పఠనీయం

స్ర్తివాద ధిక్కార స్వరమే ‘నీలిగోరింట’ ప్రతిబింబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలిగోరింట (కవిత్వం) - మందరపు హైమవతి, విజయవాడ-520003,
ప్రతులకు: ప్రజాశక్తి అన్ని బ్రాంచీలు, విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు, నవతెలంగాణ, నవచేతన బుక్ హౌస్,
కాచిగూడ, హైదరాబాద్.
=================================================
ఇరవైయ్యొవ శతాబ్దంలో ఊపందుకున్న బలమైన స్ర్తివాద గొంతుకల్లో ఆరితేరిన పదునైన మహిళా కవితాస్త్రం మందరపు హైమవతి. ‘సూర్యుడు తప్పిపోయాడు’, ‘నిషిద్ధాక్షరి’ కవితా సంపుటులతో సాహిత్య లోకానికి సుపరిచితమైన గొంతు ఈమెది. వక్తగా, వ్యాసకర్తగా, సమీక్షకురాలిగా తనదైన ముద్రవేసుకుని, పలు పురస్కారాలను సొంతం చేసుకున్నారు. సభలూ, సమావేశాలూ, సమ్మేళనాల్లో విరివిగా పాల్గొన్నారు. ఈమె రచనలపై యూనివర్సిటీ విద్యార్థులు పరిశోధనలు చేశారు. అనేక కవితలు, సంపుటులు ఇతర భాషల్లోకి అనువాదం పొందాయి.
ఇపుడు మళ్లీ ‘నీలి గోరంట’ కవితా సంపుటితో పాఠకలోకంలోకి అడుగుపెట్టారు. అస్తిత్వవాదాలూ, ఉద్యమాల ప్రభావంతో సృజనాత్మకమైన రచనలు చేసి, క్రియాశీలకమైన పాత్రను పోషించారు. స్ర్తివాద ఉద్యమంలో భాగంగా విభిన్నకోణాల్లోని ప్రతికూలాంశాలను ఎండగడుతూ లబ్దప్రతిష్ఠురాలైన సాహితీవేత్తగా ప్రత్యేక స్థానాన్ని పొందారు.
‘‘రెండు వందలు డెబ్భై రోజులు / రక్తంలో రక్తమై ఊపిరిలో ఊపిరై/ కడుపులో కదలాడిన పాపాయి / కన్ను తెరిచిన క్షణమే / కన్నతల్లికి దూరమైన దుఃఖగాథ కన్నా, విషాదగాథ ఏముంటుంది’’- అంటూ సందేహాత్మకంగా అనేక ప్రశ్నల బాణాలను సంధిస్తారు కవయిత్రి మందరపు హైమవతి ‘అద్దెకో గర్భం’ కవితలో. ‘సరోగసి’ పేరుతో ఇష్టారాజ్యమేలుతున్న ఒక పాశ్చాత్య సంస్కృతి మన దేశానికి కూడా సంక్రమించి విషబీజాన్ని నాటుతోంది. భర్త వీర్యకణాలతో కృత్రిమ బీజకణాల్ని, ప్రత్యామ్నాయ మాతృగర్భకోశంలో ప్రవేశపెట్టి కనే బిడ్డలతో పరాయి అమ్మతనాన్ని ఆపాదించే నవనాగరిక సంప్రదాయానికి స్వాగతం పలుకుతోంది వర్తమానతరం. ఈ నేపథ్యాన్ని ముక్తకంఠంతో నిరసన గళమెత్తి నిప్పులు చెరుగుతారు కవయిత్రి. భారతీయ ఆచార వ్యవహారాలకు ఇది చెంపదెబ్బ. దీనినే బహిష్కరించే ప్రయత్నం చేస్తారు.
‘‘సీరియళ్ళలో సినిమాలలో/ నాయికలను వెంటాడి వేధించే / నాయకులే ఆరాధ్యదైవాలైనప్పుడు/ కనిపించిన ప్రతి అమ్మాయి కామదేవతే’’ అంటారు ‘అంతరంగ గాయాలు’ శీర్షికలో.
చూస్తుండగానే / సూర్యరశ్మికి మంచుబొమ్మ/ కరిగిపోయినట్లు / నువ్వు నడక / మాట మనిషి మాయమై / ఒక జ్ఞాపకంగా మిగలడం విషాదం’ అని అంటున్నపుడు గతించిపోయిన అనుభవాల సారం ఒక యాంత్రిక ప్రపంచంలో కొట్టుమిట్టాడుతుండే భావన అంతర్లీనంగా దిగులుతో కూడిన విషాద సందర్భాన్ని గుర్తుచేస్తుంది. దీనినే నటన అనే మిథ్యా ప్రపంచంలో దినసరి జీవితాన్ని రోజుల మధ్య వెళ్లదీయడంగా గమనించాలి. ధ్వనిపూర్వకమైన వాస్తవ జగతికి దగ్గరచేసేతనాన్ని చేరువ చేస్తుందిది. ఈ ఒడుపుని అందుకోవడంలో స్ర్తివాద కవయిత్రిగా బహిరంతర స్వభావ లక్షణాన్ని కవితాత్మకంగా అందిపుచ్చుకున్నారు హైమవతి. ‘గుండెల్లో కొండంత ధైర్యముంటే / కొండల గుండెల్లోనూ విజయ స్తంభాలు/ నాటవచ్చని చాటి చెప్పిన మీరే/ ఎవరెస్టు కంటే ఎతె్తైన శిఖరాలు’ అంటారు ‘ఎవరెస్టుకంటే ఎత్తుగా’ కవితలో. ఎతె్తైన శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు చిన్నారులు ప్రదర్శించిన స్ఫూర్తిని విశ్వమానవీయం చెయ్యడంలో ఒక గొప్ప వారసత్వ భరోసాని లోకానికి కానుకగా అందిస్తారు ఈమె.
కవిత్వ తళుకుల్ని మెరుపులుగా అద్దే కొన్ని కవితావాక్యాలు ఆపాదమస్తకం మనల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. ‘నా సుందర సూర్యోదయాలన్నీ / వంటింటి ఆకాశంలో’, ‘క్షణాలు గడిచిపోతూనే వుంటాయి / కాలువలో వదిలిన కాగిత పడవల్లా’, ‘చినుకుల పురివిప్పి / నాట్యమాడుతుంది / వర్షామయూరం’, ‘గొడ్డలితో నరికిన మోడు / ఎర్రని చిరుగుల చిరునవ్వు చిలకరించినట్లు’, ‘రెక్కలు తడిసిన జంట పక్షుల్లా’, ‘దిగులు గీతల నలుపు రంగు విషాద చిత్రాన్ని’, నవ్వుల నదిలో కదిలే పువ్వుల నావను’, ‘పెదవులపై విరిసిన నందివర్థనాల నవ్వులు’, ‘మనసు చెమర్చిన అపురూప క్షణం’, ‘కలలు రెక్కలు విరిగిన పక్షిలా’, ‘నుదుటిపై చిందిన ఒక చినుకు / తీర్చిదిద్దిన తిలకం బొట్టు’, ‘కరకు గరికిపోచ కొసలను / చుంబించే మంచుముత్యం స్పర్శ’ వంటి పంక్తులు నిర్జీవంగాపడి వున్న ఊహలను కొత్త ఆలోచనలతో తట్టిలేపుతాయి. ఈమె కవితాత్మక శైలి సహజంగా కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. అందులో వర్ణనతోకూడిన ప్రతీకలు, భావచిత్రాలు కోకొల్లలు. ప్రాచీన పద్య సాహిత్యంపై ఉన్న పట్టు, పదబంధాల్లోని గాఢత, వాక్య నిర్మాణంలోని నిర్మలత్వం, నిరసనతనం పాఠక ప్రియుల్ని సమ్మోహనభరితం చేసి ఆకట్టుకుంటాయి. స్ర్తివాద ధిక్కార స్వరంతో బహుముఖ పార్శ్వాల్ని తడిమిన ఈ ‘నీలిగోరింట’ సంపుటి శక్తివంతమైన సృజనాత్మక పాత్రను పోషిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి కనిపించదు.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910