పఠనీయం

విభిన్న భావ సమూహాల హారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదేదో నెమలి నీడలా వుంది- కవితా సంపుటి,
రచన: ఆశారాజు, వెల:200/- కాపీలకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, నవ చేతన పబ్లిషింగ్ హౌస్, నవోదయ బుక్ హౌస్.
==================================================================
సరళత్వంతో కరచాలనంచేసే కవులు కొద్దిమందే వుంటారు. మనసుకి హత్తుకుపోయే శైలితో చిరకాలంగా కవిత్వం రాసే కవి ఆశారాజు ఇప్పటిదాకా అనేక సంపుటాలు అందించిన అనుభవంతో ఇపుడు తన 19వ పుస్తకంతో మన ముందుకొచ్చారు. దీని పేరు ‘ఇదేదో నెమలి నీడలా వుంది’. 111 కవితల సమాహారంతో విభిన్న భావ సమూహాలను ఒకే చోట గుదిగుచ్చి అక్షర స్పర్శగా కలబోశారు.
‘‘బండల ముందెప్పుడూ / తల దించకు / రాళ్లే / దేవుళ్లయి కూర్చుంటాయి’’ అంటారు ‘రాళ్లూ రప్పలే దేవుళ్లవుతాయి’ కవితలో. శృతిమించిన విగ్రహారాధనకు హేతువాద దృష్టితో హెచ్చరికలు జారీ చేస్తూ దిశా నిర్దేశం చేస్తారు కవి ఆశారాజు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా శాస్ర్తియ దృష్టితో సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేస్తారు.
‘ఆస్పత్రిని నిర్లక్ష్యంగా /స్మశానం చేశాకా / చిన్నపిల్లల ఊపిరి / చుక్కల ఆకాశమైంది’ అంటూ ‘ఇదిగో ఇది మరో నిశ్శబ్దం’ శీర్షికలో వర్తమాన వ్యవస్థ తీరుతెన్నుల్ని బొమ్మకట్టిస్తారు. ఇటీవల కాలంలో ఆస్పత్రి సిబ్బంది వ్యవహరిస్తున్న విధానాలను తూర్పారబడుతూ ఎండగడతారు. పసిపిల్లల మార్పిడి, విక్రయం, నిర్లక్ష్య ధోరణులపట్ల నిప్పులు చెరుగుతూ అక్రమాలను సున్నితంగా నిలదీస్తారు. ఇది ఆశారాజు సునిశిత పరిశీలనా శక్తికి అద్దంపడుతుంది.
‘తప్పిపోయాం’ శీర్షికలో ఒంటరితనం గూడుకట్టిన దిగులుతనాన్ని చాలా ఆర్ద్రవంతంగా అక్షరీకరిస్తారు.
‘‘చెంతలేని సంతానాన్ని / జ్ఞాపకాల్లో చూస్తూ నేను/ కన్నపిల్లల్ని దీవిస్తూ / తల్లడిల్లే నా సహచరి / ఖాళీ గదుల్లో తప్పిపోయాం’’ అటున్నపుడు.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు దూరం గా, విదేశాలకు పొట్టకూటికోసం వలసపోయే ఎదిగిన పిల్లలు.. చిట్టచివరికి ఏకాకితనాన్ని మిగిల్చి, విషాదమయం చేసే సందర్భాన్ని గుర్తుచేస్తారు కవి. పైకి కనిపించని ఈ రంపపుకోత బాధని మనసు లోతుల్లోనే దిగమింగుకొని, భారంగా వెళ్లదీస్తున్న కాలానికి ప్రతిరూపం ఈ కవిత.
‘బస్తాల్లో మిగిలిన స్వప్నాలకు / ప్రాణమంత ధర పలికితే / రైతు ఒక్క పూట తినైనా / దేశానికి కడుపు నింపుతాడు’’ అని చెప్పడం వెనుక ‘వొంపుల ముక్కెర’ కవిత అంతరంగం అంతుబడుతుంది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకి కనీస గిట్టుబాటు ధరతోపాటు, సబ్సిడీ అందని దైనీయ స్థితిని ప్రాణమంత ధరతో పోల్చి చెబుతాడు కవి. కల్తీ ఎరువులు, నకిలీ విత్తనాలు- క్రిమి సంహారక మందులు చేస్తున్న మోసానికి ప్రత్యక్ష సాక్షిగా రైతుబిడ్డ మిగిలిపోతున్నాడు.
‘అవి దొరికేవి కావు’ కవితలో పేర్కొన్నట్లు - ‘కళ్లు కనిపించని కటిక చీకట్లో కూడా / కలల వెలుగులో / జీవితాన్ని దర్శిస్తాను’ అనడం తాత్త్విక తత్త్వంలోని ఆశావాద దృక్పథాన్ని సామూహిక చైతన్యానికి గుర్తుగా ఋజువు చేస్తారు కవి ఆశారాజు.
ఈ సంపుటిలో విలక్షణ శీర్షికలైన - జేబునిండా స్వప్నాలు, కల దొరికింది, నీడను జమ చేశాను, ఎండ ఎక్కడో స్నానం చేసినట్టుంది వంటి కవితాత్మక ప్రతిబింబాలు సాహితీప్రియుల్ని అలరిస్తాయి. చందమామ, హైదరాబాదుల ప్రస్తావన తరచుగా వినిపిస్తుంది. కవిత్వం కురిపించే జల్లులు పంక్తులరూపంలో మనల్ని సేదతీరుస్తాయి.‘మూసి కళ్లకు గొళ్లెం పెట్టాను’, ‘మెట్లమీద కనిపించే / పక్షిరెక్కల మృదువైన జ్ఞాపకం’, ‘నా భుజంమీద వాలిన ఆకాశం’, ‘ఊరంతా దీపాల పందిరిలా’, ‘సీతాకోక చిలుక కాకముందు / నేను కూడా గొంగళి పురుగునే’, ‘ఎవరూ లేవకముందు ఉదయానే్న / నా జ్ఞాపకాలు కోకిలై కూస్తున్నాయి’, ‘కళ్ళముందు పిల్లలు / చందమామల్లా నవ్వుతుంటే’, ‘ఆకాశం నిండా చుక్కలు ఎగురుతుంటాయి’, ‘పువ్వుల మీద కత్తులు సానబెట్టేవాళ్ళు’, ‘చేపలు దులిపిన వలలా / చుక్కలు లేని ఆకాశం’, ‘దారి వెంట చీకటి ముసిరితే / చందమామ వెంట నడుస్తుంది’, ‘దెబ్బ తగిలిన కుందేలు పిల్లలా / నీలాకాశం సన్నగా మూల్గుతోంది’, ‘తుమ్మ కొమ్మల మీద పట్టుకుచ్చుల్లా / ఋతువులుతో ఆటలాడే పిట్టగూళ్ళు’, ‘్ఫ్యను వేస్తే / గాలి వర్షంలా కురుస్తోంది’, ‘వేణువూదితే ఆకాశం నిద్రలేచినట్టు / నేలమీద నీడ నెమలిలా ఆడుతోంది’, ‘తెల్లారేసరికి / తెల్లని వెనె్నలంతా / నెత్తురై పారుతోంది’ వంటి విభిన్న కవితా వ్యక్తీకరణలు సంభ్రమాశ్చర్యాలలో మనల్ని ఓలలాడించి ఉర్రూతలూగిస్తాయి. ఇలా ఆశారాజు కవిత్వం మొత్తం జీవన సంఘర్షణల్లోని ఆటుపోట్లతో ఆసాంతం చదివింపజేస్తాయి. మంచి కవితా సంపుటిని అందించినందుకు ఈ కవిని అభినందించకుండా ఉండలేం.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910