పఠనీయం

మంచి మనసులు - మంచిని పెంచే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మనసులు కథలు-
రచన: పోలాప్రగడ రాజ్యలక్ష్మి, వెల:రూ.150/-,
కాపీలకు: రచయిత్రి, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 9618126033 మరియు జ్యోతి వలబోజు 8096310140
===================================================================
శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారు పది సంవత్సరాల బాల్య ప్రాయంలోనే సాహిత్యాసక్తిని వెలయించుకున్నవారు. అంతటి చిరువయసులోనే కృష్ణశతకం, సుమతీశతకం కంఠతా పట్టారు. జంధ్యాల పాపయ్యశాస్ర్తీ (కరుణశ్రీ) పురిపండా అప్పలస్వామి, ఆవత్స సోమసుందర్ లాంటి ప్రముఖుల ఉపన్యాసాలు విని ఉత్తేజితులయ్యారు.
రెండు పదుల వయసులో వీరి మొదటి కథ 1964లో అచ్చయింది. పోలాప్రగడ సత్యనారాయణగారి చేయి పట్టుకుని అత్తింట అడుగుపెట్టిన తర్వాత వీరి సాహిత్యానుసరక్తి ద్విగుణీకృతమయింది. కారణం- భర్త కీ.శే. పోలాప్రగడ సత్యనారాయణగారు అప్పటికే గొప్ప కథకులుగా పేరుగాంచారు.
జన్మతః వచ్చిన ఆసక్తి, భర్త ప్రోత్సాహం రెండింటి కలయిక ఒక సంగమంలా భాసిల్లి నాటినుండి నేటివరకు వీరిచే 14 నవలలు, 6 కథా సంపుటాలు వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, కవితలు- అన్నింటా రాజ్యలక్ష్మిగారు తమ ప్రతిభను చాటుకున్నారు. గెలుచుకున్న అవార్డులు, రివార్డులు బిరుదులు- అన్నీ ప్రసిద్ధమైనవే కావటం విశేషం. అరవయ దశకపు రచయితలు, రచయిత్రులందరిలాగానే ఆనాటి సాహిత్యపు కేన్వాసుపై రాజ్యలక్ష్మిగారు గీచిన కథా చిత్రాలన్నీ, కుటుంబం భార్యాభర్తల అనురాగం, కొత్త కాపురం, వయసుతో వచ్చే ఆధ్యాత్మిక భావాలు కేంద్రకాలై నిలిచాయి. పల్లెల్ని ప్రజలు ఇంకా మరవకముందే వీరి బొంబాయి (ఈనాటి ముంబయి) జీవితం రాజ్యలక్ష్మిగారికి ఒక అదనపు తూణీరమై నిలిచింది. బేబి సిట్టింగ్ అంటే ఏమిటో తెలియని ఆ కాలానికి వీరి కధలోని బామ్మగారు బేబి సిట్టింగ్‌తో ఎంతో కొంత సంపాదిస్తారు.
ప్రస్తుత కథా సంకలనంలో 17 కథలున్నాయి. అదనంగా నాలుగు అధ్యాయాల్లో తన సాహిత్యం తనపై అభిమానుల అభిప్రాయాలు, బాల్యం, తనకు సాహిత్యం ఆరోప్రాణం ఎలా అయిందో చెప్పారు.
వీరి కథలన్నీ, నడి సముద్రంలో చిరు అలలు కూడా లేని సమయాన, నావ ప్రయాణం ఎంత సాఫీగా జరుగుతుందో అంతటి ప్రశాంతత, ప్రయోజకతతో సాగుతాయి.
రామ్ రామ్ మేష్టారు అనబడే రామయ్య పంతులుగారికి ఊరినిండా పరిచయాలే! కారణం- నలుగురితో కలిసి పోయి రోజూ రామాలయంలో భజన కార్యక్రమాల్ని నిర్వహిస్తాడు. బంధు మిత్రులకు బట్టలు- కొడుకు ఖాతాలో అప్పులు చేసైనా కొంటాడు. మంచి మనసున్న కొడుకు ప్రేమగా విసుక్కున్నా, తీవ్రంగా అభ్యంతర పెట్టడు. కోడలు తులసి, మామగారి పక్షమే! ‘రామ్ రామ్ మేష్టారు’ కథ చదువుతున్న ప్రతీ వయోజన పాఠకుడి మనసులో చిన్ననాటి చాలీ చాలని ఆదాయం, పొదుపు, చిన్న చిన్న మందలింపులు మనసులో మెదిలి మందహాసాలు పూయిస్తాయి.
మహాలక్ష్మి భర్త మూర్తిగారిది చిన్న ఉద్యోగం, ఫ్లాటు నివాసం. ఆమెకు ‘గోవు మహాలక్ష్మి’ని పెంచుకుని, సేవ చేసి తరించాలని మహా చెడ్డ సరదా! ఆమెకు ఆలోచన వస్తే చాలు మూర్తిగారి పర్సుకి చిల్లుపడుతుంది. లక్ష రూపాయలకు ఆవునికొని, సెల్లార్‌లో కట్టేసుకుంటుంది. రొచ్చూ, పేడా అంబారావాలు, ఫ్లాటు సహవాసులందరికీ నచ్చవు. చివరకు పదివేలు తక్కువకు వదిలించుకుంటాడు మూర్తిగారు.
మచ్చుకు ఇచ్చిన పై రెండు కథల్లాంటివే మిగతావీను. కథలన్నింటా, ఓ సందేశం వుంటుంది. ఒక మంచి కథను చదివామన్న సంతృప్తి పాఠకులకు ఉంటుంది. ట్యాబులు, కంప్యూటర్లు, నెట్‌లు, చెవిలో సెల్లు లొల్లి, ఈ కాలంలో రాజ్యలక్ష్మిగారి కథలు, అనుభవాలు గ్రీష్మ తాపం తరువాత తొలకరి చినుకుల్లా, హృదయోల్లాసాన్ని కలిగిస్తాయి. కథల నిండా మంచి మనుషులు, మంచి మనసులు ఎదురవుతారు.

-కూర చిదంబరం 8639338675