పఠనీయం

మధునాపంతులవారి ‘ఆంధ్ర రచయితలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర రచయితలు (వచనము)
రచన: మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీ
వెల:450/- ప్రతులకు: మధునామూర్తి, గణేశ్ హైట్స్-3, ఆనందవనం, ఫ్లాట్ నెం.504, చినముషిరివాడ, పెందుర్తి, విశాఖపట్నం-531173 (ఎ.పి.) ఫోన్:9398040740
*
సమీక్షకులు: ప్రొ. ముదిగొండ శివప్రసాద్
బ్రహ్మశ్రీ మధునా పంతుల సత్యనారాయణ శాస్ర్తీగారి పేరు చెప్పగానే మనకు ‘ఆంధ్రపురాణం’ గుర్తుకు వస్తుంది. ఇదొక ప్రౌఢ పద్యకావ్యము. ప్రబంధ యుగ కవుల స్థాయికి ఏవిధంగానూ తీసిపోదు. ఇందలి వసె్తై్వక్యము ఆంధ్రత్వమే. మధువ్రతుడు అధ్యాపక వృత్తిని రాణ్మహేంద్రవరంలో నిర్వహించారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆధునిక తెలుగు రచయితలను, ముఖ్యంగా ఇరువదవ శతాబ్దంలోని వారిని సంక్షిప్త పరిచయం చేయాలనే భావన కలిగినట్లుంది. అందుకే చిన్నయసూరితో మొదలుపెట్టి పద్య కవులను ప్రధానంగా పరిచయం చేశారు. ఈ గ్రంథ ప్రయోజనము వక్తలకు పోటీ పరీక్షలకు హాజరయేవారికి కరదీపికగా రిఫరెన్సు గైడుగా ఉపయోగపడుతుంది. ఈ వ్యాసములలో నిజాయితీతో బాటు నిర్మొగమాటం కూడా కన్పిస్తుంది.
మధునాపంతుల ప్రాథమికంగా ఒక కవి. అలాంటప్పుడు దిగ్ధంతులైన సాటి కవులను అంచనావేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర కవులకు కొప్పురవు కవులకు సాహితీ స్పర్థ 20 శతాబ్దపు పూర్వభాగంలో ఉండేది. దానిని తస్మదీయులు శాఖా స్పర్థగా మార్చారు.
మధునాపంతులవారు ఎట్టి దాపరికము లేకుండా ‘ఱంతుల్‌మానుమ’ అంటూ కొప్పరపు కవుల గర్జనా పద్యములను తిరుపతి కవుల సమాధానాములను యధాతథంగా ఈ సంకలనంలో ఉటంకించారు. అదేవిధంగా రాణ్మహేంద్రవరమునకు చెందిన కొక్కొండ వెంకటరత్న కవిగారికి నెల్లూరునకు చెందిన వేదం వెంకట రాయ శాస్ర్తీగారికి మధ్య శ్రుతిమించి రాగాన పడిన వాగ్వాదమును మధునాపంతులవారు నిరపేక్షంగా పంక్తులకు పంక్తులు ఉదాహరించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తాను ప్రౌఢ కవి అయి యుండి సమకాలీనుడు విశ్వనాథ సత్యనారాయణ వంటి వారిని అంచనా వేయటం ఒక సాహస ప్రయోగం.
తెలుగులోని సాహిత్య చరిత్రలలో వంగూరి సుబ్బారావు కవిత్వవేది పింగళి లక్ష్మీకాంతం, ఆరుద్ర వంటి బహు రచయితల రచనలలో ఎవరి ప్రత్యేకత వారిదే. వానిని తులనాత్మకంగా అధ్యయనం చేసినవారికి వైవిధ్యం కనిపిస్తుంది. అలాంటప్పుడు శ్రీవాత్సవ ఉషఃకిరణాలు, మధునాపంతులవారి ఆంధ్ర రచయితలకు పోలిక లేదు. మధునా వారి వచన రచన సూటిగా ముక్కుకు సూటిగా కూడా ఉంది. విషయ ప్రతిపాదనలో వారెట్టి భేషజమూ పాటింపలేదు. దాపరికమూ లేదు. శారదా పాద పద్మములకు ఇదొక అష్టోత్తర శతనామ పూజ. వీరు స్పృశించిన వారిలో మాన్యులూ అసామాన్యులూ గుణ సింధువులు రస బంధువులతోబాటు ఈతరం వారికి బొత్తిగా తెలియని ఆనాటి రంగ మార్తాండులు కొందరు ఉన్నారు. ఇది సహజం. ఒక కవి తన సమకాలీన సమాజం చేత గుర్తింపబడడు. అనంతరకాలంలో మహామహుడు అని ప్రశంసింపబడుతాడు. అలాగే ఒక కవి తన జీవనకాలంలో తారాజువ్వవలె వెలిగి తరువాతి కాలంలో తెరమరుగవుతాడు. ఈ దృష్టిలో మనం మధునాపంతులవారి గ్రంథాన్ని అవలోడనం చేయాలి. గ్రంథాన్ని వారు చిన్నయసూరితో మొదలుపెట్టడం వారి ఔచిత్యానికి దర్పణం. ఎందుకంటే చిన్నయసూరి తెలుగు భాషకు చిన్మయసూరి. వారు బాల వ్యాకరణము రచించడానికి ముందు చాలా ప్రయోగాలు చేశారు. పద్యాంధ్ర వ్యాకరణము రచించాడు. యతిప్రాసలు గణములు సూత్రముల బిగింపునకు అడ్డము వచ్చినట్లు భావించారు. ఇలా కొన్ని ప్రయోగాలు చేసి చివరకు బాలవ్యాకరమణను వెలువరించి శాశ్వత కీర్తి నార్జించాడు. నిజమే! చిన్నయసూరితో ఈ గ్రంథాన్ని ప్రారంభించడం సముచితంగా ఉంది. రచయిత సంక్షిప్త పరిచయం కులగోత్రముల గ్రంథముల జాబితా వారి సమకాలీనుల అభిప్రాయములు ఆ తరువాత వారి రచనలనుండి ఉద్ధరింపబడిన కొన్ని పద్యములు ఇలా మధునాపంతులవారి రచన సాగింది. నిజానికి ఈ గ్రంథం ఒకేసారి రచింపబడలేదు. మొదట ఆంధ్ర మాస పత్రికలో ప్రతినెలా ఒక రచయిత పరిచయంగా వచ్చింది. తర్వాత మరికొన్ని చేర్చారు. అదేపల్లి నాగేశ్వరరావుగారు ప్రచురించినపుడు ప్రతిపరివర్థితమయింది. మధునాపంతులవారి కుమారులు మనుమడు ఈ శతజయంతి (2020) సంవత్సరంలో పూనుకోవటంవలన ఈ కృతి మనకు అందుబాటులోనికి వచ్చింది. దీనిపై ప్రచురణకర్తల అభిప్రాయం ఇలా ఉంది. ‘‘కళాప్రపూర్ణ మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారి ఈ గ్రంథ నిర్మాణము ఆయా గ్రంథకర్తల దేశ కాలములు గ్రంథముల పేళ్లు మచ్చు పద్యములు అను తీరున గాక ధ్వనిప్రాయమైన చతుర కవితా విమర్శనముతో వక్రోక్తి చమత్కృతితో రసవత్కావ్యమువలె గంభీరార్థమై మనోజ్ఞమై యున్నది’’. ఈ అభిప్రాయములో అతిశయోక్తి లేదు.
చిన్నయసూరితో ప్రారంభమైన ఈ కృతి వంగూరి సుబ్బారావుతో ముగిసింది. నడుమ జంట కవులను ఒకటిగా భావిస్తే దాదాపు 108 మంది సంగ్రహ పరిచయాలున్నాయి.
నిజానికి 20వ శతాబ్దానికి పూర్వం కొన్ని వందలమంది రచయితలున్నారు. వారందరినీ పరిచయం చేసినప్పుడే సమగ్రత సిద్ధిస్తుంది. ఐనా సేవావేశముతో ఈ పరిమిత గ్రంథము వెలువరించానని మధునాపంతులవారు నమ్రంగా చెప్పుకోవటం వారి సాత్విక స్వభావానికి నిదర్శనం. ఆ విధంగా చూస్తే ఇప్పటి 3 లక్షలమంది కవి శబ్ద వాచ్యులు వస్తారు. భమిడిపాటి కామేశ్వరరావుగారు నాటక రచయిత. ఫ్రెంచి రచనలకు భావానువాదం చేశారు. నోరి నరసింహశాస్ర్తీగారు కవి- చారిత్రక నవలా రచయిత తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారు దేశభక్తి- వీరితో ప్రథమ భాగము ముగిసింది. ఐతే భండారు తమ్మయ్య, తురగా వెంకట రామకవి, బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, ఇంకా వైతాళికులులో ముద్దుకృష్ణ సేకరిచిన కవులలో కొందరు ఈ సంకలనంలో కన్పడరు.
ఆంధ్ర రచయితలు అని పేరు పెట్టడంవలన కేవల పద్య కవులకే ఈ కృతి పరిమితం కాలేదు. వైయాకరణులు నాటకకర్తలు ఆస్థానం ప్రభువులకు కూడా స్థానం లభించింది. మధునా పంతుల ‘మహాకవి’ పదమునధిష్ఠించిన వారి మహత్తకు ఇవి మువ్వనె్నల యశఃపతాకలు.

సశేషం