పఠనీయం

తప్పిపోయిన మానవత కోసం వెతుకులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుడు తప్పిపోయాడు (కవితా సంపుటి)
-కె.విల్సన్‌రావు
వెల: రూ.120
పుటలు: 204
ప్రతులకు: పాలపిట్ట బుక్స్ నవోదయ బుక్‌హౌస్ ప్రగతిశీల బుక్‌సెంటర్

** *** *** === == === === ******************

బ్రతుకు నిత్య గ్రీష్మ ఋతువైనపుడు అకాల వర్షమై ఆనందింపచేస్తుంది కవిత్వం. నిరాశల ఎండిన కొమ్మలకు వసంతం వర్ణాన్నద్దుతుంది. దిగులు లోయలో వెనె్నల పాటై పరిమళిస్తుంది. ఆత్మహత్యల కాలంలో అమృతవర్షిణీ రాగమాలపిస్తుంది. అంతులేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అలాంటి కవితా సంపుటి కొమ్మవరపు విల్సన్‌రావుగారు రచించిన ‘దేవుడు తప్పిపోయాడు.’
కవికి ఒక లక్ష్యం ఉంది. ఎవరి కోసం రాయాలో, ఎందుకోసం రాయాలో స్పష్టమైన అవగాహన ఉంది. రాజ్యహింసను ధిక్కరిస్తూ కలం ఖడ్గం పట్టిన కవి ‘బువ్వగింజలు’లో ‘చీకటి మేఘాలపై పోరుమంటల పాటై నూతన యుగ ద్వారాలను తెరుద్దాం’ అంటారు. మానవత కోసం, మనిషి కోసం పరితపిస్తారు. కలలు కంటారు. అన్యాయాలను ప్రతిఘటించమంటారు. ‘కలల సాకారం కోసం’లో ‘జీవితాన్ని ఎప్పుడూ తడితడిగా ఉంచే/ సెలయేరుని/ కనాలని కలగంటున్నాను’ అంటారు. మానవతా ప్రపంచానికి పునాదులు వేద్దాం అంటారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.
ఈనాడు ప్రపంచీకరణ పిడికిట్లో బడుగుదేశాలు నలిగిపోతున్నాయి. అంతరిక్షంలో పయనిస్తున్న మానవుడు అంతరంగాన్ని మాత్రం అదుపు చేసికోలేక పోతున్నాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు పదులు దాటినా ధనిక బీద తారతమ్యాలు తగ్గలేదు. అన్నదాతల ఆత్మహత్యలు, ఆడపిల్లలపై అత్యాచారాలు నిత్యకృత్యాలు. అన్నిటినీ చూస్తున్న దేవుడు రాయిలాగా మారిపోయాడు. కానీ కవి మాత్రం ప్రతి దానికీ స్పందిస్తాడు. అన్యాయాలను ప్రతిఘటిస్తాడు.
‘అక్షరాన్ని నిశ్శబ్దంగా రగిలించి/ పదాల వత్తుల్కి/ వెలుతుర్నద్ది/ స్వచ్ఛ సంభాషణలకి/ పచ్చని పరిమళాల్నద్దే కవిత్వం’ అంటూ కవిత్వం చదవటమన్నా, కవిత్వం రాయటమన్నా ఎన్ని రాత్రులు మోసార్ణవాలవ్వాలో’ అని కవిత్వం ఎలా ఉండాలో చెప్తారు.
ఇలాటి కవికి ప్రతిదీ కవితా వస్తువే. ఇప్పుడు బహుళ జాతి సంస్థలు ప్రపంచమంతటా విస్తరించాయి. సమస్త దేశాలను తమ వస్తువులు ‘అమ్ముకొనే మార్కెట్‌లుగా మార్చేశాయి. వాళ్ల కపటనీతిని ఎండగడుతూ ‘కన్నీటిని కూడ బహుళ జాతి సంస్థల ద్వారా మాత్రమే/ కొనాలని శాసిస్తున్న అపర కపట వైతాళికుడు’ అని ఆఖరికి విషాదం మొ. అనుభూతుల్ని కూడ వ్యాపార వస్తువును చేసిన విధానాన్ని నిరసిస్తారు.
ఈ జగత్తులో అమ్మను మించిన కవితా వస్తువు లేదు. చిత్రకారులకు, గాయకులకు, శిల్పులకు అందరికీ ఇష్టమైన వ్యక్తి అమ్మ.
ఇంట్లో అందరూ నిద్రపోతున్నా అందరికంటె ముందు అమ్మ నిద్రలేస్తుంది. ‘నిద్రమత్తు వదలక ముందే/ చిరుగుల చీర కుచ్చెళ్లు బూడ్లో దోపి/ చీకట్లను చిమ్మి వెలుతుర్ని ఒళ్లంతా చుట్టకునేది’ అని అమ్మ గురించి చెప్పిన కవితలో ‘గింజల వేటలో అలసిన వాడ కోడీ/ హామీ పత్రంపై సంతకం చేసినట్లు మూడుసార్లూ కూసేది’ అని కవితను ప్రారంభిస్తారు. దీనిలో ‘వాడ’ ‘కోడి’లో వాడనుకోడిగా ప్రతీక చేసి చెప్పడంలో చాలా అర్థాలున్నాయి. బడుగు జీవులు తమ కుటుంబ సభ్యుల కడుపు నింపుకోవడానికి చేసే పనులను ఇక్కడ గింజల వేటగా అభివ్యక్తీకరిస్తారు. కుటుంబాన్ని పోషించే అమ్మలాటి కష్టజీవికి ‘నాలోంచి నన్ను చేదుకొని తరతరాలు/ తలెత్తుకొని సెల్యూట్ చేసే/ అసలు సిసలైన అమ్మ జెండానావిష్కరించాలి’ అని అమ్మపై తనకున్న గౌరవాన్ని ఆవిష్కరిస్తారు ‘అమ్మ జెండా’ కవితలో.
ఈ సంపుటికి పేరు పెట్టిన ‘దేవుడు తప్పిపోయాడు’ శీర్షిక చూడగానే పాఠకుల మనస్సుల్లో ఎన్నో ప్రశ్నలు చెలరేగుతాయి. ఎక్కడైనా మనుషులు తప్పిపోతారు గానీ దేవుడు తప్పిపోవడమేమిటని. ‘పత్తి పండించే రైతు బట్టనేసే నేతగాడు/ కూటిగింజల కోసం అలమటిస్తున్నాడు/ నేసిన బట్టను అమ్ముకొనే దళారీ మాత్రం/ కోట్లకు పడగలెత్తుతున్నాడు. ఐనా రాయి ఐన దేవుడు ఏమీ చలించడు. ‘శాంతివచనాలు పలుకుతూ/ దొంగ కొంగ జపం చేస్తున్న/ పనికిమాలిన వంకర ముఖపు శిలవి’ అంటూ ‘దేవుడా/ నువ్వెప్పుడూ/ నీలోంచి నువ్వు/ తప్పిపోతూనే ఉండు/ నన్ను నేనే/ ఈ నేలలో విత్తుకొని/ కొత్త జలానికి దోసిలి పడతాను’ అని దేవుణ్ణి వంకర ముఖమున్న రాయివి అని నిందిస్తూ, చివరి రెండు వాక్యాల్లో దేవుడికన్నా మనిషి గొప్పవాడని తన జీవితాన్ని తానే నిర్మించుకోగల శక్తి కలవాడని అంటారు.
తన కష్టనష్టాల గురించి దేవుడికి మొర పెట్టుకోవడం కన్నా ఆ సమస్యను ఎదుర్కొంటే సమస్య పరిష్కారవౌతుందని చెప్పి శ్రమశక్తిని నమ్ముకొమ్మంటారు. ఈ కవితలో మనిషి ఒక విత్తనంలా లోపల విత్తుకొని కొత్త జలానికి దోసిలి పడతాను’ అని ఊహాశాలితతో కొత్త ప్రతీకలు సృష్టించి కవిత్వాన్ని కొత్త మార్గం పట్టించారు కవి.
సుఖదుఃఖాలు కావడికుండల లాంటివి. ఎంతటి ధనవంతుడైనా జీవితంలో ఎప్పుడో అప్పుడు - కష్టాలు అనుభవించక తప్పదు. కష్టాలకి కుంగిపోవడం మానవ సహజమే. ‘దుఃఖ స్వరాలు’లో ఎంత వైభవాన్ని అనుభవిస్తున్నా.. దిగులు కుండల్ని మోయాల్సిన క్షణం/ ఒక్కటైనా ఉంటుంది - జీవితంలో/ అని అంటూ దుఃఖాలకి కుంగిపోకుండా ‘ప్రశ్నించటం నేర్చుకో/ ఓడిన జీవితం/ కుక్కలా తోకూపుకుంటూ/ నీ ముందు సాగిలపడుతుంది’ అని అంటారు. దేనికీ తలవంచకుండా ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రతిఘటించమంటారు కవి.
కవి రైతుల కష్టాల్ని చూచి చలించిపోతారు. ‘మట్టి దివ్వె’లో రైతుల త్యాగ జీవితానికి నివాళినిస్తూ ‘అతడు మృత్యుగంట మోగినా ఎదిరించి/ ప్రతిరోజు మరణశయ్య నెక్కే/ సజీవ పరిమళం’ మట్టిలో మమేకమై/ నిత్యం దహనవౌతూ/ ఆధిపత్య పోరులో’ అలమటిస్తున్న/ ఎన్నటికీ మలగని దీపం’ రైతు ఎంత కష్టపడి పంటలు పండించినా తనకు దక్కేది కన్నీటి పంటేనని అంటారు. అలాటి రైతు జీవితంతో వ్యాపారం చేసి లాభాల పంటలు పండించే వారి గురించి ‘అలాటి వాడి కళ్లలో గులాబీ ముళ్లను గుమ్మరించి/ మల్లెల పరిమళ స్వప్నాల్ని దొంగిలించిందెవరో’ అని వాపోతారు.
జ్ఞాన జలపాతాలు కావలసిన అక్షరాలయాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టే రొచ్చుగుంటలుగా మారినపుడు రోహిత్‌ల ఆత్మహత్యలు తప్పవు. ‘మావాడివే’లో ‘అక్షరాలకు ప్రాణాలు పోసే ప్రాంగణాల్లో/ కుతూహలాన్ని ఎదగనీయని/ జ్ఞాన దేవుళ్లుంటారని/ నీ నిష్క్రమణ తరువాతే తెలిసింది’ అని కులభేదాలపై తన ఆవేదనను, ఆక్రోశాన్ని వ్యక్తీకరిస్తారు.
వర్తమాన సమాజంలోని సమస్యలపై, పెట్టుబడిదారీ వ్యవస్థపై ఎక్కుపెట్టిన బాణాలు ఈ కవితలు. వస్తు వైవిధ్యంతో కూడిన ఈ కవితలు ఆలోచింపజేస్తాయి. కవిగారికి ఇది మూడవ కవితా సంపుటి. ‘న్యాయ నిర్ణేతవు నీవే’ మొదటి కవితా సంపుటి నుంచి ఈ సంపుటి వరకు జరిగిన కవితా ప్రయాణంలో సాధించిన పరిణతి ఈ పుస్తకంలోని అక్షరం అక్షరంలో ప్రత్యక్షవౌతుంది.
సంపూర్ణ వాక్యం, ఋతురాణి, వెలుగు విల్లు.. మొ. కవితలు కవికి స్ర్తిలపై గల గౌరవాన్ని, అభిమానాన్ని తెలుపుతాయి. ఆయా, తాడు మీద నడిచే పిల్ల, ద్విచక్ర వాహనాల్లో గాలి ఎక్కించే పిల్లాడు గురించి రాసిన దీపధారి, ఊపిరి తీగ, ఒక రాజు కథ, నాన్న గురించిన ఇష్ట వాక్యం కవితలు మనసును ఆర్ద్రపరుస్తాయి.
పుస్తకమంతా మనసున్న స్వచ్ఛమైన మనిషి కావాలి, నిరంతర కలల కుబేరుడొకడు కావాలి’ అని కలవరించి పలవరిస్తారు ‘తెల్లని మల్లెపువ్వంటి/ మనసున్న నలుగురు మనుషులు తోడుండాలి’ అని అంటారు.
‘గెలవాలంటే యుద్ధమే చేయాల్సిన పనిలేదు, నిశ్శబ్ద వౌనం కూడా యుద్ధమే’ ‘మంచి కవిత్వం చదివాక ఎవరైనా మరోరోజు బ్రతికితే బాగుండుననిపించాలి’ ‘నల్లరేగడి నేలలోంచి మొలుచుకొచ్చిన ఎర్ర కలువ అతడు’ ‘బొంత కింద దాచిన రూపాయి బిళ్లల్ని తూటాలుగా మార్చాలి’ ‘నిత్య హరిత వృక్షాన్నై ఊపిరి భాషను మోస్తూ వికసిస్తాను’ మొ. వాక్యాలు మనసులో కొత్త భావాలు పల్లవింపజేస్తాయి.
కలల కుబేరుడు, వెనె్నల రంగులు, తన్మయ తపస్సు, బతుకు కాడి, అప్పుల గాయాలు, జీవన వ్యాకరణం, కాంతి భాష మొ. ప్రతీకలు అలరిస్తాయి. మామూలు వాక్యాలకు కవిత్వపు రంగు ఎలా అద్దాలో తెలుసుకున్న విల్సన్‌రావు గారు భవిష్యత్తులో మరెన్నో ఉత్తమ కవితా సంపుటాలు రచించాలని ఆశిద్దాం.

-మందరపు హైమవతి 9441062732