పఠనీయం

రసాత్మక కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రసాదమూర్తి కవిత్వం
రచన:ప్రసాదమూర్తి, వెల:రూ.150/-, ప్రతులకు: కేరాఫ్ కె.రాజేశ్వరిదేవి, జవహర్ నవోదయ
విద్యాలయ, గోపన్నపల్లి, హైదారాబాద్ మరియు అన్ని పుస్తక కేంద్రాల్లో. 8499866699, 9705468149
*
కవిత్వ విధ్య కొందరికే పట్టుబడుతుంది. అలా పట్టుబడినవారిలో ప్రసాదమూర్తిగారు ఒకరు. ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పటివరకు తాను రచించిన ఏడు కవితా సంపుటుల నుంచి ఎంపిక చేసికొన్న కొన్ని కవితలను ఇప్పుడు ఒక పుస్తకంగా తీసుకువచ్చారు.
ఏ కవితకైనా వస్తురూపాలు ముఖ్యం. పడుగుపేకలు అల్లుకుపోయినట్లు ఈ కవి చేతిలో వస్తురూపాలు చక్కగా ఒదిగిపోయాయి. ప్రపంచీకరణ ప్రభావంవలన మన దేశంలోని కుల వృత్తులన్నీ అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు అగ్గిపెట్టెలో పట్టేలా ఆరు గజాల చీర నేసిన నేతగాడు ఇప్పుడు బట్టలు అమ్ముకోలేక ఆకలితో అల్లాడిపోతున్నాడు. ఈ నేతన్నల విషాదాన్ని ‘తాతకో నూలుపోగు’లో ‘రామపాదుకల్ని మా గుండెలమీద పెట్టుకొని / నీ పావుకోళ్ళని మగ్గం గోతిలోనే సమాధి చేసిన దుర్మార్గం మాది’’ అని చేనేత పనివాళ్ళకి బతుకు లేకుండా చేసిన ఈ వ్యవస్థను కవి ఎండగడతారు.
తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేకపోవడం ఎవరికైనా సమస్యే కాని తలదాచుకోవడానికి తనది అంటూ ఒక చోటు కూడా లేని శరణార్థుల బాధ ఎవరికీ చెప్పతరం కాదు. ‘మాతృదేశం కనబడక / కాలికంటిన మట్టి తమదే అని మొత్తుకున్నా / వినిపించుకొనే నాథుడెవడూ ఎదురుపడక / నాఫ్ నదిలో దూకేసిన రోహింగ్యాల నడుగు’ అని దేశంలోని ప్రజలు’లో కాందిశీకుల కన్నీటి భాషను అక్షరీకరిస్తారు.
ఈ దేశంలో తాను పండించిన పంటకు ధర నిర్ణయించలేని అభాగ్యుడు రైతు ఒక్కడే. గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్య చేసికొన్న రైతుల ఆక్రందనకు అక్షరరూపమిస్తూ ఇలా అంటారు. ‘పురుగుమందు నన్ను తాగి అమృతమవుతుంది / నన్ను గాలిపటంలగా ఎగరేసి ఉరితాడు విరితాడుగా గుబాళిస్తుంది’ అని కర్షక జీవితంలోని దుర్భర విషాదాన్ని ‘చేనుగట్టు పియానో’లో వినిపిస్తారు.
బతుకు సమరంలో ఓడిపోయిన వాళ్ళ వెతలను చూచి కవి చలించిపోతారు. కల్లుగీయడానికి చెట్టెక్కి కాళ్ళకు కట్టుకొన్న తాడే బిగిసిపోయి మరణించిన కల్లుగీత పనివాడి మరణ చిత్రంలోని దైన్యాన్ని ‘కాళ్ళపైన ఆకాశం అజ్ఞాత శవంమీద ఏ పుణ్యాత్ముడో కప్పిన మట్టిగుడ్డయింది’ అని బొమ్మకట్టిస్తారు ‘నాన్న చెట్టు’లో.
పసిపిల్లల మనస్తత్వం వున్న కవికి పిల్లలన్నా, పూలన్నా అపరిమితమైన ఇష్టం. రమణీయమైన రంగు రంగుల పూల మార్కెట్‌ను చూసి పరవశించి ‘పూలమ్ముకొని బతికిపోయినా బావుండు/ నిత్యం రంగుల సుగంథాల వానలో నృత్యం చేసేవాడిని’ అంటూ ‘పూలండయ్ పూలు’లో తన పూల మనసును పరిమళింపజేస్తారు.
కవికి మనుషులంటే అమిత ప్రేమ. అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, నాయనమ్మ, తాతయ్య, మిత్రులు అంటే ప్రాణం. అనుభూతుల సువాసనలద్దిన కవితలు ఈ సంపుటిలో చాలా వున్నాయి. కూతురితో తనకుగల అనుబంధాన్ని ‘ఎర్రపూల గౌను’ శీర్షికలో వర్ణిస్తూ ‘ఇంటికొచ్చి వెళ్ళినా / మొదటిసారి అత్తారింటికి వెళుతున్నట్టే వుంటుంది / కన్న పేగులో శాకుంతలం నాటకం / నాలుగో అంకం’ నలభైసార్లు రిపీటవుతుంది’ అని చదువుతున్నపుడు కూతుళ్ళు లేనివాళ్ళు తమకూ ఒక కూతురుంటే బాగుండునని కలవరిస్తారు.
ఈ సంపుటిలోని కవితలన్నీ విభిన్న వస్తు భరితాలు. ప్రశ్నించడమే నేరమైనపుడు, పీడితులపట్ల నిలిచినందుకే కారాగారాన్ని కానుకగా ఇచ్చిన రాజ్యహింసను గురించి ‘కుట్ర’ రాసినా, నాన్న చేతిలో తన్నులు తింటూ ఎదురుతిరగని అమ్మను ‘అమ్మా ఫెమినిస్టువు కాదే’లో పురుషాహంకారాన్ని ధిక్కరించినా, పూలే గురించి రాసినా, అనాథ బిచ్చగత్తెను ఆవిష్కరించినా, ఏ కవిత ముట్టుకున్నా కవిత్వం జలజలా ప్రవహిస్తుంది.
గుండె కొల్లేరు, బుద్ధాశ్రమం, బుష్ మళ్లీ రావద్దు, కూతురొచ్చింది, పునరామోసం, ఊరూ వానా, ఊటీ పద్యాలు మనసును మరింత ఆర్ద్రపరుస్తాయి. భాష, భావం ఒకదానికొకటి పూసల్లో దారంలా ఇమిడిపోతాయి. ధారాశుద్ధి ఈ కవితల ప్రత్యేకత.
‘‘ఈ మధ్య ఎక్కడ మెట్లెక్కినా / ఏదో ఓ మెట్టు మనిషిలా తగులుతోంది’ ‘ఎర్రటి ఎండను బిళ్ళలుగా కత్తిరించి నీటి దుపట్ట మీద అతికించే పనిలో పడ్డావు’ లాంటి వాక్యాలు మనసుకి హత్తుకుపోతాయి. ‘అప్పుడే పుట్టిన పసిపాప లాంటి పద్యంలా మనుసు కేర్‌మంది’, ‘చేపు పైకెగిరి లేయెండ చొక్కా తొడుక్కొని మళ్లీ బుడుంగుమంటున్నాయి’ వంటి పద చిత్రాలు అద్భుతమనిపిస్తాయి.
ఇప్పటికే తెలుగు కవిత్వంలో తనదంటూ ఒక ముద్రవేసికొన్న ప్రసాదమూర్తిగారు మరిన్ని కావ్యాలు రచించి తెలుగు పాఠకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశిస్తున్నారు.

-మందరపు హైమవతి 9441062732