పఠనీయం

సాహిత్య సామాజిక వ్యాస దర్శనము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాసదర్శనము - సాహిత్య సామాజిక వ్యాస సంకలనం-
రచన: ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, వెల:రూ.350/-, ప్రతులకు: నవోదయ ఆర్య సమాజ్ మందిర్ ఎదురుగా, కాచిగూడ, హైదరాబాద్-500 027, తెలంగాణ. ఫోన్:040-24652387.
================================================================
చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ వివిధ పత్రికలలో సందర్భోచితంగా రచించిన ఎన్నో విలువైన వ్యాసాలు ఇటీవల సంకలనాలుగా వస్తున్నాయి. ఆ పరంపరలో వచ్చిన తాజా గ్రంథం ‘వ్యాస దర్శనము’. ఇందులో భారతీయ సంస్కృతి మూల సూత్రాలు, పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం వంటి బరువైన వ్యాసాలతోబాటు సావిత్రి బయోపిక్, సంజయ్‌లీలా భన్సాలీ తీసిన పద్మావత్ వంటి చిత్రాలపై చారిత్రక దృక్పథంతో చేసిన సమీక్షా వ్యాసాలు కూడా ఉండటం గమనార్హం.
ప్రొఫెసర్ మాదిరాజు రంగారావు అవిశ్రాంత సాహితీ కృషీవలుడు. ఆయనను ప్రశంసిస్తూ వారి సాహిత్య గ్రంథాన్ని విశే్లషిస్తూ ఒక సమాలోచనం ఉంది. రంగారావు తన గ్రంథంలో అరవిందుణ్ణి, రవీంద్రుణ్ణి, స్ఫోటవాద ప్రవక్తను ప్రస్తావించారు. ఆ సారాంశం ఈ చిన్న వ్యాసంలో విద్యార్థులు అవగతం చేసుకోవచ్చు.
పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం మానవుని సర్వాంగీణ వికాసాన్ని కోరుతుంది. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాల సంతులనం సమాహారం ఆయన ప్రతిపాదించారు. ఈ వివరాలు శివప్రసాద్ ఒక పరిశోధనా పత్రంగా ఇందులో సమర్పించారు. రచయిత చిన్ననాటి ముచ్చట్లు నూరేండ్ల క్రింద తెలుగు జనపదాలు ఎలా ఉండేవో ఇందులో వారు రెండు దీర్ఘవ్యాసాలల్లో వివరించి మహోపకారం చేశారు. ఈతరంవారికి ఇది తెలియని సమాచారం.
ఋతమ్ అంటే ఏమిటి? సత్యమేవ జయతే అనే ముండకోపనిషత్ వాక్యానికి అర్థం ఏమిటి? భారతీయ సంస్కృతికి మూల స్తంభాలేమిటి? ఈ వౌలిక చర్చను శివప్రసాద్ ఒక వ్యాసంలో చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు మాదాల వీరభద్రరావు శతజయంతిని పురస్కరించుకుని వారి జీవన రేబాలను మరొక వ్యాసంలో పరిచయంచేశారు.
హరికథా భిక్షువు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తిగారు హరిదాసులకు ఒక ఒరవడి- ఒక పరవడి. ఆయన జీవితంపై ఓ అందమైన వ్యాసం ఇందులో ఉంది. ఒంగోలుకు చెందిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి.హనుమారెడ్డి చేస్తున్న సాహిత్య సేవపై ఓ ప్రశంసా వ్యాసం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వ్యాస దర్శనం ఒక విజ్ఞాన సర్వస్వంలా కన్పడుతున్నది. ఇందులో వర్తమాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాల తీరుతెన్నులపై తీవ్రమైన నిరసన తెలిపే సమాచారం సోదాహరణంగా ఉంది.
యోగ్యతను బట్టి కాక పైరవీలతో పురస్కారాలు కొనుక్కోవటం నేడు ఆనవాయితీగా మారిన వికృత ధోరణిని ప్రొఫెసర్ శివప్రసాద్ ఎత్తిచూపారు. చివరకు భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలు కూడా రాజకీయ ప్రయోజనాలతోనే ప్రకటించటం దుర్మార్గం అన్నారు రచయిత.
ఈ వ్యాస సంకలనంలో అప్పుతచ్చులు అనే ఓ ఆసక్తికరమైన వ్యాసం ఉంది. నేడు పత్రికలలో వస్తున్న శబ్ద దోషాలపై ఈ వ్యాసం వేలెత్తి చూపుతుంది. పండితులైన ప్రూఫ్ రీడర్లు పత్రికలలో లేకపోవటం పెద్ద లోపం అంటారు శివప్రసాద్. ఈయనది ప్రధానంగా చారిత్రక దృష్టి. భారతదేశ చరిత్ర పాఠ్య గ్రంథాలల్లోను చలన చిత్రాలల్లోను ఎలా వక్రీకరింపబడుతున్నదో వీరు ఉదాహరించారు.
సిసిల్ బిడిమెల్లో టెన్‌కమాండ్‌మెంట్స్ తీసినప్పుడు చూపిన చారిత్రక ప్రామాణ్యం బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు ఎందుకు చూపటంలేదు. ఇది కళామతల్లిని అవమానించినట్లే అంటారు శివప్రసాద్.
ఈ వ్యాసాలు లోగడ ఆంధ్రభూమి దిన, వార, మాస పత్రికలలో వచ్చినవే అయినా అన్నీ ఒకేచోట సంకలనం చేయటం పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తుంది.
శ్రీమతి జలంధర పాజిటివ్ ఎనర్జీ ఎలా మానవుడు సంపాదించుకోవాలో మైత్రి అనే శీర్షిక ద్వారా నిరూపించింది. ఆ తర్వాత ఆ సమాచారం నాలుగు సంపుటాలల్లో గ్రంథరూపంలో వెలువరించారు. ఈ సంపుటాలపై ప్రొఫెసర్ గారి సమీక్షా వ్యాసాలు ‘దైవీ మానసిక చికిత్స’ పేరుతో ఇందులో చేర్చటం ముదావహం.
మంచి పుస్తకాలు రావటంలేదని పాఠకులు చేస్తున్న ఫిర్యాదుకు సమాధానంగా ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ వ్యాసదర్శనం వెలువరించారు. ప్రతివారు చదివి పదిలంగా పదికాలాలపాటు దాచుకోవలసిన గ్రంథం వ్యాస దర్శనము. దీనిని వై.ఎస్.ఆర్.మూర్తి అనే సాహిత్య కళాపోషకునికి అంకితం చేయటం సముచితంగా ఉంది.

-జొన్నాభట్ల నరసింహప్రసాద్