పఠనీయం

‘రమణీయ’ కావ్యానుశీలనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు:72, వెల:రూ.80/-,
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌజ్ బ్రాంచీలు, మరియు నవచేతన బుక్‌హౌజ్ బ్రాంచీలు. సెల్:9010570550.
=================================================================
విద్వాన్ విశ్వంగారికి ‘పెనే్నటి పాట..’ ‘ఒకనాడు’ కావ్యాలు మంచిపేరును తెచ్చిపెట్టాయి! రాయలసీమ ఆధునిక కావ్యంగా భాసిల్లిన ‘పెనే్నటి పాట’.. చారిత్రక కావ్యంగా వెలుగొందిన ‘ఒకనాడు’ రెండింటినీ రమణీయంగా కావ్యానుశీలనం చేసి.. తెలుగు పాఠకలోకానికి ఓ గ్రంథ రూపంలో డా ఆమళ్ళదినె్న వేంకటరమణ ప్రసాద్‌గారు అందించడం అభినందనీయం.
విద్వాన్ విశ్వంగారి ‘పెనే్నటి పాట’ కావ్యంలోని మధురిమలను వేంకట రమణ ప్రసాద్‌గారు తమ కావ్యానుశీలనంతో.. సామాజిక సాక్ష్యాలను ‘విద్వాన్ విశ్వం’ పేరుతో వెలువరించిన గ్రంథంలో ప్రతిబింబించే కావ్యాన్ని కూడా రమణప్రసాద్‌గారు తమ ప్రతిభా వ్యుత్పత్తులతో.. ఇదే గ్రంథంలో వాస్తవ ఘటనలకు అద్దంపట్టారు. అయితే రమణప్రసాద్‌గారు లోగడ ‘అనంతపద్యం’ పేరుతో అనంతపురం జిల్లా పద్య సాహిత్య వికాస గ్రంథాన్ని ప్రకటించారు. అందులో సుమారు 350 మంది పద్య కవుల సాహిత్యాన్ని ఆయన సమీక్షించారు. విద్వాన్ విశ్వంగారి ఈ రెండు కావ్యాలు కూడా తొలుత ఆ గ్రంథంలో పొందుపరచబడినవే కావడం విశేషం! విద్వాన్ విశ్వంగారు ‘పెనే్నటి పాట..’ ‘ఒకనాడు’ గ్రంథాలకున్న ప్రాధాన్యతను దృష్టియందుంచుకుని.. ‘విద్వాన్ విశ్వం’ పేరుతో ఓ ప్రత్యేక గ్రంథాన్ని ప్రకటించి.. విద్వాన్ విశ్వంగారిపట్ల.. ఆయన రచనలపట్ల రమణ ప్రసాద్‌గారు తమ గౌరవాన్ని చాటుకున్నారు.
పెన్నానదిలో నీటిచుక్క కూడా లేని విషాదాన్ని విద్వాన్ విశ్వంగారు తన కావ్యానికి సంకేతంగా తీసుకున్న విషయాన్ని రమణప్రసాద్‌గారు తమ ఈ గ్రంథం ద్వారా కావ్యానుశీలనం చేశారు. పల్లెటూళ్ళలో తాండవించిన దర్పాన్నీ.. దారిద్య్రాన్నీ.. అసహాయతను.. బలాధిక్యతను బలిదానాన్నీ తులనాత్మకంగా చిత్రించిన కావ్య శిల్పం అని విశ్వంగారి ‘పెనే్నటిపాట’ గురించి రమణ ప్రసాద్‌గారు తేల్చి చెప్పారు. విశ్వంగారి మరో కావ్యం ‘ఒకనాడు’ యొక్క పేరే ఇతిహాసాన్ని తలపింపజేస్తుందని రమణప్రసాద్ గారు వ్యాఖ్యానించారు. రైల్వేగేటు దగ్గర ‘ఒకనాడు’ జరిగిన చారిత్రక ఘటనకు విద్వాన్ విశ్వంగారు అక్షర రూపం ఇచ్చిన తీరు అభినందనీయమని అభిప్రాయపడ్డారు. సంపన్న నాగులమ్మ అను మానవతి శీలసంరక్షణకై చేసిన ఒంటరి పోరాటాన్ని పద్యకావ్యంలో వీరరసోచికంగా ఆవిష్కరించడంలో విద్వాన్ విశ్వంగారు సఫలీకృతులైనారని రమణప్రసాద్‌గారు పేర్కొన్నారు. ‘ఒకనాడు’ కావ్యంలోని వివిధ ఘట్టాలను దృశ్యమానం చేసిన తీరును కూడా ఆయన కొనియాడారు.
‘‘శుకపిక శారికా రవరుచుల్ వినిపింపవు; గూబమూల్గు / లొక్కక తఱి గుండె పీల్చును; దిగుల్ వడజేయును తీతువుల్; సము /త్సుక వృక జంకమ్ములు మతుల్ సెడ గయ్యిడు; వల్లకాడు పె /న్నకు నిరు గుట్టలందు పులిన స్థలి పుఱ్ఱెలు పండు మెండుగన్’’ విద్వాన్ విశ్వంగారు పెన్న గుట్టల్లో ఇరువైపుల హృదయ విదారక దృశ్యాలను ఈ పద్యంలో బంధించారని రమణప్రసాద్‌గారు తమ కావ్యానుశీలనం ద్వారా చక్కగా విశే్లషించారు.
ఇక ‘ఒకనాడు’ కావ్యానికి అనుశీలనం చేస్తూ.. హంపన్నతో సన్నిహితంగా మెలగే పల్లెపడుచు నాగులమ్మ రూపవతి గుణవతి అనీ.. హంపన్న నాగులమ్మ ప్రేమికులనీ.. వారిమధ్య అమలిన శృంగారాన్ని విద్వాన్ విశ్వంగారు ఆయా పద్యాల్లో చిత్రించిన తీరును రమణప్రసాద్ గారు సోదాహరణంగా వివరించారు.పల్లెటూరి అమాయక జీవన సంప్రదాయానికి ప్రతీకలుగా హంపన్న నాగులమ్మలను రమణీయంగా విశ్వంగారు వర్ణించిన విషయాన్ని రమణప్రసాద్‌గారు తమ కావ్యానుశీలనం ద్వారా చక్కగా పాఠకులకు ఇట్టే అర్థమయ్యే రీతిలో ఆవిష్కరించారు.
‘‘చిన్నది పదునారేండ్లది / కనె్నతనమ్మునకు వెన్నకలిగించునది ఆ / అన్నులమిన్న’’ అంటూ సాధారణమైన వర్ణనతో నాగులమ్మను ప్రస్తావించి..
కురులు ముడిచి ముద్దకొప్పును జెక్కి, గో /రంట పూలగుత్తి నంట దురిమి / కోల దోసగింజ కుంకుమబొట్లతో / లక్ష్మివోలె నాగులమ్మ వచ్చె.. అంటూ విశ్వంగారు అందంగా కొనసాగించిన తీరును రమణప్రసాద్ గారు చక్కగా విశే్లషించారు. ‘కోల దోసగింజ కుంకుమ బొట్టుతో’అని అనడం చూస్తుంటే.. విశ్వంగారు ఆనాటి సమాజంలోని ఆడపిల్లల్ని ఎంత నిశితంగా పరిశీలించి వారి సౌందర్యమూర్తిమత్వాన్ని ఎలా అందంగా ఆవిష్కరించారో అంటూ.. రమణప్రసాద్‌గారు కితాబుచ్చారు.
ఇలా ఈ గ్రంథంలో విద్వాన్ విశ్వంగారి రెండు కావ్యాలను రమణప్రసాద్‌గారు ప్రతిభావంతంగా కావ్యానుశీలనం చేస్తూ... ‘పెనే్నటి పాట’ సామాజిక సాక్ష్యానికి ప్రతిబింబమని.. ‘ఒకనాడు’ చారిత్రక సాక్ష్యమని తేల్చి చెప్పారు. ఈ రెండు కావ్యాలను పాఠకులు సులభంగా గ్రహించే విధంగా సరళమైన రీతిలో రమణప్రసాద్‌గారు కావ్యానుశీలనం చేయడం అభినందనీయం.విద్వాన్ విశ్వంగారి రచనా వైచిత్రిని ఈ గ్రంథం ద్వారా చాటి చెప్పారు. పద్యప్రియులు... సాహితీప్రియులను అలరించే విధంగా రమణప్రసాద్ గారి రచన ఇందులో కొనసాగించడం బాగుంది.. అందరు చదివి.. కావ్యాల్లో ప్రకటించిన కవితా వస్తువులతోపాటు.. విద్వాన్ విశ్వంగారి రచనా శైలిని అందరం ఆస్వాదించి అనుభూతి పొందే విధంగా కావ్యానుశీలనం చేసిన రమణప్రసాద్ గారికి అభినందనలు తెలుపుదాం...

-దాస్యం సేనాధిపతి 9440525544