పఠనీయం

నా ఊహ నృత్యం.. నా ధ్యాస నృత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాట్యభారతీయం
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా , హోస్టన్, టెక్సాస్
వెల: రూ.100
ప్రతులకు: జెవి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
(హైదరాబాద్ - టిఎక్స్) సత్యసాయిపురం కుంట్లూరు విలేజ్ హైదరాబాద్- 501 505

========================

భారతీయ నాట్యకళ విశ్వజనీనమైనది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అమెరికా వంటి దేశాలలో కూచిపూడి నాట్యాన్ని జనాదరణ ఎక్కువయింది. ఇక్కడ నుండి ఉద్యోగరీత్యా వలసలు వెళ్లిన తెలుగువారు నాట్య వేదానికి అప్రకటిత దూతలుగా సంధాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిలో శ్రీమతి కోసూరి ఉమాభారతి ఒకరు. వీరు కూచిపూడి నృత్యంలో సుశిక్షితులై అమెరికాలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వారికి ఇటు తండ్రి అటు భర్త ప్రోత్సాహాన్ని ఇవ్వడం వలన వారి కళ మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసించింది. అమెరికాలో చాలా తెలుగు సంస్థలు ఉన్నాయి. వారు మాతృభూమి రుణం తీర్చుకోవడం కోసం ఇతోధికంగా కళా సాంస్కృతిక సాహిత్య రంగాలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి సంస్థలలో వంగూరి ఫౌండేషన్స్ ఒకటి. ఇప్పటికి వీరు పుంఖానుపుంఖాలుగా గ్రంథాలను ప్రచురించారు. ‘నాట్య భారతీయం’ అనే ఈ గ్రంథం 72వ ప్రచురణ. ఇది ఒక రకంగా శ్రీమతి కోసూరి ఉమాభారతికి అభినందన సంచిక అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఆమె రచించిన రచనలతోపాటు వివిధ సందర్భాలలో జరిగిన సన్మానాలు, ప్రశంసాపత్రాలు సచిత్రాత్మకంగా తీసుకొని వచ్చారు. గ్రంథాన్ని చాలా విలువలతో తీసుకుని రావడంలో ప్రచురణ కర్తలు ఆర్థికంగా ఏమీ రాజీపడలేదు. హార్థికంగా కూడా ఇది వారి రసాభినిష్ఠకు దర్పణం పడుతున్నది. ఇందులో రచనలు లోగడ ఆయా సందర్భాల్లో ఒక అమెరికన్ సంచికలో వచ్చినవే. అయితే అవి సంకలనంగా తీసుకుని రావడంలో ఈ ఫౌండేషన్ వారు కృతకృత్యులైనారు. నిజానికి ఇవన్నీ నాట్యశాస్త్ర సిద్ధాంత సంబంధ విశే్లషణాత్మక వ్యాసాలు కావు. రచయిత్రి కొంత ఆత్మకథను మరి కొంత లోక కథను కలిపి పఠనీయంగా ఉండేటట్లు అత్యంత సరళాతి సరళమైన వ్యావహారిక శైలిలో అమెరికా తెలుగు వారికి అందించింది. అయితే ఇందలి స్వవిషయాలు కొన్ని సార్వకాలిక సత్యాలు కావడంతో దీనికి పఠనీయతతోపాటు విశ్వజనీనత కూడా సంక్రమించింది. రచయిత్రి ‘నా ఊహ నృత్యం, నా ధ్యాస నృత్యం, నా మదిలో నృత్యం, నా క్రియలో నృత్యం’ అని చెప్పుకున్నారు. ఈ గ్రంథాన్ని ముద్రించిన ఫౌండేషన్ వారు నాట్యభారతి ఉమాభారతి నర్తకిగా, నాట్య గురువుగా, నటిగా, రచయిత్రిగా చూపిన బహుముఖీన ప్రజ్ఞను సమాజానికి అందించడం కోసం ఒక మంచి ప్రయత్నం చేశారు. ఒక విధంగా ఈ అభినందన సంచిక ఉమాభారతికి మాత్రమే కాదు తెలుగు నృత్యానికి వంగూరి వారు ఎత్తిన కళానీరాజనం. ప్రచురణకర్తల మాటలలో ‘కేవలం ఐదేళ్ల క్రితం సృజనాత్మక రచనా వ్యాసంగంలో అడుగుపెట్టి ఇప్పటికే రెండు కథా సంపుటాలు, మూడు నవలలూ ప్రచురించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవన్నీ ఒక ఎత్తయితే ఈ నాట్య భారతీయం మరొక ఎత్తు. ఎందుకంటే ఇది ఆమె తన జీవిత ప్రస్థానంలో జరిగిన అనేక ఘట్టాలని ఎంతో ఆసక్తికరంగా, ఛాయాచిత్రాలతో సహా అందించి తన రచనా వ్యాసంగంలో కొత్త పుంతలు తొక్కారు. ఇటు గృహస్థ జీవితంలో బాధ్యతలు నిర్వహిస్తూ అటు కళారంగంలో అంతర్జాతీయ కీర్తిప్రతిష్ఠలను సంపాదించడం ఉమాభారతి ప్రత్యేకత. ఈమె వెంపటి చినసత్యంగారి శిష్యురాలు. ఇప్పుడు తానే గురుస్థానం ఆక్రమించి ఎందరో నాట్యభారతులను సృష్టించింది. వంగూరి వారి కృషి సఫలీకృతమయింది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్ 9603612246