్లా?
ఎన్.కె.బాబులాంటివారు ముందుకు వచ్చారు. వారు వేసిన ఈ ప్రయత్నాన్ని వారి మాటల్లోనే - ‘‘అనేకమంది రచయితలు మంచి కధలు వ్రాస్తున్నప్పటికీ, వారి కధలు సంకలనాలలో చోటుచేసుకోవటంలేదు.. ఆ దిశలో నా ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రూపుదిద్దుకున్నదే ఈ కధా సంకలనం’’. మంచి సంకలనం. అభినందనలు. అయితే బాబుగారు మధ్యేమార్గాన్ని అవలంభించి అటు క్రొత్తవారి రచనలను, ఇటు లబ్దప్రతిష్టుల రచనలనూ కలిపి ఈ సంకలనాన్ని మన ముందుకు తెచ్చారు. మొత్తం 54 కధల్లో ఐదు బాలల కధలు కూడా ఉన్నాయి. ఇది ఎన్.కె.బాబుగారి మొదటి ప్రయత్నంగా తెలుస్తున్నది. కాబట్టి కొన్ని సూచనలు ఇవ్వటానికి సాహసిస్తున్నాను.
1.రచయితల ఫోను నెంబర్లు కూడా ఇస్తే బాగుంటుంది. పాఠకుడు తనకు నచ్చిన రచయితతో నేరుగా మాట్లాడే వీలు వుంటుది. రచయిత ఫొటో, జీవిత వివరాలు ఇస్తే మరీ బావుండేది.
2.పుస్తకాలు ప్రచురించే ఉద్దేశం - సామాన్య పాఠకుడు సైతం కొని చదవాలి. సంకలనానికి రూ.200/-గా ధర నిర్ణయించటం, ఈ ధరకు ఒక పాఠకుడిని కొనమనటం బాబుగారిది సాహసోపేతమైన నిర్ణయంగానే అనుకోవాలి. అందునా సహకార పద్ధతిలో వెలువరించిన ఈ క్రొత్త రచయితల (అందరూ కాదు) సంకలనానికి ఇంత ధర!
ఈ సందర్భంలో సిహెచ్.శివరామప్రసాద్ (వాణిశ్రీ)గారి ‘మా కథలు’ చెప్పుకోవాలి. వరుసగా ఆరు సంవత్సరాల నుండి వెలువరిస్తూ కొత్త, పాత రచయితలన్న శషభిషలకు పోకుండా రచయిత/త్రుల ఫోటోలుతో, వారి వివరాలను ఇస్తూ మూడు వందలపేజీల, 2017 సంకలనానికి నిర్ణయించిన ధర రూ.99/- మాత్రమే.
ఇదంతా చెబుతున్నది బాబుగారిని విమర్శించేందుకు కాదు. వారి సదుద్దేశము నాలుగు కాలాలపాటు కొనసాగి తెలుగు కథా ప్రపంచంలో ఒక క్రొత్త ఒరవడిని ప్రవేశపెట్టినందుకు అభినందిస్తూ ఇస్తున్న సలహా మాత్రమే!
ఇక సంచలనంలోని కథల విషయానికి వస్తే, 54కథల్లో 17గురు దాకా మంచి పేరున్న వారే అవటం గమనీయం! క్రొత్త రచయితలు (అని నేను భావిస్తున్న) కూడా చాలా బాగా రాస్తున్నారు.
అనుకోకుండా చాన్నాళ్ళ తరువాత కలుసుకున్న భగ్న ప్రేమికుల ప్రేమోదంతం, వాళ్ళు కనబర్చిన హుందాతనం ‘వికసించని కుసుమాలు’లో దేవరాజు రవి బాగా చెప్పారు. పరీక్షరోజు జగదాంబ సెంటర్ (విశాఖపట్నం)లోని ఒక ఏక్సిడెంటులో అబ్బాయి ప్రాణం కాపాడుతాడు. లేటుగా వెళ్లటంవల్ల సెంటర్‌లోకి అనుమతించబడక పరీక్ష తప్పుతాడు. మానవత్వం వర్సెస్ పరీక్షలో మానవత్వమే గొప్పది అని చెప్పే డా. డి.వి.జి.శంకర్‌రావుగారి ‘్ఫలితం’. మధ్యతరగతి మనఃస్తత్వాన్ని బాగా ఎనలైజ్ చేసిన కొమ్ముల వెంకట సూర్యనారాయణగారి ‘మామ్మ’. ఇద్దరిలోనూ ఆకలి కేకలు. ఉన్నవి చాలవు. చాలినన్ని ఉండవు. లేమిలో బ్రతుకులీడ్చేవారు ఇంతే! ఇద్దరూ దగ్గరవుతారు. ఒకరికి కొత్త, మరొకరికి అది అలవాటే. ఆతని ఆకలి తీరాక, ఆమె అతని జేబులు తడుముతుంది. కేవలం ఒకే ఒక వంద నోటు, ఇంటినుండి వచ్చిన ఉత్తరం, ఉత్తరంలోని డబ్బు అవసరాలు చదివి చలించిపోతుంది. తన దగ్గరున్న వంద నోటు కూడా, పర్సులో ఉంచి, తనకు ‘బాగా అలవాటైన చీకట్లోకి నిర్భయంగా నడిచింది’ మంజరిగారి ‘గదిలో వాళ్ళిద్దరూ’లో. పేరున్న రచయితల కధలకు ఏ మాత్రమూ తీసిపోని కథ.పేరొందిన మల్లాది, యండమూరి, సలీం, సింహప్రసాద్, దాట్ల దేవదానం రాజు లాంటి రచయితల కథలు సంకలనంలో మణిపూసల్లా భాసిస్తున్నాయి. కొత్త పాటల మేలుకలయికలా వస్తువైవిధ్యం కథనం శిల్పం - అన్నీ బాగా సమకూడిన సంకలనం ఇది. సంపాదకులు పై సూచించిన వాటిపై దృష్టిసారించితే, ముందు ముందు వచ్చే సంకలనాలు మరింత బాగా ఉంటాయి అని నిశ్చయంగా చెప్పవచ్చును.

-కూర చిదంబరం 8639338675