పఠనీయం

విలువైన సమీక్షామాలికిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమీక్షామాలిక
రచన: సి. ఉమాదేవి
వెల: రూ. 120/-లు
జె. వి. పబ్లికేషన్స్ హైదరాబాద్ ఫ్లాట్‌నెం. 501, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ -73
==========================================================
కవులు, రచయిత(త్రు)లు తమ రచనలను పుస్తకాలుగా ప్రచురించుకున్నాక, వాటి అమ్మకాల సంగతి ఎలా వున్నా ముందుగా పత్రికలలో తమ పుస్తకాలమీద సమీక్షలను ఆశించి, ఆయా పత్రికలకు రెండేసి ప్రతులు పంపి ఎదురుచూస్తూంటారు. సాధారణంగా ప్రతి పత్రికకూ ఒక సమీక్షకుల ప్యానల్ వంటిది ఉంటుంది. సంపాదకులు ఆయా సమీక్షకులకు తమకు వచ్చిన గ్రంథాలను కొన్నింటిని ‘స్వీకారం’లో వేసేసినా, సమీక్షించదగిన పుస్తకాలుగా భావించినవాటిని సమీక్షార్థం ఇస్తూంటారు. అయితే సమీక్షకులు ఆ గ్రంథాన్ని సాకల్యంగా చదివి సంపాదకులు నిర్దేశించిన నిడివిలో రాసి పంపితే వాటిని ఓ క్రమంలో వీలువెంట ప్రచురించడం జరుగుతూంటుంది. అయితే సమయం వెచ్చించి తమకు వచ్చిన పుస్తకానికి వెంటనే సమీక్ష రాసి పంపడం అందరు సమీక్షకులూ చేయరు. కొందరయితే విస్మరించేస్తూంటారు కూడాను. తమకు ఇవ్వబడిన గ్రంథం, ఆ గ్రంథ రచయిత, ఎవ్వరైనా రాగద్వేషాలు లేక సహృదయంతో పుస్తకాన్ని బేరీజు వేసి సమీక్షించగలగడం సమీక్షకుల లక్షణం కావాలి. తమకు నచ్చకపోతే రాయమని ముందే చెప్పాలి. అలా కాక సమీక్ష రాయకుండా విస్మరించడం, లేక చాలా ఆలస్యంగా రాయడం చేసే సమీక్షకులుంటారు. కానీ కొందరు మాత్రం బాధ్యతగా, పుస్తకాన్ని ఆసాంతం చదివి, మంచి చెడులు బేరీజువేస్తూ, రచయిత కృషిని గుర్తించి సమీక్షను సకాలంలో పంపి సంపాదకులకు, తమ సమీక్షను త్వరగా చూసుకోగల ఆనందాన్ని రచయితలకు అందచేస్తూంటారు.
నిజానికి గ్రంథ సమీక్ష అనేది అలవోక వ్యవహారం కాదు. పుస్తకానికి గల ముందుమాటలో, పీఠికలో చదివేసి సమీక్షకులు రాసేయడం కాదు. ఆ గ్రంథ రచయిత హృదయాన్ని, వారి రచనా సంకల్పాన్ని పట్టుకోవాలి. కేవలం రంధ్రానే్వషణ దృష్టి పనికిరాదు. సమీక్ష అనేది సాహిత్య విమర్శనా వ్యాసం కాదు. ఒక్కసారి సమీక్షకు పత్రికలో కేటాయించిన నిడివి కూడా తక్కువగా వుంటుంది. అయినా వున్న పరిధిలోనే పుస్తక సమీక్షను నెరపాలి. రచనలోని లోటుపాట్లను చెప్పకూడదని ఎవరూ అనరు. కానీ రచయితకు ఆ సమీక్ష ప్రోత్సాహదాయకంగానూ, పాఠకులకు ఆ పుస్తకాన్ని గురించిన సమాచారం గ్రంథ పఠనాసక్తి కలిగించేదిగానూ వుండగలగాలి. సమీక్షకుడు రచయితకు, పాఠకునికీ మధ్య వారథి వంటివాడు. ఒకప్పుడు భారతి వంటి సాహిత్య పత్రికల్లో గ్రంథ సమీక్షకు గొప్ప విలువ వుండేది. సంవేదన వంటి పత్రికలో రా.రావంటి తీవ్ర విమర్శకులూ వుండేవారు. రచయితలు కూడా సమీక్షను సహృదయంతో స్వీకరించలగాలి. కేవల ప్రశంసలూ, పొగడ్తలే సమీక్షనుంచి ఆశించకూడదు. సమీక్షకులు కూడా సమ్యకదృష్టితో వ్యవహరించాలి. రచయితను బట్టి కాక రచనను బట్టి సమీక్ష సాగడం మంచిది. సమీక్ష ఆ రచనను బట్టి వుంటుందికానీ ఆ రచయితపైగల వైయక్తిక అభిప్రాయాల మూలకందంగా కాదు. నిజమైన సమీక్షకుడు ఆ సమతుల్యతను పాటిస్తాడు.
తాము చేసిన పుస్తక సమీక్షలను సమీక్షకులు గ్రంథ రూపంలో ప్రచురించడం కూడా ఒక ప్రయోజనవంతమైన పని. అనేక గ్రంథాలను గురించి, రచయితలను గురించి ఒకచోట పరిచయం చేసుకోగల అవకాశం ఆ సమీక్షలద్వారా చదవదగిన పుస్తకాలను ఎంపిక చేసుకుని వాటిని సేకరించుకుని చదివే ఆసక్తి పాఠకులకు లభిస్తుంది. సి.ఉమాదేవిగారు ‘సమీక్షామాలిక’ పేరిట తాము చేసిన 65 గ్రంథాల సమీక్షలను ఒక పుస్తకంగా ప్రచురించి మంచి పనిచేశారు. జె.వి.పబ్లికేషన్స్ జ్యోతి వలబోజుగారు మహిళా పబ్లిషర్‌గా ఖ్యాతిగాంచి, ముఖ్యంగా అనేకమంది రచయిత్రుల గ్రంథాలను ముద్రించుకున్నారు. ఆవిడ ప్రచురణల సంఖ్య ఏనాడో శతాధికమైంది.
సి.ఉమాదేవిగారు ఆంధ్రప్రభ, సూర్య వంటి పలు పత్రికల్లో సమీక్షకురాలిగా పుస్తక సమీక్షలను చేస్తున్నారు. ఆమె ‘‘ఏ రచనయినా చదివినపుడు అందులో నిబిడీకృతమైన అంతర్భావం ద్వారా మన ఆలోచనలకు తొలిబీజం వేస్తుంది. ఆ అక్షరకేళి మనసును పదే పదే వెంటాడుతుంది. పుస్తకం ఏమి చెప్తోంది, ఎందుకు చెప్తోంది, ఎలా చెప్తోంది అనే ప్రశ్నలకు సమాధానమే నా సమీక్షమాలిక’’ అంటారు. ఉమాదేవి మంచి సమీక్షకురాలు. సమీక్షకులంటే తొలుత ఉత్తమ పాఠకులన్నమాటే! అయితే విశే్లషణాశక్తిగల పాఠకులు. ఒక పుస్తకం చదివి దాని మంచి చెడులను గురించి పదిమందికీ పంచగల నేర్పరులు. అలాంటి నేర్పరితనం ఉమాదేవిగారిలో వుంది. ఈ 65 సమీక్షల్లో ఒకే రచయితవి నాలుగైదు పుస్తకాలు సమీక్షించినవీ వున్నాయి. అలాగే కవిత, కథ, నవల వంటి పలు ప్రక్రియా గ్రంథాలపై రాసిన సమీక్షలున్నాయి. అందరూ సమీక్షకులూ అన్ని రకాల పక్రియా గ్రంథాలను సమీక్షించే సమర్థులు కారు. కథలను విశే్లషించిన ఓ సమీక్షాకాలం కవితా విశే్లషణ చేయలేకపోవచ్చు. లేదా మరో వ్యాస సంకలనాన్నో, జీవిత చరిత్రనో బేరీజు వేసే సామర్థ్యం కలది కాకపోవచ్చు. అందుకే ఏ సమీక్షకులకు ఏ పుస్తకాలు సమీక్షలు చేయించడానికి ఇవ్వాలో సంపాదకులకు తెలుస్తుంది, తెలియాలి. అయితే ఎలాంటి పుస్తకాన్నయినా సమీక్షించగల బహుముఖీన ప్రతిభ కొందరికే వుంటుంది. నిస్సందేహంగా ఉమదేవిగారు ఆ వరుసలోనివారే. ఏ పుస్తకం సమీక్షించినా దానికి న్యాయం కూర్చగల ప్రజ్ఞ, అతి చిన్న సమీక్షలో సైతం పుస్తకంలోని ప్రాముఖ్యత దర్శింపజేయగల నైపుణ్యం వారికి వుంది.ఎందరో రచయిత్రుల నవలా, కథా సంపుటాలను మరెందరో రచయితల గ్రంథాలను అలాగే యువ రచయితల గ్రంథాలను కూడా ఈ సమీక్షామాలికలో అందుకోవచ్చు. ప్రతి సమీక్షకూ చక్కని శీర్షికను సంతరించడం మరో విశేషం. ఏమయినా తమ పుస్తకం ఉమాదేవిగారు సమీక్షిస్తే బాగుండుననిపించేలా రచయితలకూ, ఉమాదేవిగారి సమీక్ష చదవాలనిపించేలా పాఠకులకూ, ప్రియమైన సమీక్షకురాలిగా ఆవిడ మున్ముందు మరింతగా భాసించాలని నా ఆకాంక్ష.

-సుధామ 98492 97958