పఠనీయం

మనిషి లోపలి మహా సముద్రాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి లోపలి మహాసముద్రాలు- - కిల్లాడ సత్యనారాయణ,
వెల: రూ.80/-, ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, మరియు విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు.
==============================
సువిశాల మానవ జీవన కోణాల్ని మనస్తత్వ శాస్తద్రృష్టి నేపథ్యంతో తులనాత్మక అధ్యయనం చేసి బాహ్యాంతర లోతుల్ని తడిమిన రచయిత కిల్లాడ సత్యనారాయణ. వృత్తిరీత్యా ఐ.పి.ఎస్.అధికారిగా పనిచేస్తూనే, ప్రవృత్తిరీత్య 13 వ్యాసాలతో రాసిన ‘మనిషి లోపలి మహాసముద్రాలు’ అనే వ్యాస సంపుటి ఇది. వ్యక్తిత్వ వికాసక్రమంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ శోధించిన అంతర్మూలాల లోతుపాతుల లోటుపాట్లను ఆమూలాగ్రం పరిశీలించి, చర్చించి, విశే్లషించి, విడమర్చి చెప్పిన సూక్ష్మ మేథో మథన విషయ తవ్వకాల తపనకు అద్దం పట్టిస్తుంది. సగటు జీవుల మనస్తత్వ ఆలోచనలకు, ధోరణులకు, చేతలకు తగిన దిశా నిర్దేశనం చేస్తూ స్తబ్దుగా పడివున్న మస్తిష్కాల్లో కొత్త పరిష్కార మార్గాల్ని బోధిస్తుంది. సృజనాత్మక మేథో వికాసానికి ఆశావహ దృక్పథంతో బాటలు పరుస్తుంది.
‘మనసు భాషే మాతృభాష’ శీర్షికలో చెప్పినట్టు- ‘సృజనాత్మకతకు భాష ప్రేరకం కావాలి’ అంటారు. ‘మాతృభాషలో విద్యాభ్యాసం మేధోపరంగా, భావోద్వేగ పరంగా మహత్వపూర్ణమైనదని’- యునెస్కో మాటగా చెబుతారు రచయిత. ఇలా చూస్తే- స్వేచ్ఛకు పెద్దపీట వేసే ‘్ఫన్‌లాండ్’ వంటి దేశ విద్యావిధానం మనకు గుర్తుకురాక మానదు. ‘అవును - కాదుల అంతరార్థం’ వ్యాసంలో- ‘ప్రవర్తనకు అచేతనాశక్తే కారణం’ అన్న భావాన్ని ధ్వనింపజేస్తారు. ‘శబ్ద దృశ్యాలకు ఆవల’ శీర్షికలో- ‘ఇంద్రియ- ఇంగితాల ప్రాధాన్యత, సంగీత సాధన ప్రస్తావన’ కనిపిస్తుంది. ‘‘దృశ్యం లేకుండా ఆలోచించడం అసాధ్యం’’ అనే అరిస్టాటిల్ పలుకుల్ని స్ఫురణకు తెస్తారు. ‘మార్పుకి ముఖద్వారం వినడం’ అన్న అంశంలో- ‘నాకు ఏమీ తెలియదన్న ఒకే ఒక్క విషయం నాకు తెలుసు’ అని ప్రవచించిన తత్తవేత్త సోక్రటీస్ మాటల్ని ‘వినడానికి మొదటి మెట్టు’గా అభివర్ణిస్తారు సత్యనారాయణ. ‘సమూహంలో ఒంటరితనం’ వ్యాసంలో- మనిషి ప్రధానంగా ఆశ్రీత జీవి అని, సమూసం మనిషికి ఒక ఆటస్థలంగా, ప్రయోగశాలగా, రంగస్థలంగా నొక్కి చెబుతారు. ఒంటరితనాలలో రకాలైన- వాత్సల్య, సహవాస ప్రభావ, సాంకేతిక ప్రేరిత, గృహైక, అభద్రతాభావ సామాజిక, అహంకారపూరిత భౌగోళిక ఒంటరితనాల సారూప్య భేదాల్ని తేటతెల్లం చేస్తారు. ‘తలరాత- అదృష్టం’ శీర్షికలో- ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఆరు మార్గాలను సూచిస్తారు. వ్యక్తుల కార్యశీలతను వివరిస్తారు. ‘తనను తాను తెలుసుకున్నవాడికి జీవితం మధుర సంగీతం’ అంటూ నిర్వచిస్తారు.
‘శిక్ష-బహుమానం’లో ‘ప్రభుత్వ-ప్రైవేటు రంగాలమధ్య పోలికను వ్యక్తీకరిస్తారు. ముర్రే స్ట్రాస్, స్కిన్నర్, థార్న్ డైక్, దేసి, కోహ్న్ మున్నగు మేధావుల ఆలోచనా తీరులను విడమర్చి చెబుతారు. బహ్య- అంతర్గత ప్రేరణలతో పాటు ప్రవర్తనాదుల ప్రసక్తి తీసుకొస్తారు. ‘సాధన సృజనకు శత్రువా’ అన్న చర్చలో- సాధన మనిషిని పరిపూర్ణుణ్ణి చేస్తుంది అంటారు. క్రెడిట్ కార్డు మనస్తత్వాన్ని, గురువు వైరాగ్యాన్ని తాత్విక దృష్టితో కళ్ళకు కట్టిస్తారు. ‘ప్రకృతి ప్రసాదించినదానికి అదనంగా నేర్చుకోవడమే జ్ఞానం’ అని నొక్కి వక్కాణించిన శాస్తవ్రేత్త జేమ్స్ బాల్ద్విన్ హృదయాన్ని ఆవిష్కరిస్తారు. ‘లక్ష్యాలు- మార్గాలు’లో ‘అనుభూతి మార్గానికి గీటురాయి’ అని, ‘తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాల్ని పొందడమే యుక్తి’ అని వ్యాఖ్యానిస్తారు. ‘జయాపజయాలు’లో ‘‘నా శవాన్ని మీరు వీధుల్లో మోసుకెళ్తున్నప్పుడు నా రెండు చేతుల్ని అందరికీ కనబడేలా వేలాడనివ్వండి’’ అంటూ కోరిన అలెగ్జాండర్ విజ్ఞతను దార్శినికత్వానికి ప్రతీకగా చెబుతారు. ‘‘నీదైన శైలిలోకి ప్రతి చర్యనీ తీర్చిదిద్ది వాటన్నింటినీ నీ ఆత్మ శ్వాసతో పూరించడమే’’ అన్న ఖలీల్ జిబ్రాన్ సందేశాన్ని వినిపిస్తారు. ‘ఆకాంక్షలు - అవకాశాలు’లో- వస్తువులు కోర్కెలు మధ్య పోలికల్ని చెబుతూ ‘మనుషుల్ని ప్రేమించాలి- వస్తువుల్ని వాడుకోవాలి’ అని ఉపదేశిస్తారు. ‘ఆనందమే జీవితం’ శీర్షికలో- కవి చంద్రసేన్ చెప్పిన వాక్యాలు ‘‘కళ్ళు తెరిస్తే జననం / కళ్ళు మూస్తే మరణం/ రెప్పపాటే గదా జీవితం’’ అన్నపుడు తాత్విక కోణం ఉట్టిపడుతుంది. మనిషి ఆనందానికి కారణమైన ఆరు ఆటంకాలను ఉటంకిస్తారు. ‘నేను, నాది, నా’ అనే స్వభావంలోంచి ‘‘బాధలు నన్ను పట్టుకోలేదు. నేనే వాటిని పట్టుకున్నాను’’ వంటి లోతైన భావనతో కూడిన ఆలోచనలకి బీజం వేస్తాయి. ఇలా సాగిన ఈ వ్యాస పరంపరలో మన తెలుగు జాతీయాలు, సామెతలు, నానుడులు అనేకం ఈ సంపుటిలో చాప కింద నీరులా ప్రవహిస్తాయి. ‘చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు’, ‘చెప్పే నోరుకి వినే చెవి లోకువ’, ‘వాళ్ళు పట్టిందల్లా బంగారమవుతుందని’, ‘జీవితం వడ్డించిన విస్తరి’, ‘అందేవరకూ కాళ్ళూ, అందాక జుత్తు’, ‘చిన్నపామును పెద్ద కర్రతో కొట్టడం’ వంటి వాక్య పలుకుబళ్ళు తెలుగు సాంప్రదాయానికి, సంస్కృతికి గీటురాళ్లుగా నిలుస్తాయి.
సానుకూల దృక్పథంతో ‘మార్పు జీవలక్షణం’గా భావించే ఈ వ్యాసాల్లో అందరికీ ఉపయుక్తమైన సమాచారాన్ని, సందేశాన్ని, జీవనసారాన్ని అంతర్లీనంగా పిండి అక్షరాల రూపంలో మనకి అందిస్తారు రచయిత. ఏది అవసరమో, ఏది అనవసరమో తేల్చి చెప్పే జీవన రహస్య పరుసవేది విద్య ఇతని సొంతం.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910