పఠనీయం

దినపత్రిక బతుకు అర్ధగంట (గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాసా సుబ్బారావు గారు. పేరొందిన పాత్రికేయుడు. జగమెరిగిన జర్నలిస్ట్.
గోరాశాస్ర్తిగారి గురించి మొదలు పెట్టి ముందుగా ఖాసా గారి ప్రసక్తి ఎత్తుకోవడం ఎందుకంటే, తెలుగువారం అందరం గర్వించే ప్రసిద్ధ పాత్రికేయుడు గోరాశాస్ర్తి గారు జర్నలిజం రంగంలోకి రావడానికి ఖాసా సుబ్బారావుగారే ప్రధాన కారణం. అంతవరకూ గోవిందు రామశాస్ర్తిగా రైల్వేలో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్న ఆ పెద్దమనిషిని పిలిచి మరీ స్వతంత్ర (ఇంగ్లీష్) పత్రికలో ఉద్యోగం ఇచ్చారు. జర్నలిజం అంటే ఏమిటి? పత్రికలంటే ఏమిటి? ఇవేవీ రామశాస్ర్తి గారికి అంతవరకు ఏమీ తెలియదు. అయినా ధైర్యంగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి మద్రాసు చేరారు. చేరి ఖాసా సుబ్బారావు గారు ఎంతో నమ్మకం పెట్టుకుని తనకు అప్పగించిన పాత్రికేయ కొలువులో చేరిపోయారు. అంతే వెనుతిరిగి చూసుకోలేదు. వృత్తికి ప్రవృత్తి తోడయింది. కలంలోని బలం అర్థమయ్యాక గోవిందు రామశాస్ర్తి గారు గోరాశాస్ర్తిగా మారిపోయారు. అదే పేరుతో జర్నలిజంలో కొత్త శిఖరాలకు ఎగబ్రాకారు. స్వతంత్ర మేగజైన్ ఎడిటర్‌గా ఎంతో మంది వర్థమాన రచయితలను ప్రోత్సహించారు. అలా ఆయన వెన్నుతట్టి పెన్ను పట్టించిన వారిలో అనేకమంది తదనంతరకాలంలో సుప్రసిద్ధ రచయితలుగా, పత్రికారచయితలుగా రూపొందారు. ఆంధ్రభూమి ఎడిటర్‌గా చేరినప్పటి నుంచి ఆయనలోని ప్రజ్ఞాపాటవాలు మరింతగా వెలుగు చూశాయి. కేవలం సంపాదకీయం చదవడం కోసమే పత్రిక కొనే సంప్రదాయం గోరాశాస్ర్తి గారితో మొదలయ్యిందంటే అతిశయోక్తి కాబోదు.
పత్రికా రచయిత, సంపాదకుడు అనేవి ఆయనలో ఒక కోణం మాత్రమే. శ్రవ్య మాధ్యమమైన రేడియోకి నాటకం ఎలా రాయాలి? అనే విషయాన్ని ఆయన కాచి వడబోశారు. ఆ చేత్తోనే మరెన్నో అపురూప రచనలు చేస్తూ నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సారస్వత మాగాణాన్ని పండించారు.
జర్నలిజానికి సంబంధించిన ఓనమాలు తెలియకుండానే ఆ రంగంలో ప్రవేశించి, తనంటే ఏమిటో నిరూపించుకుని తెలుగు పత్రికలను గురించి తయారుచేసిన పరిశోధనా పత్రం సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. తెలుగులో పత్రికా రచయితలు కావాలనే అభిలాష కలిగిన వారికోసం సుబోధకమైన శైలిలో అనేక పుస్తకాలు రాశారు. ‘అనువదించడం ఎలా? మీరూ జర్నలిస్ట్ కావచ్చు’ అనే శీర్షికలతో రాసిన వారి రచనలు విశేష ప్రాచుర్యం పొందాయి.
గోరాశాస్ర్తి గారు పుట్టింది ఇప్పుడు ఒడిషా అని పిలుచుకుంటున్న ఒకప్పటి ఒరిస్సాలో. కోరాపుట్ జిల్లాలోని తోరామాల్ గ్రామంలో 1919 అక్టోబర్ మూడో తేదీన జన్మించారు. చదివింది బియ్యే వరకే. మంచి ఉద్యోగం అని ఎదురుచూడకుండా ఎదురొచ్చిన ప్రతి చిన్నా చితాకా ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళారు. ఆ అనుభవాలు అన్నీ ఒక పత్రికా రచయితగా, ఒక సాహిత్యకారుడిగా ఆయనకు ఉపయోగపడ్డాయి కూడా. ఖుర్దా రోడ్ స్టేషన్‌లో రైల్వే గుమాస్తాగా చేస్తున్న రోజుల్లో ఉబుసుపోకకు ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో రచనలు చేయడం మొదలు పెట్టారు. వాటిల్లో అనేకం ఆనందవాణి, ‘కథానిక’ ఆంధ్రపత్రిక, దీపిక, నవశక్తి, శ్రమజీవి మొదలయిన పత్రికలలో ప్రచురణకు నోచుకునేవి.
ఆనందవాణి సంపాదకులు ఉప్పులూరి కాళిదాసు గారు వాటిని చదివి కుర్ర శాస్ర్తి గారిలోని రచనా శైలికి ముగ్ధులై ఆయన గురించి ఖాసా సుబ్బారావు గారికి ఎరుకపరిచారు. శాస్ర్తి గారి ఆంగ్ల రచనలు సుబ్బారావు గారికి బాగా నచ్చాయి. ఆయన టెలిగ్రాము ఇచ్చి శాస్ర్తి గారిని పిలిపించుకుని స్వతంత్ర పత్రికలో ఉద్యోగం ఇచ్చారు.
ఆంగ్ల స్వతంత్రకు తోడుగా ప్రారంభించిన తెలుగు స్వతంత్ర పత్రికలో శాస్ర్తి గారు మొదలు పెట్టిన ‘వినాయకుడి వీణ’ శీర్షిక తెలుగు పత్రికాలోకంలో ఒక సంచలనంగా మారింది. శాస్ర్తిగారికి విశేషమైన పేరు ప్రఖ్యాతులు కట్టబెట్టింది. స్వతంత్ర పత్రిక మూతపడిన తర్వాత శాస్ర్తి గారి మకాము హైదరాబాదుకు మారింది. ఆంధ్రప్రభలో ప్రత్యేక ప్రతినిధిగా కొంతకాలం పనిచేసిన పిమ్మట ఆంధ్రభూమి సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి మరణించేవరకు అదే బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించారు.
ప్రముఖ హేతువాది ఎన్.ఇన్నయ్య ఒక వ్యాసంలో శాస్ర్తిగారిని గురించి రాస్తూ సంపాదకుడు అనేవాడికి సమయ జ్ఞానం అవసరం అని శాస్ర్తిగారు చెబుతుండేవారని పేర్కొన్నారు. ‘దినపత్రిక బ్రతుకు అర్ధగంట. ఆ తర్వాత పకోడీ పొట్లాలకే పనికొస్తుంది’ అనేవారట శాస్ర్తి గారు.

-భండారు శ్రీనివాసరావు 98491 30595 http://bhandarusrinivasarao.blogspot.com