పఠనీయం

ఆలోచింపజేసే ‘ఆత్మీయరాగం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మీయరాగం (కథలు)
-రాజేష్ యాళ్ల
వెల: రూ.120
ప్రతులకు: జ్యోతివలబోజు cell No. 8096310140

** ********************

కథా రచనలో చెయ్యి తిరిగిన రచయితలు చాలామంది ఉన్నారు. ఆధునిక జీవన పార్శ్వాల్ని బహుముఖ కోణాల్లో తడుముతూ కథలుగా చిత్రించే కథకుల్లో రాజేష్ యాళ్ల ఒకరు. మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు పాశ్చాత్య నాగరికతా ప్రభావ ఛాయల్ని ఎలా పులుముకుంటున్నాయో ఈ కథలు నిరూపిస్తాయి. ఇటీవలే ఆవిష్కరించిన కథల సంపుటి ‘ఆత్మీయరాగం’. ఇందులో 16 కథలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క జీవన కోణాన్ని వెలికితీస్తాయి. ఈ సంఘర్షణ రాపిడిలోంచి రాటుదేలిన అనుభవాలే ఈ అక్షర సత్యాలు. వీటిని అనుభూతిస్తూ పలవరించే ప్రయత్నం చేద్దాం.
మానవత్వానికి అత్యవసర సంబంధానికీ మధ్య తొంగిచూసే విలక్షణమైన వైవిధ్యపూరిత కథ ‘స్వచ్ఛమైన నవ్వు’. ఉత్తేజ్ దగ్గర జూనియర్‌గా చేస్తున్న కొలీగ్ ఆకాశ్ ఒకసారి తన పర్సులోని వస్తువులన్నీ పోగొట్టుకొని దిగులు పడుతున్నంతలో పోలీసుస్టేషన్ నుండి ఫోన్ రావడంతో ఊపిరి పీల్చుకుంటాడు. పొరపాటున వేరొకరి డ్రైవింగ్ లైసెన్స్ తన పర్సులో కనిపించడంతో ఒకింత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో తనకు యాక్సిడెంట్ జరగడంతో అంబులెన్స్ డ్రైవర్ సకాలంలో హాస్పిటల్‌కి చేర్చి, ప్రాణాలను కాపాడుతాడు. చివరికి తనను రక్షించిన డ్రైవర్ లైసెనే్స తనను రక్షించిందనే నిజాన్ని ఉత్తేజ్ ద్వారా తెలుసుకుని పశ్చాత్తాప భావనకు గురికావడం ఈ కథలోని కొసమెరుపు. అవసరం విలువను చాటిచెప్పే కథ ఇది. మానవీయ కోణంలో పాఠకులను ఆలోచింపజేసి చైతన్యవంతం చేస్తుంది.
సహజీవనం పేరుతో ఓ యువ జంట కొత్తగా ఒక ఫ్లాట్‌లో దిగిన కొన్ని నాళ్లకే వరుణ్ భార్గవిని విడిచి దీపికతో వెళ్లిపోవడంతో ఆమె అయోమయంలో పడుతుంది. ఇది గమనించిన ఫ్లాట్ యజమాని ఆమెను ఓదార్చి, భార్య సహకారంతో అయిదు రోజులు ఆశ్రయమిచ్చి, భార్యను పోగొట్టుకున్న తన కుమారుడు ప్రదీప్‌కి ఇచ్చి కట్టబెట్టాలనే ప్రయత్నంలో ఉంటారు. కానీ భార్గవి తన ప్రియుడిపై పోరాటం కోసం సంసిద్ధపడి బెంగుళూరు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని, సొంతింటికి వెళ్లిపోతుంది. తన ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా ఓ లేఖ రాసి పోతుంది. ఈ ఇతివృత్తాన్ని ‘చిక్కుముడి’ కథగా మలచడంలో రచయిత నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. ముందుచూపుతో దూరాలోచన లేని జీవితాలు చివరికి ఎలాంటి మలుపులతో దుష్ఫలితాన్ని పొందుతుందో తెలియజెప్పే కథ ఇది.
ఉద్యోగ వ్యామోహంలో పడి కన్నకూతురి పెంపకాన్ని నిర్లక్ష్యం చేసే అనూష చివరికి తల్లి త్యాగాన్ని తండ్రి మాటల్లో తెలుసుకొని పశ్చాత్తాపంతో కుంగిపోయే కథ ‘పేషన్’. ఉద్యోగ విషయంలో భర్త, అత్తమామల మాటలు కాదని మొండికేసి, కూతురి ద్యుతిని ‘బేబీ కేర్ సెంటర్’లో పడెయ్యడానికి వెనకాడని మనస్తత్వాన్ని చాలా బలంగా చిత్రీకరించారు రచయిత. చిన్నప్పుడు తనకొచ్చిన ఫిట్స్ రోగాన్ని దూరం చెయ్యడానికి తల్లి పద్మ ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, కంటికి రెప్పలా కాపాడుకొచ్చిన తీరు మాతృత్వ ఔన్నత్యానికి దర్పణంగా నిలుస్తుంది. చాలా విశాల దృక్పథంతో గొప్ప ఆర్ద్రతను కలిగిస్తుంది. ఇలాంటిదే మరొక కథ. స్ర్తిల ఉద్యోగ బాధ్యతల్ని ఆసరాగా చేసుకుని శారీరక లైంగిక వాంఛల్ని తీర్చమని పోరుపెట్టే పై అధికారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే కథ ‘మోనికా యూ ఇడియట్’ స్ర్తిలోలత్వం పేరుతో రిషీ లాంటి యువకుడు ప్రాజెక్ట్ నెపంతో మోనికా ప్రమోషన్‌కి అడ్డం పడటంతో, ట్రూత్ టీవీ సహాయంతో నేరుగా పట్టించి, పలువురి ప్రశంసలకు కారణభూతమవుతుంది మోనిక. ఈ గెలుపు స్ర్తి జాతి మొత్తాన్ని చైతన్యవంతం చేసి, ప్రగతి దిశగా ముందడుగు వేసేలా చేస్తుంది.
మార్కులు, ర్యాంకుల వేటలో పిల్లల్ని వేధించి, వెంటాడే తల్లులకు కనువిప్పు కలిగించేది ‘కలలు’ కథ. ఆద్యంతమూ ఆసక్తికరంగా ఆలోచనాత్మకంగా సాగుతుంది. చిన్నప్పట్నుంచి ఎన్ని మంచి మార్కులతో ర్యాంకులు తెచ్చుకున్నా తృప్తి చెందని పూజ మనస్తత్వానికీ, సాధించిన వేధింపులకీ మానసికంగా కుంగిపోతాడు కొడుకు నాని. ఇంటర్మీడియెట్ తర్వాత.. ఓ రోజు చెప్పాపెట్టకుండా వేరే రెసిడెన్షియల్ కాలేజీలో సీటు రిజర్వ్ చేసుకుని, ఓ లేఖ రాసి పుస్తకంలో పెట్టి వెళ్లిపోతాడు కొడుకు. పిల్లల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా, వ్యక్తిగత స్వేచ్ఛకి అవకాశమివ్వకుండా, బాల్యాన్ని తమ చేతలతో కాలరాసే మధ్యతరగతి మనస్తత్వాలకు పూజ పాత్ర ఒక చెంపదెబ్బ లాంటిది. కొసమెరుపుతో రచయిత జ్ఞానోదయాన్ని కలిగించిన తీరు భావి తరాలను ఆలోచింపజేస్తుంది.
వృత్తిరీత్యా బ్యాంకు క్యాషియర్‌గా పనిచేస్తున్న మాధవ్‌కి అనుకోని రీతిలో పరిచయమవుతాడు వృద్ధుడు గణపతి. అతని శ్రీమతి. కొన్నాళ్టికి బాగా చేరువయ్యాక కుటుంబ మిత్రులుగా మారిపోతారు. సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశ సందర్భంలో తమ కొడుకులు విదేశాల నుండి రాలేని విషయాన్ని బాధతో చెబుతూ, ఆ బాధ్యతను కూడా మాధవ్ దంపతుల నెత్తిన వేస్తారు. ఈ నేపథ్యంలో తాను పల్లెటూళ్లో విడిచిపెట్టి వచ్చిన తల్లిదండ్రులను కలుసుకునేందుకు తిరుగు ప్రయాణమవుతాడు మాధవ్. అక్కడ తండ్రి క్షయ రోగంతో మంచాన పడి ఉండడం చూసి, తల్లి ప్రేమాప్యాయతలకు చలించిపోతాడు. తనతో వాళ్లను తిరిగి ఇంటికి తీసుకుపోవడంతో ఈ ‘నిశ్చింత’ కథ ముగిసిపోతుంది. దూర ప్రాంతాల్లో తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఉద్యోగ బాధ్యతలతో తలమునకలై కొట్టుమిట్టాడే పిల్లల స్థితిగతుల్ని చాలా అర్థవంతంగా లోతుగా చర్చిస్తుంది ఈ కథ.
ఇలాంటివే మరికొన్ని వైవిధ్యపూరితమైన కథలు ఈ సంపుటిలో చాలా ఉన్నాయి. వీటిలో ఆత్మీయరాగం, ఆమె ఒంటరి కాదు, అన్నయ్య మనసు, అసమంజసం, గౌరవం, నీలకంఠం, ఆ గువ్వకు ఇప్పుడు ఎగరడమొచ్చింది, స్వేచ్ఛ, ప్రక్షాళన మున్నగు కథలు. వీటి మూలాల లోతుల్ని వర్తమాన సామాజిక ప్రపంచంతో ముడిపెట్టి చెప్పడంలో రచయిత రాజేష్ యాళ్ల సమతౌల్యాన్ని, సహన దృష్టిని, సహజ పోకడల్ని కళ్లకి కట్టించే ప్రయత్నం చేశారు. రచనాశైలిలో మంచి బిగువూ, వ్యక్తీకరణలో సరళత్వం, సున్నితత్వం, సూటిదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. తీవ్ర భావోద్వేగాల మధ్య సునిశిత పరిశీలనా దృష్టి ఈ రచయిత సొంతం. కాబట్టే పాఠక జనానికి చేరువలో ఒక సామాజిక వాస్తవికతకి సజీవ నిలువుటద్దంలా ప్రతిబింబిస్తూ నిలబడ్డాయి. లోకం పోకడలను అవగతం చేసుకొని జీర్ణించుకున్న తర్వాతే ఈ కథల ఇతివృత్తాలను పరిశీలనలోకి తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇది రచయిత తొలి కథల సంపుటే అయినప్పటికీ మంచి పరిపక్వతతో సృజనాత్మక శైలితో రాసినట్టుగా ద్యోతకమవుతుంది. భవిష్యత్తులో మరిన్ని గొప్ప కథల కూర్పుతో అనేక సంపుటులను తీసుకురావాలని ఆశిస్తూ రాజేష్‌గారి కృషిని మనస్ఫూర్తిగా అభినందిద్దాం.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910